నాకది మొదటి విమాన ప్రయాణం కాకపోయినా, మొట్టమొదటి విదేశీ విమాన ప్రయాణం. మద్రాసు నుంచి సిలోన్ కు ప్రయాణ సమయం గంట లోపే. అయినా, ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో పాటు హాట్ డ్రింక్స్ సర్వ్ చేయడం ఆశ్చర్యం అనిపించింది. చూసినంత మేరా కొబ్బరి తోటలు తప్ప వేరే కనిపించని శ్రీలంక భూభాగంలో కొంత దూరం ప్రయాణించిన విమానం, కనెక్టింగ్ ఫ్లయిట్ తప్పిపోకుండా కొలంబో విమానాశ్రయంలో దిగింది. మద్రాసు లాగే సముద్రతీర ప్రాంతం కావడం వల్ల వంటికి జిగటగా చెమట పట్టే ఉష్ణ వాతావరణం.
కాసేపటి తర్వాత విమానం ఎక్కి కౌలాలంపూరు బయలుదేరాము. మొదటి విదేశీ ప్రయాణం కనుక ముచ్చట పడి విండో సీటులో కూర్చున్నాను. నా తాపత్రయమే కానీ, విండో నుంచి తెల్లగా దూది పరుపుల్లా పరచుకున్న మబ్బులే కానవచ్చాయి. ఈ సారి కూడా మర్యాదలు బాగున్నాయి. అడిగినవారికి అడిగినంత పోస్తున్నారు, తినే వారికి తిన్నంత తినిపిస్తున్నారు. ప్రయాణం పొడుగునా ఈ సంతర్పణ సాగుతూనే వుంది.
మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో విమానం దిగాను. అంతవరకూ ఢిల్లీ, బేగంపేట, మద్రాసు ఎయిర్ పోర్టులు మాత్రమే చూసిన నా కళ్ళకి కౌలాలంపూర్ విమానాశ్రయం చాలా పెద్దదిగా, గొప్పదిగా అనిపించింది.
ఆ దేశంలో మంచి సూటుకేసులు దొరుకుతాయి, కాబట్టి ఇక్కడ నుంచి చెత్త సూటుకేసు తీసుకువెళ్లి అక్కడ పారేసి కొత్తది కొనుక్కో అనే ఓ మిత్రుడి సలహా పాటించి, ఓ పాతిక రూపాయలతో కోటీ మాల్ సూటు కేసు కొని, రెండు జతల బట్టలు పెట్టుకుని బయలు దేరిన నాకు, ఈ చెత్త సూటు కేసు ఎప్పుడు హఠాత్తుగా తెరుచుకుని నా పరువు తీస్తుందో అనే భయం పట్టుకుంది. దాంతో దాన్ని జాగ్రత్తగా చేతులో పట్టుకుని రెస్ట్ రూముకు వెడుతూ, దానికి దగ్గరలో కూర్చొన్న ఓ ఇండియన్ లాగా కనబడుతున్న వ్యక్తిని, లోపలకు పోయి వస్తాను, దీన్ని కాస్త కనిపెట్టి చూస్తారా అని మనకు అలవాటయిన పద్దతిలో అడిగాను. అతడు నవ్వుతూ ఏడాది తర్వాత వచ్చి చూడండి, మీ సూటు కేసు ఇక్కడే వుంటుందని అంటూ లేచిపోయాడు.
అప్పటికి నా జేబులో మద్రాసు ఎయిర్ పోర్టులో రూపాయలతో మార్చుకున్న పదిహేను డాలర్లు, స్టేట్ బ్యాంకులో చేసిన చేబదులు మూడు వేల రూపాయలు వున్నాయి. బషీర్ బాగ్ స్టేట్ బ్యాంకు బ్రాంచీలో సావిత్రి గారని ఒక మహానుభావురాలు మేనేజర్. నాకూ, డి. వెంకట్రామయ్య గారికి అవసరానికి, అనవసరానికి ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తుండేవారు. కూర్చోబెట్టి, కాఫీ ఇప్పించి, డబ్బులు అక్కడికే తెప్పించి చేతిలో పెట్టి సాగనంపేవారు. అలా చేసిన చేబదులు డబ్బులన్న మాట.
ఎయిర్ పోర్ట్ అధికారి నా దగ్గర వున్న డాలర్లు చూసి మీరిక్కడ ఎలా సర్వైవ్ అవుతారు అని అడిగాడు. ఏం జవాబు చెప్పాలో ఆలోచిస్తుండగా, ‘భేష్ వచ్చేశారా, నా ఫ్లయిట్ కొద్దిగా లేటయింది, మీరూ అదే హోటల్ కు కదా, పడండి పోదాం’ అని భుజం తట్టారు వెనక నుంచి హోం మంత్రి ప్రభాకర రెడ్డి గారు. బతుకు జీవుడా అని ఆయన కారెక్కాను.
కింది ఫోటో:
మలేషియా తెలుగు సభల సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య. నాటి మంత్రి, మండలి వెంకట కృష్ణారావు గారు
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి