9, జనవరి 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (62) - భండారు శ్రీనివాసరావు

 ఇంతకు  ముందే రాసినట్టు చాలామంది రాజకీయ నాయకులు వృత్తి రీత్యా నన్ను గుర్తు పెట్టుకునేవారు. అయితే వీరిలో టి. అంజయ్య తరహా వేరు. కేంద్రంలో సహాయ మంత్రిగా వున్న అంజయ్యను కాంగ్రెస్ అధిష్టానం చెన్నారెడ్డి స్థానంలో ముఖ్యమంత్రిగా నామినేట్ చేసింది. ఇందిరాగాంధి హయాములో ముఖ్యమంత్రులను శాసన సభ్యులు ఎన్నుకునే విధానానికి స్వస్తి వాక్యం పలికారు. ఢిల్లీలో నిర్ణయం అవుతుంది. తూతూ మంత్రంగా శాసన సభాపక్ష సమావేశం జరుగుతుంది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధులు శాసన సభ్యులతో కలివిడిగావిడివిడిగా మాట్లాడి అభిప్రాయాలు సేకరిస్తారు. చివరకు శాసన సభాపక్షం సమావేశమై ముఖ్యమంత్రిని ఖరారు చేసే బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేస్తుంది. అది పట్టుకుని ఢిల్లీ వెళ్ళిన ప్రతినిధులు మళ్ళీ ఒక సీల్డ్ కవర్ పట్టుకుని హైదరాబాదు వస్తారు. ఆ కవరులో వున్న పేరును ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారు. అందరూ చప్పట్లు కొట్టి ఆమోదిస్తారు. చిత్రం ఏమిటంటే అప్పటివరకు ఆ పదవికోసం  తీవ్రంగా ప్రయత్నాలు చేసిన నాయకుడి చేతనే సీల్డ్ కవర్ అభ్యర్ధి పేరు ప్రతిపాదింపచేస్తారు.  ఇదొక తంతు. తప్పనిసరి తంతు అని అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తూ వచ్చిన ఈ సీల్డ్ కవర్ విధానాన్ని తప్పు పడుతూ వచ్చిన ప్రతిపక్షాలు కూడా తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే విధానాన్ని అనుసరిస్తూ రావడం మన ప్రజాస్వామ్యంలోని చమత్కారం. టీడీపీ అధినాయకుడు ఎన్టీఆర్ ఈ సీల్డ్ కవర్ విధానాన్నిజిల్లాపరిషద్ చైర్మన్ఎన్నికలకు కూడా వర్తింపచేశారు.  రాజకీయాల్లో ఒకటే రూలు. అధికారంలోకి రావడానికి కొన్ని మాటలు చెప్పాలి. అలా దక్కిన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కొన్ని కాని పనులు చేయాలి. ఇది అన్నిపార్టీలకు వర్తించే సార్వత్రిక సూత్రం.

సరే! తరువాత ముఖ్యమంత్రి అంజయ్య అని అందరికి తెలిసిపోయింది. కొందరు సీనియర్లు తమకు అవకాశం తప్పిపోయినందుకు బాధ పడ్డారు. మరికొందరు అంజయ్య లాంటి వాడు  అయితేనే మంచిది, తమ చెప్పుచేతల్లో వుంటాడని భ్రమ పడ్డారు.

అంజయ్యగారు కేంద్ర మంత్రిగా వున్న కాలంలో అనేక సార్లు హైదరాబాదు వచ్చారు కానీ నేను వెళ్లి కలుసుకుంది లేదు. ముఖ్యమంత్రిగా నామినేట్ అయిన తరువాత కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పాల్గొనడానికి అంబాసిడర్ కారులో అసెంబ్లీకి వచ్చారు మెట్లు ఎక్కుతుంటే నేను కనపడ్డాను. ఏం శ్రీనివాస్! బాగున్నావా! అని ఆప్యాయంగా పలకరించారు. అన్నేళ్ల విరామం తర్వాత నేను ఆయనకి పేరుతొ సహా గుర్తున్నందుకు  సంతోషపడాలో, ఆయన మంచితనాన్నిపొగడాలో తెలియని అయోమయంలో పడిపోయాను.

కాంగ్రెస్ సంస్కృతి ప్రకారం జరగాల్సిన తంతు అంతా జరిగిపోయింది. కాకపోతే ఒక చిన్న మినహాయింపు. సీల్డ్ కవర్ గొడవ లేకుండా, పరిశీలకులు ఢిల్లీలో ఇందిరాగాంధీతో ఫోన్లో మాట్లాడి, సీ ఎల్ పీ నాయకుడుగా అంజయ్య ఎన్నిక అయినట్టు ప్రకటించారు. మళ్ళీ ఇలా జరగడం నాకు తెలిసి, 2004 లో ముఖ్యమంత్రిగా  వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఎన్నిక ఇలానే పెద్ద తంతు లేకుండా ముగిసింది.

ఓ రోజు ముఖ్యమంత్రి అంజయ్య గారు సచివాలయంలో నలుగురితో మాటా మంతీ సాగిస్తున్న సమయంలో ఆయనకు ఓ ఫోన్ వచ్చింది. ఆయన తత్తరపడుతూ లేచి వున్నపాటున బరకత్ పురాలో వున్న తన ఇంటికి బయలుదేరారు. అప్పటికి అంజయ్య గారు అధికార నివాసం గ్రీన్ లాండ్స్ (ముద్దుగా ఆయన పెట్టుకున్న పేరు ‘జయ ప్రజా భవన్) కి మకాం మార్చలేదు. బరకత్ పురాలో హౌసింగ్ బోర్డ్ వారి టూ ఆర్ టీ ఇంట్లోనే వుంటున్నారు. ఇప్పటి రోజులతో పోలిస్తే అది ఒక విడ్డూరమే. ఆ చిన్న ఇంటిపైనే గది మీద గది నిర్మించుకుంటూ వెళ్లడం వల్ల చాలా ఇరుకుగా వుంటుంది. మెట్లు కూడా సౌకర్యంగా వుండవు.

సరే! అంజయ్య గారు హడావిడి పడుతూ ఇంటికి వెళ్ళి ఆయాసపడుతూ మెట్లెక్కినప్పుడు కనబడ్డ దృశ్యం ఈనాటి ఛానళ్ళకు దొరికివుంటే పండగే పండగ. రాజీవ్ గాంధీ అక్కడి చిన్న గదిలో అంతకంటే చిన్న కుర్చీలో కూర్చుని తనను పీక్కుతింటున్న దోమల్ని తోలుకునే పనిలో నిండా మునిగి తేలుతున్నాడు. అసలే పండంటి మనిషి. లేత శరీరం. ఆయన మొహం మీద దోమ కాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అసలు జరిగిన విషయం ఏమిటంటే, ప్రధాని ఇందిరా గాంధి తనయుడు ఇండియన్ ఎయిర్ లైన్స్ లో   పైలట్ గా పనిచేస్తున్నారు. రాజీవ్ గాంధీ పైలట్ గా హైదరాబాదు వచ్చిన విమానంతిరిగి వెళ్ళడానికి బాగా వ్యవధానం వున్నట్టుంది. యెందుకు అనిపించిందో తెలియదు కానిఆయన బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఎవర్నో అడిగి ఓ కారు తీసుకుని నేరుగా బరకత్ పురాలోని అంజయ్య గారి నివాసానికి వెళ్ళిపోయారు. ఈ కబురు అందిముఖ్యమంత్రిగారు ఆఘమేఘాలమీద ఇంటికి వచ్చేసరికి ఇదీ సీను.

'అమ్మ ఇచ్చిన ఉద్యోగంఇది అని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రిగా  అంజయ్య గారు ఏనాడు నామోషీ పడలేదు. పైగా కూసింత గర్వంగా చెప్పుకునేవారు. రాజీవ్ గాంధీ ఆయన ఇంటిని చూసి వాళ్ల అమ్మ సెలెక్షన్ మంచిదే అనుకుని కూడా వుంటారు. కాకపొతే పేరడీ ఏమిటంటే అంజయ్య గారి ముఖ్యమంత్రి పదవి వూడడానికి కూడా తదనంతర కాలంలో రాజీవ్ గాంధీయే కారణం అయ్యారు.

పోతే! పైకి చెప్పకపోయినా ఇది చదివే వారికి ఓ  సందేహం తొలుస్తుండవచ్చు. ఇదంతా మీకెలా తెలుసనీ.

ఆ రోజుల్లో నేను  రేడియో రిపోర్టర్ గా వుండేవాడిని. కారణం చెప్పలేను కాని అంజయ్యగారికి  నేనంటే అవ్యాజానురాగం. నేను కాసేపు దగ్గర్లో కనబడకపోతే చాలు  ఆయనగారికి క్షణం తోచేది కాదు. ‘శ్రీనివాస్ ఏడీ’ అని సొంత సిబ్బందిని ఆరా తీయడం ఆయనకు అలవాటు. అంచేత ఆరోజు నేను కూడా అంజయ్య గారి వెంటే వున్నాను. అదన్న మాట.

 

 

కింది ఫోటో:





(ఏదో సినిమాలో రాళ్ళపల్లి చెప్పినట్టు టేప్ రికార్డర్ పట్టుకుని ఈ పక్కన నేను, ఆ పక్కన అంజయ్య గారు. మా మధ్యలో నాగార్జున గ్రామీణ బ్యాంక్ చైర్మన్  శ్రీ వై.ఎస్.ఎన్. మూర్తి)

(ఇంకా వుంది)        

కామెంట్‌లు లేవు: