అంజయ్యగారి మంత్రి వర్గాన్ని `జంబోక్యాబినెట్' అని ఎద్దేవా చేసేవారు. ఎయిర్ బస్ మంత్రివర్గం అని హేళనగా మాట్లాడేవారు. అరవైమంది మంత్రులేమిటి, విడ్డూరం కాకపోతే అనేవారు. కార్టూన్ల సంగతి సరేసరి. అయినా, ప్రతిదీ తేలిగ్గా తీసుకునే తత్వం ఆయనది. యాదగిరి (హెలికాప్టర్)తో తనను ముడిపెట్టి ఒక దినపత్రికలో ప్రచురించే వ్యంగ్య చిత్రాలను కూడా నవ్వుతూ ఆస్వాదించే మనస్తత్వం ఆయనది.
`వెనకటి
రోజుల్లో జిల్లాకు ఒకే ఒక్క అయ్యేఎస్ ఆఫీసర్ (జిల్లాకలెక్టర్) ఉండేవాడు.
ఇప్పుడో, ఇద్దరు
ముగ్గురు అలాంటి అధికార్లు జిల్లాల్లో పనిచేస్తున్నారు. అలాంటప్పుడు జిల్లాకు
ఇద్దరు మంత్రులు వుంటే తప్పేంటి శ్రీనివాసూ’ అనేవారు
ఆంతరంగిక సంభాషణల్లో.
చెవులు మాత్రమే వున్న కాంగ్రెస్ అధిష్టానానికి
చెప్పుడు మాటలు విని నిర్ణయాలు తీసుకునే అలవాటు వుంది. అప్పట్లో మీడియా సంస్థలు
లేవు. కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో పడాలి అంటే అలాంటి వార్తలు హైదరాబాదు నుంచి
వెలువడే ఆంగ్ల దినపత్రికల ఢిల్లీ ఎడిషన్లలో వచ్చేట్టు చూసుకోవడానికి అసమ్మతి వర్గం
వాళ్ళు నానా ప్రయత్నాలు చేసేవాళ్ళు. మొత్తానికి ఆ ప్రయత్నాలు ఫలించాయి.
ఆ రోజు మంత్రి వర్గం సమావేశమౌతోంది, మధ్యాహ్నం పన్నెండు తర్వాత ముఖ్యమంత్రి
విలేకరులతో మాట్లాడతారని కబురొచ్చింది. సచివాలయం బీట్ చూసే విలేకరుల, అందరం
బిలబిలమంటూ సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌కు చేరుకున్నాం. విలేకరులు, అధికారులతో
సమావేశాలు నిర్వహించేందుకు ఆ ఛాంబర్ ప్రక్కనే ఒక చిన్న హాలు ఉండేది.
ఓ అరగంట తర్వాత అప్పటి ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య ఆ
హాల్లోకి వచ్చారు. విలేకరులందరినీ పేరుపేరునా పలకరిస్తూ మామూలు కబుర్లలో
పడిపోయారు. మధ్యమధ్యలో, ఏం మొయిన్ (మొయినుద్దీన్
- ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి) అందరికీ అన్నీ (కాఫీ టిఫిన్లు) అందాయా? అని వాకబు
చేస్తున్నారు. అప్పటికి దాదాపు ఒంటిగంట కావస్తుండడంతో చివర్లో కూర్చున్న నాలో
అసహనం పెరిగిపోతోంది. మరో పదిమిషాల్లో మధ్యాహ్నం ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ఈ
బులెటిన్ తప్పిపోతే మళ్లీ సాయంత్రం దాకా దిక్కులేదు. కానీ అంజయ్యగారి కబుర్లు ఒక
పట్టాన తేలేలా కనిపించడంలేదు. చివరికి ఏదయితే అదే అయిందని లేచి ఆయన దగ్గరకు
వెళ్లాను. వార్తల టైమ్ అవుతోందని చెప్పేసి, ఏం చెప్పదల్చుకున్నారో ఒక్క ముక్కలో
చెప్పండని కోరాను. దానికాయన పెద్దగా నవ్వేస్తూ `చెప్పడానికేముంది!
మంత్రులందరూ (రాజీనామా లేఖలు) ఇచ్చేశారు' అని సైగలతో చెప్పేశారు. నేను రయ్
మంటూ బయటకు పరుగెత్తి, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రేడియోకి ఫోన్ చేసి
మంత్రుల రాజీనామా వార్తని అందించాను. వెంటనే ఒకటీ పదికి మొదలయ్యే ప్రాంతీయ
వార్తల్లో మంత్రివర్గ రాజీనామా వార్త ప్రముఖంగా మొదటి హెడ్ లైన్లో వచ్చింది.
ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే, విలేకరులు
వార్తలను అందించే తొందర్లో ఎలా తప్పుల్ని తొక్కుతారో అన్నది తెలియచెప్పడానికే.
ఇందుకు నేనూ మినహాయింపు కాదని చెప్పడానికే.
ఆ రోజు నేను హడావిడిలో అరవైమంది మంత్రులు
రాజీనామా చేశారని చెప్పాను. మధ్యాన్నం రేడియో వార్తల్లో అలాగే ప్రసారమైంది. నిజానికి
ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గంలో సభ్యుల సంఖ్య అరవై. 59 మంది
మంత్రులే ఆరోజు రాజీనామా చేశారు. సాయంత్రం వార్తల్లో ఈ తప్పు
సవరించుకున్నామనుకోండి.
సాధారణంగా పత్రికలకు ఒక భాష వుంటుంది. విలేకరుల
సమావేశాల్లో నాయకులు మాట్లాడేది సాకల్యంగా విని,
నోట్స్ రాసుకుని, తమదైన
బాణీలో చక్కగా ఆ వార్తకు సొగసులు అద్ది ప్రచురించేవారు. మనం ఇంత బాగా మాట్లాడామా అని మర్నాడు
పత్రికల్లో తమ వార్తను చదువుకున్న నాయకులు ఆశ్చర్యపోయేవారు.
అంజయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రముఖ
దినపత్రిక ఆ బాణీని పూర్తిగా మార్చుకుంది. అంజయ్య గారు తెలంగాణా యాసలో మాట్లాడే
వారు. ఆయన మాట్లాడిన ప్రతిమాటా యధాతధంగా ప్రచురించడం ఆ పత్రిక మొదలు పెట్టింది.
ఎలాంటి ఎడిటింగ్ లేకుండా వార్తను ప్రచురించడం అంతవరకు ఎరుగని విషయం. ఇందులో
కొత్తదనం వుండడం వల్ల పత్రిక సర్క్యులేషన్ బాగుపడి ఉండవచ్చు. కానీ ముఖ్యమంత్రి
స్థాయికి అది తగదని పత్రికల్లో పనిచేసే సీనియర్లు అభిప్రాయపడేవారు. ఒకరకంగా
చెప్పాలి అంటే ఇప్పటి లైవ్ టెలికాస్ట్ మాదిరిగా ఆయన గురించిన వార్తలు ఆ పత్రికలో
వచ్చేవి. అంజయ్య గారు కూడా అభ్యంతరం పెట్టేవారు కాదు.
అంజయ్య గారు గతంలో వెంగళరావుగారి మంత్రివర్గంలో, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. కార్మికుల
సంక్షేమం గురించి అహరహం ఆలోచిస్తుండేవారు.
పురుళ్ళ ఆసుపత్రిలో ‘లేబర్ రూము’ పై అంజయ్య గారి
జోకు సుప్రసిద్ధం. లేబర్ మినిస్టర్ గా ఈ ఎస్ ఐ ఆసుపత్రికి వెళ్లారట. అక్కడ
మెటర్నిటీ వార్డులో పురుళ్ళ గదికి ‘లేబర్ రూం’ అని బోర్డు వుండడం చూసి ఆయన
సంతోషపడి తన ఆనందాన్ని దాచుకోలేక ‘చూసారా ఈ ఆసుపత్రిలో లేబరోళ్లకోసం ప్రత్యేక ఏర్పాట్లు వున్నాయి” అనేశారట.
ఆయన అమాయకత్వాన్నిబట్టి ఇలాటి జోకులు
పుట్టివుంటాయి. కానీ, అంజయ్య గారు ముఖ్యమంత్రిగా
కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. పంచాయతి రాజ్ సంస్థల్లో సర్పంచులను నేరుగా
ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. చాలాకాలంగా వాయిదా పడుతున్న పంచాయతీ
ఎన్నికలను నిర్వహించారు. ఆ ఎన్నికలను పార్టీ గుర్తులు లేకుండా నిర్వహించి గెలిచిన
వాళ్ళు అందరూ మన పార్టీనే అని ధైర్యంగా ప్రకటించారు.
కింది ఫోటో:
అంజయ్య మంత్రివర్గం రాజీనామా వార్త క్లిప్పింగ్
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి