18, జనవరి 2025, శనివారం

18-01-1996

 తెలతెలవారుతుండగా మెలకువ వచ్చింది. రైలు రేణిగుంట స్టేషన్లోకి ప్రవేశిస్తోంది. తోటి ప్రయాణీకుల్లో చాలామంది లేచి తిరుపతి స్టేషన్లో దిగడానికి సామానులు సర్దుకుంటున్నారు. పక్క బెర్త్ లో పడుకున్న మాజీ మంత్రి, తెలుగు దేశం నాయకుడు శ్రీ ముద్దు కృష్ణమ నాయుడు, నా జర్నలిస్టు మిత్రుడు ఎం.ఎస్. శంకర్  ఇంకా నిద్రలోనే వున్నారు. శంకర్ కి తిరుపతి దేవుడు అంటే తగని నమ్మకం. నిజానికి అతడి ఒత్తిడితోనే ఈ ప్రయాణం.  ఏడాదికి ఒకటి రెండు సార్లు స్వామి దర్శనం చేసుకోవడం అతడికి అలవాటు. రైల్లో  రాత్రంతా ముద్దు కృష్ణమ నాయుడి గారితో కబుర్లతోటే సరిపోయింది. దర్శనానికి ఎవరికయినా చెప్పనా అని ఆయనే అడిగారు. వద్దండి, అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చాము అని చెప్పాము.

నా దగ్గర బి.హెచ్. ఇ.ఎల్. వాళ్ళు ఓసారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇచ్చిన సిగరెట్ పెట్టె సైజు బుల్లి ట్రాన్సిస్టర్ రేడియో వుంది. దాన్ని ఆన్ చేశాను. ఢిల్లీ నుంచి ఇంగ్లీష్ వార్తలు మొదలయ్యాయి. వున్నట్టుండి, “హియర్ ఈజ్  ఎ ఫ్లాష్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావ్ ఈజ్ నో మోర్. ఎకార్దింగ్ టు అవర్ హైదరాబాద్ కరస్పాండెంట్ పవని విజయలక్ష్మి..”

షాక్. కాసేపు మెదడు మొద్దుబారింది. అంతకు ముందు రోజు, అంటే నిన్ననే ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వార్త కూడా నేనే ఇచ్చాను. ఎక్కడా ఆయనలో అనారోగ్యం ఛాయలు కనిపించలేదు. ఇదేమిటే? ఎలా జరిగింది? నిజమా కాదా! వార్త వచ్చింది ఆకాశవాణి నేషనల్ బులెటిన్ లో.  శంకర్ ని, ముద్దు కృష్ణమ నాయుడు గారిని లేపుతుండగానే, రైలు రేణిగుంట స్టేషన్ లో ఆగింది. విషయం వినగానే ముద్దు కృష్ణమ నాయుడు గారు ‘నేను అనాథను అయిపోయాను’ అంటూ  గుండెలు బాదుకుంటూ భోరున ఏడవడం మొదలు పెట్టారు. శంకర్ బయటకి పరిగెత్తాడు, పేపర్ కొనుక్కుని రావడానికి. అందులో ఎన్టీఆర్ ప్రెస్ మీట్ తప్పిస్తే వేరే విషయం లేదు. ప్లాట్ ఫారం కూడా మామూలుగానే వుంది. ఇంకా ఎవరికీ విషయం తెలిసినట్టు లేదు. అంటే పత్రికల ఎడిషన్ టైం అయిపోయిన తర్వాత జరిగి వుంటుంది.  నాయుడి గారి ఏడుపు గమనించి ఆయన గన్ మెన్ పరిగెత్తుకు వచ్చాడు.

భారంగా రైలు దిగాము. పరికిస్తే అంతా మామూలుగా ప్రయాణీకుల రణగొణధ్వనులతో వుంది. వెంటనే కొండ పైకి వెళ్ళాము. అక్కడ కూడా అంతా ప్రశాంతంగానే వుంది. ఏర్పాట్లు చేసుకున్నాము కనుక దర్శనం త్వరగానే ముగిసింది. బయటకి వచ్చేసరికి వాతావరణంలో పెనుమార్పు. తిరుమలలో అంగళ్లు, హోటళ్ళు   మూసేస్తున్నారు. మమ్మల్ని పైకి తీసుకువచ్చిన టాక్సీలోనే కిందికి వెళ్ళాము. శంకర్ మూడు నాలుగు అవుట్ స్టేషన్ ఇంగ్లీష్ పత్రికలకి వార్తలు పంపుతుంటాడు. తిరుపతిలో బంద్ పాటిస్తున్నారు. ప్రతి కూడలిలో ఎన్టీఆర్ ఫోటో పెట్టి నల్ల జండాలు కట్టారు. వీధులు అన్నీ నిర్మానుష్యంగా వున్నాయి. ఆఖరికి బండి దుకాణాలు కూడా లేవు. ఇన్ఫర్మేషన్ సెంటర్ కి వెళ్ళాము. అక్కడ మా ఫ్రెండ్ సుభాష్ గౌడ్ అధికారి. ఆఫీసు కూడా మూసేసి వుంది. ఎలాగో లోపలకి వెళ్ళాము. శంకర్ అక్కడే కూర్చుని  టైప్ రైటర్ మీద నాలుగు విభిన్న వార్తలు టైప్ చేశాడు. వాటిని ఫాక్స్ చేయడానికి  (సుభాష్  గౌడ్ తర్వాత కాలంలో  ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు) అతడో మనిషిని ఇచ్చి పెద్ద పోస్ట్ ఆఫీసుకు పంపించాడు. అది మూసేసి వుంది. తలుపు మీద తడితే ఎవరో తలుపు ఓరగా తీసి ఏం కావాలంటే హైదరాబాదు నుంచి వచ్చిన జర్నలిస్టులం, ఎన్టీఆర్ వార్త ఇవ్వాలి అంటే లోపలకు రానిచ్చాడు. పని పూర్తయిన తర్వాత ఆకలి సంగతి తెలిసింది. ఎన్ని చోట్ల తిరిగినా ఒక్క హోటల్ తెరిచి లేదు. సుభాష్ గౌడ్ చెబితే అతడి మనిషి ఓ చిన్న రెస్టారెంట్ కి తీసుకు వెళ్ళాడు. షట్టర్లు వేసి వున్నాయి. వెనుక నుంచి దొంగ దోవన లోపలకి తీసుకు వెళ్ళాడు. భోజనం లేదు, ఒక్క ప్లేట్ సాంబార్ రైస్ మాత్రం ఇస్తాను, సర్దుకోండి అన్నాడు. ఏం చేస్తాం అదే మహాప్రసాదం అనుకుని తినేసి బయట పడ్డాము. సాయంత్రం హైదరాబాదు వచ్చే రైల్లో రిజర్వేషన్ వుంది కాబట్టి ఎక్కాము. రైలంతా ఖాళీ. ఎక్కడైనా ఆపేస్తారేమో అనుకున్నాము కానీ మొత్తం మీద ఇళ్లకు చేరాము.

ఇంటికి రాగానే, మా ఆవిడ నిన్నంతా మీకోసం తెగ ఫోన్లు. తెల్లవారుఝామున్నే రోశయ్య గారి ఫోను. మీరు తిరుపతి వెళ్ళారు అని చెప్పాను అంది.

ఇక తరువాతి కధ అందరికీ తెలిసిందే.

ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం తరువాత  ఎన్టీఆర్  తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు అనే వార్త మొట్టమొదటిసారి రేడియోలో నాద్వారా  ప్రపంచానికి తెలిసింది. కానీ ఆయన మరణ వార్త ఇవ్వలేకపోయాను.

కింది ఫోటో :

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు (Courtesy Timescontent.com)



 

కామెంట్‌లు లేవు: