ముఖ్యమంత్రి అంజయ్య గారిని మార్చాలని కాంగ్రెస్
అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని ఆయనకు తెలియచేసింది. అంజయ్య గారు తన పదవికి రాజీనామా
చేసారు. కొత్త నాయకుడి ఎన్నికకు ముహూర్తం ఖరారు అయింది. అప్పటికి ఇంకా ఆయన
ఆపద్ధర్మ ముఖ్యమంత్రే. నేనూ జ్వాలా కలసి ఆయన వెస్పా స్కూటర్ మీద చిక్కడ పల్లి
నుంచి ముఖ్యమంత్రి అధికార నివాసం ‘జయప్రజాభవన్’ ( గ్రీన్ లాండ్స్) కు వెళ్లేసరికి
బాగా పొద్దు
పోయింది. అంతా బోసిపోయి వుంది. నాయక జనం జాడ
లేదు. మేడ
మీద అంజయ్య గారు తన షరా మామూలు వస్త్ర ధారణతో అంటే, గళ్ళ లుంగీ, ముతక
బనీనుతో కనిపించారు. ఏమి మాట్లాడాలో తోచలేదు. కాసేపు వుండి
వచ్చేస్తుంటే వెనక్కి పిలిచారు. ఒక పిల్లవాడిని చూపించి ‘చూడు శ్రీనివాస్, ఇతడికి దూరదర్శన్ లో ఏదో కాజువల్ ఉద్యోగం
కావాలట. ఎవరికయినా చెప్పి చేయిస్తావా ?’ అని అడుగుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు
తిరిగాయి. నేను పని చేసేది రేడియోలో అని ఆయనకు బాగా తెలుసు. అయినా తనని నమ్ముకుని
వచ్చిన ఆ పిల్లవాడిని చిన్నబుచ్చడం ఇష్టం లేక నన్ను అడిగి వుంటారు.
అందుకే ఆయన చనిపోయినప్పుడు ఒక దిన పత్రిక పెట్టిన
పతాక శీర్షికను నా జర్నలిస్టు మిత్రుడు పాశం యాదగిరి ఎప్పుడూ గుర్తు చేస్తుంటాడు.
“గరీబోళ్ళ
బిడ్డ – నిను మరవదు ఈ గడ్డ”.
(సాక్షి
పత్రిక ఎడిటర్ గా ఇటీవల పదవీ విరమణ చేసిన వర్దేల్లి మురళి ఆ హెడ్డింగు పెట్టారు.
అప్పట్లో ఆయన ఆ పత్రికలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు)
అంజయ్య జనం మనిషి అనే వాస్తవం అంబర్ పేట స్మశాన
వాటికలో జరిగిన ఆయన అంత్య క్రియలకు గుండెలు బాదుకుంటూ హాజరైన అపార జనసందోహమే
నిదర్శనం.
చివరకు అంజయ్య మరణవార్త కూడా రేడియోకి ఒక సమస్యగా
మారడం అదో విడ్డూరం. అదీ నా మూలంగా.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ
కేంద్ర మంత్రి శ్రీ టి. అంజయ్య ఢిల్లీలోని రామమనోహర్ లోహియా ఆసుపత్రిలో మరణించారు.
అప్పుడు కేంద్రమంత్రిగా ఉన్న శ్రీ పీవీ నరసింహారావు,
అంజయ్య భౌతిక కాయాన్ని విమానంలో హైదరాబాదు తీసుకువస్తున్నట్టు జాతీయ న్యూస్
ఏజెన్సీలు సమాచారం ఇచ్చాయి. బెజవాడ నుంచి వెలువడే కొన్ని ప్రధాన పత్రికల్లో కూడా
అంజయ్య మరణ వార్త ‘లేట్ న్యూస్’ రూపంలో సంక్షిప్తంగా ప్రచురించారు.
విజయవాడ ఆలిండియా రేడియోలో న్యూస్ ఎడిటర్ గా ఉన్న కృష్ణారావు గారు హైదరాబాదులో ఉన్న నాకు
ఫోను చేసి అడిగారు. వార్త కరక్టే అని చెప్పాను. కానీ ఆయన చనిపోయింది ఢిల్లీలో.
నిబంధనల ప్రకారం ఢిల్లీ విలేకరి ఆ వార్తను ధ్రువపరచాలి. అందుకోసం ప్రయత్నించారు
కానీ ఆ సమయంలో ఢిల్లీలో ఎవరూ దొరకలేదు. ఈ నిబంధనలు అమల్లోకి రావడానికి కూడా ఒక
నేపధ్యం వుంది.
చాలా ఏళ్ళ కిందటి సంగతి.
ఢిల్లీలో బాబూ జగ్జీవన్ రామ్ మరణించినట్టు ఆరోజు
ఉదయం ఆరుగంటల ప్రాంతంలో పీటీఐ వార్తా సంస్థ వార్త ఇచ్చింది. మరో నలభయ్ అయిదు
నిమిషాల్లో విజయవాడ నుంచి ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ప్రాంతీయ వార్తావిభాగం
అధికారి శ్రీ ఆర్వీవీ కృష్ణారావు, వెంటనే స్పందించి, జగ్
జీవన్ రాం గురించిన సమస్త సమాచారం సిద్ధం చేసుకుని సవివరంగా ఆ వార్తను ప్రసారం
చేసారు. న్యూస్ రీడర్, కీర్తిశేషులు కొప్పుల సుబ్బారావు ఆ రోజు బులెటిన్
చదివారు. ప్రాంతీయ వార్తల అనంతరం ఢిల్లీ నుంచి వెలువడే సంస్కృత వార్తల్లో ఈ
సమాచారం లేకపోవడంతో సిబ్బంది కంగారు పడ్డారు. ఆ తరువాత ఏడూ అయిదుకు వచ్చే ఢిల్లీ
తెలుగు వార్తల్లోనూ,
ఎనిమిది గంటల జాతీయ వార్తల్లోనూ ఆ మరణవార్త
లేకపోవడంతో కంగారు మరీ ఎక్కువయింది. బెజవాడ రేడియో కప్పదాటు వేసిన విషయం బయట
పడింది. అప్పటి తెలుగు దేశం లోక్ సభ సభ్యుడు శ్రీ పుట్టపాగ రాధాకృష్ణ ఈ విషయాన్ని
ప్రశ్న రూపంలో లేవనెత్తారు. ఈ వార్త ప్రసారం చేయడంలో పీటీఐ పై ఆధారపడి దేశంలోని
ఏడు రేడియో స్టేషన్లు తప్పు చేశాయని సమాచార శాఖ మంత్రి లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
గమ్మత్తేమిటంటే ఈ పొరబాటు చేసిన విజయవాడ రేడియో స్టేషన్ పేరు ఈ జాబితాలో లేదు.
ఏది ఏమైనా ఈ ఉదంతంతో మరణ వార్తల ప్రసారం విషయంలో
అనుసరించాల్సిన ఆదేశిక సూత్రాలు ఢిల్లీ నుంచి జారీ అయ్యాయి. రేడియో విలేకరి
స్వయంగా వెళ్లి చూసి ఇచ్చేదాకా, ముఖ్యుల మరణ వార్తను ప్రసారం
చేయరాదని ఆంక్షలు విధించారు.
ఇవి అంజయ్యగారు చనిపోయినప్పుడు అడ్డం వచ్చాయి. చనిపోయింది
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. నిబంధనల పేరుతొ ఆరోజు న్యూస్ బ్రేక్
చేయక పోతే ప్రజలనుంచి పెద్ద నిరసన వచ్చే ప్రమాదం వుంది. దాంతో ఏమైతే ఏమైందని
కృష్ణారావు గారు అంజయ్య గారి మరణ వార్తను ఇతర వివరాలతో కలిపి ఉదయం ఆరూ నలభయ్ అయిదు
నిమిషాలకు మొదలయ్యే ప్రాంతీయ వార్తల్లో ప్రముఖంగా ప్రసారం చేసారు.
ఏడు గంటల అయిదు నిమిషాలకు ప్రసారమైన ఢిల్లీ
తెలుగు వార్తల్లో ఆ ముచ్చటే లేదు. ఇక్కడ నుంచి వార్త ఇచ్చినా నిబంధనల పేరుతో తీసుకోలేదు.
‘తెలుగు
ప్రముఖుడు ఒకరు చనిపోతే ఆ వార్తను ఢిల్లీ తెలుగు వార్తల్లో చెప్పరా’
అంటూ అదే టీడీపీ సభ్యుడు పుట్టపాగ
రాధాకృష్ణగారు పార్లమెంటులో హడావిడి చేసారు.
ఇలాటివే మరి కొన్ని అవకతవకలు రేడియో వార్తల్లో
దొర్లాయి. లోక్ నాయక్ జయప్రకాశ్ కన్నుమూత గురించిన వార్త. ధ్రువ పరచుకోకుండానే
వార్తల్లో ఇవ్వడం,
నాలుక కరచుకోవడం జరిగింది. పార్లమెంటు
శ్రద్ధాంజలి ఘటించింది కూడా. ఆ తరువాత కానీ జరిగిన పొరబాటు తెలియరాలేదు.
మరోటి విదేశీ రేడియో ముచ్చట.
ఎనభయ్యవ దశకం చివర్లో నేను మాస్కోలో, రేడియో
మాస్కో తెలుగు విభాగంలో పనిచేసే రోజుల్లో, తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎం.జి.
రామచంద్రన్ తీవ్ర అస్వస్థత అనంతరం కన్ను మూశారు. వార్తను ధృవీకరించుకోవడం జరిగింది
కానీ, ఆ
వార్త రేడియో మాస్కో తమిళ వార్తల్లో కూడా ప్రసారానికి నోచుకోలేదు. కారణం
మరో విషయంలో వాళ్లకు ధృవీకరణ సకాలంలో అందకపోవడమే. అదేమిటంటే, చెప్పుకోవడానికి చిత్రంగా
వుంటుంది కానీ, ప్రాంతీయ పార్టీ నాయకుడు ఎం.జి. రామచంద్రన్ కు అప్పటి
కేంద్ర ప్రభుత్వానికి నడుమ సయోధ్య ఉందా లేదా అనే విషయం రేడియో
మాస్కో ఢిల్లీ విలేకరినుంచి తగిన సమాచారం అప్పటికి అందకపోవడం వల్ల ఆ మరణ వార్తను
కొన్నాళ్ళు నిలిపి వేసి తర్వాత ప్రసారం చేశారు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే, విలేకరులు
వార్తలను అందించే తొందర్లో ఎలా తప్పుల్ని తొక్కుతారో అన్నది తెలియ చెప్పడానికే.
ఇందుకు నేనూ మినహాయింపు కాదని చెప్పడానికే.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసి చనిపోయినవారిలో
భవనం వెంకట్రాం తప్పించి అందరికి హైదరాబాదులో విగ్రహాలు వున్నాయి. వీరు చనిపోయిన
వెంటనే విగ్రహాల ఏర్పాటు జరిగింది. కొందరి
పేరిట పార్కులు,
స్టేడియం వున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి జనంలోమంచి పేరు తెచ్చుకున్న అంజయ్య గారికి, 1986 లో
ఆయన చనిపోతే, ఇరవై
ఏళ్ల తర్వాతనే 2006 లో
ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాములో లుంబినీ పార్కు వద్ద అంజయ్య విగ్రహం
నెలకొల్పి, ఆ
పార్కుకు అంజయ్య పేరిట నామకరణం చేశారు.
కింది ఫోటో:
హైదరాబాదు లుంబినీ పార్కు వద్ద అంజయ్య విగ్రహం
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి