11, జనవరి 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో ( 66) – భండారు శ్రీనివాసరావు

కౌలాలంపూర్ ఎయిర్ పోర్టు నుంచి నగరంలోకి  చాలా సేపు  ప్రయాణం. ఇప్పుడు అంటే అలాంటి రోడ్లు అందరికి అనుభవంలోకి వచ్చాయి కానీ,  ఆ రోజుల్లో విశాలమైన రోడ్లు, ఎత్తైన భవనాలు, రకరకాల కార్లు, ప్రతిదీ అపురూపమే. అంబాసిడర్, ఫియట్ తప్ప మరో బ్రాండ్ కారు ఎలా వుంటుందో చూడాలి అంటే సినిమాల్లోనే.  భాష రాని వాళ్ళు కూడా ఇంగ్లీష్, హిందీ సినిమాలకు వెళ్ళడానికి ఒక కారణం ఇటువంటివి చూసి ఆనందించడానికే అని చెప్పుకునే వారు.

ఒక గంట ప్రయాణం తర్వాత కారు హోటల్ జయ ఇంటర్నేషనల్ ముందు ఆగింది. రిసెప్షన్ లో కనుక్కుంటే నా పేరు ముఖ్యమంత్రి వెంట వచ్చే అధికారుల బృందంలో వుంది. ఈ బృందం మొత్తానికి ఒకే ఫ్లోర్ లో గదులు. పైగా విడిగా నా కోసం ఒక వాహనం, డ్రైవర్. పదిహేను డాలర్లతో దిగిన నాకు ఈ వైభోగం పడుతుందని నేను ఊహించలేదు. ప్రభాకర రెడ్డి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు చెప్పి నా గదికి వెళ్లి రిఫ్రెష్ అయ్యాను. బాత్ టబ్ లో స్నానం చేయడం అదే మొదటిసారి. ఈ లోగా నా కోసం ఎయిర్ పోర్టుకు వెళ్ళిన కారు డ్రైవర్ తిరిగి వచ్చాడు. అతడికి ఇంగ్లీష్ అర్ధం అవుతుంది. ‘పలానా చోటుకి అనిలేదు. ఓ గంట సేపు అలా ఊరు చూసి వద్దాము, ఎక్కడా ఆగాల్సిన పని లేదు’ అని ముందే చెప్పాను, షాపింగ్ అనుకుని తీసుకువెడతాడేమో, వున్నవి కొద్ది డాలర్లే అనే సందేహంతో.    అతడు మలేసియాలో స్థిరపడ్డ తమిళుడు. కొంచెం తెలుగు తెలుసు. పేరు రామచంద్రన్. కారు డ్రైవర్లకు ప్రయాణీకుల మనస్తత్వం, ఆలోచనలు  అర్ధం చేసుకునే శక్తి ఉంటుందేమో. అతడు సరాసరి ఒక దుకాణం దగ్గర ఆపాడు. మీ దగ్గర ఇండియన్ రుపీస్ వుంటే ఇక్కడ మార్చుకోండి. బ్యాంకు రేటు కంటే ఎక్కువే ఇస్తారు అన్నాడు. ‘ఉన్నాయి కానీ ఇప్పుడు తేలేదు. కాసేపు తిరిగి వెనక్కి వెడదాం’ అన్నాను. ‘పరవాలేదు, పెద్ద పెద్ద హోటళ్ళలో తప్ప అన్నిచోట్ల ఇండియన్ రుపీస్ తీసుకుంటారు’ అని మొదటి పాఠం చెప్పాడు.

హోటల్ కు వెళ్లేసరికి అక్కడ నానా హడావిడిగా వుంది. రిసెప్షన్ హాలు లోకి వెళ్ళే అద్దాల ద్వారం దగ్గర జనం గుమికూడి వున్నారు. అందరూ తెలుగు సభల కోసం వచ్చిన వారే అని వారి మొహాలు చూస్తేనే తెలుస్తోంది. ఆ తలుపు దగ్గర నిలబడితే తెరుచుకుంటాయి. లోపల అడుగు పెట్టగానే మూసుకుంటాయి. ఇలాంటివి మనదగ్గర చిన్న చిన్నమాల్స్ లో కూడా ఇప్పుడు ఉంటున్నాయి. చెప్పాకదా. అప్పట్లో ప్రతిదీ కొత్తే. హడావిడికి కారణం ఏమిటంటే భయం. తెరుచుకున్న తలుపు వెంటనే మూసుకుంటుందేమో అని భయపడి, తలుపు తెరుచుకోగానే, క్షణం ఆలస్యం చేయకుండా అందరూ బయట నుంచి ఒక్క గెంతు గెంతి  లోపలకు దూకుతున్నారు. ఇదంతా చూసిన తర్వాత,  హోటల్ వాళ్ళు ఆ అద్దాల తలుపులు తెరిచే ఉంచారు. మొదటి రోజు భోజనాలు అద్భుతంగా వున్నాయి. దేశం కాని దేశం వచ్చాము అనే భావన లేకుండా చక్కటి తెలుగు వంటకాలతో భోజనాలు పెట్టారు. సాయంత్రం అయ్యేసరికి అతిధుల సంఖ్య వాళ్ళు ఊహించిన దానికి కొన్ని రెట్లు పెరిగింది. దాంతో ఒక కూర, పచ్చడి, సాంబారు పెరుగుతో సరిపుచ్చారు. హోటల్ లోని మసాజ్ సెంటర్ మాత్రం మంచి బిజినెస్ చేసింది. తెలుగు సభల ప్రతినిధులతో   కిటకిటలాడింది. ఎందుకంటే అక్కడ మసాజ్ చేసేవారందరు ఆడవాళ్ళు.

ఈలోగా, బొంబాయి మీదుగా ప్రయాణం చేసి కౌలాలంపూర్  వచ్చిన  ముఖ్యమంత్రి బృందం  హోటల్ కు చేరింది. అక్కడ ఏర్పాటు చేసిన గదుల్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ ఫ్లోర్ లో చిట్టచివరి విశాలమైన గది ముఖ్యమంత్రికి, పక్క గది సెక్యూరిటీ అధికారి, ఐపిఎస్ ఆఫీసర్ వామనరావు గారికి, ఆ పక్క గది నాకు, మిగిలినవి ఇతర సిబ్బందికి కేటాయించారు.  

అంజయ్య గారు శాకాహారి. ఆ విషయం తెలియని అక్కడి ఆహ్వాన సంఘం వారు రకరకాల నాన్ వెజ్ వంటకాలతో డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆయన మాత్రం  రెండు రొట్టెలు, బంగాళా దుంపల కూరతో సరిపెట్టుకున్నారు.

ప్రపంచ తెలుగు సభల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మలేసియా ఉప ప్రధాన మంత్రి డాక్టర్ మహాతీర్ మహమ్మద్ కూడా హాజరయ్యారు. తెలుగు భాష గొప్పతనం గురించి యథావిధిగా ప్రసంగాలు సాగాయి. ప్రవాసాంధ్రుల కోర్కెలు తీర్చడానికి తమ  ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నం చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.  

కారణాలు ఏమైతేనేం కాంగ్రెస్ అధిస్థానం అంజయ్యపై కినుకతో వున్నరోజులవి. ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తరవాత అంజయ్య గారు హోటల్ రూముకి తిరిగొచ్చేసారు. వెంట షరా మామూలుగా నేను. కాస్త నలతగా కనిపించారు. అంత పెద్ద గదిలో ఆయనా నేను ఇద్దరమే. సాయంత్రం అవుతోంది. ఆయన దీర్ఘంగా ఆలోచిస్తూ పెద్ద కిటికీ అద్దంలోనుంచి బయటకు చూస్తున్నారు. విశాలమయిన రోడ్డు. వచ్చే కార్లు. పోయే కార్లు. పక్కనే ఏదో ఫ్యాక్టరీ లాగావుంది.

ఆయన వున్నట్టుండి “చూసావా!” అన్నారు. నాకేమీ అర్ధం కాలేదు.

పొద్దున్న బయలుదేరేటప్పుడు చూసాను. అందులో (ఆ ఫ్యాక్టరీ లో) పనిచేసేవాళ్లందరూ గంట కొట్టినట్టు టైము తప్పకుండా వచ్చారు. అయిదు నిమిషాల్లో లోపలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్లీ అంతే. షిఫ్ట్ పూర్తికాగానే ఠంచనుగా ఇళ్లకు పోతున్నారు. పనిచేసేవాళ్లకు వాళ్లకు కావాల్సింది ఇవ్వాలి. కావాల్సిన విధంగా పని చేయించుకోవాలి. ఇలా మన దగ్గర కూడా చేస్తే కావాల్సింది ఏముంటుంది!” అన్నారాయన యధాలాపంగా.

అంటే ఇప్పటిదాకా ఆయన ఆలోచిస్తోంది ఇదన్నమాట.

కౌలాలంపూర్ తెలుగు మహాసభల ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదనీ, ఇందిరాగాంధీ ఈ విషయంలో ముఖ్యమంత్రి పట్ల చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారనీ, హైదరాబాదులో ఒక ప్రముఖ దినపత్రిక పత్రిక రాసిన విషయం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న అంజయ్య గారికి “రాజకీయ జ్వరం” పట్టుకున్నట్టు అప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. అందుకే ఆయన సభా ప్రాంగణంలోనే వుండిపోకుండా వొంట్లో బాగోలేదనే నెపంతో హోటల్ రూముకి తిరిగొచ్చేసారని వదంతులు హైదరాబాదు దాకా పాకాయి. ఈయనగారేమో ఇక్కడ తాపీగా కూర్చుని కార్మికులు గురించి ఆలోచిస్తున్నారు. అలావుండేది అంజయ్య వ్యవహారం.

కింది ఫోటోలు:


కౌలాలంపూర్ లో తెలుగు మహా సభల కార్యక్రమంలో నాటి ముఖ్యమంత్రి శ్రీ టి. అంజయ్య, ప్రభ్రుతులు









 

(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: