ఇప్పటిమాట కాదు. అరవై ఏళ్ళ పైమాటే.
మద్రాసు జనరల్
ఆసుపత్రి బీటు చూసే ఒక విలేకరికి ఒక రోజు స్కూటర్ ప్రమాదంలో గాయపడి మరణించిన
వ్యక్తి శవం కనిపించింది.
పక్కనే
ఎవరికోసమో ఎదురుచూస్తున్న లక్ష్మి అనే అమ్మాయి (పేరు తరువాత తెలిసింది) అతడికి తారసపడింది. ఆమె ఒక నిర్మాణ కూలీ. స్కూటరు
పై వెడుతున్న ఓ ఇద్దర్ని అటుగాపోయే వాహనం కొట్టేసి ఆగకుండా అందరూ చూస్తుండగానే
వెళ్ళిపోయింది. కిందపడి గిలగిలాకొట్టుకుంటున్నవారిని అందరితోపాటు ఈమె కూడా
చూసింది. అందరూ వింత చూసేవారే కాని ఒక్కరూ కలగచేసుకోలేదు. ఈమే పరిగెట్టుకు వెళ్లి వాళ్ళను లేవదీయాలని ప్రయత్నించింది. ఓటాక్సీని ఆపింది. అప్పటికే ముగ్గురునలుగురు ఆపకుండాపోయారు. మరి
కిరాయి ఎవరిస్తారని మరో టాక్సీవాడు
అడిగాడు. డబ్బులేదు. ముక్కుపుడక చూపించింది. టాక్సీలో ఇద్దరినీ జనరల్ హాస్పటల్ కి తీసుకువెళ్ళింది. అయిన ఆలస్యంవల్ల ఆ ఇద్దరిలో ఒకడు అప్పటికే చనిపోయాడు. ఈ స్తితిలో
విషయం తెలుసుకున్న విలేకరి హృదయం ద్రవించింది.
నిరక్షరాస్యురాలయిన
ఓకూలీ వనిత తన రోజుకూలీ కూడా వొదులుకుని, ముక్కుపుడక టాక్సీవాడికి ఇచ్చి
హాస్పటల్ కు చేర్చిన వైనాన్ని ఆ విలేకరి మరునాడు తన పేపర్లో రాసాడు. ‘క్వాలిటీ ఆఫ్ మెర్సీ ‘అనే శీర్షికతో రాసిన ఆ వార్త
నగరంలో చర్చనీయాంశం అయింది. పోలీసు కమీషనర్, లక్ష్మికి పాతికరూపాయల నగదు బహుమతి ప్రకటించారు. ఆమె రోజుకూలీ
రూపాయన్నరతో పోల్చుకుంటే ఆరోజుల్లో అది పెద్దమొత్తమే. పత్రికా పాఠకులనుంచి కూడా
మంచిస్పందన వచ్చింది. అనేకమంది ఆమెకు కానుకలు పంపారు. మధురై నుంచి వెంకటేశ్వరన్
అనే వ్యక్తి ఒక పార్సెల్ పంపాడు.. గాయపడ్డవారి రక్తంతో తడిసిన ఆమె చీరెకు బదులుగా ఒక కొత్త
చీరెను కానుకగా పంపించాడు. పాఠకులనుంచి దాదాపు వెయ్యిరూపాయల సాయం అందింది. వంద
రూపాయలు మించి వస్తే ఒక ఇత్తడి గిన్నె కొనుక్కుంటానని ఆయువతి తరువాత అదే విలేకరికి
ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. అది చదివిన
కంచికామకోటి పీఠాధిపతి, పరమాచార్య ఒక ఇత్తడిగిన్నెను ఆమెకు కానుకగా పంపించారు.
ఇంతకీ అసలువిషయంఏమిటంటే
-
ఆ వార్త వేసిన పేపరు హిందూ. ఆ వార్త రాసింది అందులో కొత్తగా విలేకరిగా చేరిన
ఆర్.జే. రాజేంద్రప్రసాద్.
ఈ కధా నాయకుడు,
తదనంతర కాలంలో హైదరాబాదులో హిందూ పత్రిక
డిప్యూటీ ఎడిటర్ అయ్యారు. నేను హైదరాబాదు
రాకముందు నుంచి కూడా ఆయన నాకు తెలుసు. నేను విజయవాడలో ఆంధ్రజ్యోతిలో
పనిచేసేటప్పుడు ఆయన అక్కడే హిందూ పత్రికకు ROVING CORRESPONDENT గా వున్నారు. వార్తలకోసం చుట్టుపక్కల
జిల్లాలు తిరుగుతుండేవారు.
ఆ రోజుల్లో
ఒకసారి మా వూరికి మా పార్లమెంటు సభ్యుడు, కేంద్రమంత్రి అయిన డాక్టర్ కే.ఎల్.
రావు టూరు ప్రోగ్రాము పెట్టుకున్నారు. ఆ సందర్భంలో రాజేంద్రప్రసాద్ గారు 'మీ ఊరు
పోతున్నాను, మీరూ వస్తారా' అని అడిగారు. 'అది అంత సులభం కాదండీ,
ప్రయాణంలో చాలా అవస్థలు పడాలి' అన్నాను. 'అవస్థలు పడితేనే
కదా మనకి వార్తలు దొరుకుతాయ'ని ఆయన అన్నారు.
సరే అని ఇద్దరం
బెజవాడ నుంచి రైల్లో బయలుదేరాము. ఉదయం నైజాం పాసింజరులో వెళ్లి రెండు గంటల తర్వాత
మోటమర్రి (అంతకుముందు అల్లినగరం) స్టేషనులో దిగాము. వర్షాకాలం. దోవ అంతటా చిత్తడి
చిత్తడిగా వుంది. అల్లినగరం మీదుగా జొన్నచేలమధ్య కాలిబాట పట్టుకుని, నాలుగు మైళ్ళు నడిచి వెడితే మా వూరు కంభంపాడు.
చెప్పులు చేతిలో పట్టుకుని నడక మొదలు పెట్టాము. బురద నేలల్లో మోకాళ్ళ దాకా కాళ్ళు
కూరుకుపోతున్నాయి. పాపం ప్రసాద్ గారు పట్టణం నుంచి వచ్చి ఎన్ని అవస్థలు పడుతున్నారో
అనిపించింది. కానీ ఆయన మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన మార్కు మందహాసంతో
దారిపొడుగునా కబుర్లు చెబుతూనే వున్నారు. జొన్నచేలు దాటి, మా వూరు
పొలిమేరల్లో వరిపొలాల గట్ల మీద నడుచుకుంటూ మొత్తం మీద మా వూరు చేరాము.
పల్లెటూరు కదా
టిఫిన్ల మాట ఎత్తకుండా మా అమ్మగారు ఏకంగా భోజనాలకే లేపారు. మా బామ్మగారు ఎవర్రా
వచ్చింది, తాసీల్ దారా అని అడుగుతోంది. భోజనాలు అయిన తర్వాత ప్రసాద్ గారు
వూళ్ళో తిరిగి వద్దామన్నారు. వచ్చింది పేపరు మనిషి అని వూరి వాళ్ళకి
తెలిసిపోయింది. ఆయనతో చెప్పుకుంటే పేపర్లో రాస్తారు, తమ కష్టాలు తీరిపోతాయని అందరూ ఆయన
చుట్టూ మూగి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ప్రసాద్ గారు పరమ ప్రశాంతంగా వాళ్ళు
చెప్పిన ప్రతిదీ ఓపిగ్గా విన్నారు. కే.ఎల్. రావు గారు మా వూరికి మధ్యాన్నం రెండు
గంటల ప్రాంతంలో రావాలి. అందరం ఆయన కోసం ఎదురు చూస్తున్నాం.
మూడయింది, నాలుగయింది, మంత్రిగారి
జాడలేదు. చూస్తుండగానే చీకటి పడింది. అప్పటికి మా వూళ్ళో కరెంటు లేదు. కిరసనాయిలు
దీపాలే. ఇంతలో జీపు హెడ్ లైట్ల కాంతి కనిపించింది. ఇంకేముంది వస్తున్నారని సంబర
పడ్డాము. ఆ జీపు లైట్లు, ఆకాశంలో గిరగిర
తిరిగే సర్కసు దీపం (బీమ్) మాదిరిగా కొంతసేపు కనిపించి ఆ తర్వాత కనపడకుండా పోయాయి.
ఇంకో రెండు గంటలు చూసి వూరివాళ్ళు ఇళ్ళకు మళ్ళారు.
ఆ తర్వాత
కాసేపటికి రెండు జీపుల్లో మంత్రిగారి కాన్వాయ్ మా ఇంటి దగ్గర ఆగింది. మా బాబాయి
కొడుకు సత్యమూర్తి అన్నయ్య మా వూరు సర్పంచ్. కాస్త వసతిగా ఉంటుందని ఆయన
కార్యకలాపాలు మా ఇంటి నుంచే నడిపేవారు.
అనుకున్నంత సేపు
పట్టలేదు మంత్రిగారి పర్యటన. చల్లారిపోయిన పాలను మళ్ళీ వేడి చేసి పెట్టి ఇచ్చిన
కాఫీలు తాగి నిష్క్రమించారు. వచ్చింది హిందూ కరస్పాండెంటు కాబట్టి, ప్రసాద్ గారితో
కాసేపు విడిగా మాట్లాడారు.
మర్నాడు
బయలుదేరి మేమిద్దరం బెజవాడ వచ్చేసాము.
ఆ తర్వాత మూడో
రోజనుకుంటాను హిందూలో ఓ బాక్స్ ఐటం వార్త వచ్చింది. సరైన రోడ్లు లేక దారి తప్పిన
కేంద్రమంత్రి అంటూ. కేంద్ర మంత్రి తనతో మాట్లాడిన విషయాలను క్లుప్తంగా
ప్రస్తావించి, వూరి వాళ్ళు తనతో చెప్పుకున్న కష్టాలను వివరంగా రాసారు.
ఆ వార్త వచ్చిన
కొద్ది రోజులకే, కే.ఎల్. రావు గారు శ్రమదానం కార్యక్రమాన్ని ప్రకటించి మా వూరికి
రోడ్డు, కరెంటు మంజూరు చేసారు. మా వూరికే కాదు చుట్టుపక్కల అనేక గ్రామాలను
కలుపుతూ వత్సవాయి నుంచి చెవిటికల్లు వరకు మా వూరి మీదుగా రోడ్డు పడింది. కరెంటు
వచ్చింది. శ్రమదానం అంటే ఏ వూరివాళ్ళు ఆ ఊరికి కావాల్సిన కరెంటు స్తంభాలు తమ బండ్ల
మీద చేరవేయాలి. అలాగే రోడ్డు నిర్మాణంలో శ్రమదానం చేయాలి.
కే.ఎల్. రావు
గారిచ్చిన స్పూర్తితో దాదాపు నలభయ్ గ్రామాల ప్రజలు పార్టీలతో నిమిత్తం లేకుండా తమ
ఊళ్లకు కరెంటు, రోడ్డు సాధించుకున్నారు.
అయితే దండలో
దారం మాదిరిగా ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ గారు రాసిన వార్త ప్రభావం ఈ అభివృద్ధిలో
వుంది.
దానికి
ప్రత్యక్ష సాక్షులలో నేనొకర్ని.
ఆ రోడ్డుకు ఎవరూ
పనికట్టుకుని పేరు పెట్టలేదు. ఆ నలభయ్ గ్రామాల ప్రజలే ఈనాటికీ దాన్ని కె.ఎల్.రావు
రోడ్డు అని పిలుచుకుంటున్నారు. కే.ఎల్.రావు గారి కుమార్తె, ఐ.ఏ.ఎస్. అధికారి సుజాతా
రావు గారికి ఈ విషయం చాలా సార్లు
చెప్పాను. ఆవిడ కూడా వెళ్లి చూద్దాం అన్నారు. హైదరాబాదులో వున్నప్పుడు పని
ఒత్తిళ్ళ కారణంగా వీలు పడలేదు. తరువాత ఢిల్లీ పోస్టింగు. అక్కడే రిటైర్ మెంటు. ఇక
కుదురుతుందని నేనూ అనుకోవడం లేదు.
నీటి పారుదల నిర్వహణ, గ్రామీణ
విద్యుదీకరణ రంగాల్లో కె.ఎల్.రావు ( కానూరి లక్ష్మణ రావు అసలు పేరు. కృష్ణా జిల్లా
కంకిపాడు వాస్తవ్యులు) గారికి ఒక ఇంజినీరుగా దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు
వున్నాయి. ఒక అంతర్జాతీయ సదస్సులో కె.ఎల్.రావు గారు ఆశువుగా చేసిన సుదీర్ఘ ప్రసంగం
ఆలకించిన నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు ముగ్ధుడు అయ్యారు. ఆ నాటి ముఖ్యమంత్రి
డాక్టర్ నీలం సంజీవ రెడ్డి గారు ఆయన్ని అధికార పార్టీ తరపున విజయవాడ పార్లమెంటు
నియోజక వర్గం నుంచి పోటీ చేయించారు. అదే నియోజక వర్గం నుంచి రావు గారు ముమ్మారు
లోకసభకి ఎన్నికయ్యారు. జవహర్లాల్ నెహ్రు, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ మంత్రి వర్గాల్లో ఆయన మంత్రిగా
వున్నారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత. వృత్తి రీత్యా రాజకీయ నాయకుడు కాకపోయినా, నాగార్జున సాగర్ ఆనకట్ట రూపకల్పనలో, నిర్మాణంలో ఆయన
పాత్ర అద్వితీయం. రాతితో, మట్టితో ఆనకట్ట నిర్మాణం ఏమిటని ఎద్దేవా చేసిన వాళ్ళు వున్నారు.
‘మనది పేద దేశం.
నిరక్షరాస్యులైన పనివాళ్లు కోట్లలో వున్నారు. వారికి ఎంతోకొంత జీవన భృతి కల్పించాలి
అంటే ఇలాంటి నిర్మాణాలే తగినవి అని ఆయన గట్టిగా వాదించి అలాగే సాగర్ ప్రాజెక్టును
నిర్మించారు. దేశంలో ఆ రోజుల్లో నిర్మితమైన అనేక సాగు నీటి ప్రాజెక్టులు, ఆనకట్టల వెనుక
కె ఎల్ రావు గారి పాత్ర వుంది. నీటిపారుదల పితామహుడు అనే పేరు ఆయనకు వుంది. సాగర్ ఎడమ కాలువ ద్వారా కృష్ణా జిల్లాలోని అనేక
ప్రాంతాలకు సాగునీరు అందేలా చేశారు. వందల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు.
తమకు సేవచేసిన మనిషిని గుర్తు పెట్టుకుని మూడు సార్లు గెలిపించిన ఆ ఓటర్లే నాలుగో
సారి ఓడించడం రాజకీయాల్లోని చమత్కారం.
కింది ఫోటోలు:
1 కామెంట్:
Prasadji
Gem of a person
కామెంట్‌ను పోస్ట్ చేయండి