మాది 1962 హెచ్.ఎస్.సి. బ్యాచ్. ఈ ఒక్క సంగతి గుర్తు పెట్టుకుని వున్నట్టయితే, లేదా సమయానికి గుర్తు వచ్చి వున్నట్టయితే ఇవ్వాళ నా నెలవారీ పెన్షన్ ఓ పాతిక వేలు పెరిగివుండే అవకాశం వుండేది. నాది మతిమరపు జాతకం కదా! కర్ణుడి లాగా సమయానికి గుర్తురాలేదు. బంగారం లాంటి అవకాశం చేజారి పోయింది. అందుకే కదా నన్ను నేను జీరో అనుకునేది. ఉత్తి జీరో కాదు, బిగ్ జీరో. ఆ కధేమిటో మరోసారి సమయం వచ్చినప్పుడు చెబుతాను.
ఆ ఏడాది కారణం తెలియదు కాని, 1962 హెచ్.ఎస్.సి. యాన్యువల్ పరీక్ష రోల్ నెంబర్లు రాష్ట్రం మొత్తంలో ఖమ్మం, రిక్కబజార్ హై స్కూలు నుంచి మొదలు
పెట్టారు. ఒకటి, రెండు, మూడు ఇలా అన్నమాట. నా రోల్ నెంబరు ఏడు. ఏడంటే ఏడే. ముందు వెనుక మరో అంకె లేదు. హాల్
టికెట్ మీద ఏడు నెంబరు చూడగానే, కాపురం చేసే కళ కాళ్ళ మెట్టెలు చూస్తే తెలిసినట్టు, నా పరీక్ష
ఫలితం పరీక్ష రాయక ముందే నాకు తెలిసిపోయింది. ఇది కాక మరో అదృష్ట సంఖ్య వచ్చినా
ఫలితం మారదని కూడా నాకు తెలుసు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధికి ఓట్ల
లెక్కింపుకు ముందే ఫలితం పట్ల ఓ అంచనా ఉంటుందని అంటారు. అలాగే విద్యార్ధికి కూడా
ఫలితం పట్ల ముందుగానే ఓ అంచనా వుంటుంది. కాకపోతే, రిజల్ట్స్ వచ్చేవరకు మేకపోతు గాంభీర్యం.
మినిమం సెకండ్ క్లాస్. హయ్యర్ సెకండ్ వచ్చినా ఆశ్చర్యం లేదు అంటూ బూకరింపులు.
సప్లిమెంటరీ పరీక్ష ఫీజు కట్టడంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. నాదీ అలాగే ముగిసింది.
ఒకటి కాదు, రెండు
సార్లు. ఒకటి ఒంటరి అంకె. నాకు నచ్చదు.
పరీక్షలు రాయడం పూర్తయింది. తప్పడం తప్పదు అనే విషయం కూడా మనసుకు రూడి
అయింది. కాబట్టి కంభంపాడు వెళ్లి అక్కడ పిల్లలతో ఆడుకుంటూ కాలక్షేపం చేయడం మంచిదని
అక్కడికి బిస్తరు కట్టాను. మా పెద్దన్నయ్య ఎప్పుడూ ప్రయాణాలకి సూట్ కేసులు వాడే
వాడు కాదు. ఆ రోజుల్లో చాలామంది హోల్దాల్ వాడేవాళ్ళు. దానికా పేరు ఎందుకో నాకయితే
తెలియదు. బహుశా హోల్డ్ ఆల్ అయివుంటుంది. దానికి రెండు వైపులా బట్టలు పెట్టుకునే జాగా
వుంటుంది, దాన్ని
రెండుపక్కలా మధ్యకు మడిచి బెల్ట్ తో బిగించేవాళ్లు. ప్రయాణాలకు చాలా అనువుగా
వుండేది. కొంతమంది దాన్ని బిస్తరు అనేవాళ్ళు.
మొత్తం మీద మా ఊరు చేరాను. ఊరు చేరగానే నాకు వంటికి కొత్త రక్తం పట్టినంత
హుషారు. బారెడు పొద్దెక్కి లేచినా అడిగేవాళ్ళు వుండరు. పనివాళ్లు లేపడానికి చూసినా
మా బామ్మ వాళ్ళని కసిరేది, పిల్లాడు
ఒళ్ళు మరచి నిద్రపోతుంటే చూడలేరా అని వాళ్ళ మీద గయ్యిమనేది. సాయంత్రం అయ్యేసరికి
తుమ్మల బీడు పక్కన పారే వాగు ఇసుకలో చెడుగుడు (కబడ్డీ) ఆడేవాళ్ళం. కూత ఎంత పెడితే అంత ఘనం. మా ఊరి
స్కూలుకు బయట నుంచి మాస్టర్లను వేయడం మొదలయింది. మల్లయ్య గారనే కొత్త టీచరు
వచ్చారు. ఆయన తన వెంట షటిల్ ఆటను పట్టుకొచ్చారు. బ్యాట్లు,బంతులు కొని ఆట ఆడేవాళ్ళం. ఆయనే అది ఎలాఆడాలో
చెప్పాలి. స్కోరు గమ్మత్తుగా వుండేది. ఇరుపక్షాలు సమానం అయితే లవ్ ఆల్ అనేవారు. ఆటలో ఈ లవ్వు
ఏమిటని నవ్వుకునేవాళ్ళం. పాటలు బాగా పాడేవాడు. ఘంటసాల లాగా పాడుతాను అని ఆయనకో
నమ్మకం. మహేశా పాపవినాశా కైలాస వాసా ఈశా అనే పాట ఎక్కువగా పాడేవాడు. ఊళ్ళో
చిన్నపిల్లలను దగ్గరకు తీసి చిన్న చిన్న నాటికలు వేయించేవాడు. మా ఇంట్లోనే వాటి
రిహార్సల్స్ నడిచేవి.
వరి కళ్లాల సమయంలో మా బామ్మగారు వెళ్లి రాత్రి పూట అక్కడే పడుకునేది.
ఒక్కోసారి ఆమెను ఇంట్లోనే వుండమని నేను వెళ్ళే వాడిని. పగటి పూట బాగానే వుండేది.
ఎడ్ల చేత తొక్కించడం, చేటలతో
ధాన్యం చెరిగి రాశిగా పోయడం, కుండలతో అంటే
మట్టివి కావు, ధాన్యం
కొలతకు వాడే ఇత్తడి గుండిగలతో కొలిచి బస్తాలు నింపడం, సరదాగా గడిచేది. కట్టె మిఠాయి తట్టలలో
పెట్టుకుని కళ్లాల దగ్గరికి తీసుకువచ్చి అమ్మేవారు. మానెడు వడ్లు కొలవడం, హాయిగా తినడం. రాత్రి పూట బాగా చలి వేసేది.
రెండు దుప్పట్లు కప్పుకున్నా చలి ఆగేది కాదు. అందుకని వరి గూడులో నేను కాళ్ళు
ముడుచుకుని పడుకోవడానికి వీలుగా, ధృవ ప్రాంతాలలో నివసించే ఎస్కిమోలు మంచుతో ఇండ్లు నిర్మించుకున్నట్టు చిన్న
గూడు చేసి నేను అందులో పడుకోగానే మళ్ళీ వరిగడ్డితో మూసేసే వారు. అందులో వెచ్చగా
పడుకుని నిద్రపోయేవాడిని. కాపలా కోసం పంపిస్తే నిద్రపోతావా అని మా బామ్మ నన్ను ఆ
డ్యూటీ నుంచి తప్పించింది.
మా బామ్మ రుక్మిణమ్మ గారికి ముగ్గురు
కుమార్తెలు. ఆమె పెద్ద కుమార్తె అంటే మా పెద్ద మేనత్త రంగనాయకి భర్త, ఖమ్మం
జిల్లాకు చెందిన కొలిపాక లక్ష్మీ నరసింహారావు గారు. నరసింహారావుగారి అన్నగారు
కొలిపాక శ్రీరాం రావు గారు వరంగల్లులో పెద్ద వకీలు. ఈ అన్నదమ్ములకు ఇద్దరికీ ఖమ్మం, వరంగల్ జిల్లాలలో వందల ఎకరాల భూమి. మా పెద్ద మేనత్త మొగుడు పెద్ద
లాయరు కూడా. పిత్రార్జితంతో పాటు వకీలుగా మంచి పేరు, గట్టి ఆస్తులు
సంపాదించారు. లక్ష్మీ నరసింహారావు గారి పెద్ద కుమారుడు రామచంద్ర రావు గారికి మా
రెండో అక్కయ్య శారదను మేనరికం ఇచ్చారు.
రెండో మేనత్త కమలా బాయి భర్త ఖమ్మంలో పెద్ద వకీలు, అంతకంటే పెద్ద భూస్వామి అయిన పర్చా శ్రీనివాసరావు
గారు. రైల్వే స్టేషన్ సమీపంలోనే ఆయనకు పెద్ద బంగ్లా వుండేది. అది పాత తెలుగు
సినిమాల్లో జమీందారుల భవనంలా కనిపించేది. ఎత్తయిన మెట్లెక్కి పైకి వెళ్ళగానే
ఎదురుగా ఒక పెద్దహాలు, దానికి ఇరువైపులా వరండాలు, మళ్ళీ వెనకవైపు మరో హాలు,
ఇరువైపులా గదులు ఇలా
చాలా విశాలంగా వుండేది. ఆయన ఆఫీసు గదిలో ఒక సీలింగు ఫ్యాను వుండేది. సీలింగు
ఎత్తుగా వుండడం వలన అవసరం అయినప్పుడు ఫ్యానును కిందికి దించుకునే ఏర్పాటు వుండేది.
మా మేనత్త మొగుడు కూర్చునే వకీలు కుర్చీ, దానికి
ఎదురుగా పెద్ద మేజా బల్ల, అటూ ఇటూ క్లయింట్లు కూచోవడానికి కుర్చీలు
చాలా అట్టహాసంగా ఉండేవి. ఆయన ప్రాక్టీసు కూడా అలానే వుండేది. ఇది కాక ఖమ్మం
జిల్లాలో వాళ్ళ స్వగ్రామం మండవలో భారీ
ఆస్తులు ఉండేవి. దానికి ఆనుకుని ఉన్న కృష్ణా జిల్లాలోని గ్రామాల్లో కూడా భూములు
ఉండేవి. వాటిమీద వచ్చే అయివేజు కూడా భారీగానే వుండేది. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో
పాల్గొన్నాడు. పీవీ నరసింహా రావు గారితో ఆయనకు మంచి సాన్నిహిత్యం వుండేది. ప్రధాని
అయిన తరువాత కూడా పీవీని పేరుతొ సంబోధించే చనువు ఉన్న మనిషి శ్రీనివాసరావు గారు.
ఆడపిల్లలకు విద్య ఆవశ్యకతను గుర్తించి ఆయన ఖమ్మంలో బాలికల పాఠశాల ఏర్పాటుకు దోహదపడ్డారు.
దాదాపు తొంభై ఏళ్ళ వయస్సులో కూడా మా బామగారి
అమ్మగారు చెల్లమ్మగారు, మా బామ్మగారు పచ్చి మంచి నీళ్ళు సైతం
ముట్టకుండా నిష్టగా ఉపవాసాలు చేసేవాళ్ళు. మా బామ్మ గారు
కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉత్తర, దక్షిణ యాత్రలు అన్నీ చేసింది. చెల్లమ్మ
గారు మాకు బుద్ధి తెలిసిన తరువాత ఎటూ వెళ్ళేది కాదు. ఎప్పుడూ కంభంపాడులోనే తావళం
తిప్పుకుంటూ దైవ ధ్యానం చేసుకుంటూ, పిల్లలకు భారత, భాగవతాల్లోని పద్యాలు, కధలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేది.
పొద్దుగూకేవేళకు పిల్లలందరూ ఆమె మంచం చుట్టూ మూగేవాళ్ళు. ఈ రోజు
భండారు వంశంలో చాలామందికి పురాణాల మీద పట్టు చిక్కడానికి, సంస్కృతీ సంప్రదాయాలపట్ల అవగాహన కలగడానికి
చెల్లమ్మగారి ప్రవచనాలే కారణం. మా వూళ్ళో అప్పుడు పాతిక, ముప్పయిదాకా బ్రాహ్మణ గడప వుండేది. మూడు
పంచాంగాలు మా వూరినుంచి వెలువడేవి.
తోకటపా:
మా భండారు వంశ వృక్షానికి చెందిన
ఒక కొమ్మ తాలూకు కొన్ని రెమ్మలు, మా రెండో
అక్కయ్య కొలిపాక శారద కుటుంబ సభ్యులు అన్నమాట, ఈరోజు అంటే 2024 డిసెంబరు 14 శనివారం నాడు హైదరాబాదులోని
ఒక పెద్ద హోటల్లో కలిసారు. ఎవరి కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా, మేనమామలుగా నన్నూ, మా రెండో
అన్నయ్య రామచంద్రరావు గారిని పిలవడం ఆనవాయితీ. వెళ్లాం. దాదాపు ఎనభయ్ మంది దాకా వచ్చారు. గ్రూపు ఫోటో తీసుకోవడానికి వీలు
లేకపోయింది. సందర్భం మా పెద్ద మేనత్త రంగనాయకి గారి చిన్న కూతురు శ్రీలక్ష్మి
(ఖమ్మం నుంచి మొదటి లేడీ గ్రాడ్యుయేట్) కుమారుడు గోపి షష్టి పూర్తి. గోపి నాన్నగారు
సింగరాజు ప్రభు గారు కేంద్ర ప్రభుత్వంలో అనేక విభాగాల్లో ఉన్నతోద్యోగాలు చేసి రిటైర్ అయి హైదరాబాదులో సెటిల్ అయ్యారు. వారి
వయసు కేవలం తొంభయ్ సంవత్సరాలు.
(కింది ఫోటోలో ఫుల్ స్లీవ్స్ తెల్ల షర్ట్ టక్ చేసుకున్న వ్యక్తి.
ఎక్కడికైనా సరే స్వయంగా కారు నడుపుకుంటూ వెడతారు. ఇక నా పక్కన ఉన్న శ్రీలక్ష్మి
(పాపాయి వదిన) ఎనభయ్ ఏళ్ల వయసులో కూడా వంట చేస్తుంది. మాలాంటి వాళ్ళం పొతే వండి
పెడుతుంది. అమ్మతరపు చుట్టాలమని మా అన్నదమ్ముల పట్ల ఆపేక్ష. ఫోటోలో కుడి పక్కన మా అన్నయ్య
రామచంద్రరావు గారు. 80, 90, 78, 80 వరుసగా వయసులు అన్నమాట)
ఈ నలుగురిలో నేనే చిన్నవాడిని.
(ఇంకా వుంది)
3 కామెంట్‌లు:
హెచ్.ఎస్.సి అంటే ఎన్నో క్లాసు భండారు వారూ ? నేను పొరుగు రాష్ట్రం వాడిని లెండి, అందువల్ల తెలియదు 🙂.
విన్నకోట నరసింహారావు గారు, హెచ్.ఎస్.సి. హయ్యర్ సెకండరి సర్టిఫికేట్, పదో తరగతి. ఇది పాస్ అయితే అక్కడితో స్కూలు చదువు అయిపోతుంది. కాలేజీలో ఒక ఏడాది పీ యు.సి. ప్రీ యూనివర్సిటీ కోర్స్, తరువాత మూడు సంవత్సరాలు గ్రాడ్యు యేషణ్. (బియ్యే లేదా బీకాం, లేదా బి ఎస్సీ)
ధాంక్స్, భండారు వారు.
మీరు చెప్పిన లెక్క 14 సంవత్సరాలే అవుతుంది. కానీ మూడేళ్ళ డిగ్రీ చదువుతో 15 యేళ్ళ విద్యాభ్యాసం పూర్తయినట్లు లెక్క. కాబట్టి మీ హెచ్.ఎస్.సి పదకొండవ తరగతికి సమానం అని నా అభిప్రాయం (దానికి ఒకేడాది పి.యు.సి కలిపితే 12 యేళ్ళ చదువు. దానికి మూడేళ్ళ డిగ్రీ చదువు కలిపి 15 యేళ్ళ విద్యాభ్యాసం.)
(అమెరికా వాడికి 16 యేళ్ళ విద్యాభ్యాసం లెక్క. అందుకే వాడి దగ్గర MS చెయ్యడానికై మన 15 యేళ్ళ చదువు అర్హతగా పరిగణించడు. అందుకే మన నాలుగేళ్ల ఇంజనీరింగ్ వాడికి సరిపోతుంది వాడి 16 యేళ్ళ లెక్క కోసం.)
కామెంట్‌ను పోస్ట్ చేయండి