10, డిసెంబర్ 2024, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (34) - భండారు శ్రీనివాసరావు

 

 

ఖమ్మంలో మా అన్నయ్య  ఉద్యోగం అంతా జిల్లా కలెక్టర్ గారితో ముడిపడి వుండేది. ఆయన దౌరా వెడితే ఆయనతో పాటు మా అన్నయ్య కూడా వెళ్ళేవాడు. కలెక్టర్ గారి నివాసం రైలు కట్ట పక్కన.

ఆ రోజుల్లో ఖమ్మం కలెక్టర్ ఆఫీసు ట్రంకు రోడ్డులో వుండేది. చాలా చిన్న భవంతి. మెట్లు ఎక్కగానే ఎదురుగా స్వింగ్ డోర్. దాని వెనుక ఒక నీలంగుడ్డ పరచిన మేజా బల్ల. వెనుక కుర్చీలో కలెక్టర్. అదీ పరిస్తితి. అటాచ్డ్ బాత్ రూమ్ కూడా వుండేది కాదు. వెనక పెరట్లో ఎక్కడో దూరంగా వుండేది.

 

సయ్యద్ హషీం ఆలీ ఖమ్మం జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారు ఆయన వద్ద జిల్లా పౌర సంబంధాల అధికారిగా వుండేవారు. (తదనంతర కాలంలో ఆ శాఖకు డైరెక్టరుగా, అయిదుగురు ముఖ్యమంత్రులకు, 'చెన్నా టు అన్నా' - పీఆర్వోగా పనిచేశారు) ఆ కలెక్టర్ గారు ఎప్పుడు దౌరా వెళ్ళినా మా అన్నయ్యను వెంటబెట్టుకుని వెళ్ళేవారు. పత్రికల్లో వార్తలు, ఫోటోలు వేయించుకోవడం ఆయనకు సుతరామూ ఇష్టం వుండేది కాదు. మరి, ఎందుకు తనని కూడా తీసుకువెడుతున్నట్టు. అసలు విషయం ఏమిటంటే జిల్లాలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు సామాన్య ప్రజలు, ప్రధానంగా బీదాబిక్కీ ఆయన్ని కలుసుకుని తమ సమస్యలు చెప్పుకునే వారు. హషీంఆలీ గారి తెలుగు భాషా పరిజ్ఞానం అంతంత మాత్రం. కింది స్థాయి రెవెన్యూ సిబ్బంది తర్జూమా చేసి చెప్పేటప్పుడు తనని తప్పుదోవ పట్తిస్తారేమో ఆయనకు అనుమానం. అందుకని ఆ పనిలో తోడ్పడడం కోసం మా అన్నయ్యను వెంట ఉంచుకునే వారు. ఈ సాన్నిహిత్యాన్ని కొందరు అపార్ధం చేసుకున్నారు కూడా. కలెక్టర్ గారితో మీకు బాగా పరిచయం వున్నట్టుందే అని అడుగుతుండేవారు. మా అన్నయ్య స్వతహాగా హాస్య ప్రియుడు. ‘అవునండీ. బాత్ రూమ్ అవసరం లాంటిది మా పరిచయం. బాత్ రూమ్ లోకి వెళ్ళిన వాళ్ళు అక్కడే వుండిపోరుకదా. అలాగే నేను కలెక్టర్ గారిని రోజూ ఎన్నిసార్లు కలుసుకున్నా అవసరం మేరకే. అది పూర్తికాగానే బయటకు వస్తాను’ అనేవారు.

ఒక రోజు కలెక్టర్ ని కలవడానికి భద్రాచలం దగ్గర ఓ పల్లెటూరు నుంచి ఓ రైతు వచ్చాడు. గుమ్మం ముందు హమేషా వుండే డవాలా బంట్రోతు ఆ సమయంలో ఏదో పనిమీద వెళ్ళాడు. లోపల కలెక్టర్ గారు బాత్రూంకు పోవడానికి లేచి పెరటి ద్వారం వైపు వెడుతున్నారు. సరిగ్గా ఆ టైంలో రైతు స్వింగ్ డోర్ తెరుచుకుని ‘కలెక్టర్ దొరగారెక్కడ?’ అని అడిగాడు. తాను అడుగుతున్నది సాక్షాత్తు కలెక్టర్ నే అని అతడికి తెలియదు. హషీం ఆలీగారు ఏమాత్రం నొచ్చుకోకుండా, అతడిని కూర్చోబెట్టి విషయం తెలుసుకుని సమస్యను పరిష్కరించే విషయంలో తన కింది సిబ్బందికి తగు సూచనలు ఇచ్చి పంపేశారు.

ఆ రోజుల్లో ఖమ్మం మొత్తంలో రెండే రెండు గవర్నమెంటు స్కూళ్ళు. ఒకటి నేను  చేరిన రిక్కబజార్ హైస్కూలు. రెండోది రైల్వే స్టేషన్ దాటి వెళ్ళిన తర్వాత ప్రభాత్ టాకీసు దగ్గర అనుకుంటా, మల్టీ పర్పస్ హైస్కూలు. ఇలాంటి పేరు వినడం నాకు మొదటిసారి. అక్కడ మా అక్కయ్య కొడుకు కౌటూరి దుర్గాప్రసాద్ చదివేవాడు. ఇక రిక్కా బజార్ స్కూలు మామిళ్ళ గూడెం లోనే వుండేది. మా అన్నయ్య ఇంటి నుంచి నడక దూరం. వెళ్ళే దారిలో ఎడమవైపు మా మేనకోడలు విజయలక్ష్మి భర్త, తదనంతర కాలంలో తన తెలివితేటలతో రాణించి, ఇద్దరు ముఖ్యమంత్రులకు ప్రధాన పౌర సంబంధాల అధికారిగా దశాబ్ద కాలానికి పైగా పనిచేసిన జ్వాలా నరసింహారావు తండ్రి కట్టించిన ఇల్లు. మా చుట్టపక్కాలు అందరికి ఖమ్మం చుట్టుపక్కల గ్రామాల్లో ఆస్తులు వున్నాయి. పిల్లల చదువుల కోసం వారిలో చాలామంది ఖమ్మంలో సొంత ఇండ్లు కట్టుకున్నారు. అలాగే వనం వారి కృష్ణాపురానికి చెందిన వనం శ్రీనివాసరావు గారు కూడా మామిళ్ళగూడెంలో సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుని ఒక వాటా అద్దెకు ఇచ్చి మరో వాటాలో పిల్లలు వుండి  చదువుకునే వీలు కల్పించారు. అప్పటికి జ్వాలాతో స్కూలు స్నేహమే కానీ బంధుత్వం ఏర్పడలేదు. మా అందరికీ గురువుగారైన కేఎల్ నరసింహారావు గారు చాలాకాలం జ్వాలా వాళ్ళ ఇంట్లోనే అద్దెకు వున్నారు. కోటు, టై తో ఇంగ్లీష్ సినిమాల్లో రిచర్డ్ బర్టన్ లా వుండేవారు. ఆ ఇంటిపక్కనే ఖమ్మం మూసీ అని చెప్పుకునే ఓ మురికి కాలువ పారుతుండేది. మామూలు రోజుల్లో పెద్దగా నీళ్ళు ఉండేవి కావు. మధ్యమధ్యలో వున్న బండరాళ్ళపై కాళ్ళు పెట్టి ముక్కు మూసుకుంటూ కాలువ దాటే వాళ్ళం. వర్షాకాలంలో మాత్రం కాలువలో నీటి ఉధృతి బాగా వుండేది. వరద తీసేదాకా పిల్లలం దాన్ని దాటడం ఇబ్బందిగానే వుండేది. 

రికాబ్ బజార్ స్కూలు కొంత భాగం పెంకుటిల్లు, కొంత భాగం తరగతులకోసం వేసిన షెడ్లు. బెజవాడలో నేను చదువుకున్న సీవీఆర్ స్కూలుకి, దీనికి పోలికే లేదు. మాస్టార్లు కొత్త, స్నేహితులు కొత్త. అక్కడ మాస్టారు గారూ అనేవాళ్ళం. ఇక్కడ అందరూ సారూ సారూ అంటున్నారు. అక్కడేమో భీమారావు మాస్టారు. ఇక్కడేమో వెంకటేశ్వర్లు సారు. ఇలా అన్నీ తేడాలే కనిపించేవి కొత్తల్లో. అయితే తేడా కనపడని విషయం ఒకటి కనిపెట్టాను. చదువులో ఫస్ట్ వాళ్ళు చాలామంది వున్నారు.  లాస్ట్ నుంచి ఫస్ట్ మళ్ళీ నేనే. రిక్కా బజారు స్కూల్లో నా క్లాస్ మేట్స్ లో అన్ని రకాల వాళ్ళు వున్నారు. బాగా చదివి ఫస్ట్ మార్కులు తెచ్చుకునే జ్వాలా, ఎల్.వీ.ఆర్.ఎస్. శర్మ, సయీద్ రహమాన్, అబ్దుల్ రహమాన్, ఏమ్వీ కే హెచ్ ప్రసాద్, జూపూడి హనుమంత రావు, వనం వరదారావు  అత్తెసరు మార్కులు తెచ్చుకునే గుర్రం రామ్మోహన్, జూపూడి ప్రసాద్, నా బోటి వారు, పరీక్ష రాసే బెంచిపై  కత్తి పెట్టుకుని, దర్జాగా కాపీ కొట్టి పాసయ్యే నవాబ్,  ధర్మా, చీనా వంటి రౌడీ రకం, అల్లరిచిల్లరగా తిరిగే బ్యాచ్ ఇంకోటి. నానా గోత్రభ్యః అన్నట్టు వుండేది మా తొమ్మిదో తరగతి సెక్షన్. ఇక శర్మ గయ నుంచి జ్వాలాకు ఎన్నో ఏళ్ల తరువాత రాసిన ఉత్తరంలో పేర్కొన్నట్టు, మా అయ్యవార్లు అంటే సార్లు, చిన్ని రామారావు గారు, కొందరికి మాత్రమే విడమరచి చెప్పి మిగతా వాళ్ళను కసురుకునే వెంకట్రామారెడ్డి సారు, ‘వనజభవుండు నిన్నొసట...’ అంటూ చెప్పే తెలుగు సారు అయ్యదేవర రామచంద్ర రావు గారు, చిన్ని రామారావుగారు,  వీరభద్రం గారు, అవధాని గారు,  రసూల్ సారు, ఇన్ని రకాల మందలతో వేగుతుండేవారు. 

అయితే  అందరిలో జ్వాలా తీరే ప్రత్యేకం. పెద్దగా చదువుతున్నట్టు కనబడేవాడు కాదు. కానీ పరీక్షల సమయానికి చక్కగా సిద్ధం అయ్యేవాడు. మార్కులు బాగా తెచ్చుకునే వాడు. టీచర్లకు కూడా ఆయన అంటే ఇష్టం.  అదేమి  చిత్రమో తెలియదు.  ఆయన స్నేహితులందరూ, వనం నరసింగ రావు, ఆయన తమ్ముడు  వనం రంగారావు (ఇప్పుడు లేరు) వయసులో పెద్దవాళ్లు కూడా. వాళ్ళ ముచ్చట్లు కూడా ఒక పట్టాన అర్ధం అయ్యేవి కావు. వాళ్ళ ఊరి రాజకీయాలు, కాలేజీ రాజకీయాలు. లేదా క్రికెట్ కబుర్లు. వాళ్ళ ఇంటి పక్క ఖాళీ స్థలంలో ఆడితే క్రికెట్టు, లేదా ఫుట్ బాల్. క్రికెట్ గురించి, ఆ ఆటలో వాడే ఇంగ్లీష్ పదాలు గురించి ఏమీ తెలియదు కనుక, నేను అప్పుడప్పుడు కాసేపు ఫుట్ బాల్ ఆడేవాడిని. మామిళ్ళ గూడెం క్రికెట్ క్లబ్ పేరుతొ ఒక టీం వుండేది. దానికి వనం రంగారావు (వనం గీత భర్త)  అనే ఓ దూరపు చుట్టం కెప్టెన్. అయితే ఈ మొత్తం కార్యకలాపాలకి జ్వాలా ఇల్లు కేంద్రం. అంచేత అన్నిట్లో ఆయన మాటే చెల్లుబడి అయ్యేది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు చిన్ననాటి నుంచే ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉండేవి. తను అనుకున్నది చేసేవాడు. లేదా అదే పని ఇతరులచేత చేయించేవాడు. ఫలితంగా పురుడు పోసుకుంది లిల్లీ పుట్ పార్టీ. ఆ పార్టీ  తరపున స్కూలు ఎన్నికల్లో నన్ను ఒప్పించి పోటీకి నిలబెట్టాడు.  జూపూడి ప్రసాద్, జూపూడి హనుమంత రావు, ఎల్.వీ.ఆర్.ఎస్. శర్మ జమలాపురం రామచంద్రం, కందిబండ రామ్మోహన్ రావు, రామబ్రహ్మం, అందరం చిన్న ఆకారాల వాళ్ళమే. అందుకే మా పార్టీకి మేము పెట్టని పేరు లిల్లీ పుట్ పార్టీ. ఒక స్కూలు ఎన్నికలకు గోడలమీద నినాదాలు రాయడం మాతోనే మొదలయింది అనుకుంటా. ప్రచారం హడావిడిగానే జరిగింది కానీ ఫలితం వేరేగా వచ్చింది. గెలవడం అంటే ఏమిటో, ఓడడం అంటే ఏమిటో తెలియని వయసు కనుక పెద్దగా బాధ పడ్డది లేదు.

సో, ఖమ్మంలో నా చదువు ఓటమితో మొదలయింది. అదే కంటిన్యూ అయింది.

కింది ఫోటో:

చిన్నప్పుడు ఫోటో అంటేనే  తెలియదు కనుక అప్పటి ఫోటోలు లేవు. అంచేత  పెద్దయిన తర్వాత జ్వాలా నేనూ.



(ఇంకావుంది)

1 కామెంట్‌:

Zilebi చెప్పారు...

ఇలా అందరు పెద్ద పెద్ద పదవులు~ పెద్ద పెద్ద పేర్లు గడించిన వారలు ఒకే చోటినుండి రావడం అద్భుతమండీ రావ్ గారు