9, డిసెంబర్ 2024, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (32) - భండారు శ్రీనివాసరావు

 


 

దాశరధి గారిని మొదటిసారి చూసినప్పుడు నాకు ఆయనే దాశరధి అని తెలవదు.

పట్నం కాబట్టి, మా బావగారు పెద్ద వకీలు కాబట్టి అనేక పనుల మీద అనేకమంది బెజవాడ  వచ్చి పోతుండేవాళ్ళు. హోటళ్ళలో విడిది చేసే అలవాట్లు అప్పటికి రాలేదు. తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లోనే మకాము, భోజనం కూడా. ఆ విధంగా, గవర్నర్ పేటలోని మా బావగారిల్లు ఒక సత్రం మాదిరిగా వుండేది.

ఒక రోజు పొద్దున్నే లేచి పక్కబట్టలు మడత పెడుతుంటే, వరండాలో గోడపక్కన పొడుగుబల్ల మీద పడుకుని ఒక పొట్టి మనిషి నిద్రపోతూ కనిపించాడు.  రాత్రి ఏదో రైలుకు వచ్చి పడుకున్నట్టున్నారు. తరువాత మా అక్కయ్య చెబితే తెలిసింది ఆయన దాశరధి అని. అప్పటికే మద్రాసులో సినిమాలకు పాటలు రాస్తున్నారట.

దాశరధి గారు పనులు చక్కబెట్టుకుని వెడుతూ వెడుతూ తను రాసిన కొన్ని పుస్తకాలు మా బావగారికి ఇచ్చి వెళ్ళారు. అప్పుడే ఆయన రచయిత అని కూడా తెలిసింది.  ఆ తరువాత ఎన్నో ఏళ్ల తరవాత నేను రేడియోలో చేరిన తర్వాత ఒక సందర్భంలో హైదర్ గూడాలో దాశరధి గారు నివాసం ఉంటున్న అపార్ట్ మెంటుకు వెళ్లాను. సినీ ప్రముఖుడు ఒకరు మరణిస్తే సంతాప సందేశం రికార్డు చేయడానికి వెళ్ళిన గుర్తు. ఆయన ఎంత సాదాసీదాగా వుంటారో, ఆయన ఇల్లు కూడా అంతే సాదాసీదాగా వుంది. ఎక్కువసేపు వెయిట్ చేయించకుండా నేను వెళ్ళిన పని పూర్తి చేయించి పంపడం ఆయన సంస్కారం.

అలాగే సినీ నటుడు రామన్న పంతులు గారితో అలాగే పరిచయం. ఒకప్పుడు ఆయనగారు కూడా బెజవాడలో ప్లీడరే. తరువాత మద్రాసు వెళ్లి చాలా సినిమాల్లో నటించారు. వాటిల్లో ఎన్టీఆర్ గిరీశం గా నటించిన కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధాన్లుగా వేషం వేశారు. బాపూ తీసిన బంగారు పిచిక సినిమాలో రామన్న పంతులు గారు, భార్యా విధేయుడిగా  ప్రధాన పాత్ర పోషించారు. రామన్న పంతులు గారి మనుమడే జంధ్యాల దర్శకుడిగా తీసిన మొదటి చిత్రంలో హీరో. చిత్రమైన విషయం ఏమిటంటే రామన్న పంతులు గారి మనుమడు ప్రదీప్ కూడా భార్యా విధేయుడిగా ఇటీవల ఒక సినిమాలో ‘అంతేగా అంతేగా’  అంటూ ప్రేక్షకులని అలరించారు. జంధ్యాల మద్రాసు వెళ్లి స్క్రిప్ట్ రైటర్ గా మొట్టమొదట సినిమా కెరీర్ మొదలు పెట్టిన రోజుల్లో నేనొకసారి మద్రాసులో ప్రదీప్ గారిని చూశాను. అప్పటికి ఆయన సినిమాల్లో వేయడం మొదలు కాలేదు. తిరిగి వారిని కూడా హైదరాబాదు ఆలిండియా రేడియోలో చేరిన తరవాతనే ఒకటిరెండు సార్లు కలుసుకున్నాను. ప్రదీప్ భార్య  శ్రీమతి సరస్వతి గారు కూడా దూరదర్శన్ లో యాంకర్/ అనౌన్సర్ గా తాత్కాలికంగా కొన్నేళ్ళు పనిచేసి పేరు తెచ్చుకున్నారు.

తన తాతగారు రామన్న పంతులు గారి గురించి నటుడు ప్రదీప్ ఇలా చెప్పారు.

 

వీళ్ళమ్మా శిఖతరగ, ప్రతి గాడిద కొడుకు తిండిపోతుల్లా నా యింట జేరి నన్ననేవాళ్ళే”. “తాంబూలం యిచ్చేసాను. యిహ తన్నుకు చావండి” లాంటి సంభాషణ తెలుగు వారు మరచిపోలేరు. గురజాడ గారు కన్యాశుల్కంలో ఆ మాట చెప్పిస్తారు. కన్యాశుల్కం నాటకం గానీ, సినిమా గానీ చూసిన వారికి ఆ మాట గుర్తుండిపోతుంది. అందుకు గల కారణం ఆ పాత్ర యొక్క అద్భుతమైన అభినయం. ఆ స్వరం, ఆ రౌద్రం ప్రత్యేకం. ఆ నటుడి పేరు విన్నకోట రామన్న పంతులు. నటులు శాశ్వతం కాదు. నటన అజరామరం.

రంగస్థలం, సినిమా రంగం, ఆకాశవాణి నటులు,  ప్రయోక్త, రూపశిల్పి, మార్గదర్శి, బహుముఖ ప్రజ్ఞాశాలి విన్నకోట రామన్న పంతులు గారు. తన 62 ఏళ్ళ జీవితంలో 40 సంవత్సరాలు నాటకరంగానికి, కళాకారులని తీర్చి దిద్దడానికి, మేకప్ వేయడానికి, నాటకంలో కర్టెన్లు కట్టడానికి వెచ్చించారు. తన ఇంటినే రిహార్సల్ గదిలా మార్చేశారు. విన్నకోట గారు  దర్శకత్వం వహించిన నాటకాలలో నటించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న నటులు ఎందరో ఉన్నారు. రామచంద్ర కాశ్యప, ఏ.ఆర్.కృష్ణ, నిర్మలమ్మ, మురళీ మోహన్, అన్నపూర్ణ, వీరభద్ర రావు, సుబ్బరాయ శర్మ, జంధ్యాల వంటి వారు ఈ జాబితాలోకే వస్తారు”

రామన్న పంతులు గారి కుమారుడు విన్నకోట విజయ్ రాం కూడా నటుడే. జంధ్యాల దర్సకత్వంలో కొన్ని సినిమాలలో హాస్య పాత్రలు పోషించారు. దురదృష్టం తన ప్రతిభను పూర్తిగా నిరూపించుకోవడానికి అవకాశం లేకుండా చిన్నవయసులోనే చనిపోయాడు.  

   

మా బావగారింటికి ఆదివారం నాడు కాలక్షేపం కబుర్లు చెప్పుకోవడానికి చాలా మంది లాయర్ స్నేహితులు వస్తుండేవాళ్ళు. కీసర నరసింహారావుగారు, (వీరి పిల్లలు, ఒకడు  వేదాద్రి  తదనంతర కాలంలో పెనుగంచి ప్రోలులో స్థిరపడి అక్కడ అయ్యప్ప స్వామి పెద్దస్వామిగా ఒక వెలుగు వెలిగి అక్కడే కన్నుమూశాడు. మరో కుమారుడు మూర్తి సెంట్రల్ ఇంటలిజెన్స్ బ్యూరోలో అధికారిగా పదవీ విరమణ చేశాడు) మోగులూరు వెంకటేశ్వర రావు గారు,  కొన్నాళ్ళు మద్రాసులో వుండి, కొన్ని సినిమాల్లో వేసి తిరిగి బెజవాడ వచ్చిన రామన్న పంతులు గారు, రామచంద్ర కాశ్యప గారు, అడ్డంకి శ్రీరామ మూర్తి గారు, చింతలపాటి శివరామ కృష్ణ గారు,   బంగారప్పన్ను లాయరు గారు, మా క్లాస్ మేట్ దశరధరాం తండ్రి లక్కావజ్జల నారాయణ మూర్తిగారు ఇలా చాలామంది వచ్చేవాళ్ళు. మధ్య హాల్లో కుర్చీలు, బల్ల ఒక పక్కకు జరిపి, వాళ్ళు వచ్చే సమయానికి కింద జంపఖానా పరచి సిద్ధం చేసేవాళ్ళం. మా అక్కయ్య అడపాదడపా చిన్న స్టెయిన్ లెస్ స్టీల్ గ్లాసుల్లో టీలు పంపేది. మేము అందిస్తుండేవాళ్ళం.  వాళ్ళలో కొందరికి సిగరెట్లు అవసరం అయినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్లి జైహింద్ టాకీసు కార్నర్లో ఉన్న రెడ్డి కిళ్ళీ షాపులో కొని తెచ్చి ఇచ్చేవాళ్ళం. కొందరు బర్కిలీ, కొందరు పాసింగ్ షో, కొందరు చార్మినార్. మాకు పాసింగ్ షో సిగరెట్టు పెట్టె నచ్చేది. దానిమీద ఫెల్ట్ హ్యాట్ పెట్టుకున్న మనిషి బొమ్మవుండేది. రెడ్ విల్స్ అప్పుడు వున్నట్టు లేదు. మార్కోపోలో వుండేది కానీ, అది తాగేవాళ్లు తక్కువ. చాలా ఖరీదు. అది తాగేవాళ్ళ పక్కన నిలుచుంటే కమ్మటి వాసన వచ్చేది, జర్దా కిళ్ళీ లాగా.

పెద్ద వాళ్ళ ఆటలు అయిపోగానే ఖాళీ అయిన సిగరెట్ పెట్టెల కోసం పోటీపడే వాళ్ళం. వాటితో బచ్చాలు ఆడుకోవచ్చని.

ఇలా రోజులు గడుస్తున్న రోజుల్లో మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారికి  ఖమ్మంలో జిల్లా పౌర సంబంధాల అధికారిగా ఉద్యోగం వచ్చింది. అప్పటికే నా భారం మోస్తున్న బావగారి భారాన్ని తగ్గించడానికి నన్ను ఖమ్మం స్కూల్లో చేర్చడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా సీవీఆర్ హైస్కూలు నుంచి టీసీ సర్టిఫికేట్. ఖమ్మం రిక్కా బజార్ గవర్నమెంట్  స్కూల్లో తొమ్మిదో తరగతిలో అడ్మిషన్.

ఆంధ్రా ప్రాంతంలో ఎస్.ఎస్.ఎల్.సి. తెలంగాణాలో హెచ్ ఎస్ సీ.  ఆంద్రాలో ఇంటర్ మీడియెట్, తెలంగాణా ప్రాంతంలో పీయూసీ (ప్రీ యూనివర్సిటీ)

ఈ గోలలు ఏవీ అర్ధం కాని నేను హాయిగా ఖమ్మం వచ్చేశాను.

నా చదువు మరో రూపం సంతరించుకుంటుందని నాకప్పుడు తెలియదు.   

 

కింది ఫోటోలు:


(ఒకనాటి  ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ గవర్నర్  కుముద్ బెన్ జోషీతో దాశరధి కృష్ణమాచార్య, మా బావగార్లు అయితరాజు రామారావు, కొలిపాక రామచంద్ర రావు 



కన్యాశుల్కం లో అగ్నిహోత్రావధానిగా విన్నకోట రామన్న పంతులు గారు 



ముద్దమందారం హీరో ప్రదీప్ 



 




 

(ఇంకా వుంది)          

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఇక్కడి విన్నకోట రెఫరెన్సు చూడగానే మన అంతర్జాతీయ విఖ్యాత బ్లాగ్వ్యాఖ్యాతగార్లు వినరా వారికి జోష్ వచ్చి కామింటు పరంపరలు మరిన్ని రావచ్చని ఆశిస్తున్నాము :)



అజ్ఞాత చెప్పారు...

వినరా గారు రామన్న పంతులు గారి కుటుంబం తో మీ సంబంధం గురించి వివరాలు చెప్పండి.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఇంటిపేరు ఒకటే గానీ సంబంధం ఏమీ లేదండి. వారు వారే, మేము మేమే.

కుదురు ఒకటే అయ్యుంటుంది గానీ తరువాత తరువాత తరాలు విడిపోయుండవచ్చు.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// “ ఇక్కడి విన్నకోట రెఫరెన్సు చూడగానే ……… “ //

మరీ మునగచెట్టెక్కిస్తున్నారు అజ్ఞాత గారు (9 Dec 2024 at 10:50 am) 🙂.

అజ్ఞాత చెప్పారు...

సెలబ్రిటీ లో ఇళ్లకు వెళ్లి న్యూసెన్స్ చేస్తూ వారి వ్యక్తిగత జీవితాలపై ఇష్టానుసారం కథనాలు చేస్తూన్న మీడియా జర్నలిస్టు లంటేనే అసహ్యం వేస్తుంది. వికృత పోకడలు పోతున్న మీడియా దుర్మార్గులకు తగిన శాస్తి జరుగుతుంది.