19, జూన్ 2022, ఆదివారం

హాస్యబ్రహ్మ – భండారు శ్రీనివాసరావు

 

ఏదో రాసుకుంటుంటే ఫోన్ మోగింది. కొత్త నెంబరు.
‘నేను శంకర నారాయణను’ అని పరిచయం చేసుకున్నారు అవతలి వ్యక్తి.
గొంతు సుపరిచితంగానే వుంది. కానీ ధ్యాస వేరేగా వుండడం చేత చప్పున గుర్తు పట్టలేకపోయాను.
ఆయనే నా ఇబ్బంది కనుక్కున్నట్టు వున్నారు.
‘నా పేరుకో తోక కూడా వుంది.హాస్య బ్రహ్మ అంటారు’
ఇంకేం! ఆయన ఎవరో తెలిసిపోయింది. జర్నలిజంలో సుదీర్ఘ కాలం అనుభవం ఉన్న సీనియర్ పాత్రికేయుడు. హాస్యాన్ని అవధానంగా మలచి, ఇంటాబయటా సుప్రసిద్ధుడైన రచయిత.
‘జంధ్యాల గురించి మీరు రాసిన వ్యాసం చదివాను, నిజంగా నాకు బాగా నచ్చింది. అంచేతే ఫోన్ చేసి మాట్లాడాలని అనిపించింది’ అన్నారాయన ఎంతో నమ్రతగా.
ఆంధ్రజ్యోతి నెట్ ఎడిషన్ లో వేయడం వల్ల రీచ్ పెరిగినట్టుంది. చాలా కాల్స్ వచ్చాయి.
అనేక విషయాలు ప్రస్తావించారు. జంధ్యాలతో తన అనుభవాలు, ఆయన తనకు ఇచ్చిన ప్రోత్సాహం అన్నీ చెప్పుకొచ్చారు. మనిషి చనిపోయి దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత ఆయన గురించి మంచిగా మాట్లాడడం ఈ రోజుల్లో విశేషమే.
అలాగే మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారి గురించి, మా మేనకోడలు భర్త, రచయిత, రిటైర్డ్ ఐ.పి.ఎస్. అధికారి రావులపాటి సీతారామా రావు గారి గురించి ఎన్నో విషయాలు చెప్పారు. మా కుటుంబంతో అంత పరిచయం వుందని నాకు తెలియదు.
‘పర్వతాల రావు గారు సమాచార శాఖ డైరెక్టర్ గా రిటైర్ అయిన తర్వాత ఓపెన్ యూనివర్సిటిలో మాకు పాఠాలు చెప్పేవారు. ఆయన దగ్గర సునిశితమైన హాస్యం చిప్పరిల్లేది. క్లాసుకు ఎవరైనా ఆలస్యంగా వస్తే, ‘మీకంటే ముందు వచ్చినందుకు నన్ను క్షమించండి’ అనేవారు. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడూ క్లాసుకు లేటు కాలేదు’

మాటల్లో పద్మ పురస్కారాల మాట వచ్చింది.
‘రాకపోవడమే మంచిది. వస్తే, ఎవరినో పట్టుకుంటే వచ్చింది అంటారు. అదే రాలేదనుకోండి. మీకు ఎప్పుడో రావాల్సిన పురస్కారం, ఇంకా రాకపోవడమేమిటని ఎంతో కొంత సానుభూతిగా మాట్లాడతారు. ఇది బెటరు కదా!’ అన్నారాయన ఛలోక్తిగా.
ఎంతైనా హాస్య బ్రహ్మ కదా!
(19-06-2022)

కామెంట్‌లు లేవు: