28, జూన్ 2022, మంగళవారం

ఎదిగి ఒదిగిన కర్మయోగి పీవీ నరసింహారావు


(జూన్ ఇరవై ఎనిమిది పీవీ జయంతి)

మరణించడానికి కొన్ని నెలలముందు శ్రీ పీవీ నరసింహారావు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావిడి యెలా వుండేదో ఒక విలేకరిగా నాకు తెలుసు. ఆయన చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా అధికారులు, అనధికారులు, మందీ మార్బలాలు, వందిమాగధులు, ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు, ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.
ఒక్క పీవీ అనే కాదు ప్రధానమంత్రి ఎవరయినా సరే, రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు అంటే చాలు యావత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు అప్రమత్తం అయిపోయేవి. శాఖల వారీగానే కాదు అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ఉన్నతస్థాయి సమావేశాలు జరిపి ప్రధాని పర్యటన ఏర్పాట్లు సమీక్షించేవారు. ఆకాశవాణి, దూరదర్శన్ ల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రధాని పాల్గొనే ప్రతి కార్యక్రమాన్ని రెండు టేపుల్లో రికార్డు చేయడానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసేవారు. కార్యక్రమం ముగియగానే ఆ వివరాలు రాసివున్న ఒక టేపును అక్కడికక్కడే ప్రధాని బృందంలోని అధికారులకు అందచేసేవారు. అవన్నీ ప్రధాని పాటు ఢిల్లీ చేరిపోయి ఆ తరువాత ప్రధాని కార్యాలయంలోని 'ఆర్చివ్స్' విభాగానికి చేరేవి. ఇప్పుడంటే మొబైల్స్ వచ్చాయి కనుక ఇబ్బంది లేదు. పూర్వం ప్రధాని ప్రసంగించే వేదిక దగ్గరగా టెలిఫోన్స్ డిపార్టుమెంటు వాళ్లు, దేశంలో ఎక్కడికయినా మాట్లాడగలిగే ఫోనును అమర్చేవారు. ఆ ఫోను ఎవరికి ఉపయోగపడిందో లేదో తెలవదు కాని ప్రధాని పర్యటన సమాచారం ఢిల్లీ, హైదరాబాదు, విజయవాడలకు ఫోను చేసి చెప్పడానికి రేడియో విలేకరిగా నాకు పలుసందర్భాల్లో ఉపయోగపడిన మాట వాస్తవం. పీవీ ప్రధానమంత్రిగా వున్నప్పుడు బేగంపేటలోని ఒక సందులో వున్న స్వామి రామానంద తీర్ధ ట్రస్టు కార్యాలయానికి వచ్చేవారు. ఇక అక్కడ చూడాలి అధికారులు, అనధికారుల హడావిడి. ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తరువాత కూడా అక్కడ జరిగిన ట్రస్టు సమావేశాలకు ఆయన హాజరయ్యేవారు. వాటిని కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు 'అధికారాంతమునందు...' అనే పద్యపాదం జ్ఞాపకం చేసుకోవాలో, 'ఈ కర్మభూమిలో పదవి, అధికారం ముందు అన్నీ దిగదుడుపే' అనే నిజాన్ని హరాయించుకోవాలో నాకు అర్ధం అయ్యేది కాదు.
పీవీ గురించిన మరో జ్ఞాపకం నా మదిలో వుండిపోయింది.
మాజీ ప్రధానిగా పీవీ రాజ భవన్ లో వున్నప్పుడు, నేనూ , ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్ ఆర్వీవీ కృష్ణారావు గారు, గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం వెళ్లి, ఆ పని పూర్తిచేసుకున్నతరవాత, రాజ్ భవన్ గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి వెడుతూ అటువైపు తొంగి చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము. ‘పీవీ గారిని చూడడం వీలుపడుతుందా’ అని అక్కడవున్న భద్రతాదికారిని అడిగాము. అతడు తాపీగా 'లోపలకు వెళ్ళండి' అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.
పెట్టిన తరవాత, మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్ బాల్ మాచ్ చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే, మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు నా వైపు చూస్తూ, 'మీ అన్నయ్య పర్వతాలరావు ఎలావున్నాడయ్యా !' అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో దశాబ్దాల క్రితం, పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు, రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు ఆయనకు పీఆర్వో గా కొద్దికాలం పనిచేశారు. అసలు పీవీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ పీవీగారి గొప్పతనం. ఆ తరవాత కూడా ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ మాకు ‘కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది, కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల, కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత, కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది. రోశయ్య గారు వచ్చిన తరువాత కాసేపు వుండి మేము వచ్చేశాము. ఇది జరిగి ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఈ చక్కని జ్ఞాపకం మాత్రం మా గుండెల్లో ఇంకా తాజాగానే వుంది. మరోసారి వారిని ఢిల్లీలో కలిసాను. రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెడుతూ అప్పుడు కేంద్రమంత్రిగా అత్యంత ఉచ్ఛ స్థానంలో వున్న పీవీ గారిని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా నిశ్శబ్ధం. కాసేపటి తరువాత ఎవరో అటుగా వస్తే 'పీవీ గారిని కలవడానికి వీలుంటుందా' అని హిందీలో అడిగాను. అతగాడు బంగ్లాలో ఓ గది చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ గారు. ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. అప్పుడు ఆయన విదేశాంగ మంత్రి అనుకుంటాను. నా మొహంలో భావాలు పసికట్టినట్టున్నారు. 'పనులు చేసి పెడుతూ వుంటే కదా పదిమంది వచ్చేది' అన్నారు ఆయన తన మొహంలో భావాలు ఏమీ తెలియకుండా.
'మాస్కో ఎందుకయ్యా వేరే దేశంలో మీ రేడియో ఉద్యోగాలు లేవా ? బాగా చలిదేశం. పెళ్ళాం పిల్లలతో ఎలావుంటావు' అని అడిగారు. చాలా ముక్తసరిగా మాట్లాడేవారని పేరున్న పీవీ గారు నేను వూహించని విధంగా చనువుగా ఆ రెండు ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను.

కింది ఫోటో చాలా పాతది, సతీసమేతంగా పీవీ నరసింహారావు గారు









Below Andhrajyothy  LINK:



 ఎదిగేకొద్దీ ఒదిగిన కర్మయోగి - Andhrajyothy

కామెంట్‌లు లేవు: