6, మార్చి 2022, ఆదివారం

హక్కులు సరే! మరి బాధ్యతలు! - భండారు శ్రీనివాసరావు

 (Published in ANDHRA PRABHA on 06-03 -2022, SUNDAY)

రేపు ఏడో తేదీ సోమవారం నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలలో శాసన సభ బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి.

సమావేశాల్ల్లో ఏం జరుగుతుంది, అవి సజావుగా సాగుతాయా అనేవి  ప్రజాస్వామ్య ప్రియులను కలచివేస్తున్న ప్రశ్నలు.

పద్దతిగా జరిగే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పడానికి గత అనుభవాలు చాలు.

మరి పరిష్కారం ఏమిటి? వుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  శాసనసభ ప్రాంగణంలో సభ్యులకోసం అత్యంత విలువైన గ్రంధాలయం వుంది. ఇప్పటి సంగతి తెలవదు.  నేను విలేకరిగా పనిచేస్తున్న రోజుల్లో కదాచిత్ గా ఆ గ్రంధాలయంలోకి అడుగుపెడుతూ ఉండేవాడిని. శ్రీయుతులు తెన్నేటి విశ్వనాధం, వావిలాల గోపాలకృష్ణయ్య,  పిల్లలమఱ్ఱి వెంకటేశ్వర్లు,  బోడేపూడి వెంకటేశ్వరరావు, వెంకయ్యనాయుడు,  ఎస్.జైపాల్  రెడ్డి, సీ హెచ్ విద్యాసాగర్ రావు వంటి ఉద్దండులయిన ప్రజాప్రతినిధులు ఆ గ్రంధాలయాన్ని ఉపయోగించుకుంటూ వుండడం నాకు తెలుసు. ఇప్పటి శాసన సభ్యులు, ముఖ్యంగా తొలిసారి సభలో అడుగుపెట్టిన వారు ఈ లైబ్రరీకి వెళ్లి వెనుకటి కాలంలో సభ ఎలా నడిచేది అన్న విషయంపై అవగాహన పెంచుకోగలిగితే అసలు సమస్య దూదిపింజలా ఎగిరిపోయే అవకాశం ఎక్కువ. కానీ వారికి అంతటి తీరికా ఓపికా వుంటాయా అంటే నాకు అనుమానం కూడా ఎక్కువే.

శాసనసభ కావచ్చు, పార్లమెంటు కావచ్చు వాటిని సజావుగా నిర్వహించడానికి కొన్ని నిర్దేశిత నియమ నిబంధనలు వుంటాయి. వాటిని గురించి కొత్త సభ్యులకు, పాతవారికి కూడా పూర్తి సమాచారం అందిస్తారు. సభలో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు ఇలా అన్ని విషయాలపై సభ్యులకు వివరాలు అందచేస్తారు. పాలక ప్రతిపక్షాలు వీటిని తుచ తప్పకుండా పాటిస్తే పేచీయే లేదు. ఇలాటి వ్యాసాల అవసరమూ వుండదు. గతాన్ని తవ్వితీయడంలో చూపిస్తున్న శ్రద్ధాసక్తులు, గతంలోని మంచిని గ్రహించడంలో ప్రదర్శిస్తే వర్తమానం ఇంతటి బాధాకరంగా వుండదు. భవిష్యత్తు గురించి బెంబేలు పడాల్సిన పరిస్తితి ఉత్పన్నం కాదు.

జనతా ప్రభుత్వం నాటి ఒక ఉదంతాన్ని గుర్తుచేసుకుందాం. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి. జార్జ్ ఫెర్నాండెజ్ ఆయన మంత్రివర్గంలో సభ్యుడు. ఆయన ఓ సందర్భంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఉద్దేశించి ‘ఆవిడ ఎప్పుడూ అబద్దాలే చెబుతారు’ (She is a perennial liar') అని దురుసుగా వ్యాఖ్యానించారు. దానిపై దుమారం రేగింది. అభ్యంతర పెట్టింది కూడా ప్రధానమంత్రి కావడం విశేషం. 'ఉన్నమాటే చెప్పాను' అంటారు ఫెర్నాండెజ్. 'అయినా కానీ, అలా అని వుండాల్సింది కాదు. కాదూ కూడదు, అనాలని అనిపిస్తే, ఆవిడ చాలా అరుదుగా నిజం చెబుతారు’ (She seldom tells truth) అనాలి' అంటూ సభామర్యాదను బోధించారు మొరార్జీ.

అలాగే ఒకానొక రోజుల్లో, శాసనసభ నడిచే తీరుతెన్నులు ఎలా వుండేవో తెలుసుకోవడానికి కొన్ని మచ్చు తునకలు:

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి, ఒక సందర్భంలో ప్రతిపక్ష కమ్యూనిస్ట్ సభ్యులు శాసన సభ నుంచి వాకవుట్ చేస్తేనే ఎంతగానో మధన పడ్డారు. అప్పుడు ఆయన చేసిన ప్రసంగం అసెంబ్లీ లైబ్రరీ రికార్డులలో పదిలంగా వుంది.

1959 ఆగస్టు ఒకటో తేదీన శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం చెబుతూ ముఖ్యమంత్రి సంజీవరెడ్డి గారు తన ప్రసంగాన్ని ఇలా ప్రారంభించారు.

"చర్చ ఇంత సవ్యంగా జరుగుతున్న ఈ తరుణంలో తలవని తలంపుగా దేశంలో ఎక్కడో జరిగిన ఒక చర్యకు నిరసనగా మిత్రులు సభ నుంచి బయటకు వెళ్ళిపోవడం చాలా విచారకరం. కర్నూలులో వుండగా ప్రకాశం గారి ప్రభుత్వం పోయింది. కాంగ్రెసు వారు నాలుగు సీట్లు కూడా గెలవరని అనుకున్నారు. కానీ ఎంతో మెజారిటీతో ప్రజలు గెలిపించారు. ఒకసారి ఒక పార్టీ, మరొకసారి మరో పార్టీ అధికారంలోకి రావచ్చు. ఇది ఈనాటి ధర్మం కాదు. వేదకాలం నుంచి వస్తోంది. పాతకాలంలో యుద్ధం చేస్తున్నప్పుడు కూడా రెండు పక్షాలు గెలవ్వు. ఎవరో ఒకరే గెలుస్తారు. ఉత్తర గోగ్రహణంలో భీష్ముడు దుర్యోధనుడితో చెబుతాడు. 'రాలచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే' అని. అందువల్ల ప్రతిపక్షం ఇక్కడ లేకపోయినా నేను వారికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఈ ప్రశాంతతను కాపాడుకోవాలి. ప్రశాంత వాతావరణం వుందని గవర్నర్ తన ప్రసంగంలో చెప్పారు. దానికి క్రెడిట్ ప్రభుత్వానిది కాదు, పోలీసులదీ కాదు, ఆ క్రెడిట్ ప్రతిపక్షానిది అని వెంకటేశ్వర్లు గారు చెప్పారు. నేను వారితో ఏకీభవిస్తున్నాను. అప్పోజిషన్ పార్టీ, రూలింగ్ పార్టీ కల్సి చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు అనేకం వున్నాయి."

 

ఆంద్రప్రదేశ్ ఆవిర్భావం తరువాత ఏర్పడ్డ తొలి శాసన సభకు తొట్టతొలి స్పీకర్ గా కాంగ్రెస్ కురువృద్ధుడు అయ్యదేవర కాళేశ్వరరావు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1956 నవంబర్ నాలుగో తేదీన ఆయన స్పీకర్ గా మొదటి ప్రసంగం చేసారు.

"మీరందరూ ఈ సభాద్యక్ష స్థానాన్ని నాకు ఇచ్చి గౌరవించినందుకు కృతజ్ఞతలు. మీరందరూ ఇష్టపడినట్టయితే, మీ అందరి అనుమతితో ఒక పని చేయదలచుకున్నాను. స్పీకర్ బల్ల మీద వున్న ఈ వెండి దండాన్ని తీసివేస్తాను. ఈ వెండి దండం భూస్వామ్య వ్యవస్థకు, రాచరికానికి గుర్తు. ప్రజాస్వామ్యంలో దీనికి స్థానం లేదు."

1959 ఆగష్టు ఒకటో తేదీన ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, గవర్నర్ ప్రసంగానికి  ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు అంశాలవారీగా సమాధానం చెప్పారు.

"ఎవరూ చెప్పని ఒక విషయం బాగారెడ్డి గారు చెప్పారు. మిగిలినవారికి ధైర్యం లేక చెప్పలేదని నా ఉద్దేశ్యం. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఏమంటే ఏమో, న్యాయం అని తోచినప్పుడు కూడా పైకి చెప్పడానికి సంకోచిస్తున్నారు. మన రాష్ట్రానికి వచ్చే మొత్తం (ఆదాయంలో) యాభయ్ శాతం వాళ్ళ సాలరీల కింద ఇస్తున్నారు. వాట్ ఈజ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్? ఒక్క శాతం. పన్నులు కడుతున్న రైతాంగానికి, పల్లెటూరివారికి తెలియదు కానీ, తెలిస్తే ముఖ్యమంత్రి మొదలుకుని కింది వరకు రాళ్ళతో కొడతారు. 330 లక్షలమంది ప్రజానీకం రాష్ట్రంలో వుంటే, ఒక లక్షమందో, రెండు లక్షలమందో చదువుకున్నవాళ్ళమని మనం అనుకుని, వచ్చే రాబడిలో సగం మొత్తాన్ని వాళ్ళకే  పంచేసుకుంటూ వుంటే బాగుంటుందా!  ఎవరేమి అడిగినా డబ్బు లేదంటాము. కాలువ రిపేరు చేయమంటే డబ్బు లేదంటాము. విద్యుచ్చక్తి ఇవ్వవయ్యా అంటే డబ్బు లేదంటాము. శ్రీ రామాచార్యులు గారు ధర్మల్ స్టేషన్ పెట్టండి, రాయదుర్గం నుండి లైను వేస్తె ఎన్నో ఊర్లకి కరెంటు వస్తుంది అని అడిగితే అలాట్ మెంటు లేదని సమాధానం చెబుతాము. పాపం ప్రజలకి తెలియడం లేదు. అమాయకులుగా వున్నారు. చదువు సంధ్యలు లేవు. వారికి లక్ష అంటే ఏమిటో, కోటి అంటే ఏమిటో తెలియదు. వాళ్లకి మన గురించి అసలు నిజాలు తెలిస్తే మనల్ని బయటకు పంపుతారు. 'మీరూ వద్దు, మీ రాజ్యమూ వద్దు, మీ గుమాస్తాలు వద్దు. బాబూ మమ్మల్ని విడిచిపెట్టండి, మా బతుకు మేము బతుకుతాము' అంటారు. ఆ పచ్చి నిజాన్ని బాగారెడ్డి గారు చెప్పినందుకు నేను ఆయన్ని అభినందిస్తున్నాను"

 

ఇది ఒక ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రసంగం అంటే నమ్మడం సాధ్యమా! ఒక ప్రతిపక్షనేత కూడా ఈ విధంగా నిజాలు మాట్లాడడానికి సాహసించడని అనుకునే రోజులివి.

కాబట్టి నేతలూ, గతం ఎలా ఉండేదో, ప్రజా ప్రతినిధులు ఎలా వ్యవహరించేవారో తెలుసుకోవడానికి ఒక్కసారి అసెంబ్లీ లోని  గ్రంధాలయానికి వెళ్ళండి. 'కాదు, ఇలానే వాద ప్రతివాదాలతో సమయం గడుపుతాము, రాజకీయాలతోనే పొద్దు పుచ్చుతాము'  అంటే ఎవరూ చేయగలిగింది ఇప్పట్లో ఏమీ లేదు. సర్వం తెలిసినవాళ్ళనీ, సర్వజన సంక్షేమం కనిపెట్టి చూస్తారని ప్రజలు మిమ్మల్ని తమ ప్రతినిధులుగా శాసనసభలోకి పంపారు. శాసన కర్తలుగా మీకు ఎన్నో హక్కులు వున్నాయి. అదే సమయంలో బాధ్యతలు కూడా అంతే వున్నాయి. హక్కులు గుర్తున్నవారు బాధ్యతల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి.

ప్రతి రోజూ అసెంబ్లీలో జరిగేది చూస్తున్నప్పుడు, నిష్టురమైన ఈ నిజాన్ని చెప్పక తప్పని రోజులు వచ్చాయనిపిస్తోంది.(06-03-2022)

 

కామెంట్‌లు లేవు: