23, మార్చి 2022, బుధవారం

ఆ గాలీ .....ఆ నేలా...... భండారు శ్రీనివాసరావు

 

అరవై అయిదేళ్ళ పైమాటే. అప్పటికి నాకు పదేళ్లు ఉంటాయేమో! ఆనాటి జ్ఞాపకాలు  స్పష్టాస్పష్టంగా మనసు పొరల్లో మెదులుతున్నాయి. గురుతుల మడతల్లో కదులుతున్నాయి.

మా ఊరు కంభంపాడు. అప్పట్లో చాలా వెనకపడ్డ ప్రాంతం. అయినా అన్నీ ఉండేవి. స్వావలంబన లాంటి మాటలు, వాటి అర్ధాలు అప్పట్లో తెలవ్వు. కానీ అన్నీ అమర్చినట్టు ఉండేవి ఆ కొసగొట్టు పల్లెటూళ్ళో.

మా ఇంటికి దగ్గరలో అంటే నడిచిపోయే దూరంలో చెరువు గట్టు కింద మా మాగాణి పొలాల పక్కన ఓ మెరక మీద మంచి నీళ్ళ బావి. పైగా గిలకల బావి. నాలుగువైపులా ఇనుప  గిలకలు ఉండేవి. ఊరి మొత్తానికి అదొక్కటే మంచి నీటి వనరు. మా ఇంట్లో బావిలో నీళ్ళు ఉప్పు  కషాయం. స్నానాలకు, ఇతర అవసరాలకు ఆ నూతి నీళ్ళే వాడేవాళ్ళం. మా అమ్మగారు వెంకట్రావమ్మ, మా చిన్న మేనత్త చిదంబరం తడి మడి చీరెలతో వెళ్లి మంచినీటి బావి నుంచి బిందెలలో నీళ్ళు తెచ్చేవాళ్ళు.

అప్పుడప్పుడూ వాళ్ళతో నేనూ వెళ్ళే వాడిని. దోవలో వీరబ్రహ్మం ఇల్లు. ఆయన ఉలీ, బాడిసె పట్టుకుని ఎడ్లు లాగే బండ్లు తయారు చేసేవాడు. నేను అక్కడే ఒక మొద్దు మీద కూర్చుని చూస్తూ కూర్చుండేవాడిని. బండి చక్రాలు, వాటికి ఆకులు అలా కొలతలకు తగ్గట్టుగా ఎలా చెక్కేవాడో ఆశ్చర్యం అనిపించేది. ఆయన ఏమీ చదువుకున్నవాడు కాదు. కానీ బండి ఇరుసు ఏ కొలతలతో చెక్కితే బండి బ్యాలెన్సుగా నడుస్తుందో ఆ విధంగా తయారు చేసేవాడు.

ఆ పక్క వీధిలో కమ్మరి కొలిమి. ఆయనకూ చదువు రాదు. కానీ ఇనుమును కొలిమిలో ఎర్రగా కాల్చి రకరకాల సామాగ్రి తయారు చేసేవాడు.

ఒక వీధిలో వస్త్రాల హనుమంతరావు అని నా దోస్తు ఇల్లు వుండేది. ఆడామగా బట్టలు నేసేవాళ్ళు. ఇంటి బయట చేతికి రంగులు పూసుకుని దారాలకు రంగులు అద్దేవాళ్ళు. ఇంట్లో మగ్గం మీద చీరెలు ధోతులు నేసేవాళ్ళు.

చిన్నిరాములు కొట్లో మిఠాయి ఉండలు, లౌజు ముక్కలు కూడా అమ్మేవాళ్లు. ఇళ్ళల్లో లాంతర్లు, చిమ్నీ(బుడ్డి) దీపాలకు వాడే కిరసనాయిలు అక్కడే కొనేవాళ్ళం. కిరోసిన్ డబ్బా పైన ఒక మూలలో వున్న రంధ్రంలో గొట్టం లాంటి సాధనం వుంచి పైకీ కిందికీ ఒక తీగతో లాగుతూ వుంటే డబ్బాలో కిరోసిన్ సీసాల్లో పడేది.

ఆ పక్కనే కుండలు చేసేవారు. కుండలు చేసే విధానం చూస్తుంటే కళ్ళు తిరిగిపోయేవి. ఒక చక్రం మీద మట్టి ముద్ద వుంచి ఆ చక్రాన్ని వేగంగా ఒకసారి తిప్పేవాళ్ళు. తడి చేతి వేళ్ళతో ఆ మట్టి ముద్దను సుతారంగా తాకుతూ చిత్రవిచిత్రంగా కుండలు తయారు చేసేవాళ్ళు. ఆ ముద్ద నుంచి కుండల ఆకారాలు వస్తుంటే ఏదో మాయాజాలంగా అనిపించేది.

సత్యమూర్తి అని నా చిన్న నాటి నేస్తం. ఆయన అన్నయ్య నాగలింగాచారి  బంగారు నగలు చేసేవాడు. బడికి వెళ్ళే దోవలోనే  వాళ్ళ ఇల్లు. బుగ్గలు బూరెలు అయ్యేలా గొట్టంతో ఊదుతూ ఎర్రటి కొలిమిలో బంగారం కరిగించి వస్తువులు తయారు చేసేవాడు.

సాయంత్రం అయ్యేసరికి మా ఇంటికి దగ్గరలో ఉన్న వాడనుంచి బ్యాండు మేళం వినపడేది. ఆ తర్వాత తెలిసింది వాళ్లకు గిరాకీ లేని రోజుల్లో అలా తీరి కూర్చుని సినిమా పాటలు ప్రాక్టీసు చేస్తుంటారని. అలాగే సన్నాయి మేళం వాయించేవాళ్లు. మా ఇంటికి చుట్టపక్కాలు ఎవరైనా వస్తే వాళ్ళు పెట్రోమాక్స్ లైట్ తెచ్చి పెట్టేవాళ్ళు. ఆ లైటు వెలిగిస్తుంటే పిల్లలం అందరం కళ్ళప్పగించి చూస్తుండే వాళ్ళం. పొడుగాటి వత్తి తగలబడిపోకుండా చిన్న ఆకారంలోకి మారిపోయి తెల్లటి వెలుగులు విరజిమ్మడం నిజంగా ఆశ్చర్యంగా వుండేది. ఆ వత్తి ఎర్రపడి కాంతి తగ్గినప్పుడల్లా గాలి కొట్ట్టేవారు.

మా ఊరు పంచాంగాలకు ప్రసిద్ధి. వాటిని రాసే సిద్ధాంతులు ముగ్గురు వుండేవాళ్ళు. ఒకే ఊరు నుంచి మూడు పంచాంగాలు రావడం గొప్పగా చెప్పుకునే వారు. గొలుసుకట్టు రాతలో, తెలుగు అంకెలతో రాసిన పంచాంగాలను ఆ సిద్ధాంతులు తెనాలి తీసుకువెళ్లి అక్కడ అచ్చు వత్తించేవారు. ఉగాది రావడానికి ముందుగానే చుట్టుపక్కల గ్రామాలకు కాలినడకన వెళ్లి అక్కడి మోతుబరులకు పంచాంగాలు ఇచ్చి ఆశీర్వదించేవాళ్లు. సంభావన రూపంలో వచ్చిన ప్రతిఫలం ఎంత ఇస్తే అంత తీసుకుని తిరిగివచ్చేవారు.

మంచి నీళ్ళ బావికి వెళ్ళే దోవలో ముస్లింల కోసం పీర్ల సావిడి వుండేది. పీర్లను ఊళ్ళో ఊరేగించిన తర్వాత మళ్ళీ ఈ సావిడిలో భద్రపరిచేవాళ్ళు.

షెడ్యూల్ కులాలకోసం ఉసిగెవాగు అవతల ఒక కాలనీ వుండేది. అక్కడ ఒక మిషనరీ స్కూలు వుండేది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన  జంధ్యాల హరి నారాయణ  కృష్ణాజిల్లా కలెక్టరుగా వున్నప్పుడు మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు అక్కడ కొత్త కాలనీ నిర్మాణం కోసం సుమారు ఇరవై ఎకరాలు భూమి ఇచ్చారు. చక్కటి విశాలమైన కాలనీ ఏర్పడింది. జిల్లా మొత్తంలో అదే పెద్ద కాలనీ అని చెప్పుకునేవారు.

ఊళ్ళో మరో బడి వుండేది. అందులోనే మా చదువు. స్కూలు మొత్తానికి కలిపి ఇద్దరే టీచర్లు, అప్పయ్య మాస్టారు, భద్రయ్య పంతులు గారు. బ్లాకు బోర్డులు లేవు. చుట్టూ ఫ్రేం ఉన్న బొందు పలక, సుద్ద బలపం, అవి పెట్టుకునే గుడ్డ సంచీ వుంటే వాడు అందరి దృష్టిలో స్పెషల్.

అప్పయ్య మాస్టారి తండ్రి శివరాజు నాగభూషణం గారు తెలవారకముందే లేచి స్నానసంధ్యాదులు ముగించుకుని ఇంటి బయట నిలబడి ఉచ్చైస్వరంతో ఆలపించే కృష్ణ శతకంలోని పద్యాలే ఊరంతటికీ కోడికూత.

పంచాయతీ రేడియోలో  సాయంత్రం అయ్యే సరికి తెలుగు వార్తలు వినేవాళ్ళం. బెజవాడ నుంచి అంధ్రపత్రిక దినపత్రిక రెండో రోజు సాయంత్రానికి పోస్టులో మా ఊరికి వచ్చేది. అప్పయ్య మాస్టారు పత్రికలో వచ్చిన వార్తలను బిగ్గరగా చదివి వినిపించేవారు. ఆయనే మా ఊరికి రేడియో న్యూస్ రీడర్. తర్వాత అందరూ అరుగుల మీద కూర్చుని తీరిగ్గా ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు.

మా ఇంటికి వెనుక రెండు దేవాలయాలు ఒకే ప్రాకారంలో ఉండేవి. ఒకటి శివుడి గుడి. వాసిరెడ్డి జమీందారు ఆ ప్రాంతంలో కట్టించిన అనేక శివాలయాల్లో ఇదొకటి. మరొకటి ఆంజనేయుడి గుడి. పక్కనే కోనేరు వుండేది. కాలక్రమంలో అది పూడిపోయింది. ఆ గుళ్ళకు మేమే వంశ పారంపర్య ధర్మకర్తలం. వాటికి మాన్యాల రూపంలో నలభయ్ ఎకరాల దాకా భూమి వుండేది, కానీ వాటి మీద వచ్చే అయివేజు స్వల్పం. వూళ్ళో వాళ్ళే పూనుకుని పండుగ దినాల్లో ఉత్సవాలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించేవారు.

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ వారి చిన తిరుణాలకు, అది జరిగినన్ని రోజులూ మా వూరినుంచి రంగు కాగితాలతో అలంకరించిన ప్రబ్భండ్లు (ప్రభలు) మేళతాళాలతో ఇంటికొకటి బయలుదేరేవి.

ఆ రోజుల్లో మా ఊర్లో రెండు రకాల సేద్యపు నీటి వనరులు ఉండేవి. ఒకటి చెరువు, రెండోది మునేటి కాలువ. ఒకప్పుడు ఈ రెంటి కిందా అధిక భాగం భూములు మావే. ఐదో అక్కయ్య భర్త కొమరగిరి అప్పారావు గారిది  పొరుగూరు పెనుగంచి ప్రోలు. ఆ బావగారు వచ్చినప్పుడల్లా గుర్రపు సవారీ. రాగానే గుర్రాన్ని మేతకు వదిలేసేవాడు. అది మేసినంత మేరా మామగారి (అంటే మా నాన్నగారు) తాలూకు పొలాలే, ఏం పరవాలేదు అని చెప్పుకునే వారు నా చిన్నతనంలో.

ఇప్పుడు ఇవన్నీ ఏవీ లేవు అని చెప్పను కానీ అప్పటి మాదిరిగా లేవు. కొన్ని అసలే లేవు, జ్ఞాపకాలు తప్ప.

వీరబ్రహ్మం లేడు, ఎడ్ల బళ్ళు తయారుచేసే వాళ్ళు లేరు. ఆ బండ్లు  లేవు. ఎడ్లూ లేవు. ఇంటికి రెండు చొప్పున మోటారు సైకిళ్ళు, పదో పాతికో ఏసీ కార్లు. నాటి మగ్గాలు లేవు, బట్టలు నేసేవాళ్ళు లేరు. చిన్ని రాములు కొట్టు లేదు. షట్టర్లు కలిగిన దుకాణాలు వచ్చాయి. కుండల తయారీ లేదు. స్టీలు సామాను, ఫ్రిజ్ లు గృహప్రవేశం చేసాయి.

లాంతర్లు లేవు, అందరి ఇళ్ళల్లో విద్యుత్ దీపాలే. కాలక్షేపానికి బ్యాండ్ మేళాలు లేవు, ప్రతి ఇంట్లో స్మార్ట్ టీవీలే.

పంచాయతి రేడియో లేదు. అరుగుల మీద ముచ్చట్లు లేవు. అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్. ఎవరి గోల వారిదే!

స్వయంసమృద్ధి కాకపోయినా స్వయంపోషకంగా వుండే మా ఊరు, ఇప్పుడు అన్ని ఊళ్లలో ఒక ఊరు. అంతే!

పాస్ పోర్టులో నేటివ్ ప్లేస్ కాలం పూర్తి చేయడానికి మాత్రం పనికి వస్తోంది.

(23-03-2022)

కింది ఫోటో: ఓవర్ హెడ్ ట్యాంకు, మంచి నీటి పంపులు వచ్చిన తరవాత మసకబారిన మంచి నీళ్ళ బావి 

కామెంట్‌లు లేవు: