29, మార్చి 2022, మంగళవారం

చంద్రబాబు నాయుడు – నేను.

 

చాలాకాలంగా కలవని వాళ్ళు తటస్థపడి పలకరించినప్పుడు కలిగే ఉత్సాహం తీరే వేరు.
మొన్నటికి మొన్న ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో పెద్దలు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు కలిసారు. వారిని కలవక దాదాపు పదిహేను సంవత్సరాలు పైనే అవుతోంది. ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆయన నన్ను గుర్తుపట్టి ఆత్మీయంగా పలకరించడమే ఒక గొప్ప అనుభవం. ఎప్పటివో నా రేడియో జీవితం నాటి కబుర్లు గుర్తు చేయడం ఇంకా గొప్ప విషయం.
మళ్ళీ నిన్న సాయంత్రం హోటల్ దసపల్లాలో మిత్రుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రాసిన, నేను- తెలుగుదేశం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్లాను. దత్తాత్రేయ గారితో కలిసి అప్పుడే సభామందిరంలోకి ప్రవేశిస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెనక వరసలో కూర్చొన్న నన్ను చూసి, ఆగి పలకరించారు.
‘ఎలా వున్నారు, ఆరోగ్యం బాగుంది కదా! కరోనా ఏమీ ఇబ్బంది పెట్టలేదు కదా!’ అంటూ భుజం మీద చేయి వేసి ఆత్మీయంగా మాట్లాడారు. చివర్లో ఒక మాట అన్నారు, అయాం వాచింగ్ యు అని. ఎందుకలా అన్నారని ఆలోచించుకోవడం నావంతయిది.
నేను చంద్రబాబుగారిని ఆఖరు సారి కలిసింది 2013, ఆగస్టు 20వ తేదీన. ఇంత ఖచ్చితంగా ఎలా గుర్తుంది అంటే దానికి ఒక కారణం వుంది.
ఆరోజు సాయంత్రం ఒక టీవీ ఛానల్ నుంచి తిరిగి వస్తుంటే ఫోను.
చిరపరిచితమైన నెంబరు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి ఆ ఫోను. అయిదేళ్ళ క్రితం వరకు ఆ నంబరు నుంచి రోజూ అనేక ఫోన్లు వచ్చేవి. అప్పుడు నేను దూరదర్శన్/ ఆకాశవాణిలో విలేకరిగా పనిచేస్తున్నాను.
‘ఎడ్వైజర్ కృష్ణయ్య గారు మాట్లాడుతారు’ ఆపరేటర్ పలకరింపు.
టీటీడీ ఈవోగా, సీనియర్ ఐఏఎస్ అధికారిగా జర్నలిస్టులందరికీ కృష్ణయ్య గారు చిరపరిచితులు. ఉన్నత ఉద్యోగం వొదులుకుని రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
‘రేపు నాలుగు గంటలకు బాబుగారు మీడియా విశ్లేషకులు కొందరితో ఇష్టాగోష్టిగా ముచ్చటించాలని అనుకుంటున్నారు. మీరు కూడా వస్తే బాగుంటుంది’.
కాస్త ఆశ్చర్యం అనిపించింది ఈ పిలుపు.
2005లో దూరదర్సన్ లో పదవీ విరమణ చేసినప్పటి నుంచి మళ్ళీ ఏనాడు ఏ పార్టీ గుమ్మం ఎక్కలేదు.
అయితే ఈ ఆహ్వానం కాదనడానికి కూడా కారణం కనిపించలేదు. ఎందుకంటే అది విలేకరుల సమావేశం కాదు. పార్టీ ఆఫీసులో కూడా కాదు. చంద్రబాబునాయుడి గారి ఇంట్లో.
ఇంతకీ ఆయన ఏం అడుగుతారు ? ఏం చెప్పాలి ?
ఇప్పటికే మీడియా విశ్లేషకుల మీద సోషల్ మీడియాలో అనేక రకాల వ్యాఖ్యలు వెలువడుతున్నాయి, వీళ్ళు విశ్లేషకుల రూపంలో, చక్రాంకితాలు బయటకు కనబడకుండా టీవీ చర్చల్లో పాల్గొనే వివిధ పార్టీల అనధికార ప్రతినిధులంటూ.
ఏదిఏమైనా, చంద్రబాబు గారిని ఎన్నో ఏళ్ళ తరువాత కలుసుకోబోతున్నాను.
షరా మామూలుగా ఆయనే చెబుతారా లేక ఎవరైనా చెప్పింది వింటారా ? అనుకుంటూనే వెళ్లాను.
జూబిలీ హిల్స్ లో చంద్రబాబు నివాసం. పాతికేళ్ళకు పైగా చిరపరిచితమైన ప్రదేశం. మాజీ ముఖ్యమంత్రి అయినా, జెడ్ కేటగిరి భద్రత కలిగిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కావడం మూలాన సెక్యూరిటీ హడావిడి ఎప్పటి మాదిరిగానే వుంది.
రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న దరిమిలా తెలంగాణా ఏర్పాటు తధ్యం అనుకుంటున్న నేపధ్యంలో ఏర్పాటయింది ఈ సమావేశం.
టీవీల్లో తరచూ కానవచ్చే విశ్లేషకులు, నాగేశ్వర్, ఘంటా చక్రపాణి, సి. నరసింహారావు, జ్వాలా నరసింహారావు, తెలకపల్లి రవి, ఎల్. రామానాయుడు ఇత్యాదయః అందరం ఆసీనులమైన అనంతరం చంద్రబాబుగారు వచ్చి కూర్చుని, పేరుపేరునా అందర్నీ పలకరిస్తూ వారి అభిప్రాయాలను స్వీకరించే పనిలో పడ్డారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబుగారు మాట్లాడింది తక్కువ, విన్నది ఎక్కువ.
మొత్తం మీద పెద్ద విశేషంగా నాకనిపించింది ఇదొక్కటే.
పొతే,
హైదరాబాదు జర్నలిష్టుల్లో చాలామందికి కళ్ళ ముందు పుట్టి పెరిగిన పార్టీ తెలుగుదేశం. ఆ పార్టీ నలభయ్ వసంతాల ఉత్సవం జరుపుకుంటున్న సందర్భంలో పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు
(29-03-2022)

1 కామెంట్‌:

Chiru Dreams చెప్పారు...

"‘ఎలా వున్నారు, ఆరోగ్యం బాగుంది కదా! కరోనా ఏమీ ఇబ్బంది పెట్టలేదు కదా!’ అంటూ భుజం మీద చేయి వేసి ఆత్మీయంగా మాట్లాడారు. "

పవర్లో లేకపోతే ఎవరైనా ఆత్మీయంగానే మాట్లాడతారు. వైఎసార్ దీనికి మినహాయింపు.