26, మార్చి 2022, శనివారం

ఇప్పుడొక బ్రేక్ తీసుకుందాం! - భండారు శ్రీనివాసరావు

 దృశ్యం ఒక్కటే.

చూసేవారికి రెండు రకాలుగా కనిపిస్తుంది.
వైద్య పరిభాషలో ఈ జబ్బుని ఏమంటారో జనాలకు తెలవదు.
కానీ, ఒకే వార్త వివిధ పత్రికల్లో వేర్వేరు రూపాల్లో వస్తే మాత్రం – అందుకు కారణాలేమిటో ఇప్పుడు ప్రజలు అర్ధం చేసుకోగలుగుతున్నారు.
ఒక సభ కానివ్వండి, ఒక సంఘటన కానివ్వండి, ఒక రాజకీయ ప్రకటన కానివ్వండి లేదా విలేకరుల సమావేశం కానివ్వండి – వేర్వేరు పత్రికలు వేర్వేరు కోణాల్లో - వార్తలు వండి వారుస్తున్న తీరు ఇటీవలి కాలంలో ప్రస్పుటంగా కానవస్తోంది. అలాగే మీడియా. యే ఛానల్ మార్చి చూసినా ఇదే వరస.
తాము చదివే పత్రిక, తాము చూసే ఛానల్ వైవిధ్య భరితంగా వుండాలని ఎవరయినా కోరుకుంటారు. అందుకే, ప్రభుత్వ ఆజమాయిషీ లోని దూరదర్శన్ కు పోటీగా ప్రైవేట్ ఛానల్ల శకం ప్రారంభమయినప్పుడు జనం ఆ మార్పుని సాదరంగా ఆహ్వానించారు. కానీ కోరుకున్న మార్పు కోరిన విధంగా కాకుండా గాడి తప్పుతున్నదేమో అన్న పరిణామాన్ని వారు జీర్ణం చేసుకోలేకపోతున్నారు.
ఇరవై నాలుగ్గంటల వార్తా ఛానళ్ళ పుణ్యమా అని ఈనాడు సమాచారం టన్నుల లెక్కల్లో జనాలకు చేరుతోంది. ఇందులో అవసరమయినదెంత? అన్నది ప్రశ్నార్ధకమే! ఇంతంత సమాచారాన్ని మనిషి మెదడు యే మేరకు హరాయించుకోగలదన్నది ఛానళ్ళ వాళ్ళే చెప్పాలి. ఎన్ని విన్నా మెదడు తనకు చేతనయినంతవరకే తనలో నిక్షిప్తం చేసుకుని మిగిలినవి వొదిలేస్తుందని అంటారు. ఇదే నిజమయితే – టీవీ ఛానళ్ళ ద్వారా ప్రజలకు చేరుతున్న సమాచారంలో సింహభాగం వృధా అవుతున్నదనే అనుకోవాలి. విన్నదానికంటే చదివిందీ, చదివినదానికంటే రాసిందీ, రాసిన దానికంటే చూసిందీ ఎక్కువకాలం గుర్తు వుంటుందని ఓ సూత్రం. కానీ ఈ సిద్ధాంతానికి సయితం ఈ సమాచార విస్పోటనం చిల్లులు పొడుస్తోంది. ‘పీపుల్స్ మెమోరి షార్ట్’ – అంటే ప్రజలకు చిరకాలం ఏదీ గుర్తు వుండదు అనే ధీమాతోనే రాజకీయనాయకులు స్వవచన ఘాతానికి పూనుకుంటూ వుంటారు. బహుశా ఈ సూత్రాన్నే ఛానల్స్ పాటిస్తున్నాయని అనుకోవాలి.
ఇంతకీ విషయం ఏమిటంటే- సృష్టికర్త జనాలకు ‘మరపు’ అనే అద్భుతమైన వరాన్ని ప్రసాదించి ఎంతో మేలు చేసాడు. లేకపోతె, ఒకే రోజు ఒకే వార్తను భిన్న కోణాల్లో చదివి చదివి – ఒకే ప్రకటనలోని సారాంశాన్ని వేర్వేరు రకాలుగా చూసి చూసి – ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతుండేవారు.
వెనుకటి రోజుల్లో పత్రికల్లో ‘ఘాటుగా విమర్శించారు’ అని రాస్తే అక్కడికి అదే గొప్ప. ఇక ఇప్పుడో- ‘నిలదీశారు. నిప్పులు చెరిగారు. మండిపడ్డారు’ ఇలాటి విశేషణాలు కోకొల్లలు.
పోతే, టీవీ చర్చల్లో పాల్గొనే వారిని పరిచయం చేయగానే వారు ఏం మాట్లాడబోతున్నారో ఇట్టే తెలిసిపోవడం మరో దౌర్భాగ్యం. ఒక అంశాన్నివిశ్లేషించాల్సివచ్చినప్పుడు అందులోని వివిధ పార్శ్వాలను ప్రస్తావించడం సహజం. కానీ సంబంధం లేని విషయాలను ఎత్తుకుంటూ, చర్చను పక్క దోవ పట్టించేవారిని కట్టడి చేయలేకపోవడాన్నే వీక్షకులు ప్రశ్నిస్తున్నారు.
వీటికి జవాబు దొరకదు. అయితే, ఇష్టం లేకపోతే ‘కట్’ చేయడానికి ‘ఇప్పుడొక బ్రేక్ తీసుకుందాం’ అనే పడికట్టు పదం మాత్రం సదా సిద్ధం.

తోకటపా:
టీవీ చర్చల్లో పాల్గొనేవాళ్ళు పౌరాణిక నాటకాలనుంచి నేర్చుకోవాల్సిన పాఠం.
"కృష్ణుడు రాగయుక్తంగా పద్యం పాడడం పూర్తయ్యేదాకా సుయోధనుడు తన పద్యం ఎత్తుకోడు"


కామెంట్‌లు లేవు: