17, ఫిబ్రవరి 2021, బుధవారం

గోరంక గూటికే చేరింది చిలక

 తోకలేని పిట్ట తొంభై ఆమడ తిరిగిందని పోస్టు కార్డు మీద ఓ జాతీయం.

నాకొచ్చిన ఈ పోస్టు కార్డు అంతకంటే ఎక్కువే తిరిగిందో లేక ఏ పోస్టు డబ్బాలోనో రిప్ వాన్ వింకిల్ మాదిరిగా ఏళ్ళ తరబడి నిద్ర పోయిందో ఏమిటో తెలియదు. మొత్తం మీద చేరాల్సిన గూటికి (చిరునామాకు) నాలుగేళ్ల తర్వాత చేరింది.

2017 డిసెంబరులో నేను మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతిని పురస్కరించుకుని ఒక వ్యాసం రాశాను. ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురించారు, యథావిధిగా నా ఫోటోను, దానికి నా మొబైల్ నెంబరును జోడించి.

పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం వాస్తవ్యులు శ్రీ మంగెన గంగాధరరావు ఆ వ్యాసం చదివారు. చదివి నాకొక కార్డు ముక్క రాశారు. ‘అధికారాంతము నందు ...’  పద్య పాదం  పూర్తి పాఠం  గురించి, ఆ పద్యం రాసిన కవి గురించి తెలియచేయమని అందులో కోరారు.

నా ఫోన్ నెంబరు అంటే పత్రికలో వేశారు. కానీ నా అడ్రసు ఎలా కనుక్కున్నారో ఆశ్చర్యమే మరి.

ఆయన రాసిన  కార్డులో రెండు సెల్ నెంబర్లు వున్నాయి. ఒకటి పనిచేయడం లేదు. రెండో ఫోన్లో గంగాధరరావు గారు దొరికారు. మాట్లాడారు. ‘నాలుగేళ్ల తర్వాత మీరు  రాసిన కార్డు’ అందింది అని చెబితే సంతోషపడ్డారు.

వారికి ధన్యవాదాలు. మరి పోస్టల్  డిపార్ట్ మెంటుకు చెప్పాలి వేలవేల ధన్యవాదాలు.



కామెంట్‌లు లేవు: