17, ఫిబ్రవరి 2021, బుధవారం

బ్రహ్మరాత - భండారు శ్రీనివాసరావు

వంద ఏళ్ళ క్రితం రూపాయే? ఇప్పుడూ రూపాయే!
ఏమిటి? వడ్డీ! అక్షరాలా అంతే! ఈరోజే అక్షరాల్లో చూశాను. కానీ ఆ వ్రాత బ్రహ్మ వ్రాత. ఒక పట్టాన అర్ధం కాదు. ఎందుకంటే అది రాసి ఇప్పటికి అక్షరాలా నూట ముప్పయి సంవత్సరాలు.
పాత కాగితాలు, దస్తావేజులు వెనక భద్రంగా దాచుకునే వారు. ఆస్తులు తరిగీ, కరిగీ కొంత, కంప్యూటర్లలో భద్రపరచుకునే వీలూ చాలూ ఏర్పడడం వల్ల కొంతా, ఏతావాతా ఏమైతేనేం పాత దస్తావేజులు, దస్త్రాలు అటకెక్కికూర్చున్నాయి.
రేడియోలో కలిసిపనిచేసిన ఆర్వీవీ కృష్ణారావు గారు ఒక పాత దస్తావేజు ప్రతి పంపారు. ఎంత పాతది అంటే దాదాపు 130 సంవత్సరాల నాటిది. వారి ముత్తాత కాలం నాటిది. ఆర్వీవీ కృష్ణారావు (పూర్తి పేరు రాయసం వీరభద్ర వెంకట కృష్ణారావు) వారి తండ్రి రాయసం గంగన్న పంతులు గారు, (వీరు నాకు కూడా తెలుసు). గంగన్న పంతులు గారి తండ్రి వీరభద్రుడు గారు. వారి తండ్రి గారు గంగన్న గారు.
గంగన్న గారికి కొంత డబ్బు అవసరం పడింది. అదీ అయిదువందల రూపాయలు. ఈనాం భూమి కొనుగోలు చేయడానికి చేసిన అప్పు తీర్చడానికి ఈ అప్పు అన్నమాట. ఈరోజు లెక్కల్లో అదేమంత పెద్ద మొత్తం కాదు. కానీ ఆ రోజుల్లో పెద్ద పెద్ద భూస్వాములకు కూడా నగదు అవసరాలు వచ్చేవి. వాళ్లకు తెలిసినదల్లా భూమిని తనఖా పెట్టి వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తీసుకోవడం. తీర్చడం. ఇలా అప్పు తీసుకోవడానికి పైకి కనపడని పెద్ద తతంగమే నడిచేది. గంగన్న గారు వుండేది రేలంగి. డబ్బు అప్పు ఇచ్చే ఆసామి వుండేది తణుకులో. ఈ అప్పు పత్రం రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు. అంచేత ఇవి రాయడానికి ప్రత్యేకంగా లేఖరులు వుండేవారు.
కృష్ణారావు గారు పంపిన దస్తావేజు పత్రాల్లో చేతిరాత బ్రహ్మ రాతను పోలివుంది. చదవడం క్లిష్టం అనిపించినా, బ్రిటిష్ రాణి గారి చిత్రంతో వున్న రూపాయి విలువచేసే స్టాంపు పేపరు మీద రాసిన విషయాలను చదివి, అర్ధం అయినంత వరకు కొంత ఇక్కడ పొందుపరుస్తున్నాను. (అర్ధం కాని చోట చుక్కలు ఉంచాను)
“.......ఆ 1891.......తన్కు (ణ కింద కు వత్తు, తణుకు కావచ్చు) గ్రామ కాపురస్తులు, కమ్మవారు, షావుకారు చిట్టూరి యి౦ద్రయ్య (ఇంద్రయ్య) కుమార్డు వెంకట కృష్ణయ్యకు, రేలంగి కాపురస్తులు , బ్రాహ్మణులు, యిన్నాందార్లు (ఇనాందారులు) రాయసం కృష్ణమ్మగారి కుమార్డు గంగన్న వ్రాయించి ఇచ్చిన అస్వాధీనపు తన్ఖా (తణఖా, ణా కింద ఖా వత్తు) పత్రము.
“.......... యిన్నాం భూమి కొనుగోలు నిమిత్తం నేను చేసిన రుణాల తీరుమానం నిమిత్తంన్ను, నా కుటుంబ .......(బహుశా ఖర్చులు కావచ్చు) నిమిత్తంన్నూ యీరోజు కృష్ణయ్య గారి వద్ద పుచ్చుకున్న రొఖం రు. 500 (అయిదువందల రూపాయీలు) యిన్ద్కు నెల / ఒక్కింటికి వందకు రు. 1 రూపాయి చొ# వడ్డీతో అయ్యే అసలుఫాయిదాలు తీరుమానం చెయ్యగలందులమని ......”
ఈ విధంగా సాగిపోయింది ఆ రుణపత్రం.
కింద గంగన్న గారు చేసిన సంతకం ఇంకా గమ్మత్తుగా వుంది.
‘రాయసం గంగ్గ౦న్న వ్రాలు’ అని దస్కత్తు చేశారు. ఆ రోజుల్లో తెలుగు అలా వుండేదేమో!
తణుకు సబ్ రిజిస్త్రార్ ఆఫీసులో రెండు రూపాయల స్టాంపుపై రిజిస్త్రార్ సంతకం చేసి వేసిన మొహర్ వుంది.
అయిదు వందల రూపాయలు అప్పు చేయాలంటే ఇంత తతంగం నడిచేది.
అప్పు పూర్తిగా అసలు ఫాయిదాలతో అనుకున్న వ్యవధికి ముందే చెల్లు వేసి తనఖా పత్రాలను వెనక్కి తీసుకున్నట్టు కూడా వాటిల్లో వుంది.
ఇప్పుడో.....
అప్పు చేయడానికి ఆలోచించనక్కరలేదు. తీర్చే విషయం గురించి అసలు బెంగ పడక్కర లేదు. (17-02-2021)


కామెంట్‌లు లేవు: