12, ఫిబ్రవరి 2021, శుక్రవారం

మరచిపోలేని ఆతిధ్యం – భండారు శ్రీనివాసరావు

 “నేను ఈ పదవిలోకి రాక మునుపు ఒక గైనకాలజిస్టుగా ఎంతో మంది నవజాత శిశువులను  హాండిల్  చేశాను. తెలంగాణా కూడా నవజాత రాష్ట్రమే. కాబట్టి సులభంగా ఈ రాష్ట్రాన్ని కనిపెట్టి చూసుకోగలననే ధైర్యం వుంది. నేను తమిళ బిడ్డను, ఇప్పుడు తెలంగాణా సోదరిని”

ఈ మాటలు అన్నది ఎవరో కాదు, తెలంగాణా గవర్నర్ డాక్టర్  తమిళ్ సై సౌందర రాజన్.

నిన్న గురువారం ఉదయం రాజ్ భవన్ నుంచి గవర్నర్ ప్రెస్ సెక్రెటరి శ్రీ మల్లాది కృష్ణానంద్ ఫోన్ చేశారు. ‘రేపు మీరు రాజ్ భవన్ కు రావాలి. గవర్నర్ గారి పుస్తకం ఆవిష్కరణ. వీలయితే నాలుగు ముక్కలు మాట్లాడాలి.

రాజ్ భవన్ నాకు కొత్త కాదు, రేడియో విలేకరిగా చాలా సార్లు వెళ్లాను. రాజ్ భవన్ లో జ్వాలా పనిచేసేటప్పుడు దాదాపు ప్రతి సాయంత్రం అక్కడే అన్నట్టు రోజులు గడిచాయి.  అటువైపు వెళ్లక  ఇంచుమించు పదిహేనేళ్లు కావస్తోంది. అయినా అక్కడ పనిచేసే సిబ్బంది చాలామంది నా మొహం చూసి గుర్తుపట్టి పలకరించడం సంతోషం అనిపించింది. కొంతమంది నా భార్య చనిపోయిన విషయాన్ని ప్రస్తావించి పరామర్శించారు.

గవర్నర్ వచ్చారు. వెంట ఆవిడ భర్త సౌందర రాజన్ కూడా వచ్చారు. ఆయన కూడా డాక్టరే. చాలా చాలా నిరాడంబరంగా వున్నారు. అతిశయం అన్నది మచ్చుకు కూడా కనబడలేదు. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ముందుంచి ఆయన వెనుకనే నిలబడ్డారు. అలాగే గవర్నర్ గారి సలహాదారులు. శ్రీ ఏపీవీఎన్ శర్మ గారు. ఒకప్పుడు  మేమున్న ఎర్రమంజిల్ క్వార్టర్స్ లోనే వుండేవారు. వారి ఇల్లు నిశ్శబ్దంగా ప్రశాంతంగా వుండేది. మా ఇల్లు అర్ధరాత్రి అయినా హడావిడిగా వుండేది. మా గందరగోళాన్ని ఆయన ప్రశాంత చిత్తంతో భరించారు. అలాగే  మహంతిగారు. Principled officer అంటే ఆయన పేరే ముందు చెప్పుకునే వారు.


(తెలంగాణా గవర్నర్ తమిళసై తో భండారు శ్రీనివాసరావు)


ముందు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. దీప స్తంభం దగ్గరికి వస్తూనే గవర్నర్ తల ఎత్తి పైకి చూసారు. పైన వున్న ఏసీ వెంట్ నుంచి వస్తున్న గాలి ఏమైనా ఇబ్బంది పెడుతుందా అని ఒక్క క్షణం పరకాయించి చూసారు. ఆమె సునిశిత దృష్టి నాకప్పుడు బోధ పడింది.

నన్నూ మరికొందరు సీనియర్ జర్నలిస్టులను వేదిక మీదకు ఆహ్వానించి పుస్తకం విడుదల చేశారు.

ఆ తర్వాత మాలో కొందరిని మాట్లాడమని కోరారు.సుదీర్ఘ ప్రసంగాలు చేసే సందర్భం కాదు. కృష్ణానంద్ కోరినట్టే ముక్తసరిగా మాట్లాడాను. సంవత్సరం కిందట తెలంగాణా గవర్నర్ గా పదవీ స్వీకారం చేసిన పిమ్మట,  ‘తెలుగు నేర్చుకుంటాను అని లేడీ గవర్నర్ చెప్పిన వార్త పత్రికల్లో వచ్చిన సంగతి గుర్తుచేసి, ఆ కారణంగానే తెలుగులో మాట్లాడుతున్నాను అని చెప్పాను. కేంద్ర రాష్ట్ర సంబంధాలను కాపాడడంలో గవర్నర్ల పాత్ర కీలకం, ఈ బాధ్యత నిర్వహణ దిశగా అడుగులు వేస్తున్నందుకు సంతోషంగా వుందని,  తద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని, ముందు ముందు కూడా ఈ సుహృద్భావ వైఖరి కొనసాగాలని ఆశిస్తున్నట్టు చెప్పాను.

మరికొందరి  ప్రసంగాలు అయిన తర్వాత లేడీ గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో మొదలు పెట్టి, ఇంగ్లీష్ లో కొనసాగించారు.

గవర్నర్ ప్రసంగం కాబట్టి పత్రికల్లో, మీడియాలో వివరంగానే వస్తుంది. కనుక ఆ ప్రసంగంలో వినవచ్చిన ఒక ముచ్చటతో ముగిస్తాను.

‘ఒక రాజకీయ నాయకుడి దగ్గరకు ఓ నిరుద్యోగి వచ్చి తన కష్టాలను ఏకరవు పెట్టి, బతుకుతెరువుకోసం ఏదైనా ఉద్యోగం వేయించండి అని ప్రాధేయ పడ్డాడుట. ఆ నాయకుడు చిరునవ్వు నవ్వి, ‘ఏ ఉద్యోగం దొరక్కనే తాను రాజకీయాల్లోకి వచ్చాను అని జవాబిచ్చాడుట.

సభానంతరం జరిగిన విందులో మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకుని అందర్నీ అడిగి అడిగి  మరీ వంటకాలు సర్వ్ చేయించారు. మహిళలు ఎంతటి ఉన్నత స్థానంలో వున్నా కూడా తమకు మాత్రమే సొంతం అయిన ఆప్యాయంతో కూడిన  అతిథి మర్యాదల్ని మరిచిపోలేరు అనిపించింది. ఒకప్పుడు మా రేడియో వార్తా విభాగంలో పైనుంచి కింద నాలుగో తరగతి ఉద్యోగివరకు అందరూ మహిళలే పనిచేసి అఖిల భారత స్థాయిలో మా యూనిట్ కు గొప్ప అవార్డులు తీసుకువచ్చిన సంగతిని భోజనాల  కబుర్లలో భాగంగా లేడీ గవర్నర్ చెవిన వేశాను.

ఎన్నో రోజుల కరోనా గృహనిర్బంధం తర్వాత ఒక రోజు ఇలా  ఉల్లాసంగా హాయిగా గడిచిపోయింది.

 ఎంతో మంది పాత పాత్రికేయ మితృలు కలిసారు. అనేక నెలల తర్వాత అంతమందిని ఒకే చోట కలిసే మహత్తర అవకాశం కల్పించిన మిత్రుడు కృష్ణానంద్ కి ధన్యవాదాలు. 

 


(12-02-2021)  

 

కామెంట్‌లు లేవు: