11, ఫిబ్రవరి 2021, గురువారం

సర్కారు కొలువులు – భండారు శ్రీనివాసరావు

 


సర్కారు కొలువులు – భండారు శ్రీనివాసరావు
(Published in Andhra Prabha daily on 13-02-2021, Saturday)
ఉద్యోగం వుండదు కానీ ఉద్యోగం చేసే ఉద్యోగి ఉంటాడు. ఇదెక్కడి విరోధాభాసం అంటారా!
ఇదేదో సరదాగా అంటున్నది కాదు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ స్వయంగా పార్లమెంటు సాక్షిగా చెప్పిన మాట.
ప్రతి ఉద్యోగానికి దానికి తగ్గట్టు ఓ పేరు వుంటుంది, గుమాస్తో అనో, అధికారి అనో. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత పాతికేళ్ళవరకు ఒక ఉద్యోగి ఉండేవాడు. ముందే చెప్పినట్టు అతడు చేయాల్సిన ఉద్యోగం మాత్రం లేదు. అదేదో బ్రిటిష్ కాలంలో (1940) అవసరార్థం ఏర్పాటు చేసిన ఉద్యోగం. బ్రిటిష్ ప్రధానమంత్రి చర్చిల్ కు పొగతాగే అలవాటు వుండేది. గుప్పుగుప్పున రోజూ డజన్ల కొద్దీ సిగార్లు (నాణ్యమైన దొరపొగాకు చుట్టాలు) తగలేయడం ఆయన హాబీ. అందుకని చర్చిల్ దొరవారికి ఆయన బాగా ఇష్టపడే "ట్రిచినోపోలీ" వెరైటీ సిగార్‌ను చర్చల్ కి సరఫరా చేయడానికి ఒక ఉద్యోగాన్ని సృష్టించారుట. దాని పేరే సీ.సీ.ఏ. అంటే చర్చిల్ సిగార్ అసిస్టెంట్. 1945 లో చర్చిల్ ఓడిపోయినా, 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పటికీ ఈ పదవి మాత్రం 1970 వరకూ కొనసాగుతూనే ఉందిట.
పరిపాలనలో మార్పు అవసరం గురించి చెప్పడానికి ఈ ఉదంతం ఒక అతిపెద్ద ఉదాహరణ అని ప్రధాని మోడీ అన్నారు.
ఈ విషయం మీడియా వెల్లడించినప్పుడు ఇటువంటివే మరికొన్ని సంగతులు మస్తిష్కంలో మెదిలాయి.
హైదరాబాదులోని ఆకాశవాణి కేంద్రం సింహద్వారం పక్కనే ఓ స్తంభానికి వేలాడుతూ తళతళ మెరుస్తూ వుండే ఓ ఇత్తడి గంట కనిపిస్తుంది.
రేడియో స్టేషన్ లో ఈ ధర్మగంట అవసరం ఏమిటి? అనే ఆలోచన నన్ను వేధిస్తూ వుండేది.(అక్కడ పనిచేసే రోజుల్లో)
విచారించగా తెలిసింది ఏమిటంటే ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి తలెత్తినప్పుడు, అదే సమయంలో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు అందరినీ అప్రమత్తం చేయడానికి ఆ గంటను మోగిస్తారని తెలిసింది. మూడు దశాబ్దాల నా ఉద్యోగపర్వంలో ఒక్కసారి కూడా ఆ గంట మోగించిన దాఖలా లేదు. ఆ గంటను శుభ్రంగా తుడిచి పదిలంగా కాపాడడానికి ప్రత్యేకంగా ఓ ఉద్యోగి వుండేవాడేమో కూడా తెలియదు.
ఒకానొక కాలంలో, బహుశా స్వాతంత్రానికి పూర్వం అనుకుంటాను, భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే ప్రభుత్వ వైద్యులకు రవాణా సదుపాయాలు సరిగా ఉండేవి కావు. రహదారులు అధ్వానంగా ఉండేవి. ఎటు పోవాలన్నా ఎడ్ల బండ్లే శరణ్యం. ఆ రోజుల్లో ప్రభుత్వ వైద్యులకు జీపు బదులు ఎడ్ల బండి ఏర్పాటు వుండేది. ఒక బండి, అది సర్కారు వాహనం కాబట్టి జత ఎడ్లు, వాటికి గ్రాసం, బండిని నడపడానికి జీపు డ్రైవర్ మాదిరిగా ఒక పనివాడు, ఈ తతంగం నడవడానికి ప్రభుత్వ ఖజానా నుంచి బిల్లుల చెల్లింపు ఇలా సాగిపోయేది.
కొన్నేళ్ళ తరువాత ఆ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు కొద్దో గొప్పో మెరుగు పడడం వల్ల సర్కారీ విల్స్ జీపులు రంగ ప్రవేశం చేయడంతో, ఎడ్ల బండ్ల అవసరం లేకుండాపోయింది. అయినా కూడా చాలా కాలంపాటు ఆ వ్యవస్థ రికార్డుల్లో కొనసాగేది అని చెప్పుకునేవారు. 1970 ప్రాంతాల్లో అక్కడ పనిచేయడానికి వెళ్ళిన ఒక డాక్టరు గారెకి మనుషులకు వైద్యం చేసే దవాఖానాలో ఈ పశుగ్రాసం బిల్లులేమిటి అని అనుమానం వచ్చి ఆరా తీస్తే ఈ అసలు విషయం బయట పడింది.
మనలో చాలామంది పూర్వపు తహసీల్ కచేరీలు చూసి వుంటారు. పంకాలు లేని ఆ కాలంలో తహసీల్ దొరగారు కూర్చొనే సీటు మీద ఒక పెద్ద గుడ్డ పంకా వుండేది. ఒక బంట్రోతు దొరవారు దాన్ని అటూఇటూ తాడుతో లాగుతూ వుంటే అయ్యవారు మెల్లగా వీచే ఆ చల్లగాలిలో సేద తీరుతూ రాచకార్యాలు చక్కబెడుతూ వుండేవారు.
తరవాత్తరవాత విద్యుత్ పంకాలు వచ్చాయి కానీ గుడ్డ పంకాలు లాగే కొలువు మాత్రం చాలాకాలం కొనసాగింది.
ఐ.ఏ.ఎస్. అధికారిగా అనేక ఉన్నత పదవులు నిర్వహించిన శ్రీ ప్రభాకరరెడ్డి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. 1977లో ఆయన సర్వీసులో చేరిన కొత్తల్లో ‘మసాల్చి’ అనే ఉద్యోగం ఉండేదట. వెనుకటి రోజుల్లో కలెక్టర్లు గుర్రాల మీద తిరిగేవారు. ఆ గుర్రం ముందుగా వెడుతూ దారి చూపించడానికి ఈ మస్తాల్చి ఉండేవాడు. కాలక్రమంలో గుర్రాలు పోయి మోటారు వాహనాలు వచ్చినా ఆ ఉద్యోగం మాత్రం అలాగే చాలా కాలం కొనసాగుతూ వచ్చిందట.
మన దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తల్లో అమలు చేసిన పంచవర్ష ప్రణాళికల ధర్మమా అని అన్ని స్థాయిల్లో రకరకాల ప్రభుత్వ ఉద్యోగాలు పుట్టుకు వచ్చాయి. మా చిన్నతనంలో మా ఊరికి వి.ఎల్.డబ్ల్యు. అనే ఉద్యిగి కొత్తగా వచ్చాడు. అప్పటిదాకా కరణం, మునసబు మాత్రమే ప్రభుత్వం అనుకునేవారు. అలాగే బ్లాకు డెవలప్మెంట్ ఆఫీసర్ (బీడీవో) ఉద్యోగం కూడా కొత్తగా వచ్చిందే. ఇప్పుడు అవే ఉద్యోగాలకు పేర్లు మారిపోయి వుంటాయి.

‘ఒక గుంతను తవ్వు. ఆ గుంతను పూడ్చు. గుంత తవ్విన వాడికి ఓ ఉద్యోగం, దాన్ని పూడ్చిన వాడికి మరో ఉద్యోగం” ఈ పద్దతిలో అనేక ఉద్యోగాలు. అయినా దేశంలో నిరుద్యోగ సమస్య అలాగే వుంది.(EOM)

(11-02-2021)

          

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అప్పటి కాలమాన పరిస్థితులకనుగుణంగా ఆ ఉద్యోగాల ఏర్పాట్లు జరిగి ఉంటాయి, శ్రీనివాసరావు గారు. వాటిని ఇప్పుడు తలుచుకుంటే హాస్యాస్పదంగానే ఉంటుంది.

పైన మీరు చెప్పిన “పంకా పుల్లర్” మాత్రమే గాక ఆ రోజుల్లో “మషాల్చీ” అని మరొక ఉద్యోగి కూడా ఉండేవాడు. కరెంటు రాని పల్లెలలో వీధి మొదట్లో దీపాలు (లాంతరు స్తంభాలు) ఉండేవి, మీకు గుర్తుందిగా? చీకటి పడే వేళకి ఒక నిచ్చెన, ఒక కిరసనాయిలు సీసా మోసుకుంటూ ఒక ఉద్యోగి ఊరంతా తిరుగుతూ ప్రతి లాంతరు స్తంభమూ ఎక్కి, పైనున్న లాంతరు వెలిగించేవాడు. అలాగే, ఆఫీసరు గారు ఆఫీసు నుండి ఇంటికి నడుచుకుంటూ చీకట్లో వెడుతున్నప్పుడు ఒక దీపం (వెలిగించిన లాంతరు) పట్టుకుని కాస్త ముందు నడిచేవాడు “మషాల్చి” ... దారి కనబడడానికి (కరెంటు ఇంకా రాని రోజుల్లో). ఇవన్నీ నీకెలా తెలుసు అంటారా? మా తండ్రి గారు రెవిన్యూ శాఖలో ఉన్నతోద్యోగం చేశారు కాబట్టి, వారి ఉద్యోగరీత్యా అటువంటి ఊళ్ళల్లో (కరెంటు లేని) మేం కూడా కొంతకాలం నివసించాం కాబట్టి. అందువల్ల ఆ నాటి జీవనవిధానం బట్టి ఆ పనులు, ఆ ఉద్యోగాలున్నూ.

“కన్యాశుల్కం” నాటకంలో వెంకటేశం చదువు గురించి అగ్నిహోత్రావధానుల్ని బోల్తా కొట్టించడానికి గిరీశం అంటాడు చూశారా - రేపు మనవాడికి గుణుపురం తాసిల్దారీ అయి అడవిలో కమాను వెళ్ళుతుండగా .... గుర్రం మీద అని గిరీశం వివరిస్తాడు. మరి ఇది 19వ శతాబ్దపు కథ కాబట్టి అవే ఆనాటి ప్రయాణసాధనాలు. అంతెందుకు, 20వ శతాబ్దంలో 1970లలో నేను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏపీ సర్వీస్ కమీషన్ వారు డెప్యూటీ కలెక్టర్లు, డెప్యూటీ పోలీస్ సూపరెంటెండ్లు ఖాళీల భర్తీ గురించి (ఈ కాలంలో “గ్రూప్ వన్” సర్వీసెస్ అని పాప్యులర్ గా వ్యవహరించబడేవి) నోటిఫికేషన్ ఎట్టకేలకు పడింది పేపర్లో (పది పదిహేనేళ్ళ gap తరువాత తిరిగి మొదలెట్టిన నోటిఫికేషన్). సరే దాని వివరాలు APPSC కు వ్రాసి తెప్పించుకున్నాను. దాంట్లో చూస్తే సెలెక్ట్ అయిన వాళ్ళకు ఉద్యోగంలో నెలకు 150 / 200 రూపాయల జీతంతో పాటు ఒక గుర్రం కూడా ఇవ్వబడుతుందని వ్రాసి ఉంది. నేనేం బతుకుతాను, గుర్రానికేం పెడతాను అని నేను భయపడి దరఖాస్తు పెట్టలేదు (నిజంగానే). నా తెలివితక్కువే అనుకోండి. కమీషన్ వారు బ్రిటష్ కాలం నాటి వివరాల పుస్తకాన్ని సవరించక పోవడంతో నాబోటి వాడికి కలిగిన సందిగ్ధం.

చివరికి నాది అదే మాట - ఇవన్నీ అప్పటి ఉద్యోగాలు. తరువాత తరువాత కాలం చెల్లిపోయాయి.

(పైన మీరిచ్చిన “గుంత” ఉదాహరణ కొంచెం అతిశయోక్తి కదా? 🙂)

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విన్నకోట నరసింహారావు గారూ ధన్యవాదాలు. మీరు చెప్పిన మసాల్చి గురించి యాడ్ చేశాను