3, మార్చి 2017, శుక్రవారం

వ్యవస్థల నడుమ ఘర్షణలు –కొన్ని జ్ఞాపకాలు


ఇది ఇప్పటి మాట కాదు, జరిగి అటూ ఇటూగా  యాభయ్ ఏళ్ళు.
బెజవాడ రైల్వే ప్లాటు ఫారం. కృష్ణా జిల్లా కలెక్టర్ హడావిడిగా రాత్రివేళ అక్కడికి చేరుకున్నారు. కారణం వుంది. రైల్వే అధికారులపై ఆయనకు ఆగ్రహం  వచ్చింది. హైదరాబాదు నుంచి వైజాగ్ వెడుతున్న ఒక ఉన్నతాధికారికి కలిగిన అసౌకర్యం అందుకు కారణం. అధికారి రైల్వే రిజర్వేషన్ గురించి ముందుగానే రెవెన్యూ అధికారులు రైల్వే వారికి సమాచారం అందించి, రిజర్వేషన్ గురించిన అర్జీ ముందుగానే అందచేశారు కూడా. ఆరోజుల్లో రిజర్వేషన్ల వ్యవహారం ఇప్పట్లా కంప్యూటర్ల సాయంతో జరిగేది కాదు. హైదరాబాదు నుంచి వైజాగ్  వెళ్ళే వాళ్ళు బెజవాడలో రైలు మారి మరో రైల్లో వెళ్ళాలి. రిజర్వేషన్ చార్టులో హైదరాబాదు అధికారి పేరు లేదు. రెవెన్యూ అధికారులకు ఏం చెయ్యాలో పాలిపోలేదు. కలెక్టర్ నేరుగా రైల్వే ఉన్నతాధికారితో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. రైల్వే వారికీ, రెవెన్యూ వారికీ మాట పట్టింపు వచ్చింది. ఎవరికి వారు తమ వాదనే సరయినది అనుకోవడం వల్ల ఆ పట్టింపు పంతానికి దారి తీసింది. రిజర్వేషన్ ఇవ్వడం కుదరదు అంటే కుదరదు అన్నారు.
కలెక్టర్ తన పవర్ చూపించారు. జిల్లా మేజిస్ట్రేట్ అధికారాలను ఉపయోగించుకుంటూ అక్కడికక్కడే ప్లాటు ఫారం మీదనే కోర్టు ఏర్పాటు చేశారు. దురుసుగా ప్రవర్తించిన రైల్వే అధికారిని అరెస్టు చేయాలని ఆర్డరు వేశారు. రైల్వే వారికి పరిస్తితి అర్ధం అయింది. మెట్టు దిగి వచ్చి హైదరాబాదు అధికారికి బెర్తు ఏర్పాటు చేశారు.
ఇటువంటిదే మరో ఘర్షణ హైదరాబాదు పోలీసులకు, మిలిటరీ వారికీ జరిగింది. ఆబిడ్స్ పోలీసులు  ఒక మిలిటరీ జవానుతో మాటామాట పెరిగి అతడిని  అరెస్టు చేశారు. ఆ రాత్రి ఒక పెద్ద వ్యానులో వచ్చిన మిలిటరీ వారు పోలీసు స్టేషన్ పై దాడి చేసి తమ వాడిని విడిపించుకుని పోవడమే కాకుండా కొందరు పోలీసులను కూడా తమవెంట పట్టుకుపోయారు.

ఈ వివాదం సమసిపోయేలా చేయడానికి ఉన్నతాధికారులకు తల ప్రాణం తోకకు వచ్చింది.           

1 కామెంట్‌:

GARAM CHAI చెప్పారు...

what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
my youtube channel garam chai:www.youtube.com/garamchai