8, జులై 2016, శుక్రవారం

ఒక దార్శనికుడి కరిగిన కల

(ఈ రోజు వై.ఎస్.ఆర్. జయంతి)

(PUBLISHED IN "SAKSHI" TELUGU DAILY ON 09-07-2016, SATURDAY)

చీకటి చిక్కబడుతున్న కొద్దీ సుశీలకు కంగారు ఎక్కువయింది. కారు నడుపుతున్న భర్త వున్నట్టుండి కారు పక్కకు తీసి స్టీరింగుపై వాలిపోయాడు. జన సంచారం లేదు. దగ్గరలో ఊరున్న దాఖలాలు కనబడడం లేదు?  దిక్కులేని ప్రదేశంలో దిక్కుతోచని స్తితి ఆమెది. ఏం చెయ్యాలి?
పీతాంబరం స్తితిమంతుడు. ఆయన వున్న ఊరూ సంపన్న గ్రామమే. మనుమడికి నీళ్ళ విరోచనాలు మొదలై పూట గడిచిపోయింది. ఊళ్ళో ఫోనులు వున్నాయి. ఆసుపత్రే లేదు. అది వున్నచోటికి పోవడానికి రోడ్డు వుంది. కానీ ఆ రాత్రివేళ వెళ్ళడానికి బస్సులు లేవు. ఏం చెయ్యాలి?
ఏకాంబరానిది మరో పరిస్తితి. ఊళ్ళో ఆసుపత్రి వుంది. డాక్టరు ఉండడు. ఎప్పుడు వచ్చేది, ఎప్పుడు పోయేది ఆయనకే తెలియదు.  రోగం రొష్టూ వస్తే మళ్ళీ నాటు వైద్యమే గతి.
సోమయ్య ఊళ్ళో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వుంది. డాక్టరు కూడా మంచివాడు. ఊళ్లోనే ఉంటాడు. అయితే  రక్త పరీక్షకు అయినా, ఎక్స్ రే తీయించుకోవాలన్నా బస్సెక్కి పక్కన వున్న బస్తీకి వెళ్ళాలి. తీరా వెడితే కరెంటు వుండదు. అది వున్నా ఎక్స్ రే తీసేవాడు వుండడు. ఆరోగ్యం ఎటూ చెడింది. పూట తిండి పెట్టే పని కూడా చెడింది. ఏం చెయ్యాలి?
అన్నీ చిన్న సమస్యలే. వెంటనే పరిష్కరించకపోతే పెద్దవి అయ్యే సమస్యలు. ఆరోగ్య సమస్యల్లో అనేక రకాలు. వైద్యుడికి చూపించేవి. వైద్యుడి దగ్గరకు వెళ్ళే లోగా అనారోగ్యంలోని తీవ్రతను వైద్యుడి సలహాతో తగ్గించుకోగలిగేవి.
ఇవన్నీ సమస్యలే. కాని పరిష్కారం లేని సమస్య అంటూ వుండదు. ఇది అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నమ్మకం. స్వయానా డాక్టరు కావడం మూలాన పరిష్కారం దిశగా ఆలోచన చేశారు. ప్రజారోగ్యం విషయంలో ఆదర్శాలు కలిగిన మరికొంతమంది వైద్యులు జత కలిశారు. అనుకున్నది అనుకున్నట్టు చేసే అధికారులు తోడయ్యారు.
ఆ విధంగా అప్పటికే జనాదరణ పొందిన 108 తోడుగా  104 రూపుదిద్దుకుంది.
అయితే వై ఎస్ ఆర్ కల అంతటితో ఆగలేదు. దానికి సంపూర్ణత్వం కలిగించాలనుకున్నారు.
గుండెజబ్బుల వంటి పెద్ద సమస్యలు ఎదురయితే చిన్నవాళ్ళు ఏమైపోవాలి? వాటికి వైద్యం చేయిన్చుకోగల వెసులుబాటు వారికి ఎలా కలిగించాలి. అంతే! మరో అపురూప వ్యవస్థ ‘ఆరోగ్య శ్రీ’ కి అంకురార్పణ జరిగింది. చిన్నా చితకా రోగాలకు వైద్య సలహా చాలు. అందుకోసం ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో వుండే  104 ఉచిత కాల్ సెంటరు. వ్యాధి నివారణ కంటే నివారణ మేలు. అందుకోసం  నిర్దేశిత దిన వైద్య పరీక్షలు నిర్వహించే 104 సంచార వాహనం.  అత్యవసర వైద్య సాయం కోసం 108 అంబులెన్సు . ఇక విధి వికటించి పెద్ద రోగాల పాలుపడి ఎవరు కాపాడుతారా అని ఎదురు చూపులు చూసేవారి కోసం ఆరోగ్యశ్రీ.
పైగా,  ఇవన్నీ పూర్తిగా ఉచితం. అన్నీ ఒక్క గొడుగులో.
నిజానికి వై ఎస్ ఆర్ కల అంతటితో ఆగలేదు.
ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తోంది.ఇందులో సింహ భాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను తీరుస్తున్నప్పటికీ- డాక్టర్ల కొరత అన్నది ఎప్పటికీ తీరని సమస్యగానే మిగిలిపోతున్నది. మన రాష్ట్రంలో ఎనభయి వేల గ్రామాలుంటేకేవలం పదిహేను వందల చోట్ల మాత్రమే వైద్యులు అందుబాటులో ఉన్నారు. వైద్య కళాశాలలో పట్టా పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్దంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా వున్న పల్లెల్లో నివసించే వారికి ఈ అరకొర సదుపాయం కూడా అందుబాటులో లేదు. నాటు వైద్యుల దయా దాక్షిణ్యాల పైనా, వారిచ్చే నాటు మందుల పైనా  ఆధారపడాల్సిన దీన స్తితి వారిది. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా అరణ్య ప్రాంతాలలో - అంత సులువుగా చేరుకోలేని కోయ గూడాలులంబాడి తండాల్లో వుండే పేద వారికి రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాటివారు సాధారణంగా షుగరురక్త పోటుఉబ్బసంకీళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు. అసలు ఇలాటి జబ్బులు తమకు వున్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటె ఎలాటి వైద్య పరీక్షలు ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి  ఏపక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీవున్నట్టు కూడా తెలియదు.

వైద్య ఆరోగ్య శాఖ ఎన్ని నిధులు ఖర్చుచేస్తున్నా ఫలితాలు ఆశాజనకంగా వుండడం లేదు. ఈ శాఖ పేరులో వైద్యం ముందు ఆరోగ్యం తరువాత వున్నాయి. వైద్యం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడడం అనే అర్ధం వుంది. అసలు ప్రజలు ఆరోగ్యంగా వుంటే వైద్యంతో నిమిత్తం ఏముంటుంది. ఇదిగో ఈ ఆలోచనలోనుంచి పురుడు పోసుకున్నదే 104 పధకం.

108 అంబులెన్సు ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినదయితే ఈ 104 సంచార వైద్య వాహనం - పేద పల్లె ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది. ఇంతా చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే- ఒక్కొక్కరిపై పెట్టె ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే - వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.

బయో మెట్రిక్ పద్దతి ద్వారా రోగుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. గర్భిణీ స్త్రీలనుబాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు. గర్భిణి కడుపులో పిండం పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు సూచిస్తారు. తగు మందులు, పోషకాలు ఇస్తారు. నెలనెలా పరీక్షలు చేసి పురుడు వచ్చే సమయాన్ని నిర్ధారిస్తారు. పురిటి ఘడియలు దగ్గర పడ్డప్పుడు 108 కి తెలియచేసి వారిని దగ్గరలోని ప్రభుత్వ వైద్య శాలకు చేరుస్తారు. సుఖ ప్రసవం తరువాత తగిన జాగ్రత్తలు చెప్పి, తిరిగి అంబులెన్సులో ఇంటికి చేరుస్తారు.
ఆ రోజుల్లో జరిగిన సమావేశాల్లో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అనేవారు. “కడుపుతో వున్న ఆడపిల్లలను పుట్టింటికి తీసుకువచ్చి, పురుడు పోయించి  తిరిగి తల్లీ బిడ్డను క్షేమంగా అత్తారింటికి పంపడం తలితండ్రుల బాధ్యత. ఇక నుంచీ ప్రతి పేదింటి ఆడపిల్లకూ ప్రభుత్వమే పుట్టిల్లు. వాళ్ళ బాధ్యత ప్రభుత్వానిదే”

ఇంతే కాదు.

104 కాల్ సెంటర్ కు ఇంకా విస్తృతమైన లక్ష్యాలు నిర్దేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య శాలలు, నర్సింగు హోములు, ప్రైవేటు క్లినిక్కులు, ఔషధ దుకాణాలు, బ్లడ్  బ్యాంకులు ఇలా వైద్య రంగానికి సంబంధించిన సమస్త సమాచారం సేకరించి ఒక్కచోటే నిక్షిప్తం చేసారు. అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా రాష్ట్రంలో ఏమూల నుంచి ఫోను చేసినా వారు వుండే ప్రదేశానికి ఇవన్నీ యెంత దూరంలో వున్నాయి, ఏ సమయాల్లో పనిచేస్తాయి అనే వివరాలు తెలియచేయడానికి వీలుగా ఈ ఏర్పాటు. ఇక  వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ఏ  ప్రాధమిక వైద్య కేంద్రంలో వైద్యుడు అందుబాటులో ఉన్నదీ, సెలవు మీద వెళ్లిందీ ఆన్ లైన్లో తెలుసుకుని ఆ సమాచారాన్ని అటు అవసరమైన రోగులకూ, ఇటు పర్యవేక్షణ జరిపే అధికారులకూ ఎప్పటికప్పుడు ఈ కేంద్రం తెలియచేస్తూ వుంటుంది. అలాగే విద్యుత్ అధికారులతో సంప్రదించి ఈ వూర్లో ఏ సమయంలో కరెంటు వుంటుందీ, ఏ వూరి ఆసుపత్రిలో ఎక్స్ రే మిషన్లు పనిచేయడం లేదు మొదలయిన వివరాలను సంసిద్ధంగా వుంచుకుని అడిగిన వారికి అడిగినట్టుగా  సమాచారం అందించే వ్యవస్థకు రూపకల్పన చేసారు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే  నాణ్యత కలిగిన వైద్య చికిత్సలను కేవలం కలిగిన వారికే కాదు, పేదసాదలకు కూడా  అందుబాటులోకి తేవాలనేది మొత్తం ఆరోగ్య శ్రీ లక్ష్యం.
ఆ దార్శనికుడు కన్న కల సాకారం అయ్యే కృషి మొదలయింది. ప్రజలకు అందులోని  వైశిష్ట్యం ఎలాటిదో ప్రజలకు క్రమంగా అవగతమవుతోంది.
దురదృష్టం.  అప్పుడే విధి వక్రించింది. దొంగచాటుగా  మృత్యుపాశం విసిరింది.
కల కన్న మనిషి అర్ధంతరంగా అంతర్ధానమయ్యాడు. కంటున్న కల ఆయన కనురెప్పల్లోనే కరిగిపోయింది. ఒక గొప్ప స్వప్నం  ఆవిష్కారానికి ముందే ఆవిరి అయిపోయింది. అంత చక్కటి పధకం అరకొరగా మిగిలి పోయింది. రాజకీయ విషక్రీడకు బలయిపోయింది.  కార్పొరేట్ ఆసుపత్రులకు దోచి పెట్టే పధకంగా ముద్రవేసి,  అసంపూర్తిగా దాన్ని  అటక ఎక్కించారు.

కారణం ఎవరయినా జరగరానిది జరిగిపోయింది. మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా నిలవాల్సిన ఓ అద్భుత పధకం కొందరి నిర్వాకాలకు నీరుకారిపోయింది. మరి కొందరి స్వార్ధాలకు బలయిపోయింది. ఇంకొందరి ఆహాలను చల్లార్చడానికి మాడి మసయిపోయింది. రాజకీయ చదరంగంలో చిక్కుకుపోయి  ఎత్తులు పైఎత్తులకు  చిత్తయిపోయింది.

ఇప్పుడీ పధకం ఉందా అంటే వున్నట్టు, లేదా అంటే లేనట్టుగా వుంది.
ఆయన అదృష్టవంతుడు, దాటిపోయాడు. ఊళ్లకు దూరంగా, వైద్య సౌకర్యాలకు నోచుకోకుండా కొండలు, కోనల్లో నివసించే వారు దురదృష్టవంతులు. వారి బతుకుల్ని మార్చే గొప్ప పధకానికి వారు దూరం అయ్యారు.   (06-07-2016)      


5 కామెంట్‌లు:

Chandrika చెప్పారు...

అమెరికా లో కొన్ని చోట్ల పెట్టినట్లు మన దేశం లో వైద్య విద్యార్థులకి కూడా ఒక ఏడాది పాటు పల్లెలలో వాలంటీర్ గా పని చేస్తే కానీ పట్టా ఇవ్వమనే ఒక నియమం లాంటిది పెట్టాలేమోనండి.. మీరు చెప్పింది నిజమే. కొంతమంది నాయకులు చేసే పనులు ఒక్కోసారి పేదవారికి చాలా ఉపయోగపడతాయి. మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే ఆ postive attitude తో చూడ లేకపోవడమే. ఏ విషయమైనా రాజకీయం చేస్తారు. ఎప్పుడూ ఒక వర్గం ఏమి చేసినా పొగడటం అవతల వర్గం మంచి చేసినా తిట్టడం. ఎవరికి వారే తమకి కీర్తి తెచ్చుకోవాలన్న ఆరాటం లో దేశం ముందుకి వెళ్లడం ఉండదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది.

నీహారిక చెప్పారు...

పల్లెటూరులో పనిచేయడానికి డాక్టర్‌లను పంపిస్తున్నారు. విజయవాడనుండి మా ఊరికి అమ్మాయిలు మారుతి డ్రైవ్ చేసుకుంటూ వస్తారు కానీ చిన్న చిన్న పనులు చేయడం కూడా చేతకాదు.తెలిసీ తెలియకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే పెద్ద ఘనకార్యంగా ఫీలయ్యే వాళ్ళు, డాక్టర్ అవ్వాలంటే ఎంత కష్టపడతారో పనిలో అది ఉండదు. డైనమిక్ గా ఉండరు,ఎంతసేపూ గవర్నమెంట్ హాస్పటల్ లో చేరిపోతే చాలనుకుంటారు.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

చంద్రిక గారూ, వైద్య విద్యార్ధుల గురించి మీరు చెప్పినది సబబయినదే. భారతదేశంలో ప్రయత్నించారు, కానీ మామూలేగా - ఏదన్నా చేద్దామని ప్రభుత్వం అనుకుంటే దానికి తూట్లు పొడవడానికి చూస్తుంటారు. MBBS (undergraduate medical education) పట్టా పొందడానికి ఓ సంవత్సరం పాటు కంపల్సరీ రూరల్ సర్వీస్ చెయ్యాలి అని పెట్టారు. దానికి వచ్చిన వ్యతిరేకత అంతా ఇంతా కాదు.

(.) ఆ నిబంధన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివేవారికి మాత్రమే పెట్టాలనీ, ప్రైవేట్ కాలేజ్‌ల్లో విద్యార్ధులకి ఉండకూడదనీ వాదన చేశారు.
(.) ప్రైవేట్ కాలేజ్‌లో గవర్న్‌మెంట్ కోటాలో సీట్లు తెచ్చుకున్నవారికే ఆ నిబంధన ఉండాలనీ, నాన్-గవర్న్‌మెంట్ / మానేజ్‌మెంట్ / NRI కోటాల్లో ప్రవేశం తెచ్చుకున్నవారికి కాదనీ మరో వాదన.
(.) రాష్ట్ర స్ధాయి ప్రవేశ పరీక్ష ద్వారా వచ్చినవారికే అన్వయించాలనీ, ఆల్ఇండియా ప్రవేశ పరీక్ష ద్వారా వచ్చినవారికి ఉండకూడదనీ ఇంకో వాదన.
(.) రూరల్ సర్వీస్ చెయ్యల్సివస్తే తాము PG సీట్ కోసం తయారవలేకపోతామని ఓ సాకు.
(.) మరికొంతమంది ఇంకొంచెం ముందుకెళ్లి రూరల్ సర్వీస్ చెయ్యాలంటే హౌస్ సర్జన్ కంప్లీట్ చేయ్యాలనే నిబంధన తీసెయ్యమని వాదించారు కూడా.

చిత్ర విచిత్రంగా ఉన్నాయి కదా ఈ వాదనలన్నీ! చివరికి ప్రభుత్వం మీద ఒత్తిడి ఎక్కువయిపోయి, సరే PG విద్యార్ధులకే రూరల్ సర్వీస్, MBBS (undergraduate) వారికి అవసరంలేదు అని ప్రభుత్వం కొత్త రూల్ పెట్టింది. ప్రస్తుతానికి అక్కడ ఉంది విషయం. అసలు సంగతి సిటీ వదిలి వెళ్ళడం ఇష్టంలేదు. మనుష్యుల ప్రాణాల గురించి ఆరోగ్యం గురించి తాము చదివిన చదువుని అడ్డం పెట్టుకుని సమాజానికి ప్రభుత్వానికి కూడా డిక్టేట్ చెయ్యగలమనే ధోరణి బాగా ఎక్కువయిపోయింది డాక్టర్లలో.

Chandrika చెప్పారు...

విన్నకోట వారు: ఏదైనా వాగ్వివాదాలు తప్పవేమో మనకి. గిరిజనులకే సేవ చేయాలి అనుకున్న కొందరి డాక్టర్ల గురించి టపా ఒకటి పెట్టాను ఆ మధ్య . మీకు ఆసక్తి ఉంటే దాని లంకె : https://sarachandrika.wordpress.com/2016/05/07/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B5%E0%B1%87%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6-%E0%B0%9A%E0%B1%86%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%9F-%E0%B0%B2%E0%B1%8B/


విన్నకోట నరసింహా రావు చెప్పారు...

చంద్రిక గారూ, ఇక్కడ మీరిచ్చిన లింక్ ద్వారా మీ బ్లాగుకి వెళ్ళి ఆ వ్యాసాన్ని చూశానండి. ధన్యవాదాలు. నా వ్యాఖ్య మీ బ్లాగులో వ్రాశాను.