31, జులై 2016, ఆదివారం

రేడియో భేరి - 9

విశ్వనాధ స్వరంతో ‘బద్దన్న సేనాని’

తెలుగు ప్రసారాలకు సంబంధించి – హైదరాబాదు, విజయవాడ కేంద్రాలు చాలా ఎక్కువ కృషి చేసాయి. అన్ని తరగతుల శ్రోతలను ఆకర్షించడానికి ఈ రెండు కేంద్రాలు ఎన్నో కార్యక్రమాలు రూపొందించాయి. సాహిత్య విభాగం తీసుకుంటే ప్రసిద్ధుల ప్రసంగాలు, గోష్టులు, సంచికా కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు. సమస్యా పూరణాలు ఇలా ఎన్నో ప్రసారమయ్యాయి. అవుతున్నాయి కూడా. భద్రాచలంలో జరిగే సీతారామ కళ్యాణం, శ్రీశైలంలో జరిగే శివరాత్రి ఉత్సవాలు, తిరుమల బ్రహ్మోత్సవాలు మొదలయిన సందర్భాలలో ప్రత్యక్ష వ్యాఖ్యానాలతో కూడిన కార్యక్రమాలు వినిపిస్తూ రేడియో కొత్తదారులు తొక్కింది.
కధలు, నవలలు మొదలైనవాటిని ప్రసారం చేయడం లోను ఆకాశవాణి తనదైన ప్రత్యేకతను నిలుపుకుంటూ వస్తోంది. ఏ కొందరో తప్ప ఆధునిక కదారచయితల కధలను ఆ రచయితల సొంత గొంతుతోనే వినిపించడంలో ఆకాశవాణి విజయవంతం అయింది. కాకపొతే కొన్ని కొన్ని సందర్భాలలో కొందరు ప్రముఖుల కధలను నిలయ కళాకారుల ద్వారా చదివించడం జరుగుతుంటుంది.
విశ్వనాధ సత్యనారాయణ తమ ‘బద్దన్న సేనాని’ నవలను విజయవాడ కేంద్రం నుంచి ఆయనే స్వయంగా వినిపించడం రేడియో చరిత్రలో ఒక అపూర్వ విషయం. 1979 తరువాత హైదరాబాదు కేంద్రం ‘నవలాస్రవంతి’ పేరిట నవలల ప్రసారం ప్రారంభించింది. తద్వారా ప్రసిద్ధికెక్కిన ఎన్నో తెలుగు నవలలు రేడియో ద్వారా శ్రోతలు వినగలిగారు. తక్కిన కేంద్రాలనుంచి కూడా కొన్ని నవలలు ప్రసారం అయ్యాయి.
1956 జనవరి 25 నాడు మొట్టమొదటి జాతీయ కవి సమ్మేళనం ప్రసారమయింది. ప్రతి ఏడాది జనవరి 25 నాడు ప్రసారం అయ్యే ఈ జాతీయ కవి సమ్మేళనంలో చోటుచేసుకునే తెలుగు కవితలను తక్కిన భారతీయ భాషల్లోకి అనువదించి ప్రసారం చేయడం అలాగే తక్కిన భాషల కవితలను తెలుగులోకి అనువదించి ప్రసారం చేయడం జరుగుతోంది. ప్రముఖ కవుల కవితల్ని వాళ్ల నోట పలికించి పదిలపరచడంలోను ఆకాశవాణి ముందంజ వేసింది. ఉదాహరణకు హైదరాబాదు కేంద్రం సి. నారాయణ రెడ్డి గానం చేసిన ‘విశ్వంభర’ను ఆవిధంగానే పదిలపరచింది.
అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ‘గళాల’ను పదిలపరిచే కృషిలో ఆకాశవాణి నిమగ్నమై వుంది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఎందరితోనో చేసిన సంభాషణలను ఆకాశవాణి భద్రపరచింది. ఇటీవల కొన్ని సంవత్సరాలుగా రేడియోకోసం ప్రముఖుల జీవితఘట్టాలను వారితో సంభాషణల రూపంలో నిక్షిప్తం చేస్తూ వస్తోంది. అటువంటి కొన్ని సంభాషణలు ప్రసారం చేసే ప్రయత్నం కూడా మొదలయింది.
శాస్త్రీయ సంగీత సంప్రదాయ పరిరక్షణ ఆకాశవాణి కర్తవ్యాలలో ఒకటి. అన్నమాచార్య కీర్తనలు, రామదాసు కీర్తనలు, క్షేత్రయ్య పదాలు, ఆధ్యాత్మ రామాయణ కృతులు, భక్తి తత్వాలు, భక్తి గీతాలు – ఆకాశవాణి ద్వారా బహుళ ప్రచారం పొందాయి. ప్రముఖ వాగ్గేయకారుల రచనలను పదిలపరిచే ఉద్దేశ్యంతో శ్రీ త్యాగరాజస్వామి వారి ఉత్సవ సంప్రదాయ కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు మొదలైన వాటిని బాలమురళీకృష్ణ వంటి ప్రముఖ విద్వాంసుల ద్వారా పాడించింది ఆకాశవాణి. అరుదైన రచనలను సంగీత శిక్షణ కార్యక్రమాల ద్వారా ఔత్సాహికులకు నేర్పించడం విజయవాడ రేడియో కేంద్రం పెట్టిన ఓ కొత్త వొరవడి. వోలేటి వెంకటేశ్వర్లు నేర్పిన తెలుగు కృతులను దక్షిణ భారత దేశంలోని ఎందరో నేర్చుకోవడానికి ఆకాశవాణి చేసిన ఈ ప్రయత్నం ఎంతగానో దోహదపడింది. (ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్.గోపాలకృష్ణ సౌజన్యంతో)

కామెంట్‌లు లేవు: