24, జూన్ 2016, శుక్రవారం

జై జవాన్!

కొన్ని వీరోచిత గాధలు  వింటుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. మన వీర సైనికుల సాహసాలను ఎత్తి చూపే ఒక సందర్భాన్ని  ప్రపంచ ప్రసిద్ధిగాంచిన  టైమ్ మేగజైన్ ప్రచురించింది.
నేపధ్యం 1962 నాటి భారత చైనా యుద్ధం.
హిమాలయాల్లో  ఎన్నో వందల  అడుగుల ఎత్తున రెజాంగ్ లా కనుమలో  ఎముకలు కొరికే చలిలో కుమాన్ బెటాలియన్ కాపుకాస్తోంది.  మొత్తం నూటపాతిక మంది కూడా లేని ఆ భారత సైనిక దళానికి జోధ్పూర్ కు చెందిన రాజ్ పుట్ వీరుడు మేజర్ షితాన్ సింగ్ కమాండర్ గా వున్నాడు. నిజానికి దుర్భరమైన వాతావరణ పరిస్తితుల్లో ఆ సైనికులకు ఎన్నో అవసరాలు తీర్చాల్సి వుంది. అయితే వారికి అవేవీ లేవు  ఒక్క మనోధైర్యం, ఆత్మ విశ్వాసం తప్ప - అని టైం మేగజైన్ రాసిందంటే  అది వారి పట్టుదలకు చక్కటి కితాబు.
ఆ దళానికి పై అధికారులనుంచి ఒకే ఒక్క ఆదేశం. 'మీరు ఏమైనా చేయండి. చుషూల్ పట్టణం మాత్రం చైనా సైనికుల పరం కాకుండా చూడండి.'
శత్రు సైన్యం సమాయత్తంగా వచ్చింది. ఇటు పక్క ఒక్క భారత సైనికుడు వుంటే అటుపక్క యాభై  మంది చైనా సైనికులు. సంఖ్యాపరంగా అంత తేడా వుంది. వారి ఆయుధాలు కూడా అత్యంత ఆధునికమైనవి. పైగా అన్నుదన్నుగా వారికి వెనుకనుంచి అందే సహాయం విషయంలో కూడా వాళ్లు ఎన్నో రెట్లు మెరుగు.
నవంబర్ నెల.  ఆదివారం. చైనా సైన్యం దాడికి దిగింది.
భారత సైన్యం వారిని ఎదురొడ్డి నిలచింది. ఒకరు పోతే మరొకరు అన్నట్టు చైనా సైనికులు అంతులేకుండా  వస్తూనే వున్నారు. వారిని  నిలవరించడం భారత సైన్యానికి తలకు మించిన భారంగా పరిణమించింది. భారత సైన్యంలో ఒక్కొక్కడు యాభైమంది చైనా సైనికులకు సమాధానం చెప్పాల్సిన పరిస్తితి. శత్రువులు మిడతల దండు మాదిరిగా వస్తూనే వున్నారు. కమాండర్ మేజర్ షితాన్ తన సైనికులను ఉత్సాహపరుస్తూ ఒకచోటినుంచి మరో చోటికి వేగంగా కదులుతూ  తన సైనికులకు తానే ఒక దన్నుగా నిలబడ్డాడు. కానీ ఇంతలో శత్రు సైన్యం అతడిపై నేరుగా కాల్పులు జరిపింది. ఒక తూటా అతడి భుజంలోకి దూసుకుపోయింది. మరోటి నేరుగా పొట్టలో దిగబడింది. అయినా ఆ వీరుడు వెన్ను చూపలేదు. శత్రువులపై కాల్పులు జరుపుతూనే పోయాడు. గాయాలతో రక్త స్రావం అధికం అయింది. మనిషి నీరసించిపోయాడు. ప్రాణాలతో మిగిలిన కొందరు భారత జవాన్లు అతడిని చేతులమీద వేసుకుని యుద్ధరంగం నుంచి దూరంగా తీసుకుపోయి కాపాడాలని ప్రయత్నించారు. కానీ షితాన్ సింగ్ పడనివ్వలేదు. ఒక పెద్ద కొండ రాతివెనుకకు వెళ్ళగలిగాడు. అయితే అప్పటికే చాలా రక్తం పోయింది. యుద్ధరంగంలోనే వీరమరణం పొందాడు. భారత ప్రభుత్వం ఆ వీరుడిని పరమ వీరచక్ర పురస్కారంతో  గౌరవించింది.


అతడి దళంలోని అనేకమంది వీరోచితంగా పోరాడి అసువులు బాసారు. అయితే ప్రాణాలు పోయేలోగా ఒక్కొక భారత సైనికుడు  కనీసం అయిదుమంది శత్రువులను మట్టుబెట్టాడు.
నాటియుద్ధం యెంత భయంకరంగా సాగిందన్నది తరువాత ఆ ప్రాంతాన్ని సందర్శించిన తరువాత కాని అధికారులకు బోధపడలేదు. ఆ దృశ్యాలు  చాలా దయనీయంగా వున్నాయి. కందకాల్లో కానవచ్చిన మృత సైనికుల చేతుల్లో తుపాకులు గురిపెట్టి వున్నాయి. ప్రాణం పోతున్నా వారు ఆయుధాన్ని ఒదలకుండా శత్రువులతో పోరాడారని అధికారులకు అవగతమైంది. కొందరి దేహాలు శత్రుసైనికుల దాడికి ఖండఖండాలుగా మారిపోయినా, వారిచేతుల్లో  తుపాకులు అలాగేవున్నాయి.
భారత సైనిక దళంలోని ప్రతి ఒక్కడూ వీరమరణాన్ని స్వయంగా ఆహ్వానించాడు. శత్రువుల దాడికి ఛిద్రమైన వారి శరీరాలు కందకాల్లో కానవచ్చాయి. తూటాలతో వారి శరీరాలు చిల్లులు పడిపోయి కనిపించాయి. ఒక సైనికుడి చేతిలో విసరడానికి తయారుగా వుంచుకున్న బాంబు కనిపించింది. కానీ అతడిలో ప్రాణం మాత్రం లేదు.  చైనా సైనికుడి తుపాకీ తూటాకు బలైన భారత మెడికల్  ఆర్డర్లీ  చేతిలో సిరంజి, బ్యాండేజీ కనిపించాయి. ఒక డజను మందికి పైగా ఆహిర్ దళ సైనికుల శవాలు వారి స్థావరాలకు దూరంగా కానవచ్చాయి. అంటే శత్రు సైనికులను తరుముతూ వారు అంత దూరం వెళ్ళారన్నమాట.
ఈ యుద్ధంలో చనిపోయిన ఒక ఆహిర్  హర్యానాలోని కోస్లి గ్రామం నుంచి వచ్చాడు. ఈ గ్రామానికి  ఒక ప్రత్యేకత వుంది. ఆహిర్ల ధైర్య సాహసాలకు ఈ గ్రామం ప్రత్యక్ష సాక్షి. రెండో ప్రపంచ యుద్ధకాలం నుంచి ఈ వూరిలోని ప్రతికుటుంబం ఒకరిని సైనికుడిగా యుద్ధ రంగానికి  పంపింది. ఈ చిన్న గ్రామంలో భారత సైన్యానికి చెందిన అనేకమంది అధికార్లు, జవాన్లు వున్నారంటే దీని ప్రత్యేకత  అర్ధం అవుతుంది.            


5 కామెంట్‌లు:

CV చెప్పారు...

ఇటువంటి మంచి విషయాలు ఇంకా తెలియపర్చండి. ఇటువంటివి చదివిన తరువాతైనా మన నాయకులకు నిస్వార్ధం గా సేవ చేసే కనీసపు ఆలోచనైనా వస్తుంది. అసలు మన పౌరులం మనము దేశం కోసం నిస్వార్ధం గా సేవ చెయ్యటానికి ముందుకు రావాలి . ముందు ప్రజలు మారి నీతి గా బ్రతకడం అలవాటు చేసుకొంటే, దానికి అనుగుణంగానే నీతి వంతమైన నాయకులు వస్తారు.

అజ్ఞాత చెప్పారు...

The soldiers did their duty. No need to heap winsome praise.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత: So, you did your duty. Nice.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

నాయకులా, బ్లాగులు చదవడమా ! ! ఒకవేళ చదివినా వాళ్ళ అజండా వాళ్ళ అజండాయే.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత: ఎప్పుడో రాసింది మళ్ళీ మీ కోసం:

అదేవిటో దురదృష్టం. కోడళ్ళకు సరే. సినిమావాళ్ళకు కూడా అత్త అంటే పడదు. అత్త అంటే సూర్యాకాంతం లాంటి గడుసు మనిషని అనుకునేలా సినిమాలు తీసారు. తీస్తున్నారు. అత్తలందరికీ అసలు పేరు ఒకటి వుంటుంది కాని, గయ్యాళితనానికి మారుపేరనే పాడుపేరొకటి వారి సొంతం. సొంతానికి సాధించింది ఏవీ లేకపోయినా పొద్దస్తమానం కోడళ్లను సాధిస్తారనే ట్యాగ్ లైన్ మరోటి. కోడలు యెంత గుణవంతురాలయినా, నడుం దించకుండా అడవా చాకిరీ యెంత చేస్తున్నా, 'అదేం రోగమో మా కోడలు పిల్లకు నడుం ఒంగి చావదు, చచ్చినట్టు ప్రతిపనీ నేనొక్కత్తినే చేసుకు చావాలి' అనే టీవీ సీరియళ్ల అత్తళ్ళకు కొదవ వుండదు. ఇంతకీ ఈ అత్తల పురాణం ఎందుకంటే? -
సాధించే గుణం, వంకలు పెట్టే గుణం, 'అన్ని పనులు నేనే చేస్తున్నాను, వేరేవారికి పనులు చేతకాదు' అనే అత్తల సహజ స్వభావం సమాజంలో అందరిలోను ఎంతో కొంత వుందని చెప్పడానికే.
ఏదయినా ఆఫీసరును కదిపి చూడండి. అక్షరం పొల్లుపోకుండా ఇదే సోది చెబుతాడు. 'తను తప్ప పనిచేసేవారు ఎవ్వరూ లేరనీ, అందరి పనులు తానే నెత్తికెత్తుకుని చేస్తుండబట్టే ఆఫీసు ఈ మాత్రం నడుస్తోంద'నీ అంటాడు. ఆయన కింద పనిచేసేవాడిని అడిగితే ఆయనా తన కింద వాళ్లని గురించి ఇదేవిధమైన అమూల్యాభిప్రాయం వ్యక్తం చేస్తాడు. అంటే ఏమిటన్న మాట, అత్తలకీ వీళ్ళకీ ఏమీ తేడా లేదన్న మాట.
'ఎవ్వరూ పనిచేయడం లేదు అందుకే దేశం ఇలా తగలడిపోతోంద'ని అనుక్షణం మధన పడిపోయేవాళ్లు అడుగడుక్కీ కనిపిస్తుంటారు. నేనూ ఇందుకు మినహాయింపు కాదు. వంకలు పెట్టే వంకర గుణం నాకూ వుంది.
ఈ మధ్య రైల్లో పోతుంటే బోధి వృక్షం కింద బుద్ధుడికి జ్ఞాన బోధ అయినట్టు జీవిత సత్యం బోధపడింది. వెచ్చటి వేసవి కాలంలో చల్లటి ఏసీ కోచ్ లో అంతా ముసుగుతన్ని పడుకున్న సమయంలో, ప్రపంచం అంతా నిద్రలో జోగుతున్న సమయంలో పట్టాలపై రైలు అలుపులేకుండా పరుగులుతీస్తోంది. ఏదయినా స్టేషన్ వచ్చినప్పుడల్లా రైలు దడదడా పట్టాలు మారుతున్న ధ్వని వినబడుతూ వుంది. ఆ అర్ధరాత్రి వేళ పట్టాలు మార్చే మనిషి కాస్త ఏమరు పాటుగా వున్నా, కాసింత రెప్ప వాల్చినా రెప్పపాటు కాలంలో ఆ రైల్లోని ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం తధ్యం. అంటే ఏమిటి, రైల్లో ఇంతమంది జనం హాయిగా కంటినిండా నిద్రపోగలుతున్నారు అంటే ఇంతమందికోసం ఎవరో ఒకరు ఆ నిశిరాత్రివేళ నిద్ర లేకుండా పనిచేస్తున్నారనే అర్ధం. 'అది అతని డ్యూటీ చేయక ఏం చేస్తాడు' అంటే అతడు పనిచేస్తున్నాడు అనేకదా! కాబట్టి 'మనం ఒక్కళ్ళమే పనిచేస్తున్నాం, మిగిలిన వాళ్లు అందరూ పని దొంగలు' అని రొమ్ము విరుచుకోవడంలో అర్ధం లేదు.
అలాగే మరో ఉదాహరణ. చలి కాలం. నిద్రలేచి కూడా లేవడానికి బద్దకించి ముసుగు తన్నిపడుకున్నవేళ, మన ఇంటి ముందు ఎవరో పాల ప్యాకెట్లు వుంచి వెడతారు. 'అవి అంత పొద్దున్నే యెలా వచ్చాయి' అని ఒక్క క్షణం కూడా ఆలోచించం. 'ఇంటింటికీ ఇలా పొద్దున్నే వేస్తున్నాడు అంటే అతడు యెంత పొద్దున్న లేచి వుంటాడు అనే ప్రశ్న నేనయితే ఎప్పుడూ వేసుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే నాలోనూ కనిపించని 'అత్త' అవుంది. అదే నాచేత 'అది అతడి డ్యూటీ' అనే మాట చెప్పిస్తుంది. అనేది నా థియరీ. అంటే మరి అతడు తన డ్యూటీ చేస్తున్నప్పుడు 'ఎవ్వరూ పనిచేయడం లేదు' అని నేనిచ్చే స్టేట్ మెంట్లకి అర్ధం ఏమిటి?
వేడి వేడి కాఫీ తాగుతూ పత్రికల్లో వచ్చే తాజా వార్తలు చదివే భోగం మనకు పట్టింది అంటే ఎవరో పిల్లాడు తెల్లవారుఝామున్నే నిద్ర లేచి, ఏజెంట్లు ఇచ్చిన పత్రికలు సైకిల్ మీద పెట్టుకుని ఇంటింటికీ తిరిగి వేయబట్టే కదా! అలాగే తెల్లారకముందే అన్నన్ని వార్తలు మోసుకుని పత్రికలు మన ఇళ్లకు వస్తున్నాయి అంటే పత్రికాఫీసుల్లో ఎంతమందో మనకోసం నిద్ర కాచి పనిచేయబట్టే కదా! ఇలాగే, మన చుట్టూ వున్న పని మనుషులు, వీధులు వూడ్చేవాళ్ళు, ఒకళ్లా ఇద్దరా అనేకమంది ఒళ్ళు దాచుకోకుండా, పనికి బద్ధకించకుండా ఎవరి పనులు వాళ్లు చేస్తూ వుండడం వల్లే, హాయిగా కాలు మీద కాలేసుకుని కూర్చుని, 'ఎవ్వరూ పనిచేసేవాళ్ళే లేరు, నేనొక్కడ్ని తప్ప. అందుకే దేశం ఇలా తగలడిపోతోంద'ని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాము.
ఒక్కటి నిజం. ఎవ్వరూ పనిచేయకుండా మనకు రోజు గడవడం లేదు. ఒక్కళ్ళూ పనిచేయడం లేదని వంకలు పెట్టకుండా కూడా రోజు గడవడం లేదు. అందుకే అన్నది, అందరిలోనూ ఎంతో కొంత 'అత్తల గుణం' వుందని.