6, జూన్ 2016, సోమవారం

అప్పుడూ ఇప్పుడూ పులే!


డాక్టర్ చెన్నారెడ్డి.
ఉమ్మడి రాష్ట్రానికి  రెండు పర్యాయాలు తిరుగులేని ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తీ. ‘నా మాటే జీవో’ అని  బాహాటంగా  ప్రకటించిన ఉద్దండ రాజకీయ వేత్త. తరువాత కొన్నాళ్ళు  గవర్నర్ గిరీ చేసి ఆ కొలువులు  తన తత్వానికి సరిపడకపోవడంతో రాజీనామాచేసి హైదరాబాదు వచ్చి తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్న రోజులవి.
 ఆ క్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలిసి చర్చించే పనిలో తలమునకలుగా వుంటున్న కాలంలో ఒక సీనియర్  జర్నలిష్టు  ఆయన్ని తార్నాకాలోని నివాసంలో కలిసారు. కాఫీలు గట్రా  అయిన తరువాత  ఆ జర్నలిష్టుని మర్యాదపూర్వకంగా అడిగారు రెడ్డిగారు, “What brought you here?”( ‘ఏం పని మీద వచ్చావు ‘ అని అర్ధం వచ్చేలా!)
దాన్ని మరోలా అర్ధం చేసుకున్న ఆ జర్నలిష్టు చెలరేగిపోయాడు. బల్ల మీద చేతితో గట్టిగా చరుస్తూ, ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు.
‘నేను మీదగ్గరకు పని మీద రాలేదు. మీరు పిలిపిస్తే వచ్చాను. నాతొ మీకేమైనా పని వుంటే చెప్పండి.’
దాంతో చెన్నారెడ్డి గారు కాస్త తగ్గి వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేసారు. ఎంతయినా  రాజకీయవేత్త కదా!
ఆ చెన్నారెడ్డి గారు ఇప్పుడు లేరు.
ఆ జర్నలిష్టు పేరు ఆదిరాజు వెంకటేశ్వర రావు.
హైదరాబాదు దత్తాత్రేయ నగర్  లో వుంటున్న డెబ్బయ్ అయిదేళ్ళు పైబడ్డ  ఆ వృద్ధ సింహాన్ని, నిన్న (05-06-20116) కలిసాము. ఢిల్లీ నుంచి వచ్చిన దక్షిణాసియా  విదేశీ జర్నలిష్టుల  క్లబ్  అధ్యక్షుడు ఎస్.వెంకటనారాయణకు  ఆదిరాజుతో  ఢిల్లీలో పరిచయం. కరీంనగర్  జిల్లాలోని ఆయన స్వగామం వెళ్లి వచ్చిన వెంకటనారాయణ ఆదిరాజును కలవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయడంతో, జ్వాలా నరసింహారావు పూనికతో ఆదిరాజును కలవడం జరిగింది. సాక్షి ఎడిటోరియల్  డైరెక్టర్  కే. రామచంద్ర మూర్తి, 108, 104 పధకాల రూపశిల్పి డాక్టర్ అయితరాజు  పాండు రంగారావు, తెలంగాణా టుడే ఇంగ్లీష్ దినపత్రిక ఎడిటర్ కే. శ్రీనివాసరెడ్డి (పూర్వాశ్రమంలో హిందూ రెసిడెంట్ ఎడిటర్), తెలంగాణా ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ సోదరుడు డాక్టర్ సమ్మన్న మా బృందంలో వున్నారు.


వార్ధక్య ఛాయలు మినహాయిస్తే ఆదిరాజు మాకు డెబ్బయిల్లో తెలిసిన ఆదిరాజు లాగానే వున్నారు. భార్య సీతాదేవి పేరుకు తగ్గ ఇల్లాలు.  తలితండ్రులను పిల్లలు కంటికి రెప్పలా  చూసుకుంటున్నారు. ఇలాంటి పిల్లలు వుండడం అనేది జర్నలిష్టులకు వరం. జీవితమంతా ఎవరికీ తలవంచకుండా బతికిన ఆదిరాజు ఇప్పటికీ అలాగే వుండగలుగుతున్నారంటే ఇది ఆ వరం పుణ్యమే.

చరిత్రలో మరుగున పడిపోయిన ఇలాంటి  కొన్ని సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి, అంతే కాకుండా   ఆదిరాజుతో కలయికకు ప్రోద్బలం చేసిన జ్వాలాకు ధన్యవాదాలు.         

కామెంట్‌లు లేవు: