10, జూన్ 2016, శుక్రవారం

చర్చించి వగచిన ఏమిఫలము?

ఈ మధ్య మా పక్క వాటా లోకి తెలుగు వచ్చీ రాని పొరుగు రాష్ట్ర కుటుంబం ఒకటి అద్దెకు దిగింది. వచ్చిన దగ్గరనుంచి వాళ్ళను ఒక సందేహం పీడిస్తున్నట్టుగా ఇటీవలే అర్ధం అయింది. మా ఇంట్లో వుండేది నేనూ మా ఆవిడా ఇద్దరమే. పిల్లలిద్దరూ వేరే వూళ్లలో కాపురాలు వుంటున్నారు. అటువంటప్పుడు ‘ఉదయం నుంచి రాత్రిదాకా అరుపులు, కేకలు వినవస్తాయేమిట’ని పొరుగింటావిడ, మా ఇంటావిడని అంటే మా ఆవిడని ఆరా తీసింది. అదంతా టీవీ ఛానళ్ళలో వస్తుండే చర్చలలోని రచ్చని తెలుసుకుని ఆశ్చర్య పోవడం పొరుగావిడ వంతయింది.
ఆకాశవాణి, దూరదర్శన్ లలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ అనే ఒక ఉద్యోగి వుంటారు. మామూలుగా డ్యూటీ ఆఫీసర్ అని పిలిచే ఆ ఉద్యోగి డ్యూటీ ఏమిటంటే – రేడియోలో ప్రసారం అయ్యే లేదా దూరదర్శన్ లో టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రాములను ఆమూలాగ్రం శ్రద్ధగా విని, చూసి - తప్పొప్పులను పట్టుకుని, మంచి చెడులను గమనించి ఏరోజుకారోజు పై అధికారులకు రిపోర్ట్ చేయడం. రేడియో వినడానికి ప్రత్యేకంగా ఉద్యోగి అవసరమేమిటని కొందరు అడిగేవారు కూడా. బహుశా అలాటి ఏర్పాటు – ఈనాటి ప్రైవేటు ఛానళ్లలో లేకపోబట్టే ఇలాటి ‘చర్చలు’ రచ్చరచ్చగా తయారవుతున్నాయేమో!
ఇటీవల ఒక ఛానల్లో చర్చలో పాల్గొంటున్న ఇద్దరి మధ్య ఆవేశకావేశాలు పెచ్చరిల్లాయి. మాటల తూటాలు పేలాయి. అసభ్య పదజాలాలు జాలువారాయి. ఏతావాతా ఆ మహత్తర దృశ్యాలను పన్నుకట్టకుండా చూసి వినోదించగల అవకాశం వీక్షకులకు లభించింది. కాకపోతే, భాష కారణంగా విషయం అర్ధం కాని మా పొరుగింటావిడ లాంటి వాళ్ళు – పక్కింట్లో యేవో గొడవలు జరుగుతున్నాయని అపోహపడే దుస్తితి దాపురించడం దీనికి పరాకాష్ట.
ఈ మధ్య ఓ శుభకార్యం లో తారసపడిన ఓ పెద్దమనిషి అడిగాడు ‘ఎందుకండీ ఇలా ఛానళ్ళ వాళ్ళు ‘ఉప్పూ నిప్పూ లాటి మనుషులను చర్చలకు పిలుస్తారు?’ అని. సుతీ మతీ కుదరని ఇలాటివాళ్ళ వల్ల చర్చ పక్కదారి పడుతుందన్నది ఆ పెద్దమనిషి ఉద్దేశ్యం.
అసలే చిటపటలు. వీటికి ఆజ్యం పోయడానికి తయారుగా ఫోన్ ఇన్ లో మరికొందరు సిద్ధంగా వుంటారు. వీరందరినీ సర్డుబాటు చేయడానికీ, సముదాయించడానికీ యాంఖర్ సతమతమవుతుంటాడు. వాద ప్రతివాదాలు ముదిరి, ఖండన ముండనలుగా మారి, దుమ్మెత్తి పోసుకోవడాల్లోకి దిగి, వీధి కొళాయిల వద్ద తంతుని డ్రాయింగ్ రూముల్లో చూసే భాగ్యం వీక్షకులకు దొరుకుతోందని మరి కొందరి ఉవాచ.
‘ఇది ఇంతేనా? అంటే - ఇప్పటికింతే!’ అనుకోవాలి.
మెరుగయిన సమాజ నిర్మాణాలు స్క్రోలింగ్ లకే పరిమితమై పోయి, రేటింగులే ప్రధానమనుకున్నప్పుడు - ఇది ఇంతే!
ఎన్ని ఛానల్స్ వచ్చినా, వాటి నిర్వాహకులు యెంత లబ్ధ ప్రతిష్టులయినా – ఇది ఇంతే!
ఈ పోటా పోటీ ‘పోటీ యుగం’లో పోటీ తప్పనిసరి. పాట్లూ తప్పనిసరి. బోధి వృక్షాలు కూడా జ్ఞానోదయం కలిగించలేని విషమ పరిస్తితి. తప్పని సరి అనుకున్నప్పుడు ఆనందించమన్న సామెత మాదిరిగా చూసి తరించడమే వీక్షకులకు మిగిలింది.
‘చర్చించి వగచిన ఏమి ఫలము?’
(Still I feel proud to be called as a media person)


2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఆ చర్చల్లో పాల్గొనేవారు రాజకీయాలకి సంబంధించిన వారైతే వారి ప్రవర్తన పార్టీబాసుల్ని, కార్యకర్తల్ని మెప్పించే ప్రయత్నమా అనే అనుమానం కలుగుతుంది. టీవీ మీద కనబడడం మొదలయినప్పట్నుండీ ఇటువంటి తాపత్రయం ఎక్కువయిపోయింది. న్యూస్‌పేపర్ కన్నా పవర్‌ఫుల్ కదా మరి.
ఇక ఏంకర్లేమీ సతమతమవుతున్నట్లు అనిపించదు టీవీ చూసేవారికి. అంతేగాక ఇంకాస్త ఎగదోస్తున్నాడా అనిపిస్తుంది కొంతమంది ఏంకర్లని చూస్తుంటే. మీరన్నట్లు రేటింగుల మీదే తమ దృష్టంతా పెట్టుకున్న ఛానెళ్ళ వల్ల పరిస్ధితి ఇలాగే కొనసాగుతుంది.
ఏమనుకోకండి కానీ, మీ పొరుగింటావిడ అనుమానం ఓ పాత జోక్ (ముళ్ళపూడి వారిదే అనుకుంటాను) గుర్తుకుతెచ్చింది. భార్య సంగీతసాధన మొదలు పెట్టగానే ఇంటిగేట్ దగ్గరకి వెళ్ళిపోయి నిలబడుతున్న భర్తని ఎందుకలాగ అని భార్య అడిగితే నేను నిన్ను కొడుతున్నానేమో అని ఇరుగూపొరుగూ అనుమానపడకుండా అని జవాబిచ్చాడట. :) 😀 😄

అజ్ఞాత చెప్పారు...

mad dogs barking together.