16, ఫిబ్రవరి 2014, ఆదివారం

ఎవరు కాపాడాలి ఈ దేశాన్ని?

అసలేంజరుగుతోంది? -భండారు శ్రీనివాసరావు  
 అసలేంజరుగుతోంది?’ -  ఒక కేసుకు సంబంధించి, దేశంలో పరిస్తితులపై అత్యున్నత న్యాయస్తానం సుప్రీం కోర్టు కొంతకాలం క్రితం చేసిన వ్యాఖ్య ఇది.
గత కొన్ని మాసాల నుంచి  పాత పేపర్లు తిరగేసినా, టీవీ చర్చలు పునశ్చరణ చేసుకున్నా సామాన్య జనానికి సయితం మనసులో మెదిలే ప్రశ్న ఇదే.
ఎంత చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుమార్లు సరయిన సమయం చూపిస్తుంది. అలాగే ఎంత చెడిపోయిన రాజకీయపార్టీకయినా ఏవోకొన్ని సిద్ధాంత మూలాలుంటాయి. కొన్ని స్థిరమైన భావజాలాలుంటాయి. కానీ ఈనాడు  దాదాపు  అన్ని రాజకీయపార్టీలు తమ  సిద్ధాంతాలకు చెల్లు చీటీ రాసినట్టే కానవస్తోంది.
 అలాగే అన్ని రాజకీయ పార్టీలకు, పేరు ఏదయినా అధిష్టానం అంటూ ఒకటుంటుంది. అంతర్గత ప్రజాస్వామ్యం మా పార్టీలో ఎక్కువఅని గొప్పలు చెప్పుకునే పార్టీలలో కూడా ఎవరూ నోరెత్తి అధిష్టానాన్ని బాహాటంగా ఎగర్తించే సాహసం చెయ్యరు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి? చోటామోటా నాయకులు సయితం తమ పార్టీ అధినాయకులను విలేఖరుల ముందే  పూచికపుల్లలుగా తీసివేస్తున్నారు. ఔరా! వీరికెంత ధైర్యం!అని నలుగురూ అనుకునేలా నలుగురిముందే తమ నాయకులను  చెరిగి పారేస్తున్నారు.
నాయకురాలి జాతీయతను ప్రశ్నించినా, నాయకుడి రెండు కళ్ళ విధానాన్ని విమర్శించినా  ఇదేరకమయిన తెగింపు. ఏం చేస్తారులే అనే ధైర్యం.
ఏకంగా పార్లమెంటును, శాసన సభను వేదికగా చేసుకుని తిరుగుబాటు బావుటాను ఎగురవేస్తూ, సొంత పార్టీనే నగుబాటు చేసినా ఏం కాదన్న ధీమా.
అసెంబ్లీ. పార్లమెంటు  సమావేశాల్లోనే  ధిక్కార స్వరాన్ని బాహాటంగా వినిపించినా పోయేదేమీలేదన్న మొండితనం.
చట్టసభల సాక్షిగానే చట్ట ఉల్లంఘనకు పాల్పడే మంకుతనం.
రాష్ట్రం రెండు ముక్కలవుతుందా మూడు చెక్కలవుతుందా తేలే ఘడియ  తేలకముందే పార్టీలన్నీ రెండుముక్కలుగా పైనుంచి కిందవరకూ చీలిపోయాయి. ప్రాంతాల విషయం వచ్చేసరికి ఎవరికీ పార్టీల సంగతి పట్టడం లేదు. విధానాల సంగతి గుర్తు రావడం లేదు. పార్టీలు వేరయినా మాట్లాడేది ఒక్కటిగానే వుంటోంది. ఎదుటి వారిని చీల్చి చెండాడడానికి నాలుకలన్నీ ఒక్కటవుతున్నాయి. విద్వేషాగ్నులు రగల్చడానికి, నిందారోపణలు చేయడానికి సొంత పార్టీ వారు, పరాయి పక్షం వారు అన్న తేడా లేకుండా ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్తితిని గమనించేవారికి ఎవరు యే పార్టీ వారో చప్పున ఒక పట్టాన చెప్పడం కష్టమవుతోంది. పైపెచ్చు వీరిలో అనేకమంది ఏదో ఒక పార్టీని నిజాయితీగా  అంటిపెట్టుకుని నిష్కళంక రాజకీయాలు చేస్తున్నవారు కాకపోవడం వల్లకూడా అయోమయం పెచ్చుపెరుగుతోంది. మొన్న మొన్నటి వరకూ వేరే పార్టీలో వుండి ఆ గూటి పలుకులు పలికి  ఇప్పుడు మళ్ళీ అదే నోటితో వేరే పలుకులు వల్లె వేయడం చూసి విస్తుబోవడం వీక్షకుల వంతు అవుతోంది. కళ్ళకు గంతలు కట్టి -  వీరీ వీరీ గుమ్మడి పండూ వీరీ  పేరేమీఅని అడిగినట్టు అడిగితే  'ఎవరు ఎవరో' చెప్పలేని దుస్తితి.          
గతంలో పార్టీ విధానాలను మీడియాకు వివరించడానికి ప్రతి పార్టీకి అధికార ప్రతినిధులు వుండేవారు.  ఇప్పటికీ లేకపోలేదు. కానీ పార్టీ పేరుపెట్టుకుని  ప్రతిఒక్కరూ మీడియాతో మాట్లాడేస్తున్నారు.  దానికి పార్టీ అనుమతి వుందా లేదా అన్నది వారికి  అప్రస్తుతం. వారు చెప్పేది పార్టీ విధానమా కాదా అన్నది మీడియాకు అప్రస్తుతం. ఇలా -  ఎప్పటికెయ్యది ప్రస్తుతమన్నట్టుగా అప్పటికామాటలాడేవారితోనే మరింత గందరగోళం ఏర్పడుతోంది.
ఒక పార్టీ వారు చెప్పిన దానిని మరో పార్టీ వారు ఖండించే పద్దతి పోయి ఎవరి పార్టీవారిని వారే దుయ్యపట్టే కొత్త సంస్కృతి తాజాగా రూపుదిద్దుకుని వున్న  అయోమయాన్ని మరింత పెంచింది. అలాగే ఒక పార్టీని మరో పార్టీ సమర్ధించే విధానం కూడా పరిస్తితిని మరింతగా గందరగోళపరుస్తోంది. అవసరాన్నిబట్టి అవలంబిస్తున్న ఈ రెండు నాల్కల ధోరణి రాజకీయపార్టీల దివాళాకోరుతనాన్ని ఎత్తి  చూపుతోంది. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలదీ ఇదే వరస కావడం మరో విషాదం.
వీటన్నిటికీ తోడు, క్రికెట్ పరిభాష లోని  మ్యాచ్ ఫిక్సింగ్పదం  రాజకీయాల్లోకి దూసుకువచ్చింది. వీరు వారితో ఫిక్సయ్యారని ఒకరంటే, వారు వీరితో కుమ్మక్కయ్యారని మరొకరంటున్నారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో యక్షుడు అడిగి వుంటే ధర్మరాజు కూడా జవాబు చెప్పలేని స్తితి.
ఇంతటి  అయోమయం, ఇంతటి కంగాళీ వ్యవహారం, ఇంతటి దగాకోరు రాజకీయం గత నాలుగు దశాబ్దాల జర్నలిస్టు జీవితంలో ఏనాడు కనీ వినీ ఎరుగని విషయాలు.
ఎవరు కాపాడాలి ఈ దేశాన్ని?
(16-02-2014)

8 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

వోటు అనే ఆయుధాన్ని సరిగా ఉపయోగించి ప్రజలే కాపాడాలి.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ bonagiri - అది అయిదేళ్లకోమాటు. అప్పటిదాకా యెలా?

శ్యామలీయం చెప్పారు...

Not sure if this so called independent India (which always, oneway or other depended on foreign hep, initiative or leadership shamefully) is in a repairable state. I may have sounded pecimistic to you but the sore fact is this great country failed to develop stable and selfless leadership. Instead, we evolved into a nation of patient voters who cheerfully push none but rascels up the politial ladders to run a great immoral circus in the name of democracy!

అజ్ఞాత చెప్పారు...

కాంగ్రెస్ వారి మహా నాటకం లో ఒక అంకం ముగిసి మరో అంకం రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ప్రజలు ప్రేక్షకులే ఎప్పటికీ అని పార్టీ లు నమ్ముతున్నాయి. ప్రజలనెవరో రక్షించరు, వారే రక్షించుకోవాలి వారిని వారు. వ్యాఖ్య పెద్దదయి టపా అయ్యేలా ఉంది ...:)

Jai Gottimukkala చెప్పారు...

నిండు సభలో విషవాయువులు ప్రయోగించి దేశం పరువు గంగలో ముంచిన ఘనుడి గురించి మీరేమీ అన్నట్టు లేదే?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Jai Gottimukkala - ".....అసెంబ్లీ. పార్లమెంటు సమావేశాల్లోనే ధిక్కార స్వరాన్ని బాహాటంగా వినిపించినా పోయేదేమీలేదన్న మొండితనం.
చట్టసభల సాక్షిగానే చట్ట ఉల్లంఘనకు పాల్పడే మంకుతనం......" - ఇలా అన్యాపదేశంగానే తప్ప ఘనులను గురించి రాసేంత ఘనుడిని కాదు. సిద్దాంతాలు, సూత్రాలే తప్ప వ్యక్తులను తప్పుబట్టే జర్నలిజం నేను చదువుకోలేదు. నా రాతల్లో ఎప్పుడు వ్యక్తుల పేర్లు సకృత్తుగా తప్ప కనబడవు.- భండారు శ్రీనివాసరావు

Raj చెప్పారు...

Meelanti so-called medhavulu kuda karanam kada. Evadi sodi vadidi.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Raj- లెస్స పలికితిరి