26, అక్టోబర్ 2013, శనివారం

అంజయ్యగారితో నా అనుభవాలు - 2ఎనభయ్యవ దశకంలో కౌలాలంపూర్ లో ప్రపంచ తెలుగు  మహాసభలు జరిగాయి. ముఖ్యమంత్రిని ఆ సభల ప్రారంభోత్సవానికి నిర్వాహకులు ఆహ్వానించారు. కారణాలు ఏమైతేనేం కాంగ్రెస్ అధిస్థానం అంజయ్య గారిపై కినుకతో వున్నరోజులు.  ఆయన్ని ఆ సభల ప్రారంభోత్సవానికి నిర్వాహకులు ఆహ్వానించారు.  ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తరవాత అంజయ్య గారు హోటల్ రూముకి తిరిగొచ్చేసారు. వెంట షరా మామూలుగా నేను. కాస్త నలతగా కనిపించారు. అంత పెద్ద గదిలో ఆయనా నేను ఇద్దరమే. సాయంత్రం అవుతోంది. ఆయన దీర్ఘంగా ఆలోచిస్తూ కిటికీలోనుంచి బయటకు చూస్తున్నారు. విశాలమయిన రోడ్డు. వచ్చే కార్లు. పోయే కార్లు. పక్కనే ఏదో ఫ్యాక్టరీ లాగావుంది.

ఆయన వున్నట్టుండి చూసావా!అన్నారు. నాకేమీ అర్ధం కాలేదు.

పొద్దున్న బయలుదేరేటప్పుడు చూసాను. అందులో (ఆ ఫ్యాక్టరీ లో) పనిచేసేవాళ్లందరూ గంట కొట్టినట్టు టైము తప్పకుండా వచ్చారు. అయిదు నిమిషాల్లో లోపలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్లీ అంతే. షిఫ్ట్ పూర్తికాగానే ఠంచనుగా ఇళ్లకు పోతున్నారు. పనిచేసేవాళ్లకు వాళ్లకు కావాల్సింది ఇవ్వాలి. కావాల్సిన విధంగా పని చేయించుకోవాలి. ఇలా మన దగ్గర కూడా చేస్తే కావాల్సింది ఏముంటుంది!అన్నారాయన యధాలాపంగా.

అంటే ఇప్పటిదాకా ఆయన ఆలోచిస్తోంది ఇదన్నమాట.


(అంజయ్యగారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న దృశ్యం. ఆయన వెనుక గడ్డం మీద చేయి ఆనించుకుని నేను) కౌలాలంపూర్ తెలుగు మహాసభల ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదనీ, ఇందిరాగాంధీ ఈ విషయంలో ముఖ్యమంత్రి పట్ల చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారనీ’ – హైదరాబాదులో ఒక పత్రిక రాసిన విషయం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న అంజయ్య గారికి రాజకీయ జ్వరంపట్టుకున్నట్టు అప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. అందుకే ఆయన సభా ప్రాంగణంలోనే వుండిపోకుండా వొంట్లో బాగోలేదనే నెపంతో హోటల్ రూముకి తిరిగొచ్చేసారని వదంతులు హైదరాబాదు దాకా పాకాయి. ఈయనగారేమో ఇక్కడ తాపీగా కూర్చుని కార్మికులు గురించి ఆలోచిస్తున్నారు. అలావుండేది అంజయ్య గారి వ్యవహారం. (13-09-2010)

2 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

కార్మికుల గురించి చిత్తశుధ్ధితో ఆలోచించిన నాయకుడు అంజయ్యగారికి జోహార్లు.

పాపం ఆయన అమాయకుడే అన్నమాట.

రాజకీయల్లో నాయకుడైపోయాక, ఎవరైనా పదవుల గురించి ఆలోచిస్తారు, సంపాదన గురించి ఆలోచిస్తారు కాని ఇలా చీప్‌గా పాటక జనం‌ గురించి ఆలోచిస్తారా?

అయ్యో అంజయ్య!

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@శ్యామలీయం - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు