5, ఆగస్టు 2011, శుక్రవారం

తీరికలేని మనుషులు - భండారు శ్రీనివాసరావు

తీరికలేని మనుషులు - భండారు శ్రీనివాసరావు


మొన్న రాత్రి మహా టీవీలో ఏదో చర్చకు పిలిస్తే వెళ్లాను. తెలకపల్లి రవి గారు, ఘంటా చక్రపాణి గారు కూడా వచ్చారు. ప్రోగ్రాం మధ్యలో అనివార్యంగా వచ్చే ‘విరామ సమయం’లో రవి – మాటల మధ్య ప్రసిద్ధ రష్యన్ రచయిత చెఖోవ్ రాసిన ఓ చిన్న కధ చెప్పారు.

‘గుర్రబ్బండి నడుపుతూ పొట్టపోసుకునే ఒక వృద్ధుడు ఈ కధలోని ప్రధాన పాత్ర. ఆ రోజు ఉదయమే అతడి కొడుకు ఆకస్మికంగా మరణిస్తాడు. అంత దుఃఖంలో కూడా బండి నడపక పోతే పొట్ట గడవని స్తితి అతనిది. తన బండి ఎక్కినవాళ్లకు కుమారుడి మరణ వార్త చెప్పాలని నోరు తెరిచినప్పుడల్లా వాళ్లు అడ్డంపడుతుంటారు. ఎందుకంటె ఈ పాడు ప్రపంచంలో ఎవడి గోలవాడిది. తన కష్ట సుఖాలు పక్కవాడితో పంచుకోవాలనే ఆత్రుత తప్ప ఎదుటివాడి బాధ ఏమిటో ఎవరికీ పట్టదు. చివరికి, ఎవరికీ తన కడుపులోని దుఖం చెప్పుకోకుండానే ఆ రాత్రి ఇంటికి తిరిగి వస్తాడు. కొష్టంలో గుర్రాన్ని కట్టివేస్తూ పిల్లవాడి చావు కబురు దాని చెవిలో వేసి కడుపులో భారం దించుకుంటాడు.’

చెఖోవ్ ఈ కధ రాసి దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ మనుషుల మనస్తత్వాల్లో ఎలాంటి మార్పులేదు.

టీవీల్లో జరిగే చర్చలే దీనికి మంచి ఉదాహరణ. ఎవరికి వారు తమ వాదం వినిపించాలని ప్రయత్నిస్తారే తప్ప ఇతరులమాట వినిపించుకోరు. అందరికీ అన్నీ తెలియాలన్న రూలేమీ లేదు. తెలియంది తెలుసుకుంటే పోయేదీ లేదు. అనవసరమయిన ఈ అభిజాత్యం అవసరమా ? ఎవరికివారే తెలుసుకోవాలి.(05-08-2011)

4 కామెంట్‌లు:

Saahitya Abhimaani చెప్పారు...

మీరు విన్న కథ బాగున్నది కానీ, ఆ కథ ఇవ్వాళ టి వి చర్చల్లో పాల్గొనే వాళ్ళకు అన్వయించగలమా!! పాపం ఆ గుర్రబ్బండాయనకు కొడుకు చనిపోయినా బండి నడపకపోతె గడవదు, అయినా దు:ఖాన్ని చెప్పుకోవాలంటే ఎవరూ పట్టించుకోకపోవటం, ప్రపంచపు తీరును సూచిస్తూ వ్రాశారు. ఇప్పుడు టి వి చర్చల్లో పాల్గొనే వాళ్ళు ఆ చర్చల్లో పాల్గొనేది, "పొట్ట" గడవక కాదుకదా "పొద్దు"గడవక.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@శివరామప్రసాద్ కప్పగంతు - మీరు రాసింది నాకూ వర్తిస్తుంది కాని, నాకు భలేగా నచ్చింది.-భండారు శ్రీనివాసరావు

Saahitya Abhimaani చెప్పారు...

శ్రీనివాసరావుగారూ, అబ్బే మిమ్మల్ని వ్యాఖ్యలో నేను కలపలేడండీ. ఎప్పుడు చూసినా వాళ్ళే కనపడుతూ విసుగెత్తించే వాళ్ళగురించి నా వ్యాఖ్య , ఆ పైన ఒకళ్ళ మాట ఒకళ్ళు పట్టిమ్చుకోకుమ్డా పొద్దున్నే టి వి లలో ఊరికే న్యూసెన్స్ (గ్రామసింహ సమాఖ్య వారు నోరు వెళ్ళే బెట్టేట్టుగా) చేసే వాళ్ళ గురించి నా వ్యాఖ్య.

ఆంటోనీ స్పీచ్ లో లాగా అనుకోకండి, మీ వంటి పెద్దవారి గురించి అలా వ్రాసే పొరబాటు నా కీబోర్డు చెయ్యకుండా ముందుగానే ప్రోగ్రాం చేసేశాను. కథ బాగున్నది, అన్వయమే సరిపోలేదని నా బాధ. అంతే.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@శివరామప్రసాద్ కప్పగంతు - మీ అభిమానానికి నా ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు