13, ఆగస్టు 2011, శనివారం

అనుభవాలు – నేర్చుకోవాల్సిన పాఠాలు - భండారు శ్రీనివాసరావు

అనుభవాలు – నేర్చుకోవాల్సిన పాఠాలు - భండారు శ్రీనివాసరావు


రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు మంచి రసకందాయంలో పడుతున్న సందర్భంలోనే రెండు ప్రధానమయిన అంతర్జాతీయ వార్తలు స్తానిక పరిణామాల నేపధ్యపు వెల్లువలో కొట్టుకుపోయాయి.


అమెరికాలో ఆర్ధిక సంక్షోభం గురించి, ఆ దేశపు క్రెడిట్ రేటింగ్ గురించి అక్కడి వాళ్లు ఎంత ఆందోళనకు గురయ్యారో తెలియదుకాని అనేక దేశాలు మాత్రం అమెరికా పరిస్తితులపట్ల ఆందోళన చెందిన మాట వాస్తవం. సూర్యుని కాంతి చంద్రుని మీద పడి ప్రతిఫలించినట్టు అమెరికా ఆర్ధిక వ్యవస్థలో ఏర్పడే ఒడిదుడుకులు ఆయా దేశాలపై ప్రభావం చూపడం ఖాయమనే నిపుణుల అభిప్రాయం.

ఈ మాదిరి ఆర్ధిక మాంద్యాలు అమెరికాకు కొత్తవేమీ కాదు. గతంలో పలు పర్యాయాలు ఇలాటి విపత్కర పరిస్తితులను ఆ దేశం తట్టుకుని ఒడ్డెక్కిన ఉదంతాలు అనేకం వున్నాయి. మొన్నటికి మొన్న2008 లో అమెరికాలో అనేక బ్యాంకులు దివాళా తీసాయి. దానివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక సంక్షోభం తలెత్తిన సంగతి గుర్తుండే వుంటుంది. మొత్తం మీద అమెరికా ఆ స్తితినుంచి గట్టెక్కగలిగింది. కానీ లోగడ కన్నా పరిస్థితులు ఇప్పడు వేగంగా మారిపోతున్నాయి. నూతన ఆర్ధిక సంస్కరణలు, ప్రపంచీకరణ ఫలితాలు ఏదో ఒక రీతిలో అన్ని దేశాలను తాకుతున్నాయి. కొన్నింటి పాలిట ఈ సంస్కరణలు వరప్రసాదం అయితే, మరికొన్ని దేశాలు దుర్భర వైరుధ్య పరిణామాలను ఎదుర్కుంటూ వుండడం విషాదకరం. ప్రపంచ ఆర్ధిక స్తితిగతులనే సమూలంగా మార్చివేస్తున్న ఈ విధానాల దిక్కుగా వేస్తున్న అడుగు అగాధంలోకి లాగుతుందో ఆకాశానికే చేరుస్తుందో తెలియని అయోమయ పరిస్తితిలో దేశాలన్నీ ఆర్ధిక సంస్కరణల సునామీలో కొట్టుకుపోతున్నాయి. సింద్ బాద్ కధల్లో మాదిరిగా వున్నట్టుండి ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడం అసాధ్యం కాదనిపిస్తోంది. పరాయి ప్రాంతాలకు వెళ్లి వ్యాపార లావాదేవీల్లో అపార ధన రాశులను మూటగట్టుకుని స్వదేశానికి చేరే సమయంలో సముద్రంలో చెలరేగిన తుపాను కారణంగా సమస్తం కోల్పోయి బికారిగా మారే సింద్ బాద్ పాత్ర మాదిరిగా ఈనాడు అనేక దేశాలు అమెరికా లోని ఆర్ధిక పరిస్తితులనే తుపాను మూలంగా పతనం అంచుకుకు చేరుకునే ప్రమాదకర పరిస్తితులను ఎదుర్కుంటున్నాయి.

అమెరికా ఆర్ధికరంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలకంటే ప్రస్తుతం యూరోప్ దేశాలలో ఏర్పడిన సంక్షోభం మరింత ఆందోళన కలిగిస్తున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సంక్షోభం ఫలితంగా యూరోపులోని బడా దేశాల ఆర్దికవ్యవస్తలు కుదేలయ్యే సూచనలు కానవస్తున్నాయి. వేగంగా సంభవిస్తున్న ఈ మార్పులకు తగ్గట్టుగా విదేశీ సంస్తాగత పెట్టుబడిదారులు తమ వ్యూహాలను మార్చుకుంటున్న సంకేతాలు బలంగా అందుతున్నాయి. వారందరూ తమ పెట్టుబడులను త్వరితగతిన ఉపసంహరించుకునే పనిలో పడడం, అలా వెనక్కు తీసుకున్న వాటాల ధనాన్ని మళ్ళీ మరోచోట మదుపు చేయకుండా తమదగ్గరే భద్రపరచుకోవడం, లేదా బంగారం కొనుగోలుకు వినియోగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. దానా దీనా ప్రపంచవ్యాప్తంగా పుత్తడి ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. తమ పెట్టుబడుల భద్రత పట్ల విదేశీ సంస్తాగత పెట్టుబడిదారులు (ఎఫ్.ఐ.ఐ.) లు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు మన దేశంలోని దేశీయ సంస్తాగత ఇన్వెస్టర్లు (డీ.ఐ.ఐ.) లను బెంబేలెత్తిస్తున్నాయి. భారతీయ మార్కెట్లలో ఎఫ్.ఐ.ఐ.లు తమ షేర్లను తెగనమ్ముతుంటే మరోపక్క డీ.ఐ.ఐ.లు వాటిని కొనుగోలు చేయడానికి వెనుకాడుతున్నారు. ఎందుకంటె తమకంటే బలవంతులయిన ఎఫ్.ఐ.ఐ.లతో తలపడడం అంత క్షేమదాయకం కాదని వారికీ తెలుసు. అందుకే రానున్న కొన్ని వారాలపాటు కొనుగోళ్లకు దూరంగా వుండడం మంచిదన్న ఆలోచనలో దేశీయ ఇన్వెస్టర్లు వున్నట్టు కనబడుతోంది.

ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న పరిణామాల నేపధ్యంలో- భారత ఆర్ధిక వ్యవస్థ పటిష్టంగా వుందని, దానికి వెను వెంటనే వాటిల్లే ముప్పెమీలేదని కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మాత్రం భరోసా ఇస్తున్నారు. జాతి ఆర్ధిక పునాదులు బలంగా వుండడం, దిద్దుబాటు చర్యలు సకాలంలో తీసుకోగల సమర్ధవంతమయిన యంత్రాంగం కలిగివుండడం దీనికి కారణాలుగా ఆయన పేర్కొంటున్నారు. ఆర్ధిక మంత్రి ధీమా ఆహ్వానించదగ్గదే. కానీ, ముందే పేర్కొన్నట్టు, ప్రస్తుతం అన్ని దేశాలవారు అంతో ఇంతో అమలుచేస్తున్న నూతన ఆర్ధిక సంస్కరణల కారణంగా విడిగా ఏ ఒక్క దేశమూ ఒంటరిగా ఈ పరిణామాల ప్రభావం నుంచి తప్పించుకునే వీలు సహజంగానే వుండదు. ఎదుర్కోగలిగిన సత్తా మాత్రమే కాదు అందుకు తగిన సంసిద్ధత కూడా అవసరం. ఎందుకంటె ఆర్ధిక రంగంలో చోటుచేసుకునే మార్పుల విష ఫలితాలు సునామీలా విస్తరిస్తాయి. కాచుకునే వ్యవధానం వుండదు. బహుశా, ఈ ఉద్దేశ్యంతోనే పరపతి రేటింగ్ కంపెనీలపై కన్నేసివుంచాలని ‘సెబీ’ సంకల్పించింది. అమెరికా పరపతి రేటింగ్ సృష్టించిన సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని అటువంటి పరిస్థితులు మన దేశంలో తలెత్తకుండా ఈ జాగ్రత్త తీసుకుంటున్నట్టు కనబడుతోంది.

అలాగే, దేశ విదేశాలలో మన దేశానికి గుర్తింపు తీసుకువచ్చిన ఐ.టీ. రంగం మరోసారి అలజడికి, భారీ కుదుపులకు గురికాకుండా చూసుకోవాలి. గతంలో ఆర్ధికమాంద్యం సమయంలో మన ఐ.టీ. రంగం కుప్పకూలకపోయినా కుదేలయిన విషయం అందరికీ గుర్తుండే వుంటుంది. దాని ఫలితాలను రియల్ ఎస్టేట్ వంటి ఇతర రంగాలు చవిచూశాయి. తిరిగి ఇప్పుడు తలెత్తిన సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే వ్యయాన్ని బాగా నియంత్రించే ఐ.టీ. ఉత్పత్తులపట్ల శ్రద్ధ తీసుకోగలిగితేనే భారతీయ ఐ.టీ. రంగం నిలదోక్కుకోగలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే, భారతీయ ఐ.టీ. సంస్తలు కేవలం తమ ఉత్పాదనల పట్లనే కాకుండా నిరంతర పరిశోధన, అభివృద్ధి గురించి కూడా దృష్టి సారించడం అవసరమని వారంటున్నారు.

పోతే, ఆర్ధిక సంక్షోభాలను గట్టిగా ఎదుర్కుని నిలబడాలంటే అందుకు తగిన రాజకీయ సుస్తిరత చాలా అవసరం. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో రాజకీయ పార్టీలు కీచులాటలకు దిగకుండా ఒకే మాటపై నిలబడడం అన్నది ఈ పరిస్థితుల్లో ఎంతో మేలు చేస్తుంది. రాజకీయ కారణాలవల్ల ఏర్పడే అనిశ్చిత పరిస్థితులు కూడా ఆర్ధిక సంక్షోభ ప్రభావాలను మరింత విషమం చేసే ప్రమాదం వుంది. తరచుగా జరిగే బందులు, సమ్మెలు పరిస్తితులను మరింత దిగజారుస్తాయి. ఉదాహరణకు మన రాష్ట్రాన్నే తీసుకుంటే వరుస బందులు, ఆందోళనలతో రోజుకు అయిదు వందల కోట్ల రూపాయల మేరకు పారిశ్రామికరంగం నష్టపోతున్నదని ‘ఫాప్సీ’ పేర్కొన్నది.
మనదేశం పాఠాలు నేర్చుకోవాల్సిన మరో అనుభవం ఒకప్పుడు మనదేశాన్ని శతాబ్దాల తరబడి పాలించిన ఇంగ్లండు నుంచి.


గత కొద్ది రోజులుగా లండన్ నగరం తగలబడిపోతున్నదంటే అతిశయోక్తికాదు. రవి అస్తమించని సామ్రాజ్యంగా ఒకనాడు పేరుగాంచిన బ్రిటిష్ పాలకుల రాజధానీ నగరం ఈనాడు భయం గుప్పిట్లో, విధ్వంస జ్వాలల్లో చిగురుటాకులా వొణికిపోతోంది
ఒక్క లండన్ మాత్రమే కాదు బర్మింగుహాం, నాటింగ్ హాం, బ్రిస్టల్, మాంఛెస్టర్, లివర్ పూల్, ఇంకా మరెన్నో నగరాలు అగ్నిజ్వాలలకు ఆహుతవుతున్నాయి. అల్లరిమూకల దౌర్జన్యాలతో అతలాకుతలం అవుతున్నాయి. “ఈ దుస్సంఘటనలు బ్రిటిష్ చరిత్రలోనే అత్యంత దౌర్భాగ్యకరం” అని ఆ దేశ ప్రదానమంత్రి డేవిడ్ కేమరున్ పేర్కొనడాన్నిబట్టి దిగజారిన అక్కడి పరిస్తితులను వూహించుకోవడం ఏమంత కష్టం కాదు.
పోలీసు కాల్పుల్లో ఓ నల్లజాతీయుడు మరణించడం అన్న ఒక్క కారణంతో ఇంత పెనుదుమారం చెలరేగిందంటే ఓ పట్టాన నమ్మడం కష్టం. ఆ నల్లజాతీయుని మరణానికి నిరసనగా స్థానికులు నిరసన ప్రదర్శనకు దిగటం అదికాస్తా హింసాత్మకంగా మారటం, అలా మారిన పరిస్తితులను అసాంఘిక శక్తులు తమకు అనుకూలంగా మార్చుకోవడం ఇవన్నీ గమనిస్తున్నవారికి ఒక చిన్న విషయం సయితం ఎంత పెద్ద గందరగోళానికి దారి తీయగలదన్న సంగతి సులభంగా అవగతమవుతుంది. ‘జరిగిందేమిటి, జరుగుతున్నదేమిటి, జరగబోయేదేమిటి’ అన్న ప్రశ్నలు మాత్రం అక్కడి సభ్య సమాజాన్ని కలవరపరుస్తున్నాయి. నిన్న మొన్నటివరకు సహజీవనానికీ, సభ్యతా సంస్కారాలకు పెద్ద పీట వేసిన బ్రిటిష్ సమాజంలో ఈ నాడు తమ తోటివారినే అనుమానంతో చూడాల్సిన విషాద పరిస్తితి నెలకొన్నది. పరిచయం ఉన్నా లేకున్నా అందరినీ చిరునవ్వుతో పలుకరించుకునే బ్రిటిష్ పౌరుల సంప్రదాయం. అలాటిది ఈ రోజున చిరునవ్వులు చెదిరిపోయి బిగుసుకున్న పెదవులు దర్శనమిస్తున్నాయని ఆ దేశంలో చిరకాలం నుంచి నివసిస్తున్న తెలుగువారు ఇంటర్నెట్లో వాపోతున్నారు. దేశాల్లో వర్ణ వివక్షను ఖచ్చితంగా పాటించే బ్రిటిష్ శ్వేత జాతీయులు తమ దేశం లో మాత్రం దీనికి మినహాయింపు ఇస్తారని అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్లు కితాబు ఇస్తుంటారు కూడా. వివిధ
దేశాల వారు, అన్ని జాతుల వారు తమ దేశంలో తమతో పాటు సహజీవనం చేయడానికి వీలయిన ఉదార తత్వం బ్రిటిష్ శ్వేత జాతీయుల సొంతమనీ వారు చెప్పడం కద్దు.
అయినా ఎందుకీ అల్లర్లు అక్కడ జరుగుతున్నాయి ? వీటినుంచి నేర్చుకునే పాఠాలు ఏమిటి? వాటిని తెలుసుకోవడం, అర్ధం చేసుకుని తదనుగుణంగా మారడం వర్తమాన భారత ప్రజానీకానికీ, వారిని పాలించే పాలకులకు ఎంతో అవసరం.
బ్రిటన్ జనాభాలో శ్వేత జాతీయులది అగ్రభాగం. ఆ తరువాత ఆసియా దేశస్తులు. అంటే భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి ఆ దేశానికి వెళ్లి స్తిరపడ్డవారన్న మాట. చైనా, ఆఫ్రికా దేశాలనుంచి వచ్చిన వారు కూడా బ్రిటన్ లో ఏళ్లతరబడి మనుగడ సాగిస్తున్నారు.
ఇంగ్లాండ్ దక్షిణ ప్రాంతములో జనసాంద్రత అధికం. అలాగే జాతుల వైవిధ్యం కూడా ఎక్కువే. దేశ ఆర్థిక ప్రగతిలో దక్షిణాది ప్రాంతాలదే హవా. ఆర్థికమాంద్యం కొట్టిన దెబ్బతో ఆ దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. కొత్త ఉద్యోగాలు రావటం గగన కుసుమంగా మారింది. కనీస వేతనాలకన్నా తక్కువకే పనిచేయడానికి సిద్ధపడ్డా ఉద్యోగాలు ఇచ్చే నాధులు కరువయ్యారు. సహజంగా ఈ పరిణామాలు యే సమాజంలో నయినా అసంతృప్తులకు దారితీస్తాయి. దానికితోడు అంతో ఇంతో శ్వేత జాతీయులు పాటించే వర్ణ వివక్ష. అధికారికంగా కాకపోయినా ఉద్యోగాలకు పెట్టే ధరఖాస్తు స్తాయిలోనే ఈ వివక్ష మొదలవుతుందని వలస వర్గాల్లో ప్రతీతి.

జాతుల నడుమ క్రమేణా పేరుకుపోయే ఈ రకమయిన వివక్షల ప్రభావం అప్పుడప్పుడూ ఈ మాదిరి అల్లర్ల రూపంలో బయట పడుతూ వుండడం కూడా అక్కడ కొత్తకాదు.
కనీసం చిన్నాచితకా ఉద్యోగాలను సైతం మాకు దక్కనీయటంలేదని ఓ పక్క శ్వేతజాతీయులు ఆరోపిస్తుంటే, వారు పాటించే వర్ణవివక్ష గురించి వలస జాతీయులు ఆరోపించటం మామూలయి పోయింది. ఇలాంటి నేపధ్యం లోనే పోలీసులు ఓ నల్లజాతీయుడిని కాల్చి చంపటంతో అల్లర్లు ఉవ్వెత్తున వూపందుకున్నాయి.
ఈ సందర్భంలోనే భారతీయ సమాజం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు గురించిన ప్రస్తావన అవసరమవుతోంది.

అల్లర్లు చెలరేగిన సమయములో అక్కడి పోలీసుల వ్యవహారశైలి అత్యద్భుతం. కేవలం ఘటనలు జరిగిన 48 గంటల్లో దాదాపు 1500 మంది పైచిలుకు అనుమానితులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. అల్లర్లు లేని ప్రాంతాలలో పోలీసుల పహారా ముమ్మరం చేశారు. అల్లరి మూకలను అదుపు చేయటానికి వారు అనుసరించిన పద్దతులు అనుసరణీయం. ఇంత పెద్ద స్థాయిలో ఘటనలు జరుగుతున్న సమయంలో కూడా పోలీసులు తుపాకులకు పని చెప్పలేదంటే అల్లర్లను అదుపు చేయడంలో వారు అనుసరిచే అనుసరించే పద్ధతులు ఎలాటివో మన పోలీసులు నేర్చుకోవాలి. అలాగే అక్కడి మీడియా పోషించిన నిర్మాణాత్మక, బాధ్యతాయుతమయిన పాత్ర. వాస్తవాలు మినహా, వదంతులకు ఆస్కారమిచ్చే గాలివార్తలకు బ్రిటిష్ మీడియా పూర్తిగా దూరంగా వుంది.
మనదీ ప్రజాస్వామ్య దేశమే. ఇక్కడా అధికారపక్షం, విపక్షం అన్నీ ఉన్నాయి. విషమ ఘడియల్లో పాలక, ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా యెలా వ్యహరించవచ్చన్నది ఆ దేశం నుంచి నేర్చుకోవాలి. అల్లర్ల సమయంలో బ్రిటన్ లోని ప్రతిపక్షాలవారందరూ నిగ్రహం పాటించిన తీరు మెచ్చదగినది. ఒక్కరు కూడా ప్రజల భావోద్వేగాలను మరింత రెచ్చగొట్టే ఒక్క ప్రకటన కూడా చేయలేదు. అలాగే అక్కడి పాలక పక్షం కూడా ప్రతిపక్షాలు చేసిన ఆచరణ యోగ్యమయిన సూచనలు బేషరతుగా స్వీకరించింది. మరో ముఖ్యమయిన విషయం ఏమిటంటే – ఆపత్కాలంలో సాధారణ ప్రజానీకం సయితం చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోకుండా అవసరమైనంతమేరకే ఆత్మరక్షణ చర్యలకు దిగటం, గొప్ప గుండెనిబ్బరాన్ని ప్రదర్శించి చూపడం.

బ్రిటన్ కానివ్వండి ప్రపంచములో మరే గొప్ప దేశమయినా కానివ్వండి జరిగిపోయిన చరిత్రను మార్చగలిగే శక్తి కలిగివుండడం అసాధ్యం. తమ జాతికాని ప్రజలను తమ దేశానికి అనుమతించే ముందే ముందు చూపుతో వ్యవహరిస్తే పరిస్థితులు ఇలా పరిణమించే అవకాశం వుండదు. తీరా ఇతర జాతీయులు వచ్చి స్థిరపడి కొన్ని తరాలు గడిచిపోయిన తరువాత వారిపై వివక్ష చూపడం నాగరిక సమాజానికి అసలు సిసలు వారసులమని గొప్పలు చెప్పుకునే బ్రిటిష్ శ్వేత జాతీయులకు ఎంత మాత్రం తగని పని. (12-08-2011)

కృతజ్ఞతలు:  లండన్ అల్లర్లు గురించి శ్రీ అచంగ (అరుణ్ చంద్ర గడ్డిపాటి) తమ బ్లాగ్ కృష్ణవేణీ తీరం లో రాసిన కొంత సమాచారాన్ని ఇందులో ఉపయోగించుకోవడం జరిగింది. వారికి మనఃపూర్వక  కృతజ్ఞతాభివందనాలు - భండారు శ్రీనివాసరావు  
.

కామెంట్‌లు లేవు: