2, ఆగస్టు 2011, మంగళవారం

నమ్మలేని నిజాలు - భండారు శ్రీనివాసరావు


నమ్మలేని నిజాలు - భండారు శ్రీనివాసరావు

ఒకానొక కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ పోస్టుకు ప్రకటన వెలువడినప్పుడు, కరీంనగరులో కళాశాలలో పనిచేస్తున్న మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు దరఖాస్తు చేసుకొన్నారు.

కవిసమ్రాట్

 ఇంటర్వ్యూ రోజున విశ్వవిద్యాలయంలో నాటి  తెలుగు శాఖాధిపతి -  అభ్యర్థి అయిన  విశ్వనాథ వారిపై  ప్రశ్నలు సంధించడం ప్రారంభించారు.

తెలుగు శాఖాధిపతి : నీ పేరు?

విశ్వనాథ వారు : ( "నన్నే గుర్తించ లేదా? పైగా ఏక వచన ప్రయోగమా ?" అని కోపం వచ్చినా తమాయించుకొని ... ) విశ్వనాథ సత్యనారాయణ.

తెలుగు శాఖాధిపతి : ఏమేం కావ్యాలు వ్రాసావు?

విశ్వనాథ వారు : ( పేరు చెప్పాక కూడా అటువంటి ప్రశ్న వేసేసరికి పట్ట లేని కోపంతో ... ) “నేనేం కావ్యాలు వ్రాసానో కూడా తెలియకుండానే ఇక్కడ ’తెలుగు శాఖాధిపతి’ ఎలా అయ్యావురా? నీలాంటి వాడు ఉన్నంత కాలం ఈ విశ్వవిద్యాలయం మెట్లపై అడుగిడను” ( అంటూ కోపంగా వెళ్ళిపోయారు.)

తరువాత విశ్వనాథ వారు ఏ విశ్వవిద్యాలయంలోను ’ప్రొఫెసర్’ మెట్టెక్కలేక పోవడం తెలుగువారి  దురదృష్టం.

చాలా ఏళ్ళ తరువాత ఈ విషయం విశ్వనాథ వారు కూడ స్వయంగా వ్రాసుకొన్నారు.

కొసమెరుపు :

విశ్వనాథ వారు ఈ విషయాన్ని బయటపెట్టాక, రిటైరైన ఆ తెలుగు శాఖాధిపతిని ఒక సాహిత్యాభిమాని " ఇది నిజమేనా? " అని అడిగాడు. దానికి ఆ సాహితీమూర్తి సమాధానం –

“ఆయన మహాకవి అని నాకు తెలుసు. కాని ఇంటర్వ్యూలలో పరీక్షకుడు తనకు సమాధానాలు తెలిసి కూడా అభ్యర్థిని ప్రశ్నిస్తాడని ఆయనకు తెలియదు. ఆయనకు ఆ కనీస జ్ఞానం కొరవడడం శోచనీయం."

ఆనాటి ఆ తెలుగు శాఖాధిపతి - ఆచార్య బిరుదురాజు రామరాజు గారు.

బిరుదురాజు రామరాజు

సేకరణ: ఆచార్య ఫణీంద్ర

5 వ్యాఖ్యలు:

Rao S Lakkaraju చెప్పారు...

కొంచెం బుర్రున్న వాళ్లయితే ఉద్యోగం వచ్చి తీసుకోమని ఆహ్వానిస్తారుగానీ ఇంటర్వ్యూ కి రమ్మని పిలవరు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

నిజం. మీరన్నది అక్షరాలా నిజమే కావచ్చు. కానీ మనం జీవిస్తున్నది మాత్రం అర్హతల ప్రామాణికమయిన అనర్హతల ప్రపంచంలో అని మరచిపోకండి. నిజానికి వీరిద్దరూ వారి వారి వాదనల్లో గట్టివారే. కానీ వాదనకు, హేతువుకుకూ చిక్కనివి ఎన్నోవున్నాయి ఈ లోకంలో -భండారు శ్రీనివాసరావు

Rao S Lakkaraju చెప్పారు...

ఎదుటి వ్యక్తి ప్రావీణ్యం తనతో సమానమే అనుకునివుంటే, మా విశ్వవిద్యాలయానికి ఈయన అవసరము అనుకుంటే, వేయపలసిన ప్రశ్నలు ఇంకోవిధంగా ఉంటాయి.

మీ మాట "కానీ మనం జీవిస్తున్నది మాత్రం అర్హతల ప్రామాణికమయిన అనర్హతల ప్రపంచంలో" అదుర్స్.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Rao S Lakkaraju - ధన్యవాదాలు -భండారు శ్రీనివాసరావు

Jai చెప్పారు...

"విశ్వనాథ సత్యనారాయణ గారు దరఖాస్తు చేసుకొన్నారు"

ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇంటర్వ్యూ మర్యాదలు కూడా పాటించాలి. ఎంత గోప్పవారయినా పొగరు తగదు.