26, డిసెంబర్ 2009, శనివారం

వార్తా - వ్యాఖ్య - ఓటరు ఓడిపోకూడదు

వార్త  - వ్యాఖ్య - ఓటరు ఓడిపోకూడదు
- భండారు శ్రీనివాసరావు

రాష్ట్ర ఎన్నికల ప్రక్రియలో ప్రధానమైన అధ్యాయం ముగిసింది. గౌరవనీయులైన ఓటర్లు పవిత్రమైన ఓటు హక్కుని వినియోగించుకుని తమ నిర్ణయాన్ని ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తం చేసి తప్పుకున్నారు. గర చాలా రోజులుగా రాష్ట్రం మొత్తాన్ని తమ ప్రచార భేరీతో అట్టుడికించిన రాజకీయ పార్టీల అగ్రనాయకులు వేసవి విడిదుల్లో అలుపుతీర్చుకునే పనిలో పడ్డారు. ద్వితీయ శ్రేణి నాయకులు పోలింగ్ బూత్ ల వారీగా పోలయిన ఓట్ల లెక్కలు తీస్తూ - గెలుపోటములను బేరీజు వేసే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. అయిన జమాఖర్చులను అభ్యర్ధులు ఆరా తీస్తుంటే వారి అనుచరగణం బాకీ పడ్ద పద్దుల్ని బేబాకీ చేసే పనిలో మునిగితేలుతున్నారు. ఎన్నికల పుణ్యమా అని, కార్యక్రమాలకు కొరతలేకుండా ప్రసారాలు సాగించిన ఇరవైనాలుగుగంటలు టీవీ ఛానళ్లు - ఫలితాల గురించి అంచనాలు, అంచనాల గురించిన విశ్లేషణలు గుప్పించేందుకు ఏగూటి చిలకలతో ఆ గూటి పాటలు పాడించే పనిలో తలమునకలుగా వున్నాయి.

రెండో దశ పోలింగ్ ముగిసిన తర్వాత లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ ప్రచారపర్వంలో పత్రికల తీరుతెన్నులపై ’సత్యాగ్రహాన్ని’ వ్యక్తం చేశారు. ఆయన విమర్శలకు ప్రాతిపదిక లేకపోలేదు. ప్రజాస్వామ్యానికి పత్రికలు పట్టుకొమ్మలు అని గొప్పలు చెప్పుకునే పత్రికా యాజమాన్యాలు - ఆయన పలుకుల్లోని తీవ్రతను అర్ధం చేసుకుని వక్రమార్గం పట్టిన విధానాలను సరిదిద్దుకోవాలి. లేకపోతే - ’పత్రికలన్నీ’ (ప్రతులన్నీ) అమ్ముడుపోయాయి అని ఘనంగా చెప్పుకునే స్థితి నుంచి, పత్రికలే అమ్ముడు పోయాయి అనే దారుణమైన అపప్రధను మూటగట్టుకోవాల్సి వస్తుంది.

’రోజులు దుర్భరంగా గడపడం - ఈ పూట ఎలా గడుస్తుందని మధనపడడం’ ఈ దేశంలో సామాన్యుడనేవాడికి పుట్టుకతో సిద్ధించే స్థితి. వచ్చేనెల 16వ తేదీ వరకూ ఆయా రాజకీయ పక్షాలన్నింటికీ ఈ మానసిక స్థ్తితి అయాచితంగా లభిస్తోంది. గెలుపుమీద నిబ్బరం ప్రదర్సించడం. విజయంపై ఎనలేని ధీమాను వ్యక్తం చేయడంలాంటివి జనం కోసం చేస్తూ వున్నా - అంతరాంతరాల్లో ఎక్కడో కనబడని భీతి, నిజంగా గెలుస్తామా? అన్న అనుమానం, ఓడిపోతామేమోనన్న ఆందోళన అన్ని పార్టీలనూ పట్టి పీడిస్తూ వుండడం అన్నది ఈ ఎన్నికల్లోని కొత్తకోణం.

ఏదీ ఏమైనా 2009 ఎన్నికలు కొత్త నేపథ్యంలో జరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఓటు హక్కు గురించి ప్రజల్లో అవగాహన పెరిగింది. ఇందులో మీడియా పాత్ర అభినందనీయం! ఓటరు గుర్తింపు కార్డుల జారీలో ఎన్నో అవకతవకలు జరిగాయన్న అరోపణలు వున్నప్పటికీ - ఈ కార్డు సంపాదించుకోవడానికి జనం స్వచ్చందంగా పోటీ పడ్దారు. ఈ ప్రక్రియను సులభరతం చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం చేసిన ఏర్పాట్లు అమోఘంగా పనిచేశాయి కొత్తగా ఓటరు కార్డు పోందిన యువతీయువకులు పాస్ పోర్ట్ దొరికినంతగా సంబరపడిపోయి మొట్టమొడటిసారి ఓటు హక్కు వినియోగించుకోవడంలో వున్న ఆనందాన్ని ఆస్వాదించారు. సహజంగా రాజకీయాలంటే ఏహ్యత కలిగి వుండే వయస్సులో వున్న ఈ కొత్త ఓటర్లు ఎవరి పుట్టి ముంచుతారో అన్న సరికొత్త భయం పార్టీలకు పట్టుకుంది. పోలింగ్ ముగియగానే ఎదుటి పక్షం అక్రమాలకు తలపడిందని ఆరోపిస్తూ రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి ఇందుకు భిన్నంగా, ఎన్నికల సంఘం తనంతటతాను గానే విచారణ జరిపి రీపోలింగ్ జరపడం విశేషం. ప్రచారంలో హోరెత్తిన అవేశకావేశాలను పరిగణలోకి తీసుకుంటే పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందనే చెప్పాలి.మద్యం, ధనం విచ్చలవిడిగా పంపకం జరిగాయన్న ఆరోపణలు ఉన్నప్పటికీ ఈసారి దానికి అడ్డుకట్ట వేయడం జరిగిందన్న సంకేతాలను పంపడంలో యంత్రాంగం సఫలమైంది. సక్రమంగా ఎన్నికలను నిర్వహించడంలో ఎన్నికల కమీషన్ ఘోరంగా విఫలమైంది. ఏ పర్టీ కూడా విమర్సించకపోవడం కూడా ఈ సారి కొత్త సంగతి. రాజకీయపార్టీల గెలుపోటములు తేలడానికి ఇంకా మూడు వారాలకు పైగా వ్యవధి వున్నప్పటికీ - విధుల నిర్వహణలో - ఎన్నికల కమీషనర్ ఐ వి సుబ్బారావు. డీ జీ పీ మహంతి ఇప్పటికే విజయాలను మూటకట్టుకున్నారు. నిజానికి ఈ ఎన్నికల్లో తొలి విజేతలు వీరిద్దరే!

ప్రజాస్వామ్య పునాదులను మరింత పటిష్టం చేసే దిశగా సాగించే కృషిలో ఎన్నికల నిర్వహణ ప్రధానపాత్ర పోషిస్తోంది.అనుభవాల ఆధారంగా దాన్ని మరింత మెరుగు పరుచుకునే విధంగా కొత్త పాఠాలు నేర్చుకోవాలి.

ఆటోమేటిక్ ఓటింగ్ మిషన్లను ప్రవేశ పెట్టి. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా, ఓటింగ్, కౌంటింగ్ ప్రక్రియలను సులభతరం, వేగవంతం చేసిన విధంగానే అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీని ఎన్నికల నిర్వహణ కోసం సమర్గవంతంగా ఉపయోగించుకునే అంశాన్ని లోతుగా పరిశీలించాలి. ఎన్నికలు జరిగే కాలానికి మాత్రమే ఎన్నికల కమీషన్ పాత్రను పరిమితం చేయకుండా పూర్తికాలం పనిచేసేలా తగిన సాధన, సంపత్తులు కలిగిన విశేషాధికార స్వరంత్ర శాశ్వత వ్యవస్థగా దానికి ప్రతిపత్తి కల్పించాలి.

ఏక పార్టీ పాలనకు కాలం చెల్లి, సంకీర్ణ ప్రభుత్వాలనేవి రాజకీయాల్లో సాధారణ అంశంగా మారి, ఏ ప్రభుత్వం కూడా పూర్తికాలం మనుగడ సాగించడం అనేది ప్రశ్నార్థకంగా తయారై - దేశంలో ఏదో ఒక రాష్టంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగే వీలున్న ప్రస్తుత పరిస్థితుల్లో - ఎన్నికల నిర్వహణకు శాశ్వత యంత్రాంగాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకత పెరిగింది. ఎన్నికల తరుణంలో ప్రభుత్వంతో ప్రమేయంలేని సొంత యంత్రాంగాన్ని ఎన్నికల సంఘం శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోవాలి. ప్రజాస్వామ్యం అనే విలువైన వ్యవస్థను కాపాడుకోవడానికి ఈ మాత్రం ఖర్చు భరించలేనిదేమీ కాదు.

ఓటర్ల కొనసాగాలి. కొత్త్త ఓటర్ల నమేదుకు తీసుకునే శ్రద్ధను - మరణించిన లేదా వేరే ప్రాంతాలకు మకాం మార్చిన ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించే పనిలోనూ కనబర్చాలి. ఓటర్ల కులాల వివరాలను నియోజక వర్గాల వారీగా బహిరంగపరిచే పద్దతులను నిషేధించాలి.

శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత పోలింగ్ ముగియటంతోనే తీరిపోదు. రోగికి శస్త్ర చికిత్స జయప్రదం కావడం అన్నది- ఆపరేషన్ తరువాత తీసుకునే శ్రద్ధపై ఆధారపడి ఉన్నట్టే - పోలింగ్ ముగిసిన తరువాత కూడా పోలీసులు పరిస్థితులను కనిపెట్టి చూడాలి. ఏమరుపాటు పనికిరాదు. పోలింగ్ అనంతరం జరిగిన తాడిపత్రి సంఘటనలు ఈ అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.

ఎన్నికలంటే ’కలవారు’మాత్రమే ఆడుకునే ఆట కాకుండా-ఎన్నికలంటే కులాలవారీగా కొట్లాడుకునే పోట్లాట కాకుండా ఎన్నికలంటే డబ్బూ దస్కం, మనీ మధ్యంతో కూడుకున్న వ్యవహారం కాకుండా-

చూడగలిగే చేయగల్లిగే సంస్కరణలు కావాలి!
ఆ సంస్కరణలను అమల్లోకి తేగలిగే రోజులు రావాలి!
ఆ మంచి రోజుల కోసం ఎదురుచూడాలి!
ఎన్నికల్లో పార్టీలు ఓడిపోవచ్చు.
కానీ ఓటరు ఓడిపోకూడదు.

(ఏప్రిల్ - 2009)