30, డిసెంబర్ 2009, బుధవారం

నడిచి వచ్చిన దారి - 2009

నడిచి వచ్చిన దారి - 2009                               భండారు శ్రీనివాసరావు 


మరో ఏడాది కాలగర్భంలో

ఆంద్రప్రదేశ్ కు సంబంధించినంతవరకు ఈ ఏడాది ఆదీ అంతమూ ఒకే మాదిరిగావున్నాయి. సంవత్సరం మొదట్లో ఎన్నికల ప్రచార హోరు. అధికార అందలాన్ని అందుకోవాలన్న అభిలాషతో అన్ని పార్టీలు 'లక్ష్మణ రేఖ' ను అధిగమించే ప్రవర్తించాయి. ఈ పార్టీ, ఆ పార్టీ అనిలేకుండా అందరూ ప్రచార పర్వంలో ఎగ్గుసిగ్గులు వదిలేసి ప్రచార స్తాయిని అధమ స్తాయికి చేర్చడంలో 'తిలా పాపం తలా పిడికెడు' పంచుకున్నారు. నింగికెగురుదామనుకున్న వాళ్ళు 'ఉట్టి' దగ్గరే చతికిల పడ్డారు. సినీ గ్లామరు సినిమా హాళ్ళకే పరిమితమని తెలుగు వోటర్ తేల్చి చెప్పాడు. మహాకూటమిగా భుజాలు కలిపిన పార్టీలు వోటర్ తీర్పుతో జావకారి పోయాయి. చేసిన పనులే గెలిపిస్తాయని భ్రమల్లో బతికిన అధికార పక్షం 'పాసు మార్కుల' తో గట్టెక్కాల్సిన దుస్తితిలో పడిపోయింది.మహాకూటమి చెల్లాచెదురయింది. అట్టహాసంగా బరిలోకి దిగిన చిరంజీవి 'ప్రజారాజ్యమ్' పట్టాభిషేకానికి పది ఆమడల దూరంలో ఆగిపోయింది. అవసరార్ధం తెలంగాణా పల్లవి ఎత్తుకున్న 'టీడీపీ'కి ఆశాభంగమే ఎదురయింది. కేసీయార్ 'తెరాస' రెంటికీ చెడ్డ రేవడయింది. కమ్యూనిష్టులకు వ్రతం చెడింది కాని ఫలితం దక్కక పోగా - 'తోక పార్టీలు' అనే ముద్ర స్తిరపడిపోయింది. అత్యధిక కాలం రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రికార్డు సాధించిన వైఎస్సార్- ఎన్నికల్లో పార్టీని విజయపధంలో నడిపించి రెండో టెరం కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ నాయకుడిగా మరో రికార్డు సొంతం చేసుకున్నారు. ఎక్కువకాలం ముఖ్య మంత్రిగా చంద్రబాబు నాయుడు ఖాతాలో వున్న రికార్డు ను అధిగమించే అవకాశాలు అధికంగా ఉన్నప్పటికీ - హెలికాఫ్టర్ దుర్ఘటన రూపంలో మృత్యు దేవత ఆయనకు ఆ ఛాన్స్ ని దూరం చేసింది. వైఎస్సార్ ఆకస్మిక మరణంతో రాష్ట్ర రాజకీయ స్వరూపమే పూర్తిగా మారిపోయింది. రాష్ట్ర విభజన అంశం మళ్ళీ తెరపయికి వచ్చింది. ఆశలు అడుగంటిన కేసీయార్ తన అంబుల పొది నుంచి తీసిన ఆఖరి అస్త్రం 'ఆమరణ దీక్ష' అద్భుతంగా పనిచేసి కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒక మెట్టు కిందకి దించేలా చేసింది. పరిష్కార దిశగా వేసిన తొలి అడుగు జారి - ఆంద్ర ప్రాంతంలో మరో ఆందోళనకు బీజం వేసింది. ఆందోళనలు- ప్రతి ఆందోళనలతో ఆంద్ర ప్రదేశ్ అట్టుడికి పోతున్నట్టు ఏ టీవీ చానల్ని అడిగినా చెబుతుంది. ఏడాది మొదటిలో కానవచ్చిన ఆందోళనకర దృశ్యాలే మళ్ళీ సాలు చివర్లో రిపీట్ అవుతున్నాయి. ఈ ఏడాది యిలా ముగిసిపోతోంది. ఎవరికోసం ఆగని కాలం మరో ఏడాదిని మన ముందుకు తెస్తోంది. ఆశావహ దృక్పధంతో ఆహ్వానిద్దాం. ( 31-12-2009)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.bhandaru Srinivas Rao (I.I.S.)
Cell: 98491 30595 Res: 040 2373 1056.
Please click on below URL to visit my Blog:
http://bhandarusrinivasarao.blogspot.com