26, డిసెంబర్ 2009, శనివారం

వార్తా-వ్యాఖ్య - ‘ఓటరు ఓడిపోలేదు’

  ఓటరు ఓడిపోలేదు
- భండారు శ్రీనివాస రావు

ఎన్ని ప్రలోభాలు చూపినా..
ఎన్నెన్ని రకాలుగానో ఓటరు నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగినా - దాదాపు రెండు మాసాలకు పైగా వ్యాఖ్యలలాంటి వార్తలతో, సమాచారం పేరుతొ ప్రచారం చేస్తూ మీడియా హోరెత్తించినా-
ఓటరు ఓడిపోలేదు!

పైపెచ్చు విశ్వసనీయతకు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో గెలిచిన వాళ్లు ఎంతోమంది వుండవచ్చు కానీ వాస్తవంగా గెలిచింది సాధారణ ఓటరు మాత్రమే! కానీ, ఓడిపోయిన వారి జాబితా చాంతాడంత వుంది.

ఇందులో మంత్రులుగా అధికారం చలాయించిన వాళ్లు - ప్రతి పక్షంలో వుండి అయిన దానికీ, కాని దానికీ ప్రభుత్వాన్ని చేటలతో చెరిగిన వాళ్లు ఎంతో మంది వున్నారు.

అయితే, నిజానికి ఓడిపోయింది వీళ్లు కాదు. ఉనికి కోసమో, ఉనికిని నిలబెట్టుకోవడం కోసమో, ఉనికిని చాటుకోవడం కోసమో పాత్రికేయ విలువలకు నిలువు పాతర వేసిన మీడియా ఓడిపోయింది.

రాజకీయ పక్షాలు పరస్పరం విమర్శించుకోవడం వాటి తప్పుకాదు. ఎన్నికల పోరాట క్రమంలో హద్దులు దాటి వుండవచ్చు. మాటల్లో , చేతల్లో సభ్యత, సంస్కారంపాలు తగ్గి వెగటు పుట్టేలా వాటి ప్రవర్తన వుండి వుండవచ్చు.

కానీ - వాటిని ఎత్తి చూపి, సరిదిద్దడానికి దోహదం చేసే సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన పవిత్ర బాధ్యతను విస్మరించి, రాజకీయ పార్టీలకు కొమ్ముకాస్తూ, తమ మనసులోని మాటల్ని మేధావుల విశ్లేషణలుగా ప్రచురించి, ప్రసారం చేసిన మీడియా ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది!
ఓడిపోయిన రాజకీయపక్షాలు వాటి మనుగడ కోసం ఎలాగూ ఆత్మ విమర్శ చేసుకుంటాయి.
ఆ పాట్లు వాటికి ఎలాగూ తప్పవు.
కానీ, మీడియా మాట ఏమిటి?
( మే - 2009 )