19, అక్టోబర్ 2014, ఆదివారం

పనికొచ్చిన సలహా


ఇది ఇప్పటి మాట కాదు ఎప్పటి మాటో.
పారిశ్రామికవేత్త జె.ఎన్.టాటా ఓసారి జర్మనీ ప్రయాణం పెట్టుకున్నారు. ఓడలో ఫస్ట్ క్లాస్ క్యాబిన్. ఆయనతో పాటు అనేక గోనే సంచులు. వాటిల్లో దేశంలో వివిధ ప్రాంతాలనుంచి సేకరించి తెచ్చిన మట్టి. వాటిని జర్మనీలో శాస్త్రవేత్తలకు చూపించి ఇనుము లేదా ఇతర లోహాలు వుంటే  కనుగొని ఆయా ఖనిజాల తవ్వకం చేపట్టాలన్నది టాటా మహాశయుల ప్రయత్నం.
అదే ఓడలో కింద భాగంలో స్వామీ వివేకానంద  వ్యక్తి ప్రయాణం చేస్తున్నారు. ఆయన్ని గురించి అప్పటికే కర్ణాకర్ణిగా విన్న టాటా తనకు తానుగా వెళ్ళి స్వామిని కలుసుకుని పరిచయం చేసుకున్నారు. మాటల్లో తన ప్రయాణం లక్ష్యాన్ని కూడా స్వామికి వివరించారు.
స్వామి వెలిబుచ్చిన ఓ అనుమానం టాటాని ఆలోచనలో పడవేసింది. దేశం నుంచి తీసుకు వెళ్ళిన మట్టి నమూనాల్లో నిజంగా ఖనిజాలు వున్నట్టు కనుగొప్పటికీ,  విదేశీ శాస్త్రవేత్తలు నిజాయితీగా ఆ విషయం తెలియచెప్పకపోవచ్చన్నది స్వామికి కలిగిన సందేహం.
"ఒక పని చేయండి. భారత దేశంలో మేధావులయిన యువకులకు కొదవ లేదు. దురదృష్టం ఏమిటంటే వారికి సరయిన అవకాశాలు లేక వారి ప్రజ్ఞాపాటవాలన్నీ నివురుగప్పిన నిప్పులా వుండిపోతున్నాయి. మీరు దేశానికి తిరిగివచ్చిన తరువాత మైసూరు మహారాజు చామరాజ వడయారును కలవండి. ఆయన బ్రిటిష్ పాలకులకి విధేయుడే. కానీ దేశం అంటే ప్రేమ కలిగినవాడు. చక్కటి పరిశోధనాసంస్థను ఏర్పాటు చేయడంలో మీకు తోడ్పడుతాడు' అని సలహా ఇచ్చారు.

టాటా జర్మనీ నుంచి తిరిగి వచ్చిన తరువాత స్వామి వివేకానంద సలహా ప్రకారం వెళ్ళి మైసూరు మహారాజును కలుసుకున్నారు. పరిశోధనాసంస్థ ఏర్పాటు గురించిన తన ప్రతిపాదన గురించి చెప్పారు. చామరాజ వడయార్ ఎలాటి సంకోచం వ్యక్తం చేయకుండా వెంటనే 370 ఎకరాల భూమిని సంస్థ ఏర్పాటుకు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అక్కడ ఆవిధంగా ఏర్పాటయిందే దేశంలో తొలి పరిశోధనాసంస్థ - "The Indian Institute Of Science".  మహానీయుల సంకల్పబలం ఆవిధంగా వుంటుంది.

18, అక్టోబర్ 2014, శనివారం

అమెరికా ప్రెసిడెంట్ అయితేనేం ఎవరయితేనేం రూలంటే రూలే ఆ దేశంలో


నిజమా! నిజంగా నమ్మలేం అనిపించే ఈ సంఘటన నిజంగా జరిగింది. ప్రెసిడెంట్ ఒబామా స్వయంగా చెప్పకపోతే అసలీవిషయం  బయటకు పొక్కేదే కాదు. నమ్మడానికి వీల్లేని ఈ కధా కమామిషూ ఏమిటంటే-
కిందటి నెలలో న్యూ యార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాల్లో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షులవారు సతీ సమేతంగా ఆ నగరం వెళ్ళారు. ఓ రోజు వీలుచేసుకుని  భార్యను వెంటబెట్టుకుని హోటల్లో భోజనం చేయడానికి వెళ్ళారు. మాట మంతీ చెప్పుకుంటూ భోజనం ముగించిన తరువాత బిల్లు చెల్లించడానికి క్రెడిట్  కార్డు తీసిచ్చారు. అది తీసుకువెళ్ళిన బేరర్ అంతే వేగంతో తిరిగొచ్చి, 'ప్రెసిడెంట్! మీ క్రెడిట్  కార్డు చెల్లదు' అని చావు కబురు చల్లగా చెప్పాడు.   పక్కన భార్య ఉండబట్టీ, ఆవిడ తన కార్డు తీసి ఇవ్వబట్టీ ప్రెసిడెంట్ ఒబామా గారి పరువు ఆ పూటకు నిలబడింది. ఇది జరిగింది గత నెల 24 వ తేదీన. ఇది బయట పడింది  నిన్న శుక్రవారం. క్రెడిట్ కార్డ్లు, వాటి భద్రత గురించి జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ, మాటవరసకు ఈ విషయం స్వయంగా ఒబామా గారే వెల్లడించడంతో ఈ కధనం  మీడియాలో హుషారుగా గింగిరాలు తిరుగుతోంది.
ఒబామా గారు భార్యతో కలిసి భోజనం చేయడానికి ఇతర సాధారణ పౌరుల మాదిరిగానే హోటల్ కు వెళ్ళారు. ఇది ఎవరికీ పట్టలేదు. అలాగే బిల్లు కట్టడానికి క్రెడిట్ కార్డు ఇచ్చారు. బిల్లులు కట్టడం అలవాటులేని రాజకీయ నాయకులను కన్న కర్మ భూమి కాబట్టి ఆ విషయానికీ పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎంతసేపూ అమెరికా ప్రెసిడెంటు క్రెడిట్ కార్డు క్లోనింగుకు గురయిందని ఒకటే ఊదర.

ఈ సంఘటన నుంచి మన రాజకీయ నాయకులు, మీడియా నేర్చుకోవాల్సింది ఎంతో వుంది అంటే అపార్ధం చేసుకోరు కదా! 

NOTE : Courtesy Image Owner 

ఈరోజు అంజయ్యగారి వర్ధంతి - ఒక జ్ఞాపకం

ఆంధ్ర ప్రదేశ్ కు అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధి తనయుడు పైలట్ గా పనిచేస్తున్నారు. ఓ రోజు ముఖ్యమంత్రిగారు సచివాలయంలో నలుగురితో మాటా మంతీ సాగిస్తున్న సమయంలో ఆయనకు ఓ ఫోన్ వచ్చింది. ఆయన తత్తరపడుతూ లేచి వున్నపాటున బరకత్ పురాలో వున్న తన ఇంటికి బయలుదేరారు. అప్పటికి అంజయ్య గారు అధికార నివాసం గ్రీన్ లాండ్స్ (ముద్దుగా ఆయన పెట్టుకున్న పేరు జయ ప్రజా భవన్) కి మకాం మార్చలేదు. బరకత్ పురాలో హౌసింగ్ బోర్డ్ వారి టూ ఆర్ టీ ఇంట్లోనే వుంటున్నారు. ఇప్పటి రోజులతో పోలిస్తే అది ఒక విడ్డూరమే. ఆ చిన్న ఇంటిపైనే గది మీద గది నిర్మించుకుంటూ వెళ్లడం వల్ల చాలా ఇరుకుగా వుంటుంది. మెట్లు కూడా సౌకర్యంగా వుండవు.
సరే! అంజయ్య గారు హడావిడి పడుతూ ఇంటికి వెళ్ళి ఆయాసపడుతూ మెట్లెక్కినప్పుడు కనబడ్డ దృశ్యం ఈనాటి ఛానళ్ళకు దొరికివుంటే పండగే పండగ. రాజీవ్ గాంధీ అక్కడి చిన్న గదిలో అంతకంటే చిన్న కుర్చీలో కూర్చుని తనను పీక్కుతింటున్న దోమల్ని తోలుకునే పనిలో నిండా మునిగి తేలుతున్నాడు. అసలే పండంటి మనిషి. లేత శరీరం. ఆయన మొహం మీద దోమ కాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అసలు జరిగిన విషయం ఏమిటంటే – రాజీవ్ గాంధీ పైలట్ గా హైదరాబాదు వచ్చిన విమానంతిరిగి వెళ్ళడానికి బాగా వ్యవధానం వున్నట్టుంది. యెందుకు అనిపించిందో తెలియదు కానిఆయన బేగం పేట ఎయిర్ పోర్ట్ లో ఎవర్నో అడిగి ఓ కారు తీసుకుని నేరుగా బరకత్ పురాలోని అంజయ్య గారి నివాసానికి వెళ్ళిపోయారు. ఈ కబురు అందిముఖ్యమంత్రిగారు ఆఘమేఘాలమీద ఇంటికి వచ్చేసరికి ఇదీ సీను.
'అమ్మ ఇచ్చిన ఉద్యోగంఇది అని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రిగా  అంజయ్య గారు ఏనాడు నామోషీ పడలేదు. పైగా కూసింత గర్వంగా చెప్పుకునేవారు. రాజీవ్ గాంధీ ఆయన ఇంటిని చూసి వాళ్ల అమ్మ సెలెక్షన్ మంచిదే అనుకుని కూడా వుంటారు. కాకపొతే పేరడీ ఏమిటంటే అంజయ్య గారి ముఖ్యమంత్రి పదవి వూడడానికి కూడా తదనంతర కాలంలో రాజీవ్ గాంధీయే కారణం అయ్యారు.
పోతే! పైకి చెప్పకపోయినా ఇది చదివే వారికి ఓ  సందేహం తొలుస్తుండవచ్చు. ఇదంతా మీకెలా తెలుసనీ. మీలో కొందరికి తెలియని విషయం ఏమిటంటేఆ రోజుల్లో నేను  రేడియో రిపోర్టర్ గా వుండేవాడిని. కారణం చెప్పలేను కాని ఆయనకు నేనంటే అవ్యాజానురాగం. నేను కాసేపు దగ్గర్లో కనబడకపోతే చాలు  అంజయ్య గారికి క్షణం తోచేది కాదు. శ్రీనివాస్ ఏడీ’ అని సొంత సిబ్బందిని ఆరా తీయడం ఆయనకు అలవాటు. అంచేత ఆరోజు నేను కూడా అంజయ్య గారి వెంటే వున్నాను. అదన్న మాట. (18-10-2014)

(అంజయ్య గారు - నేనూ - నా రేడియో టేప్ రికార్డర్ )

17, అక్టోబర్ 2014, శుక్రవారం

ఓ నీతి కధ


సీ.ఈ.ఓ. ఏకాంబరం కారు దిగుతున్నాడని తెలిస్తే చాలు ఆఫీసు ఆఫీసంతా నిశ్శబ్దం. ఎవరి పనుల్లోకి వాళ్ళు దూరిపోతారు. ఎవరన్నా ఖాళీగా వున్నట్టు కనబడితే చాలు ఇక అంతే  సంగతులు. ఆఫీసులో అదే ఆఖరి రోజనుకోవాలి. ఒకరోజు ఆయన మెట్లు దిగివస్తుంటే ఒకడు వరండాలో  దిక్కులు చూస్తూ కనబడ్డాడు. ఏకాంబరం కోపం నషాళానికి అంటింది. 'నీ ఫేస్ నచ్చలేదు. నీ తరహా నచ్చలేదు. ఒక్క క్షణం ఇక్కడ వుంటానికి వీల్లేదు' అంటూ, 'నీ జీతం యెంత' అని అడిగాడు.  వాడు బిక్కు బిక్కుమంటూ 'ఐదువేలు' అన్నాడు. ఏకాంబరం  మేనేజర్ని పిలిచాడు. మూడు నెలలు జీతం పదిహేను వేలు అప్పటికప్పుడే అతడి చేతిలో పెట్టించాడు. వాడు దణ్ణాలు పెడుతూ వెళ్ళిన తరువాత అడిగాడు ఏకాంబరం- 'వాడు ఎవడు, ఏ డిపార్ట్ మెంటులో పనిచేస్తాడ'ని. వచ్చిన సమాధానం విని ఏకాంబరం బిక్కచచ్చి పోయాడు.
ఆ వచ్చిన వాడు, ఎంచక్కా పదిహేనువేలు పట్టుకెళ్ళిన వాడు అసలు ఆ ఆఫీసు ఉద్యోగే కాదు. పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వచ్చిన వాడు.
నీతి:  "అయినచోటా  కాని చోటా వూరికే ఎగిరెగిరి పడడం అంత మంచిది కాదు"
(పార్ధసారధి గారు పోస్ట్ చేసిన ఇంగ్లీష్ కధకు స్వేచ్చానువాదం)

శ్రమయేవ జయతే


ఊళ్ళల్లో రోడ్డు పక్కన సిగరెట్లు వగయిరా అమ్మే పాన్ డబ్బాలు కనిపిస్తాయి. ఉదయంనుంచి రాత్రి పొద్దుపోయేదాకా ఆ బడ్డీ దుకాణాల వారు శ్రమిస్తూ వుండడం అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఆ చిన్న దుకాణాల మీద దాదాపు పది పదిహేను ప్రభుత్వ శాఖల ఆజమాయిషీ ఉంటుందనేది చాలామందికి తెలియవి విషయం. మునిసిపల్ కార్పోరేషన్, పారిశుధ్య శాఖ, కార్మికశాఖ ఇలా ఈ జాబితా చాలా పెద్దది. ఇలాటి దుకాణాలు పెట్టుకునేవారు పెద్ద చదువులు చదివిన వారు అయివుండరు. కలిగిన వారు అయివుండే అవకాశం లేదు. అయినా ఇన్నిన్ని శాఖల ఆజమాయిషీ వారిపై అవసరమా? ఈ ప్రశ్న అతి సహజమైనది. మనలో చాలామంది మదిలో ఈ ప్రశ్న మొలకెత్తినా ఉసూరుమని నిట్టూర్చడం తప్ప  చేయగలిగింది ఏమీ వుండదు. సందర్భం వేరయినా ఈ ప్రశ్న వేసింది, జవాబు అన్వేషించింది సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి మోడీ అవడం వల్ల పరిష్కారం దొరుకుతుందనే ఆశ ఈనాడు కలుగుతోంది.
మోడీ ప్రధాని అయిన తరువాత ఆయన ఈ దేశ భవిష్యత్తు గురించి, దేశాన్ని ఎలా తీర్చి దిద్దాలి అనే విషయం గురించీ అనేక కలలు కంటున్నారు. నాయకులకి అది సహజం. కానీ విశేషం ఏమిటంటే, మోడీ  కనే కలలు నిజం కావాలని ప్రజలు, ముఖ్యంగా చదువుకున్నవారు, యువతీ యువకులు  సయితం  కలలు కనడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఇది మరీ  స్పుటంగా కానవస్తోంది.  అంటే ఆయన మీద జాతి జనులు పెట్టుకుంటున్న ఆశలు ఏమేరకు పెరిగిపోతున్నాయో, ఆ కారణంగా ఆయన భుజస్కంధాల మీద బరువు బాధ్యతలు ఎలా పెరిగిపోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమాత్రం తభావతు వచ్చినా ఆ ఆశల శిఖరం కూలిపోయి, ప్రస్తుతం వెల్లువెత్తుతున్న అభిమానం కాస్తా ఆగ్రహంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ వాస్తవం తెలిసిన రాజకీయనాయకుడు కావడం వల్లనేమో, మోడీ కూడా అంతే జాగ్రత్తగా ప్రజామోదపధకాలకు రూపకల్పన చేస్తున్నట్టుగా వుంది. బహుశా, ఈ క్రమంలోనే కావచ్చు,  ఇటు యువతకు, అటు శ్రామికులకు, మరో పక్క పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం, ఉత్సాహం కలిగించే - 'శ్రమయేవ జయతే' అనే నూతన పధకాన్ని - భారతీయ జనతా పార్టీ, బీజేపీకి, ఒకప్పటి  మాతృ సంస్థ అయిన జన సంఘ్ నాయకుడు, కీర్తిశేషులు దీన దయాళ్ ఉపాధ్యాయ పేరిట  ప్రధాని మోడీ గత గురువారం నాడు ప్రారంభించారు. 


                 
ఉప్త్పత్తి రంగం తీసుకున్నా, తయారీ రంగం తీసుకున్నా అక్కడ పరిస్తితులు సజావుగా సాగాలంటే అటు పెట్టుబడి పెట్టే యజమానులు, ఇటు శ్రమను పెట్టుబడిగా పెట్టే  శ్రామికులు, ఒక కాడికి రెండు ఎడ్లు మాదిరిగా సమన్వయంతో సాగాలి. ప్రభుత్వం అనేది వీరిద్దరి మీదా పెత్తనం చేసే పెత్తందారీ వ్యవస్థ కాకుండా దారి చూపే దిక్సూచి మాదిరిగా వ్యవహరించాలి. మోడీ తన ప్రసంగంలో చెప్పింది అదే. ఏదయినా వ్యాపారం పెట్టాలన్నా, పరిశ్రమ స్తాపించాలన్నా, ఫాక్టరీ నెలకొల్పలన్నా అనేక రకాల ఫారాలు, అనేక రకాల దరఖాస్తులు, అనేక రకాల అనుమతులు. ఇన్నిన్ని  అవసరమా? అన్నది ఆయన వేసిన ప్రశ్న. అందుకే, ఒకే ఒక ధరఖాస్తుతో  అన్ని రకాల అనుమతులు, ఏక గవాక్ష విధానం ద్వారా కాలయాపన లేకుండా  మంజూరు చేయాలనేది ఆయన ఆలోచన.   
ఈ సందర్భంలోనే, పారిశ్రామికవేత్తలకు కొంత అనుకూలంగా, పనిచేసే కార్మికులకు, విశేషించి కార్మిక సంఘాలకు  మరి కొంత ప్రతికూలంగా కానవచ్చే నిర్ణయాలను ప్రధాని ప్రకటించారు. ఫాక్టరీలను, పారిశ్రామిక విభాగాలను, వ్యాపార సంస్థలను కార్మిక శాఖకు చెందిన ప్రభుత్వ అధికారులు అప్పుడప్పుడూ తనిఖీ చేసి, లోటుపాట్లను ఎత్తి చూపుతుంటారు. అయితే ఈ విధానంలో పారదర్శకత లోపించి, లాలూచీ వ్యవహారాలు సాగడానికి కూడా అవకాశం వుంది. యజమానులను అయిన దానికీ, కాని దానికీ అధికారులు వేధిస్తున్నారని వారి నుంచి ఆరోపణలు కోకొల్లలుగా వస్తూ వుండడం కొత్తేమీ కాదు. అందుకే ఈ మొత్తం తనిఖీ వ్యవస్థను పారదర్శకం చేయాలని మోడీ తలపెట్టారు. ఇకనుంచి కార్మిక శాఖకు చెందిన ఇన్స్పెక్టర్ ఏదయినా ఫాక్టరీకి వెళ్లి తనిఖీ చేయాలని అనుకుంటే ఇప్పటిమాదిరిగా తన ఇష్టం వచ్చిన ఫాక్టరీకి తన ఇష్టం వచ్చిన సమయంలో వెళ్లి తనిఖీ చేయడానికి కుదరదు. ఏ  ఇన్స్పెక్టర్  ఏ ఫాక్టరీకి వెళ్ళాలన్నది కంప్యూటర్ లో లాట్లు తీసి   నిర్ణయిస్తారు. అలా తనిఖీకి వెళ్ళిన అధికారి డెబ్బయ్ రెండు గంటల్లోగా  తన నివేదికను ఆన్ లైన్ లోనే పై అధికారికి పంపాల్సివుంటుంది. ఇటువంటి తరహా పద్దతులు ప్రవేశపెట్టడం వల్ల ప్రభుత్వ ప్రమేయాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం వీలుపడగలదని మోడీ మహాశయుల ఉద్దేశ్యం. వ్యాపారాలు సులువుగా చేసుకోగల పరిస్తితి వుంటే, అవినీతికి ఆస్కారం తగ్గి, నాణ్యతలో పోటీపడడానికి  వీలుంటుంది అన్నది ఆయన భావన. పాలన గరిష్ట స్థాయిలో వుండి ప్రభుత్వ పెత్తనం కనిష్ట స్థాయిలో వుండాలని ఆయన మొదటినుంచీ చెబుతూ వస్తున్నదే. అయితే,  ప్రధాని ప్రకటించిన కొన్ని నిర్ణయాలను పారిశ్రామికవేత్తలు హర్షించి ఆహ్వానిస్తే, అనేక కార్మిక సంఘాలు కొన్ని అంశాల పట్ల నిరసన తెలిపాయి. కాలక్రమంలో ఇటువంటి విధానాలు యజమానులకు లాభదాయకంగా, కార్మిక లోకానికి నష్టదాయకంగా పరిణమిస్తాయని, కార్మికులను తమ ఇష్టం వచ్చినట్టు తొలగించుకునే  అధికారం యజమానులకి దఖలు పడుతుందనీ కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. ఏ.ఐ.టీ.యూ.సీ.  ఒక అడుగు  ముందుకు వేసి, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు  నిరసనగా డిసెంబరు  అయిదో తేదీన అఖిల భారత బంద్ కు పిలుపు ఇచ్చింది.       
కార్మికులకు ప్రయోజనం వుండే మరో విధాన ప్రకటన కూడా ప్రధాని  చేసారు. అది ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలకు సంబంధించినది. కార్మికులు, ఉద్యోగులు తమ సంస్థను లేదా కంపెనీని వొదిలి వెళ్ళాల్సిన  సందర్భాలు తటస్తించినప్పుడల్లా ఈ ఖాతాను బదిలీ చేసుకోవడం వారికి దుస్తరంగా  మారుతోంది. దీన్ని అధిగమించడానికి పీ.ఎఫ్. ఖాతా నెంబరు మార్చుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే నెంబరు కేటాయించే విధానం అమల్లోకి తెస్తారు. ఖాతా వివరాలను వారు ఎప్పటికప్పుడు వారి మొబైల్ ఫోన్ల ద్వారా తెలుసుకోగల వెసులుబాటు కూడా  వుంటుంది.
సరే! ఇవన్నీ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా అందుబాటులోకి తెచ్చుకోగల ప్రయోజనాలు. కానీ, కార్మిక లోకం తలెత్తుకుని తిరిగే రోజులు రావాలనీ, వారిలో ఆత్మ న్యూనతను కూకటివేళ్ళతో పెకలించి వేయాలనీ కూడా ప్రధాని కోరుకుంటున్నారు. ఇది నిజంగా ఆహ్వానించతగ్గ ఆలోచన. ఏ అభివృద్ధి చెందిన  దేశంలో అయినా పనివారికి సమాజంలో తగిన గౌరవ ప్రపత్తులు వుంటాయి. మన దగ్గర మాదిరిగా 'వైట్ కాలర్' ఉద్యోగాలు, 'కాలర్' మాసిన ఉద్యోగాలు అనే తేడాలు వుండవు. జీతాన్ని బట్టి కాకుండా పనికి గౌరవం లభించే విధానం రావాలనీ, అదే జీవన విధానం కావాలనీ కోరుకునే పాలకుల ప్రయత్నాలు హర్షణీయం. మోడీ  శ్రామికులను 'శ్రమయోగులు'గా అభివర్ణించారు. చక్కటి ఆలోచనే. అయితే, ఇన్నాళ్ళుగా రాజకీయ నాయకుల ఆలోచనలు అంతరిక్షంలోను,  ఆచరణ అధః పాతాళంలోను ఉండడమే ప్రజలకు తెలుసు. అందుకే వారు చెప్పే  మాటల  పట్ల, చేసే వాగ్దానాల పట్ల జనాలకు  అనేక సందేహాలు. అనేకానేక అనుమానాలు. కాబట్టి మాటలు చేతల్లో కనబడేలా అడుగులు పడినప్పుడే రాజకీయుల ఆలోచనలకు  విశ్వసనీయత లభిస్తుంది. సార్వజన ఆమోదం లభిస్తుంది.
ఇలాటి ఆలోచనలు మెండుగా చేస్తున్న ప్రధాని మోడీ 'అందరిలో ఒకరా, కొందరిలో ఒకరా' అనేది కాలమే తేలుస్తుంది.
విదియనాడు కనబడని చంద్రుడు తదియనాడు తానే కనబడతాడని సామెత.

కొంతకాలం వేచి చూడడం వల్ల పోయేదేమీ వుండదు. పైగా వోపిక అనేది భారతీయుల రక్తంలో వుంది అని కదా  చెబుతారు.  (17-10-2014)            

16, అక్టోబర్ 2014, గురువారం

మరపురాని మనుషులు

మరపురాని మనుషులు
తురగా కృష్ణ మోహన రావు పేరిట ఉత్తమ జర్నలిష్ట్ అవార్డ్ స్వీకరించిన సందర్భంలో నా ప్రసంగ పాఠం   
"తురగా కృష్ణ మోహన రావుగారు.
"ఎందుకో ఆయన కూడా ఈ వేదిక మీద వున్నట్టే నాకనిపిస్తోంది. నిన్న పోతే రేపటికి మూడు అనుకునే ఈ పాడులోకంలో కృష్ణ మోహనరావుగారు చనిపోయి ఒకటా రెండా మరో  ఒకటిరెండేళ్ళలో నలభై ఏళ్ళు కావస్తోంది. అయినా, ఇన్నేళ్ళ తరువాత కూడా  ఆయన్ని స్మరించుకుంటూ ఇంతమంది ఇక్కడకు వచ్చారంటే -  ఏ లెక్కన చూసుకున్నా నా దృష్టిలో   ఆయన బతికున్నట్టే లెక్క. అంత గొప్ప మనిషి కాబట్టే ఆయన పేరుమీద ఇస్తున్న ఈ అవార్డ్ తీసుకోవడానికి గర్వపడుతున్నాను. అందుకే జానకీరాణి గారు ఫోను చేసి చెప్పినప్పుడు కాదనలేకపోయాను. కాకపొతే, ముసలితనంలో వసంతం అన్నట్టుగా రిటైర్ అయి ఎనిమిదేళ్ళు పూర్తి అవుతుంటే ఇప్పుడు ఉత్తమ జర్నలిస్టో, అలాటిదో ఈ  అవార్డ్ ఏమిటి చెప్పండి.  కానీ రేడియోలో పనిచేసిన మా బోంట్లకు జానకీరాణి గారంటే భయంతో కూడిన గౌరవం ఏం చేస్తాం? కాదనే ధైర్యం ఎక్కడిది ?
"జానకీరాణి గారు అంటే గౌరవం. ఆవిడ వయస్సు కొంతా, ఆవిడ కలివిడితనం కొంతా కలిపి గౌరవం ఆవిడంటే. భయం దేనికంటే- నేనే గలగలా మాట్లాడుతానని అంతా అంటారు. జానకీరాణి గారు గలగలా మాత్రమే కాదు దడ దడలాడిస్తూ దడదడా కూడా మాట్లాడతారు.
"ఇక అసలు విషయానికి వస్తే నేను చదువుకుండే రోజుల్లో ఆంధ్ర పత్రిక వారపత్రికలో రాజధాని కబుర్లుఅనే శీర్షిక వచ్చేది. ప్రవీణ్ అనే ఆయన రాస్తుండేవారు. ఆ రాసే విధానం నాకు బాగా నచ్చేది. ఎప్పుడయినా హైదరాబాదు వెడితే ఆయనగారిని కలవాలని అనుకునేవాడిని. ఆయన  అంటే ఎందుకో ఇష్టం. ఆయనే తురగా  కృష్ణ మోహన రావు గారని చాలాకాలం తరువాత తెలిసింది. నాకు వారితో మరో బాదరాయణ సంబంధం కూడా వుంది. కృష్ణ మోహన రావుగారు అకాల మృత్యువాత పడిన తరువాత వారు చేసిన రేడియో విలేకరి ఉద్యోగంలోకే నేను ప్రవేశించాను. అది చిన్న ఉద్యోగం కావచ్చు.  అయినా అంత పెద్ద మనిషి చేసిన ఉద్యోగం కాబట్టి నాకది పెద్ద ఉద్యోగమే.
"కృష్ణ మోహన రావుగారు మంచి హాస్య రచయిత. అంటే నా అర్ధం మంచి హాస్యం రాస్తారని. ఆహ్లాదకరమైన హాస్యం రాస్తారని. ఆరోగ్యకరమైన హాస్యం రాస్తారని. ఆయన రచనలు  చదివిన అనుభవంతో నేను ఈ మాట  చెబుతున్నాను.
"తురగా వారు చిలికించిన  హాస్యం లాంటి హాస్యం  ఈ నాటి సమాజానికి ఎంతో  అవసరం. జనంలో  నవ్వుచచ్చిపోతోందేమో అని నాకు ఒక్కోసారి చచ్చేంత భయం వేస్తుంటుంది. నవ్వుతూ మాట్లాడేవాళ్ళతో మాట్లాడిచూడండి. కోపాలు తాపాలు మాయమైపోతాయి. బీపీలు గట్రా తగ్గిపోతాయి. దురదృష్టం ఏమిటంటే అలా నవ్వేవాళ్ళు, నవ్వించే వాళ్ళు  బాగా తగ్గిపోతున్నారు. ఇదొక విషాదం.
మరి ఏమిటి శరణ్యం. వుంది.  ఇదిగో కృష్ణ మోహనరావు గారు రాసిన ఈ మాట కచ్చేరీమొదలుపెట్టండి. పుస్తకం చదువుతూ మీరేమో ముసిముసినవ్వులు. ఆ నవ్వుల్ని చూస్తూ మీ ఆవిడ కూడా ఏమిటీ నవ్వేది మా ఆయనేనాఅని అనుమానంతో కూడిన నవ్వులు. ఇక ఆ ఇంట్లో ఒకటే నవ్వులవాన. మళ్ళీ మాట్లాడితే నవ్వుల తుపాన్.
"ఒక విషయం నేను గట్టిగా చెప్పగలను.
ఈనాడు మనం అనుభవిస్తున్న అన్ని రకాల రుగ్మతలకీ నవ్వే చక్కటి ఔషధం. కాణీ ఖర్చులేని ఆరోగ్య శ్రీ
"రేడియోలో పనిచేసే రోజుల్లో నా బల్ల మీద అద్దం కింద ఒక కాగితం మీద రాసిపెట్టుకున్నాను.
మనిషి ఏడుస్తూ పుట్టేది నవ్వుతూ చనిపోవడానికి.
"పుట్టగానే ఏడిస్తేనే బతికినట్టు లెక్క. బతికివున్నప్పుడు నవ్వితేనే బతికున్నట్టు లెక్క. ఈ లెక్క కుదరాలంటే తురగా కృష్ణ మోహనరావు గారి రచనలు  చదవండి. వాటిని  ఆస్వాదించండి. అన్ని లెక్కలు, అన్ని తిక్కలు ఇట్టే కుదిరిపోతాయి.
"ఎనీ డౌట్ ?  నాకయితే లేదు.
"ఇది సగర్వంగా  నేనిస్తున్న సర్టిఫికేట్"



(నిరుడు 'తురగా అవార్డు'కు నన్ను ఎంపిక చేసిన తురగా జానకీరాణి గారు ఈ లోకం నుంచే తప్పుకున్న ఈ రోజు ఆవిడను మరో సారి ఇలా గుర్తు చేసుకుంటున్నాను - భండారు శ్రీనివాసరావు) 

15, అక్టోబర్ 2014, బుధవారం

తురగా జానకీ రాణి గారు ఇకలేరు


"నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము...."
ఈ పద్యపాదానికి నిలువెత్తు ఉదాహరణ మా జానకీ రాణి గారు.


(కీర్తిశేషులు శ్రీమతి తురగా జానకీ రాణి)

చేరడేసి కళ్ళు, వాటికి కొట్టొచ్చినట్టు ఇంతేసి కాటుక. దూరం నుంచే చూసి చెప్పొచ్చు జానకీ రాణి గారు వస్తున్నారని. ఆ సంప్రదాయాలు, కట్టూ బొట్టూ అన్నీ అంతవరకే. మనసూ, ఆలోచనలు, సిద్దాంతాలు, సూత్రాలు అన్నీ రాబోయే తరానివి. ఆధునిక మహిళ ఆలోచనలు ఎలావుండాలో, ఎలా ఉంటాయో  ఆవిడని కలుసుకుని ఓమారు మాట్లాడితే ఇట్టే అర్ధం అవుతుంది. ఆ మాటలు వింటుంటే చూస్తున్న జానకీ రాణి గారు,ఆ మాటలు  చెబుతున్న జానకీరాణి గారు ఒకరేనా అన్నంత సందేహం కలగడం తధ్యం.
ఆమె రాకను మరో విధంగా కూడా కనుక్కోవచ్చు. ముందు ఆవిడ మాట వినబడుతుంది. తరువాత ఆవిడ కనబడతారు. చిన్నగా పొందికగా వుండే ఆ మనిషిది   ఏళ్ళు మీద పడుతున్నా వాటిని కనబడనివ్వని శారీరక తత్వం. ముందే చెప్పినట్టు మాట కొండొకచో చురుక్కు. ఎక్కువసార్లు చమక్కు.  అంత చక్కగా, శ్రావ్యంగా మాట్లాడుతారని తెలిసే బహుశా రేడియోలో ఉద్యోగం ఇచ్చి ఉంటారని అనుకునే అభిమానులు కూడా ఆవిడగారికి కోకొల్లలు. అలాటి మనిషి ఇక కనబడదనీ, అలాటి పలుకు ఇక వినబడదనీ తలచుకుని దుఃఖపడడమే ఇక మిగిలింది.
ఏవిటో కష్టాలు కట్టగట్టుకుని వస్తాయంటారు. ఈ మధ్యనే అల్లుడు ఒక రకంగా కొడుకూ అయిన నరేందర్ అందర్నీ వొదిలి వేరే లోకానికి తరలిపోయాడు. భర్త పోయిన దుఖం అనాలో, అతడ్ని మరచిపోలేని బాధ అనాలో తెలియక తల్లడిల్లుతున్న  ఉషారమణికి తల్లి పోవడం మరో విషాదం.
ఉషకు, శోభకు ధైర్యం చెప్పే ధైర్యం నాకు లేదు.
అందుకే ఈ నాలుగు మాటలు.