28, మార్చి 2020, శనివారం

ప్రెసిడెంట్ ట్రంప్ ప్రెస్ మీట్


గంటలు గంటలు ప్రెస్ బ్రీఫింగ్ అనగానే మనదగ్గర నవ్వులాటగా చెప్పుకుంటారు కానీ, అమెరికాలో కరోనా వైరస్ విస్తరించినప్పటినుంచి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్,  వైట్ హౌస్ లో  ప్రతిరోజూ సాయంత్రం రెండుగంటల పాటు విలేకరులతో మాట్లాడడం అనేది ఒక రొటీన్ అయిపొయింది. ప్రెసిడెంట్ తో పాటు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కూడా పాల్గొనే ఈ ప్రెస్ బ్రీఫింగ్ లో ఒకరిద్దరు వివిధ రంగాల నిపుణులు కూడా పక్కనే వుంటారు. మనకు విచిత్రంగా అనిపించే  విషయం ఏమిటంటే వీళ్ళు ఒక్కోసారి బహిరంగంగానే ప్రెసిడెంట్ చెప్పేదానితో తాము ఏకీవభించడం లేదంటూ బహిరంగంగానే తమ అనంగీకారం తెలియచేస్తుంటారు. ఈ రెండూ రెండున్నర గంటలసేపు ప్రెసిడెంట్ నిలబడే ఉంటాడు. ఇటీవల అంటే మార్చ్ 23 న జరిగిన ప్రెసిడెంట్ ప్రెస్ బ్రీఫింగ్ ని క్లుప్తీకరిస్తే ఇదిగో ఇలా వుంటుంది. మరో విచిత్రం ఏమిటంటే ఆ నాటి ప్రెస్ బ్రీఫింగులో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ గారికి కోపం వచ్చి మధ్యలోనే అంటే గంటన్నర కూడా కాకుండానే వెళ్ళిపోయారు. వైట్ హౌస్ లో మీడియా విభాగం అధికారి జేమ్స్ ఎస్. బ్రాడి జారీ చేసిన అధికారిక ప్రకటనకు ఇది సంక్షిప్త రూపం. అసలుది ఇరవై వేల పదాలకు పైగా వుంది. ప్రెస్ బ్రీఫింగ్ ఇలా సాగింది.
ప్రెసిడెంట్: మంచిది ధన్యవాదాలు. అందరూ వచ్చినట్టులేదు. బహుశా వైరస్ సమస్య కావచ్చు. సాధారణంగా అయితే చాలామందికి ఈ గదిలో స్థలం సరిపోయేది కాదు.
ఈ వైరస్ మీద పోరాటానికి మన సమాజంలో ప్రతి ఒక్కరినీ కలుపుకుపోయే ప్రయత్నాన్ని అమెరికా ఇక ముందు కూడా కొనసాగిస్తుంది. ఈ పోరాటంలో మనం విజయం సాధిస్తామని అమెరికన్లు విశ్వసించాలని నేను కోరుకుతున్నాను. మళ్ళీ సాధారణ పరిస్తితులు వస్తాయి. కష్టాలు ఇబ్బందులు త్వరలోనే తొలగిపోతాయి. మన ఆర్ధిక వ్యవస్థ కూడా బాగా కోలుకుంటుంది. అయితే ప్రస్తుతం మాత్రం ఈ జాతీయ విపత్తు నడుమ చిక్కుకుపోయిన మనందరం  ఈ పోరాటంలో విజయం సాధించడంపైనే దృష్టి కేంద్రీకరించాలి.
ప్రతి ఒక్క అమెరికన్ ఒక సంగతి గమనంలో పెట్టుకోవాలి. ఈ సమయంలో మనం చేస్తున్న త్యాగం అనేకమంది ప్రాణాలు కాపాడుతుందని తెలుసుకోవాలి.
అమెరికాలోని అమెరికన్లతో సహా, ఇతర ఆసియా అమెరికన్ల ప్రాణాలను కాపాడడం చాలా చాలా ముఖ్యం. ఈ వ్యాధి /వైరస్ విస్తరించడానికి వాళ్ళు కారణం కాదు.
ఈ వైరస్ తలెత్తినప్పటి నుంచి దేశంలోని అత్యుత్తమ శాస్త్రవేత్తలు, వైద్య నిపుణుల సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ  ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ వైరస్ ని తుదికంటా నిర్మూలించేవరకు ఈ కృషి కొనసాగుతుంది. మన ప్రజారోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు పరిస్తితిని గమనిస్తూ దేశంలో ఈ వ్యాధి విస్తరిస్తున్న పోకడను అధ్యయనం చేస్తూ తగిన సమయంలో దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి అహరహం పనిచేస్తున్నారు. తరువాత ఏం చేయాలి? మన తదుపరి అడుగులు  ఏమిటి అనే విషయంలో పెద్దపెద్ద బృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. ఒక్కసారి వాళ్ళు  ఓకె చెబితే మళ్ళీ మనం మన పాత జీవన విధానం వైపు మళ్లిపోతాము.
మన దేశాన్ని నిర్మించుకున్నది షట్ డౌన్ చేయడానికి కాదు.
లక్షలాదిమంది అమెరికన్ శ్రామికులకు, చిన్న వ్యాపారులకి, ప్రపంచంలో అమెరికాకు ఒక సమున్నత స్థానం కల్పించిన బడా పారిశ్రామిక వేత్తలకు  ఈ సంక్షుభిత సమయంలో సత్వర సాయం అందించే బిల్లు విషయంలో ఏకాభిప్రాయ సాధనకోసం నా ప్రభుత్వం డెమోక్రాట్లతో, రిపబ్లికన్స్ తో కలిసి పనిచేస్తుంది.
మూడు నాలుగు మాసాలు లేదా అంతకంటే ముందుగానే, ఇంకా త్వరగానే  అమెరికా తన వ్యాపార కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుంది. వీలయితే ఇంకా ముందుగానే. సమస్యకంటే పరిష్కారం ప్రమాదకరమయ్యే పరిస్తితిని అమెరికా కొనితెచ్చుకోదు.
 రెండు వారాల క్రితమే ప్రజలకు జీతంతో కూడిన సిక్ లీవ్, ఫ్యామిలీ లీవ్ ఇవ్వడానికి ఎనిమిది బిలియన్ల డాలర్లు ఖర్చయ్యే బిల్లు ఆమోదానికి రికార్డు స్పీడ్ తో పనిచేసాము. ఇందులో వైద్యం ఖర్చులు, వాక్సిన్ల ఖర్చులు కూడా వున్నాయి. కాబట్టి ఈ బిల్లును ఆమోదింప చేయడంలో పార్టీలకి అతీతంగా అమెరికన్ కాంగ్రెస్ పనిచేయాలి.
వైరస్ వ్యతిరేక పోరాటంలో ఏం జరుగున్నదో చెబుతాను. ఎనిమిది లక్షల N95 మాస్కులను, కోటీ ముప్పయి లక్షలకు పైగా సర్జికల్ మస్కులను  పంపిణీ చేస్తున్నాము. ఈ బృహత్తర కార్యక్రమంలో ఫెడరల్ ప్రభుత్వంతో ఆయా రాష్ట్రాల గవర్నర్లు, మేయర్లు పార్టీలకి అతీతంగా చేయీ చేయీ కలిపి పనిచేస్తున్నారు.
నా ఆదేశాల ప్రకారం క్లోరోక్విన్ మందును పెద్ద పెద్ద పరిమాణాల్లో తెప్పించడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటి నుంచి ఏ నిమిషంలో నైనా హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాలు న్యూయార్క్ చేరతాయి.
మీరు కూడా ఈరోజు వచ్చిన వార్తల్ని చదివారనుకుంటా. ఒక పెద్దమనిషి ప్రాణాపాయంలో పడ్డాడు. బతికే చాన్స్ లేదని అతడూ నమ్మాడు, ఆయన కుటుంబమూ నమ్మింది. ఏదో ఉపశమన వైద్యం కింద అతడి కుటుంబం అతడికి ఆ మాత్ర వేసింది. అందరూ అంతా అయిపోయిందనే అనుకున్నారు. కానీ కొన్ని గంటలు గడవక ముందే అతడులేచి కూర్చున్నాడు. అతడిప్పుడు మామూలుగా వున్నాడు. ఈ వ్యాధికి ఈ మందు పనిచేస్తుంది అని ఆమోదం తెలిపే ప్రక్రియకు మేము ఎక్కువ సమయం తీసుకోనందుకు అతడిప్పుడు సంతోషిస్తున్నాడు.
మలేరియా వ్యాధితో కునారిల్లిన దేశాల్లో ఈ మందును ఆ వ్యాధి నిరోధానికి వాడారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆదేశాల్లో ఈ వైరస్ ప్రభావం చాలా తక్కువగా వుంది.
మరో విషయం. ఈ రోజు ఉదయమే నేను అధ్యక్షుడిగా నాకున్న అధికారాలను ఉపయోగించుకుని ఒక ఆర్డరు మీదసంతకం చేసాను. ముఖ్యమైన వైద్య పరికరాలను, మాస్కులను  అక్రమంగా దాచిపెట్టడాన్ని నిషేధించే ఉత్తర్వు ఇది.
ఈ సమావేశంలో ప్రెసిడెంట్ ట్రంప్ ప్రశ్నలు అడిగేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఇచ్చారు. విలేకరులను పేరుతో పిలిచి ప్రశ్న వేయమని కోరారు. ఒక్కొక్కరూ ఒకటి కంటే ఎక్కువగానే అడిగారు. “వ్యాధి కంటే చికిత్స ప్రమాదకరం కాకూడదు” అంటూ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యపై విలేకరులు బాణాలు సంధించారు.

26, మార్చి 2020, గురువారం

రాజకీయాలకు ఇంకా టైముంది


దయచేసి వినండి – భండారు శ్రీనివాసరావు
కరోనా విషయంలో ఎవరి విధులు వాళ్ళు నిర్వహిస్తున్నారు. నిజం చెప్పాలంటే ప్రాణాలకు తెగించి చేస్తున్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమంలో కొన్ని లొసుగులు అనివార్యం. వాటిని మనం భూతద్దంలో చూసి, మరింత పెద్దవి చేసి ప్రపంచానికి చూపించే ప్రయత్నమే ఫేస్ బుక్ వంటి సాంఘిక మాధ్యమాలలో ఎక్కువగా జరుగుతోంది.  ఇంట్లో ఫ్యాను కింద కూర్చుని ఈ క్షణంలో నేనిది టైప్ చేస్తున్నాను అంటే ఈ పని చేయడానికి ఎందరో ఎక్కడో ఈ పరిస్తితుల్లో కూడా  నాకోసం పనిచేస్తున్నారని అర్ధం.
అది మరచిపోయి, ఏదేదో లేనిపోని నీలివార్తలు షేర్ చేస్తూ పోతుంటే నేనెంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నట్టు. మీరు కంటితో చూసిన విషయం ఏదైనా వుంటే, దాన్ని సంబంధిత అధికారులకి చేరవేయడానికి ఈ మాధ్యమాన్ని వాడుకుంటే అంతకంటే కావాల్సింది లేదు. ఉదాహరణకు నీలయపాలెం విజయకుమార్ ఒక పోస్ట్ పెట్టారు. వారి ఇంటికి దగ్గరలో ఉన్న ఓ సూపర్ మార్కెట్లో జనాలు ఎగబడి సరుకులు కొంటున్న సంగతి రాసారు. ప్రతి వీధిలో చిన్నవో పెద్దవో కిరాణా షాపులు వుంటే, వాటిల్లో  ధరకాస్త  ఎక్కువే కావచ్చు,  వాటిని వదిలిపెట్టి దూరంగా ఉన్న సూపర్ మార్కెట్ పై దండెత్తడం ఎందుకని వారి ప్రశ్న. “It appears that, people are yet to relise the gravity” అని ఆవేదన వెలిబుచ్చారు. వాస్తవానికి విజయకుమార్ టీడీపీ నాయకుడు. విమర్శ ప్రధానం అనుకుంటే ఆయన పోస్ట్ వేరేగా వుండేది. ఇదీ సంయమనం అంటే.
డిసెంబరు ముప్పయి ఒకటి వరకు మనకెవరికీ కరోనా అంటే తెలవదు. అది ఎలా వస్తుందో తెలవదు. ఇంతవరకు అంటు వ్యాధులు ఈగలు, దోమలు, ఇతర క్రిముల నుంచి మనుషులకు సోకేవి. వాటిని నిర్మూలిస్తేనో, అదుపు చేస్తేనో  రోగాలు తగ్గేవి. మరి కొన్నింటి  నిరోధానికి టీకాలు వున్నాయి. ఇది అలా కాదే. మనుషుల నుంచి మనుషులకు పాకే వ్యాధి. మొదటి దశలో నయం చేయడానికి వీలుంటుంది. రెండో దశ కొంత నయం. మూడో దానికి చేరితే ఇక ఇంతే సంగతులు. కేన్సర్ కూడా ఇంతే కదా అనవచ్చు. కానీ కేన్సర్ రోగిని తాకడానికి ఎవరూ సందేహించరు. చుట్టూ భార్యాపిల్లలను ఉంచుకుని ప్రశాంతంగా ప్రాణాలు విడవొచ్చు. కానీ ఇది అలా కాదే. రోగం వచ్చిందని నిర్ధారణ కాగానే బయట ప్రపంచంతోనే కాదు, కుటుంబ సభ్యులు, చుట్టపక్కాలతో కూడా సంబంధాలు తెగిపోతాయి. అందుకే మనిషికీ మనిషికీ మధ్య దూరం వుండాలని హెచ్చరిస్తోంది. మొదట్లో ప్రభుత్వాలు ప్రదర్శించిన  నిర్లిప్తత కంటే ఇప్పుడు ప్రజల చూపుతున్న  నిర్లక్ష్యం మరింత ఆందోళన కలిగిస్తోంది. అదే ప్రమాదం అనుకుంటే ఇళ్ళల్లో తీరి కూర్చుని, కంప్యూటర్లు ముందేసుకుని, ఘడియకో నీలివార్త వండి వార్చే వారితో మరింత పెద్ద ముప్పు ఎదురవుతోంది.
చూస్తుండగానే కేవలం మూడే మూడు నెలల్లో కరోనా రోగం ఇంతింతై, అంతింతై  తన విశ్వరూపం ప్రదర్శిస్తోంది. అది భారత దేశంలో కాలుమోపినప్పుడు  కేంద్రంలో మోడీ, తెలంగాణాలో కేసీఆర్, ఏపీలో జగన్ అధికారంలో వుండడం అనేది యాదృచ్చికం. ఇదే ఏడాది కిందనో, పదేళ్ళ కిందనో జరిగుంటే పాలకులు వేరుగా వుండేవారు. మీరు అనొచ్చు వారి వారి సమర్ధతను బట్టి వ్యవహరించే తీరు మారొచ్చని. కాదనను. కానీ ఈ యుద్ధం మానవాళి చేస్తున్న ప్రచ్చన్న యుద్ధం. కంటికి కనబడని శత్రువుతో చేస్తున్న యుద్ధం. మనకంటే అన్నింటా ఉచ్చస్థాయిలో ఉన్న  దేశాలే ఈ కరోనా కాటుకు విలవిలలాడుతున్నాయి. ఈ ముప్పు ఏ ఒక్క ప్రాంతానికో, లేదా ఏ ఒక్క ప్రదేశానికో పరిమితమైంది కాదు. గతంలో మనం చూస్తూ వచ్చిన ప్రకృతి వైపరీత్యాలకి దీనికి చాలా తేడా వుంది. ఒక చోట వరదలు వస్తాయి. మరో చోట వర్షాలే వుండవు. ఒక చోట భూకంపాలు సంభవిస్తాయి. మరో చోట ప్రశాంతంగా వుంటుంది. కానీ ఈ కరోనా అనేది ఒకేసారి యావత్ ప్రపంచాన్ని చుట్టుముట్టి ఉక్కిరిరిబిక్కిరి చేస్తోంది. ఎవరికి వారు తమకు సాయం చేసుకోవడంలోనే బిజీబిజీ. ఇతరులవైపు కన్నెత్తి చూసి పరామర్శించే తీరిక ఈనాడు ఎవరికీ లేదు.  బ్రిటన్ దేశానికి కాబోయే చక్రవర్తే దీని పాలిటపడి చికిత్స తీసుకుంటున్నాడు.
అంచేత చెప్పేది ఏమిటంటే, కొన్నాళ్ళు ఇంటి గడప దాటకుండా ఉండడమే దేశానికి మనం చేసే సేవ. ప్రకృతి కన్నెర్ర చేసిన కొన్ని సందర్భాలను గుర్తు చేసుకుంటే ఇళ్ళల్లో వుండడం పెద్ద విషయం ఏమీ కాదనిపిస్తుంది. తుపానులు సంభవించినప్పుడు వారాల తరబడి కరెంటు వుండదు. భూకంపాలు సంభవిస్తే ఆసుపత్రులే నేలమట్టం అవుతాయి. వరదలు వచ్చినప్పుడు తాగడానికి మంచి నీళ్ళు కూడా దొరకవు.
అదే ఇప్పుడు చూడండి.  కొన్ని కుటుంబాలకు, కొందరు వ్యక్తులకు జరిగే వ్యక్తిగత ఇబ్బందులను మినహాయిస్తే ఇంట్లో వుండి పోవడం అన్న ఒకే ఒక్క అసౌకర్యం మినహా ఇక ఏ లోటు లేదు. అధికారులు కరెంటు సరఫరాలో లోపం లేకుండా చూస్తున్నారు. నెట్ పుణ్యమా అని ఇళ్ళల్లోనే కావలసినంత కాలక్షేపం. చుట్టపక్కాలతో ముచ్చటించడానికి ఎలాగూ మొబైల్స్ వున్నాయి.  నిత్యావసర వస్తువుల కొరత అనేది సమస్యే. కానీ కొంత సంయమనం పాటిస్తే అంటే పానిక్ బయింగ్ కు స్వస్తి చెప్పగలిగితే  కాసిన ఉపశమనం లభించవచ్చు. ఇవన్నీ మన చేతుల్లో వున్నవే. ప్రభుత్వాలను విమర్శించి ప్రయోజనం లేదు. వాళ్ళని వాళ్ళ పని చేసుకోనివ్వండి. మూడు వారాలు ఓపిక పట్టగలిగితే ఆ తర్వాత మరింత ఘాటుగా  రాజకీయ విమర్శలు చేయడానికి ఎంతో సమయం లభిస్తుంది. ఈలోగా బాధ్యత కలిగిన పౌరులుగా  మనం చేయాల్సింది మనం చేద్దాం!              

25, మార్చి 2020, బుధవారం

బయట తిరక్కండిరా!



‘అలా ఎండలో తిరిగితే వడ దెబ్బ తగులుతుంది’
‘వానలో తడిస్తే జలుబు చేస్తుంది’
‘చలిగాలిలో తిరగకండి వంటికి మంచిది కాదు’
ఇలా ఆరుగాలమూ ఆంక్షలే! అందుకే పెద్దవాళ్ళ కళ్లుగప్పి బజార్న పడే వాళ్ళం. వాళ్ళ కళ్ళబడితే ఇంతే సంగతులు! వీపు విమానం మోతే!
ఇప్పటి పెద్దవాళ్ళ చిన్నప్పటి సంగతులన్నీ  ఈ మోస్తరుగానే వుంటాయి.
పొద్దున్న ఖమ్మం నుంచి మా సావిత్రక్కయ్య ఫోను. ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి. చెప్పడానికి మా ఇంట్లో ఉగాదులు లేవు, ఉషస్సులు లేవు. అందుకే కాబోలు మాటమార్చి అంది.
“బయట తిరక్కురా! రోజులు బాగా లేవు”
ఎనభయ్ తొమ్మిది నిండి తొంభయ్యవ పడిలో అడుగుపెట్టిన అక్కయ్య, డెబ్బయి నాలుగేళ్ల తమ్ముడికి ఇలా సుద్దులు చెబుతుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

కనపడని శత్రువుతో ఎడతెగని యుద్ధం – భండారు శ్రీనివాసరావు


(Published in ‘నమస్తే తెలంగాణ’ on 25-03-2020)
ప్రస్తుతం  సమస్త మానవాళినీ కలవరపరుస్తున్నది కరోనా అనే మూడక్షరాల పదం. సాధారణంగా, ఈగలు, దోమలు, లేదా ఇతర క్రిమికీటకాల ద్వారా అంటువ్యాధులు వ్యాపిస్తాయి. ఈ కరోనా అనే మాయరోగం మాత్రం మనుషుల నుంచి మనుషులకు పాకుతుంది. ఈ విలక్షణ తత్వమే ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిపట్ల ప్రజల భయాందోళనలు ఒక స్థాయికి మించి ప్రబలడానికి కారణమయింది.
‘పనిచేసే ప్రభుత్వం కావాలని అందరం కోరుకుంటాం. అయితే ప్రభుత్వం నిశ్శబ్దంగా పనిచేస్తోంద’ని ఎవరైనా అంటే ఓ పట్టాన నమ్మం. ఇది మానవ మనస్తత్వం.
‘ఈ వ్యాధి మహమ్మారిలా చుట్టుముడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది’ అనేది ఇలాంటి సందర్భాలలో సాధారణంగా వినబడే మాట.
ఈ మాటలు అనేవాళ్ళు ముందు అర్ధం చేసుకోవాల్సింది ఒక్కటే. ఎవరూ ఈ వ్యాధి రావాలని కోరుకోలేదు. ఎక్కడో చైనాలో పుట్టి చుట్టుపక్కల దేశాలకు పాకి, రోజుల వ్యవధిలోనే  ప్రపంచమంతటా విస్తరించింది. ప్రభుత్వాల అలసత్వం వల్లనో, నిర్లక్ష్యం వల్లనో ఈ కరోనా వ్యాధి మనదేశంలో పురుడు పోసుకోలేదు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే ఈ వ్యాధి మన దేశంలో కాలుమోపింది.
ఈ కరోనా అనేది సరికొత్త అంటు వ్యాధి. దీనిని గురించి ఎవరికీ తెలియదు. ఎలా వస్తుందో తెలియదు. ఎలా పోతుందో తెలవదు. విరుగుడు ఏమిటో అసలే  తెలియదు.  కలరా మొదలైన అంటు వ్యాధులకు రోగ నిరోధక టీకాలు వున్నాయి. కొత్తగా పుట్టుకొచ్చిన ఈ  కరోనా వ్యాధిని అరికట్టడానికి ఆ అవకాశమూ లేదు.
ఇతరేతర వ్యాధులు ప్రబలినప్పుడు ఆ వ్యాధి పీడితులకు బాసటగా వారి బంధుమిత్రులు వుంటారు. చికిత్సచేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు అనేకం అందుబాటులో  వుంటాయి. ఇవ్వడానికి వాక్సిన్లు, వాడడానికి  మందులు వుంటాయి. కానీ కరోనా విషయం పూర్తిగా విభిన్నం. ఈ వ్యాధి సోకిన లేదా సోకినట్టు అనుమానం ఉన్న రోగిని బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా, కుటుంబ సభ్యులను కూడా ముట్టుకోనివ్వకుండా వారిని   ఐసొలేషన్ గదుల్లో ఉంచాలి. చికిత్స పెద్ద ఖరీదైనది కాకపోవచ్చుకానీ ఇన్ని రకాల  ఏర్పాట్లు చేయడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. మొదటి రెండు దశల్లో వ్యాధిని  గుర్తించి చికిత్స చేయగలిగితే ప్రాణ హానికి ఆస్కారం వుండదు. కానీ మూడో దశకు చేరుకుంటే ఇక ఆ రోగిని కాపాడడం కష్టం అంటున్నారు వైద్యులు.
మిగిలిన వ్యాధులు వ్యాపించినప్పుడు బాహ్య ప్రపంచం అంతా మామూలుగానే వుంటుంది. ఆఫీసులు  పనిచేస్తాయి. దుకాణాలు, మార్కెట్లు తెరుస్తారు. రైళ్ళు, బస్సులు, కార్లు  విమానాలతో సహా అన్నీ మామూలుగా రాకపోకలు సాగిస్తాయి. ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం అతి స్వల్పంగా వుంటుంది. అదే కరోనా విషయం తీసుకుంటే పరిస్తితి వేరు. మనిషి నుంచి మనిషికి ఈ వ్యాధి  సోకే ప్రమాదం కారణంగా ఈ వైరస్ అతి త్వరితంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. అంచేత ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే స్వచ్చంద స్వీయ గృహ నిర్బంధం మినహా మరో దారి లేదు.
అందుకే, ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయే పెను ముప్పు ఓ పక్క  పొంచి ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు సాహసం చేసి లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి. ప్రజలు గుంపులుగా తిరుగుతూ, వారికి తెలియకుండానే ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధిని  సంక్రమింప చేసే ప్రమాదం ఉన్నందున, కర్ఫ్యూ వంటి తీవ్రమైన చర్యలను అమలు చేయాల్సిన పరిస్తితి దాపురించింది. మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఈ రోగం శరీరంలో ప్రవేశించిన రెండు వారాల వరకు ఆ విషయం గుర్తించడం సాధ్యం కాదు. ఇప్పటివరకు బయటకు వచ్చిన సమాచారాన్ని బట్టి విదేశాల నుంచి వచ్చిన వారివల్లనే ఈ వ్యాధి వ్యాపిస్తోందని తెలుస్తోంది. విదేశాల్లో బయలు దేరినప్పుడు వ్యాధి సోకినా ఆ విషయం వారికి తెలియదు. స్వదేశం చేరిన తర్వాత అలాంటివాళ్ళు ఎంతో మందిని కలిసి వుంటారు. అలాంటివారినందరినీ ఇప్పుడు వెతికి పట్టుకుని పరీక్షలు చేయాల్సిన బృహత్తర కార్యక్రమం ప్రభుత్వ భుజస్కంధాలపై పడింది. ఇది సాధారణ విషయం కాదు. సముద్రపు ఒడ్డున ఇసుకలో పడిపోయిన సూదిని వెతకడం వంటిది. అయినా ప్రభుత్వం వెనుకాడడం లేదు.
శాంతా బయోటిక్ వ్యవస్థాపకులు శ్రీ వరప్రసాదరెడ్డి ఒక టీవీ ఇంటర్వ్యూ లో చెప్పారు. వారి అమ్మాయి ఆ మధ్య కేరళ రాష్ట్రము నుంచి హైదరాబాదు వచ్చారు. ఇటీవల ఒక వైద్య బృందం వారి ఇంటికి వెళ్లి ఆవిడ ఆరోగ్యం గురించి విచారించి తగిన పరీక్షలు చేసి, కరోనా వ్యాధి లక్షణాలు లేవని నిర్ధారించుకు వెళ్లిందట. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ జాగ్రత్తలు చూసి ఆయన ఆశ్చర్యపోయారట.  అలాగే హైదరాబాదు నగరంలోని హఫీజ్ పేటలో వున్న ఒక కాలనీకి అధికారుల బృందం వెళ్ళింది. పలానా పేరు కలిగిన వ్యక్తులు పలానా రోజున పలానా దేశం నుంచి వచ్చి మీ కాలనీలో వుంటున్నారు, వారికి తక్షణం పరీక్షలు చేయాలని కాలనీ అధ్యక్ష, కార్యదర్శులను అడిగితే వాళ్ళు నివ్వెర పోయారట. విదేశాలనుంచి ఎవరు వచ్చారో అప్పటిదాకా వారికే తెలియదు. వెళ్లి చూస్తే అది నిజమని తేలింది. వెంటనే ఆ వ్యక్తులకు పరీక్షలు చేసి వారిని స్వీయ గృహనిర్బంధంలో వుండాలని చెప్పారట. అప్పటి నుంచి ప్రతిరోజూ ఫోనులో వారిని సంప్రదించి వారి ఆరోగ్య పరిస్తితి గురించి వాకబు చేస్తున్నారట. ఏదో మొక్కుబడిగా కాకుండా ప్రతిరోజూ అలా కనుక్కుంటూ వుండడం  చూసి విదేశాలనుంచి వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట.
గత పదిహేను రోజుల్లో వివిధ దేశాలనుంచి వేలమంది హైదరాబాదు వచ్చి వుంటారు. అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం వుండడం ఒక కారణం కావచ్చు. అలా వచ్చిన వాళ్ళు కార్లలోనో, బస్సుల్లోనో, రైళ్ళలోనో తమ గమ్యస్థానాలకు వెళ్లి వుంటారు. ఈ క్రమంలో వారిలో ఎవరికయినా ఈ వ్యాధి సోకి వుంటే అది ఇతరులకు అంటుకునే ప్రమాదం వుంది. కానీ ఆ ‘ఇతరులు’ ఎవరని గాలింఛి కనిపెట్టడం  సామాన్యమైన విషయం కాదు. నగరాలూ, పట్టణాలు, గ్రామాలు ఇలా అన్నిచోట్లా ప్రభుత్వ యంత్రాంగం అలా వచ్చిన వారికోసం జల్లెడ పట్టి గాలిస్తోంది.
కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తోంది అని మెటికలు విరిచేవాళ్ళు ఈ విషయాలను గమనంలో వుంచుకోవాలి. ఈ వ్యాధిని అరికట్టడం అన్నది ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో లేదు. సమస్త ప్రజానీకం సహకరించినప్పుడే సాధ్యం అవుతుంది. అదే ఆయన చెబుతున్నారు. అదే ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అనవసరంగా రోడ్లమీద తిరగ వద్దంటున్నారు. ఇంటిపట్టునే వుండమంటున్నారు. నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చూస్తామంటున్నారు. కొద్ది రోజులు ఓపిక పడితే పరిస్తితి సర్దుకుంటుందని చెబుతున్నారు.
వినడం మనందరి ధర్మం! ఎందుకంటే ఈ మహమ్మారిని అరికట్టగలిగిన సులువు మన చేతుల్లోనే వుంది. మన చేతల్లోనే వుంది.   (EOM)          

24, మార్చి 2020, మంగళవారం

కేటీఆర్ ది గ్రేట్ – భండారు శ్రీనివాసరావు


ఈ సాయంత్రం ఒక బ్లాగు మిత్రులు శ్యామల రావు గారు ఫోన్ చేసారు. వారి శ్రీమతికి వారానికి రెండు సార్లు డయాలిసిస్ చేయించాలి. భార్యాభర్తలు ఇరువురూ వృద్ధులు. ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి  మధ్యలో కొరానా కర్ఫ్యూ. ఆయనకి కాళ్ళూ చేతులు ఆడక నాకు ఫోన్ చేశారు. నేను మాత్రం ఏం చేయగలను? ఆలిండియా రేడియో నుంచి రిటైర్ అయి ఇప్పటికి పుష్కరం గడిచింది. నా మాట ఎవరు వింటారు. అంచేత ఓ సలహా ఇచ్చాను. కేటీఆర్ గారికి ట్వీట్/ వాట్సప్ చేయండని. ఆయన అలాగే చేశారు. నిమిషం గడవక ముందే ‘Will take care’ అని జవాబు వచ్చింది. మరి కాసేపటిలో కానుగుల శ్రీనివాస్ గారు అనే ఆయన వారికి ఫోన్ చేసి చిరునామా నోట్ చేసుకున్నారట. ఆ ముసలి దంపతుల ఆనందం ఇంతా అంతా కాదు.
“ముందు మీ సలహా విని తప్పించుకోవడానికి అలా చెప్పారని అనుకున్నా. కానీ ఫోన్ వచ్చేసరికి నా చెవులను నేనే నమ్మలేకపోతున్నా. మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం. ప్రభుత్వ స్పందన అద్భుతం” ఫోనులో చెబుతున్నారాయన, కానీ ఆయన కంటి వెంట కారుతున్న ఆనంద భాష్పాలు ఆ మాటల్లో  నాకు కనబడుతూనే వున్నాయి.
సామాన్యులు కృతజ్ఞత తెలిపే విధానం ఇలాగే వుంటుంది.
‘నేనున్నాను’ అని భరోసా ఇచ్చే ప్రభుత్వాన్ని వారెప్పుడు మరచిపోరు.  

ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయరా?


ప్రభుత్వ ఉద్యోగులు సరిగా పనిచేయరనే అపోహ చాలామందిలో వుంది.  అది అపోహ మాత్రమే, వాస్తవం కాదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, రాత్రీ  పగలు అనకుండా, కుటుంబాలకు దూరంగా ఉంటూ, అహరహం పనిచేసేవారు ప్రభుత్వ ఉద్యోగులలోనే కనబడతారు. సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ బి. దానం, ఉమ్మడి రాష్ట్రంలో  ఉత్తరాంధ్రలో పనిచేసే సమయంలో అక్కడే శ్రీకాకుళంలో శ్రీ విశాఖ గ్రామీణ బాంక్ చైర్మన్ గా ఉన్న మా రెండో అన్నగారు రామచంద్రరావుతో అనేవారట.
‘ఎవరెన్నయినా అననివ్వండి, గవర్నమెంటు వాళ్ళు పనిచేసే పద్దతే వేరు. తుపాన్లు, వరదలు వచ్చినప్పుడు చూడండి,  సరైన రోడ్లు లేకపోయినా దెబ్బతిన్న ప్రతి గ్రామానికి వెడతారు. బియ్యం మూటలు తీసుకువెళ్ళి బాధితులకు పంచిపెడతారు. ఎన్నికలు వస్తే పార్వతీపురం వంటి ప్రాంతాలలోని  సుదూర గ్రామీణ ప్రాంతాలకు బ్యాలెట్ పెట్టెలు మోసుకుని వెడతారు. ఆవూళ్ళల్లో వారికి సరైన భోజనం దొరకదు, వసతి వుండదు. అయినా పై అధికారులు చెప్పిన టైముకు అక్కడ హాజరు అవుతారు. కొన్ని ఊళ్లల్లో కక్షలు కార్పణ్యాలు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలవదు. అయినా వాళ్ళు అన్నిటికీ సిద్ధపడి విధులు నిర్వహిస్తారు. మరి అలాంటప్పుడు, ‘ఏమీ పనిచేయరు, జీతాలు తీసుకోవడం తప్ప’ అని వాళ్ళని నిందించడం సబబేనా?’ దానం గారి ప్రశ్న.     

దినపత్రికల లాక్ డౌన్ ???


కర్ఫ్యూ నుంచి మీడియాకు మినహాయింపు ఇచ్చారు కానీ కొన్ని మీడియా సంస్థలు (పత్రికలు) ఈ వెసులుబాటు ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంలో లేనట్టు కానవస్తోంది. హైదరాబాదు నుంచి వెలువడుతున్న కొన్ని ప్రధాన పత్రికలు ఈ నెలాఖరువరకు ముద్రణ నిలిపివేసే ఆలోచనలో వున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పత్రికలను ఇళ్ళకు చేరవేసే వ్యవస్థ (వెండర్లు, పేపర్ బాయిస్) లో కరోనా కారణంగా కొన్ని అడ్డంకులు తలెత్తడం, రవాణా వ్యవస్థలో ఏర్పడ్డ అవరోధాల కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన న్యూస్ ప్రింట్ సకాలానికి రాకపోవడం, రోజులో చాలాభాగం సిబ్బంది పనిచేసే అవసరం ఉన్న కారణం వల్ల ఉద్యోగులకు కలిగే ఇబ్బందిని తగ్గించాలనే నిర్ణయం ఇలా అనేక కారణాలతో పత్రికాముద్రణ నిలిచి పోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల ఆన్ లైన్ లో పత్రికలను పాఠకులకు అందించే వెసులుబాటును అందిపుచ్చుకునే ఉద్దేశ్యం కూడా మరో కారణం. ఏతావాతా తెలుగు పత్రికలలో చాలావరకు ముద్రణకు స్వస్తి చెప్పే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ దిశలో డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి చొరవ తీసుకుంటున్నాయని, ఈ గ్రూపు తమ రెండు పత్రికల ముద్రణకు నేడో రేపో స్వస్తి చెప్పబోతోందని విశ్వసనీయ వర్గాల భోగట్టా. మరికొన్ని అదేబాటలో వున్నాయని, అయితే ఉగాది పండుగ రోజున ప్రకటనల రూపంలో వచ్చే అదనపు రాబడి విషయం గురించి మీనమేషాలు లెక్కబెడుతున్నట్టు తెలుస్తోంది.