25, మార్చి 2020, బుధవారం

కనపడని శత్రువుతో ఎడతెగని యుద్ధం – భండారు శ్రీనివాసరావు


(Published in ‘నమస్తే తెలంగాణ’ on 25-03-2020)
ప్రస్తుతం  సమస్త మానవాళినీ కలవరపరుస్తున్నది కరోనా అనే మూడక్షరాల పదం. సాధారణంగా, ఈగలు, దోమలు, లేదా ఇతర క్రిమికీటకాల ద్వారా అంటువ్యాధులు వ్యాపిస్తాయి. ఈ కరోనా అనే మాయరోగం మాత్రం మనుషుల నుంచి మనుషులకు పాకుతుంది. ఈ విలక్షణ తత్వమే ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిపట్ల ప్రజల భయాందోళనలు ఒక స్థాయికి మించి ప్రబలడానికి కారణమయింది.
‘పనిచేసే ప్రభుత్వం కావాలని అందరం కోరుకుంటాం. అయితే ప్రభుత్వం నిశ్శబ్దంగా పనిచేస్తోంద’ని ఎవరైనా అంటే ఓ పట్టాన నమ్మం. ఇది మానవ మనస్తత్వం.
‘ఈ వ్యాధి మహమ్మారిలా చుట్టుముడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది’ అనేది ఇలాంటి సందర్భాలలో సాధారణంగా వినబడే మాట.
ఈ మాటలు అనేవాళ్ళు ముందు అర్ధం చేసుకోవాల్సింది ఒక్కటే. ఎవరూ ఈ వ్యాధి రావాలని కోరుకోలేదు. ఎక్కడో చైనాలో పుట్టి చుట్టుపక్కల దేశాలకు పాకి, రోజుల వ్యవధిలోనే  ప్రపంచమంతటా విస్తరించింది. ప్రభుత్వాల అలసత్వం వల్లనో, నిర్లక్ష్యం వల్లనో ఈ కరోనా వ్యాధి మనదేశంలో పురుడు పోసుకోలేదు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే ఈ వ్యాధి మన దేశంలో కాలుమోపింది.
ఈ కరోనా అనేది సరికొత్త అంటు వ్యాధి. దీనిని గురించి ఎవరికీ తెలియదు. ఎలా వస్తుందో తెలియదు. ఎలా పోతుందో తెలవదు. విరుగుడు ఏమిటో అసలే  తెలియదు.  కలరా మొదలైన అంటు వ్యాధులకు రోగ నిరోధక టీకాలు వున్నాయి. కొత్తగా పుట్టుకొచ్చిన ఈ  కరోనా వ్యాధిని అరికట్టడానికి ఆ అవకాశమూ లేదు.
ఇతరేతర వ్యాధులు ప్రబలినప్పుడు ఆ వ్యాధి పీడితులకు బాసటగా వారి బంధుమిత్రులు వుంటారు. చికిత్సచేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు అనేకం అందుబాటులో  వుంటాయి. ఇవ్వడానికి వాక్సిన్లు, వాడడానికి  మందులు వుంటాయి. కానీ కరోనా విషయం పూర్తిగా విభిన్నం. ఈ వ్యాధి సోకిన లేదా సోకినట్టు అనుమానం ఉన్న రోగిని బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా, కుటుంబ సభ్యులను కూడా ముట్టుకోనివ్వకుండా వారిని   ఐసొలేషన్ గదుల్లో ఉంచాలి. చికిత్స పెద్ద ఖరీదైనది కాకపోవచ్చుకానీ ఇన్ని రకాల  ఏర్పాట్లు చేయడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. మొదటి రెండు దశల్లో వ్యాధిని  గుర్తించి చికిత్స చేయగలిగితే ప్రాణ హానికి ఆస్కారం వుండదు. కానీ మూడో దశకు చేరుకుంటే ఇక ఆ రోగిని కాపాడడం కష్టం అంటున్నారు వైద్యులు.
మిగిలిన వ్యాధులు వ్యాపించినప్పుడు బాహ్య ప్రపంచం అంతా మామూలుగానే వుంటుంది. ఆఫీసులు  పనిచేస్తాయి. దుకాణాలు, మార్కెట్లు తెరుస్తారు. రైళ్ళు, బస్సులు, కార్లు  విమానాలతో సహా అన్నీ మామూలుగా రాకపోకలు సాగిస్తాయి. ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం అతి స్వల్పంగా వుంటుంది. అదే కరోనా విషయం తీసుకుంటే పరిస్తితి వేరు. మనిషి నుంచి మనిషికి ఈ వ్యాధి  సోకే ప్రమాదం కారణంగా ఈ వైరస్ అతి త్వరితంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. అంచేత ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే స్వచ్చంద స్వీయ గృహ నిర్బంధం మినహా మరో దారి లేదు.
అందుకే, ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయే పెను ముప్పు ఓ పక్క  పొంచి ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు సాహసం చేసి లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి. ప్రజలు గుంపులుగా తిరుగుతూ, వారికి తెలియకుండానే ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధిని  సంక్రమింప చేసే ప్రమాదం ఉన్నందున, కర్ఫ్యూ వంటి తీవ్రమైన చర్యలను అమలు చేయాల్సిన పరిస్తితి దాపురించింది. మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఈ రోగం శరీరంలో ప్రవేశించిన రెండు వారాల వరకు ఆ విషయం గుర్తించడం సాధ్యం కాదు. ఇప్పటివరకు బయటకు వచ్చిన సమాచారాన్ని బట్టి విదేశాల నుంచి వచ్చిన వారివల్లనే ఈ వ్యాధి వ్యాపిస్తోందని తెలుస్తోంది. విదేశాల్లో బయలు దేరినప్పుడు వ్యాధి సోకినా ఆ విషయం వారికి తెలియదు. స్వదేశం చేరిన తర్వాత అలాంటివాళ్ళు ఎంతో మందిని కలిసి వుంటారు. అలాంటివారినందరినీ ఇప్పుడు వెతికి పట్టుకుని పరీక్షలు చేయాల్సిన బృహత్తర కార్యక్రమం ప్రభుత్వ భుజస్కంధాలపై పడింది. ఇది సాధారణ విషయం కాదు. సముద్రపు ఒడ్డున ఇసుకలో పడిపోయిన సూదిని వెతకడం వంటిది. అయినా ప్రభుత్వం వెనుకాడడం లేదు.
శాంతా బయోటిక్ వ్యవస్థాపకులు శ్రీ వరప్రసాదరెడ్డి ఒక టీవీ ఇంటర్వ్యూ లో చెప్పారు. వారి అమ్మాయి ఆ మధ్య కేరళ రాష్ట్రము నుంచి హైదరాబాదు వచ్చారు. ఇటీవల ఒక వైద్య బృందం వారి ఇంటికి వెళ్లి ఆవిడ ఆరోగ్యం గురించి విచారించి తగిన పరీక్షలు చేసి, కరోనా వ్యాధి లక్షణాలు లేవని నిర్ధారించుకు వెళ్లిందట. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ జాగ్రత్తలు చూసి ఆయన ఆశ్చర్యపోయారట.  అలాగే హైదరాబాదు నగరంలోని హఫీజ్ పేటలో వున్న ఒక కాలనీకి అధికారుల బృందం వెళ్ళింది. పలానా పేరు కలిగిన వ్యక్తులు పలానా రోజున పలానా దేశం నుంచి వచ్చి మీ కాలనీలో వుంటున్నారు, వారికి తక్షణం పరీక్షలు చేయాలని కాలనీ అధ్యక్ష, కార్యదర్శులను అడిగితే వాళ్ళు నివ్వెర పోయారట. విదేశాలనుంచి ఎవరు వచ్చారో అప్పటిదాకా వారికే తెలియదు. వెళ్లి చూస్తే అది నిజమని తేలింది. వెంటనే ఆ వ్యక్తులకు పరీక్షలు చేసి వారిని స్వీయ గృహనిర్బంధంలో వుండాలని చెప్పారట. అప్పటి నుంచి ప్రతిరోజూ ఫోనులో వారిని సంప్రదించి వారి ఆరోగ్య పరిస్తితి గురించి వాకబు చేస్తున్నారట. ఏదో మొక్కుబడిగా కాకుండా ప్రతిరోజూ అలా కనుక్కుంటూ వుండడం  చూసి విదేశాలనుంచి వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట.
గత పదిహేను రోజుల్లో వివిధ దేశాలనుంచి వేలమంది హైదరాబాదు వచ్చి వుంటారు. అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం వుండడం ఒక కారణం కావచ్చు. అలా వచ్చిన వాళ్ళు కార్లలోనో, బస్సుల్లోనో, రైళ్ళలోనో తమ గమ్యస్థానాలకు వెళ్లి వుంటారు. ఈ క్రమంలో వారిలో ఎవరికయినా ఈ వ్యాధి సోకి వుంటే అది ఇతరులకు అంటుకునే ప్రమాదం వుంది. కానీ ఆ ‘ఇతరులు’ ఎవరని గాలింఛి కనిపెట్టడం  సామాన్యమైన విషయం కాదు. నగరాలూ, పట్టణాలు, గ్రామాలు ఇలా అన్నిచోట్లా ప్రభుత్వ యంత్రాంగం అలా వచ్చిన వారికోసం జల్లెడ పట్టి గాలిస్తోంది.
కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తోంది అని మెటికలు విరిచేవాళ్ళు ఈ విషయాలను గమనంలో వుంచుకోవాలి. ఈ వ్యాధిని అరికట్టడం అన్నది ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో లేదు. సమస్త ప్రజానీకం సహకరించినప్పుడే సాధ్యం అవుతుంది. అదే ఆయన చెబుతున్నారు. అదే ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అనవసరంగా రోడ్లమీద తిరగ వద్దంటున్నారు. ఇంటిపట్టునే వుండమంటున్నారు. నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చూస్తామంటున్నారు. కొద్ది రోజులు ఓపిక పడితే పరిస్తితి సర్దుకుంటుందని చెబుతున్నారు.
వినడం మనందరి ధర్మం! ఎందుకంటే ఈ మహమ్మారిని అరికట్టగలిగిన సులువు మన చేతుల్లోనే వుంది. మన చేతల్లోనే వుంది.   (EOM)          

కామెంట్‌లు లేవు: