12, మార్చి 2020, గురువారం

ఓటు ఖరీదు – భండారు శ్రీనివాసరావు

ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థను కుళ్ళబొడుస్తున్న సమస్త రుగ్మతలకు డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు ఓటరు గురవుతూ ఉండడమే కారణమని చాలామంది అభిప్రాయం. నిజానికి అది నిజం కూడా. ఎందుకంటే ఈ అభిప్రాయం కలిగివున్న వాళ్ళు కూడా ఓటర్లే. ఆ విషయాన్ని ఈ సిద్దాంతకర్తలు మరచిపోకూడదు.
‘పక్క వూళ్ళో ఓటుకి రెండువేలు ఇస్తున్నారు, మాకు కూడా అలాగే ఇవ్వండి’ అని డిమాండ్ చేసి మరీ పుచ్చుకుని ఓట్లను తెగనమ్ముకుంటున్నారు అనేది మరో ఆరోపణ. అంటే ఏమిటన్న మాట. ఒకరిని చూసి మరొకరు నేర్చుకుంటున్నారని ఒప్పుకుంటున్నట్టే కదా!
అదే నిజమైనప్పుడు ఓట్ల కోసం ఎమ్మెల్యేలను విమానాల్లో తరలించి పంచ నక్షత్రాల హోటళ్ళలో రాజభోగాలు అమర్చి రాజకీయ పార్టీలు ఇవ్వచూపుతున్న అనేకానేక ప్రలోభాలను గురించి సామాన్య జనం కూడా పత్రికల్లో చదువుతున్నారు, టీవీల్లో చూస్తున్నారు. కదా! మరి, రెండు వేలు పెట్టి కొనుగోలు చేసిన వారి ఓట్లతో నెగ్గిన ఆ ప్రజాప్రతినిధులు, అదే ఓటును గంటకు వేలాది రూపాయల ప్రలోభాలకు తాకట్టు పెడుతున్న సంగతి తెలిసినప్పుడు వారికి ఎలా అనిపిస్తుంది. రెండు పెద్ద కరెన్సీ నోట్లు, ఓ సీసాడు మద్యంతో కొన్న ఓటు విలువ తమ కళ్ళముందే కొన్ని వేలరెట్లు పెరిగిపోవడం చూసి వారి కడుపు రగలకుండా ఉంటుందా!
కాబట్టి ఓటును మద్యానికి అమ్మినా, కరెన్సీ నోట్లకు అమ్మినా, మహారాజ భోగాలకు, మంత్రి పదవులకు అమ్ముకున్నా ఒకటే అని సూత్రీకరించండి, అప్పుడు వాదన సబబుగా వుంటుంది. న్యాయం అందరికీ ఒకటే.


ఇలా అని, ఓటర్లను ప్రలోభపెట్టడాన్ని నేను సమర్ధిస్తున్నాను అని అనుకోవద్దు. నిజం నిష్టూరంగానే వుంటుంది.అది మరవద్దు.