30, నవంబర్ 2016, బుధవారం

భయమా! గౌరవమా!


పూర్వం సినిమాహాళ్ళలో విధిగా జాతీయ గీతం వేసేవాళ్ళు. జనం అందరూ గౌరవపురస్సరంగా లేచి నిలబడేవారు. ఆ తరువాత అ పద్దతికి స్వస్తి చెప్పారు. ఇప్పుడు సుప్రీం ఆదేశం అంటున్నారు. చూడాలి.
వెనుక మాస్కోలో వున్నప్పుడు ఒక జోక్ చెప్పుకునేవారు (పెరిస్త్రోయికా కాలంలో)
సోవియట్ యూనియన్ లో స్టాలిన్ హవా నడిచేరోజుల్లో ప్రతి సినిమా హాల్లో ఆటకు ముందు స్టాలిన్ బొమ్మ వేసేవాళ్ళు. వెంటనే జనం అందరూ లేచి సాల్యూట్ చేసేవాళ్ళు.
ఒకరోజు స్టాలిన్ సినిమాకి వెడితే యధాప్రకారం జనం నిలబడి సాల్యూట్ చేశారు. అది తనే కనుక స్టాలిన్ నిలబడలేదు. గర్వంగా పక్కవాడితో అన్నాడు.
“స్టాలిన్ అంటే అంత గౌరవమా!” అని.
చీకట్లో గుర్తుపట్టలేదు కాబోలు జవాబు ఇలా వచ్చింది.

“గౌరవమా పాడా! భయం. నిలబడకపోతే సైబీరియా మంచు ఎడారుల్లో ఒదులుతాడు ఆ  పాపిష్టోడు.”     

మంచికోసం అయితే మార్పు మంచిదే!


స్వాతంత్రం  వచ్చిన  పదేళ్లకు 1957 లో దేశంలో డెసిమల్ పద్దతిలో కొత్త నాణేలను ప్రవేశ పెట్టారు. మా చిన్న తనంలో తళతళ మెరిసే నయా పైసాలు వచ్చాయి. జనాలకు కొత్త నాణేలు  అలవాటు అయ్యేవరకూ అప్పటివరకు చెలామణీ లో వున్న అర్ధరూపాయలు, పావలాలు, బేడలు, అణాలు,అర్ధణాలు, కాణీలు, చిల్లు కాణీలను కూడా చెలామణీ లోనే ఉంచారు. కాలక్రమంలో అవి కనుమరుగయిపోయాయి. అలాగే తూకాలకు వాడే  వీసెలు, తులాల  స్థానంలో కిలోగ్రాములు, శేర్లు, గిద్దెల స్థానంలో లీటర్లు రంగప్రవేశం చేసాయి. దూరాలకు వాడే మైలురాళ్ళ కొలమానాన్ని కిలోమీటర్లు ఆక్రమించాయి. అప్పటికి దేశంలో నూటికి తొంభయి శాతం జనాభా అంగుష్ఠ మాత్రులు. అంటే నిశానీదారులు. వేలి ముద్ర తప్ప సంతకం చేయడం కూడా రాని నిరక్షరాస్యులు. అయినా మార్పును సంతోషంగా ఆహ్వానించారు. ఎలాటి ఇబ్బందీ లేకుండా అలవాటు పడ్డారు.
స్వతంత్ర భారతంలో వచ్చిన మరో గొప్ప మార్పు ఎన్నికల ద్వారా ప్రభుత్వాలు ఏర్పడడం. వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించారు. మొదట్లో పోటీలో వున్న ప్రతి పార్టీకీ (అభ్యర్ధికీ) ఒక్కో గుర్తు కేటాయించేవారు. కాంగ్రెస్ పార్టీకి  కాడి జోడెడ్లు, కమ్యూనిష్టులకు కంకీ కొడవలి, సుత్తీ కొడవలి ఇలా. ప్రతి గుర్తుకూ విడివిడిగా బ్యాలెట్ బాక్సులు ఉండేవి. ఖాళీ కిరోసిన్ డబ్బాలకు కాగితం అంటించి దానిపై పార్టీ గుర్తు అతికించే వారు. తరువాత ప్రతి డబ్బాను తెరిచి ఓట్లు లెక్కబెట్టి ఫలితం ప్రకటించేవాళ్ళు. దరిమిలా బ్యాలెట్ పత్రాలు వచ్చాయి. అభ్యర్దులందరి పేర్లు ఒకే బ్యాలెట్ పై వుండేవి. తరువాత పేర్లు కూడా తీసేసి కేవలం గుర్తులు మాత్రమే ఉంచేవాళ్ళు. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్ధికి ఓటువేసిన తరువాత దాన్ని బ్యాలెట్ పెట్టెలో వేసేవాళ్ళు. ఆ తరువాత ఎలక్ట్రానిక్  ఓటింగ్ మిషన్లు వచ్చాయి. ఓటర్లలో అధిక శాతం నిరక్షరాస్యులు అయినప్పటికీ కాలం తెస్తున్న మార్పులకు బాగా అలవాటుపడ్డారు. కొత్త విషయాలను సులువుగా గ్రహించడానికి చదువు అక్కరలేదని నిరక్షర భారతం పలుపర్యాయాలు నిరూపించి చూపింది.
ఇంతేనా అంటే ఇంకా వుంది.
పూర్వం టూరింగు టాకీసుల్లోనే కాకుండా, మంచి సినిమా థియేటర్లలో కూడా జనాలు చుట్టలు, బీడీలు, సిగరెట్లు తాగేవాళ్లు. పొగతాగరాదు అని స్లయిడ్లు వేసేవాళ్ళు కానీ ఎవరూ పట్టించుకునే వాళ్ళు కాదు. తరువాత ఎయిర్ కండిషన్  ధియేటర్లు వచ్చాక సినిమా హాల్లో పొగతాగ కూడదు అనే సంగతిని సామాన్య జనం ఒకరిని చూసి మరొకరు నేర్చుకున్నారు. జరిమానాలు, శిక్షల బెదిరింపుల వల్లకాదు. అంటే ఏమిటి? మార్పును ఆహ్వానించే తత్వం జనంలోనే  వుంది. వాళ్ళు మార్పుకు ఏనాడు వ్యతిరేకులు కాదు.
ఇప్పుడు డబ్బు మార్పిడికి సెల్ ఫోన్లు వాడమంటున్నారు. తప్పకుండా వాడుతారు. అయితే ఇంతకు  ముందు చెప్పిన వాటికీ దీనికీ ఓ స్థూలమైన తేడా వుంది. అవి జనం చేతులో వున్నాయి. ఇదలా కాదు. ఇంటర్నెట్ అవసరం. అదీ ఎలాంటి అవాంతరాలు లేకుండా.
నెట్ ఉపయోగించడానికి జనం సిద్ధంగానే వున్నారు. అయితే నెట్ అందరికీ అందుబాటులో ఉందా అనేదే అసలు ప్రశ్న.     

ఏలికలు సమాధానం చెప్పాలి.

29, నవంబర్ 2016, మంగళవారం

నాకు పరిష్కారం దొరికింది. కానీ......


ఇరవై ఒక్క రోజుల అనుభవం నన్ను కాస్తో కూస్తో ‘నెట్’ అక్షరాస్యుడిని చేసింది. పిల్లల సాయంతో మొత్తానికి నా బ్యాంకు ఖాతాను నా మొబైల్ ఫోనుతో అనుసంధానం చేయగలిగాను. ఊబెర్ అనాలో ఒబెర్ అనాలో ఏదైతేనేం ఒక కారు బుక్ చేసి దిగాల్సిన చోట దర్జాగా దిగిపోయాను. జేబులో చేయి పెట్టేపని లేకుండానే ట్రాన్సాక్షన్ చిటికెలో జరిగిపోయింది. దిగుతూ డ్రైవర్ మొహంలోకి చూసాను. దిగాలుగా వున్నాడు. కదిలిస్తే కధ చెప్పాడు.
“పెద్ద నోట్ల రద్దుకు పూర్వం అందరూ టాక్సీ ఫేర్ చెల్లించి దిగి పోయేవాళ్ళు. ఇప్పుడందరూ ఇలా పే చేసేసి  వెళ్ళిపోతున్నారు. వెనక డీసెల్ కొట్టించుకోవడానికి పాసింజర్లు ఇచ్చే పైకం డబ్బులు ఉండేవి. ఇప్పుడా డబ్బులు మా బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. డ్రా చేసుకోవాలంటే ఓ పూట పనిపోతోంది. పెట్రోలు బంకుల్లో మాకు కూడా ఇలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. చేసారేమో తెలవదు. ‘చేతుల్లో ఎప్పుడూ  స్మార్ట్ ఫోన్లు వుంటాయి, ఈ మాత్రం తెలవదా’ అంటే తెలవదు సారూ”  

ఏం చెప్పను? నాదీ అదే పరిస్తితి.

28, నవంబర్ 2016, సోమవారం

ఫస్ట్ కామెంట్


పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, కొద్దిసేపటి క్రితం ముగిసిన  విలేకరుల సమావేశంలో మాట్లాడిన తీరు గమనిస్తే, ఆర్ధిక గణాంకాలను ఆశువుగా పేర్కొన్న తీరును పరిశీలిస్తే  ఆయన ఈ అంశంపై చాలా కసరత్తు చేసినట్టు,  సంపూర్ణ అవగాహనతో వున్నట్టు మొదటి అభిప్రాయం కలుగుతుంది.
ఈ విషయంలో మోడీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు అధికారికంగా ఓ పక్క ప్రకటిస్తూనే మరో పక్క వినయపూరితమైన హెచ్చరిక చేశారు.
“నూటికి నూరు శాతం అవినీతి రహిత, వందకు వంద శాతం నల్ల ధనం రహిత భారతం లక్ష్యంగా ఈ పధకం అమలు జరగాలి. అప్పుడే ఇది సఫల ప్రయోగం అనిపించుకుంటుంది. లేదా విఫల ప్రయోగం అనే అపప్రధను మోయాల్సి వుంటుంది. అలా జరగడం జాతికి మేలు చేయదు” అని స్పష్టంగా చెప్పారు.

ఈ నిర్ణయం అమలు పర్యవేక్షణకు కేంద్రం నియమించిన ముఖ్యమంత్రుల కమిటీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నేతృత్వం అప్పగించడం పై అడిగిన ప్రశ్నకు ‘మంచిదేగా’ అంటూ ఇచ్చిన కేసీఆర్ సమాధానం హుందాగా వుంది.   

జంధ్యాల దటీజ్ జే.వి.డి.ఎస్. శాస్త్రి


మితృడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు, కీర్తిశేషులు జంధ్యాల అపురూపమైన ఫోటో (ఆయన అసలు పేరు జే.వి.డి.ఎస్. శాస్త్రి, జంధ్యాల అనేది ఇంటి పేరు)



Photo Courtesy: Shri Kusuma Mohanrao Kilaru

అర్ధం చేసుకోరూ......


ఏకాంబరం, లంబోదరం మాట్లాడుకుంటున్నారు. వీళ్లిద్దరిదీ రైలు పట్టాల సంభాషణ. సమాంతరంగా పోతుంటాయి కానీ ఎన్నటికీ కలవ్వు.
ఏకాంబరం: డాక్టరు రోగికి ఆపరేషన్ చేస్తున్నాడు. నొప్పి తెలియకుండా మత్తు మందు ఇచ్చాడు. రోగి స్పృహలోకి రావడానికి కొంత నిర్దిష్ట వ్యవధి వుంటుంది. అతడికి మెలకువ వచ్చేవరకు రోగి బంధువులు గాభరా పడుతుంటారు కానీ, విషయం తెలిసిన వైద్యుడు ఏమాత్రం కంగారు పడడు. అంతా అర్ధం చేసుకోవడంలో వుంది.

లంబోదరం: నిజమే. మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేశాడు. డోసు సరిగా కుదరాలి. లేకపోతే, ఆపరేషన్ సక్సెస్ అయినా రోగి ఆమత్తునుంచి తేరుకోకుండానే కన్ను మూస్తాడు. అలా జరుగుతుందనే ఈ కంగారు. అర్ధం చేసుకోమనే నేను చెప్పేది.

27, నవంబర్ 2016, ఆదివారం

పబ్లిక్ పల్స్

“ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏమవుతుంది? జనం ఏమనుకుంటున్నారు? మళ్ళీ చంద్రబాబే కావాలనుకుంటున్నారా? జగన్ రావాలనుకుంటున్నారా? చంద్ర బాబు పధకం పారుతోందా?” అనే పలు ప్రశ్నలకు తాము జరిపిన సర్వేలో వెల్లడయిన సమాధానాలను  రేపటి నుంచి అందించబోతున్నట్టు ఒక పత్రిక నేడు ప్రకటించింది.
‘ఆ పత్రిక  పాలసీ  తెలిసినదే కాబట్టి జవాబులు ఎలా వుండబోతున్నాయో తెలుసుకోవడానికి రేపటివరకు ఆగక్కరలేద’ని వాట్స్ ఆప్ లో ఒక అభిప్రాయం చక్కర్లు కొడుతోంది. మరో పత్రిక ఇదే రకమైన సర్వే చేస్తే పబ్లిక్  పల్స్ మరో రకంగా వుంటుందని ముక్తాయింపు ఇచ్చారు కూడా!

సర్వేల మీద జనం నమ్మకం తగ్గిపోతోందా! పత్రికల మీద విశ్వాసం సడలిపోతోందా!!  
ఇది తెలుసుకోవడానికి ఇంకో సర్వే అవసరమవుతుందేమో!
సర్వే జనా సుఖినోభవంతు