18, ఏప్రిల్ 2015, శనివారం

చీలి కలిసే 'ఐక్యతాప్రయోగం' ఫలిస్తుందా?


(Published in 'SURYA' telugu daily in it's edit page on 19-04-2015, SUNDAY)

'జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుంద'న్న తెలుగు సామెతను పోలే ఓ పద ప్రయోగం ఒకటి  బీజేపీ జాతీయ  అధ్యక్షుడు అమిత్ షా నోట వినబడింది. పూర్వపు జనతా దళ్ లో భాగస్వాములుగా వుండి తదనంతరం చీలిపోయి వేరు కుంపట్లు పెట్టుకున్న ఆరు ప్రాంతీయ పార్టీలు  'జనతా పరివార్'  అనే పేరుతొ ఒక్కటయిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ, ఆ కలయికకు ఓ కొత్త పోలిక చెప్పారు.  'సున్నాతో మరో సున్నా కలిస్తే గుండు సున్నా అవుతుంద'ని చమత్కరించారు.  

  
అమిత్ షా అభిప్రాయంతో ఏకీభవించాల్సిన పరిస్తితి లేకపోయినా అసలీ విలీనీకరణ నేపధ్యాన్ని తడిమి చూసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతోంది. ఈ ఆరు పార్టీలకు వేర్వేరు పేర్లు ఉన్నప్పటికీ, వాటికి నాయకులుగా వున్న నేతల పేర్లను జోడించి  చెబితేనేకాని  ఆ పార్టీలకు ఓ గుర్తింపు లభించని ఓ వింత పరిస్తితి వుంది. ప్రాంతీయ పార్టీల మనుగడ వాటి నాయకత్వ దక్షత మీదనే ఆధారపడి ఉంటుందన్నది అనుభవం నేర్పే పాఠం. తమిళనాట ఈ సంస్కృతి మరింత వూడలు దిగి విస్తరించింది. పార్టీలు, సిద్ధాంతాలు ఏమైనప్పటికీ,  వాటి కంటే కూడా ఆయా పార్టీల నాయకుల పేరు, ప్రఖ్యాతులు చెప్పే  అవి కాయలు అమ్ముకోవాల్సిన దుస్తితి ఉందన్నది  బహిరంగ రహస్యమే. ఈ ఆరు ప్రాంతీయ  పార్టీల పరిస్తితి ఇందుకు భిన్నం ఏమీ కాదు. ఉదాహరణకు భారత జాతీయ లోక్ దళ్. దీనికి ఇంటి పేరు మాదిరిగా ముందు 'చౌతాలా' అని తగిలిస్తేనే కాని అ పార్టీ గురించి ఎవ్వరికీ తెలియదు. అలాగే, 'ములాయం' సమాజ్ వాది  పార్టీ, 'లాలూ' రాష్ట్రీయ జనతా దళ్, 'నితీష్' జనతా దళ్(యు), 'దేవెగౌడ' జనతా దళ్ (ఎస్), 'కమల్ మొరార్క' సమాజ్ వాదీ జనతా పార్టీ. ఇలా ఆయా నాయకుల పేర్లతో చెలామణీ అవుతున్న ఈ పార్టీలన్నీ 'జనతా పరివార్' అనే పేరుతొ ఏకం కావాలని సంకల్పించాయి. ఈ ప్రయోగ సాఫల్య, వైఫల్యాలను నిర్ణయించే తరుణం కూడా అయిదారునెలల్లోనే రాబోతోంది. ఈ పార్టీల విలీనంపై ప్రజామోదం ఏ తీరులో వుండబోయేది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోతుంది.           
గతంలో కూడా భారత రాజకీయాల్లో ఇటువంటి ప్రయోగాలు జరిగాయి. ఎమర్జెన్సీ తరువాత జరిగిన 'జనత' ప్రయోగమే విజయవంతం అయింది. కాంగ్రెస్ పార్టీని కలలో, ఇలలో వ్యతిరేకించే అనేక పార్టీలు ఒకే పార్టీగా రంగూ రూపూ మార్చుకుని ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఒకే పేరు, ఒకే గుర్తు, ఒకే జెండా, ఒకే ఎజెండా' తో కాంగ్రెస్  తో తలపడి, ఆ పార్టీని మట్టి కరిపించాయి.
అంతకు ముందు వరకు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ తన రాజకీయ ప్రత్యర్ధులకు చుక్కలు చూపించారు. వామ పక్షాలను మినహాయిస్తే ఆ రోజుల్లో వున్నవి నాలుగే జాతీయ ప్రతిపక్షాలు. కాంగ్రెస్ (ఓ), భారతీయ జన సంఘ్, భారతీయ లోక్ దళ్, సోషలిష్ట్ పార్టీ. ఈ పార్టీలకు కాంగ్రెస్ వ్యతిరేకత అన్న ఉమ్మడి అంశం తప్పిస్తే సిద్ధాంతాలు సూత్రాల విషయంలో ఒకటికొకటి పొసగని పరిస్తితే. దండలో దారంలా ఆ పార్టీలను ఆ ఒక్క అంశమే దగ్గరకు తీసింది. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కొన్ని దుందుడుకు చర్యలు వాటి ఐక్యతకు ప్రజామోదాన్ని అందించింది. కీర్తి శేషులు లోక్ నాయక్  జయప్రకాష నారాయణ్ నాయకత్వం ఈ పార్టీల కలయికకు ఒక నిబద్ధతను కల్పించింది. ఫలితం ప్రప్రధమ విలీన ప్రయోగం సాధించిన అద్భుత విజయం.          
తదనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా ఏర్పడ్డ జనతాపార్టీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన పార్టీలు కలిసి   వూడలు దిగిన కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెళ్లగించి వేసాయి. మొత్తం 542 లోక్ సభ స్థానాల్లో 345 స్థానాలను  కైవసం చేసుకున్నాయి. స్వాతంత్రానంతరం  దేశంలో, మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా  మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటయింది. కాంగ్రెస్ కు దాని మిత్ర పక్షాలకు కేవలం 189 సీట్లు మాత్రమె దక్కాయి. అవీ ఎక్కువగా దక్షిణ భారతంలో. ఉత్తర భారతంలో ఆ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకు పోయింది. ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీతో సహా ఆ పార్టీ అతిరధ మహారధులందరూ పరాజయం పాలయ్యారు. యావత్తు ఉత్తర భారత రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ  కేవలం రెండే రెండు సీట్లతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఈ ఘోర పరాజయం ఇందిరాగాంధీ కళ్ళు తెరిపించింది. ఎమర్జెన్సీ లో జరిగిన ఆకృత్యాలకు ఆమె స్వయంగా జాతికి క్షమాపణ చెప్పారు.
అలా మొదలయిన ఓ అద్భుత రాజకీయ ప్రయోగం కొందరు స్వార్ధపరులయిన రాజకీయ నేతల పుణ్యమా అని కొద్ది కాలంలోనే విఫలం అయింది. ఇందిర, సంజయ్ లను అరెస్టు చేసి జైల్లో పెట్టడం, ఎమర్జెన్సీ ఆకృత్యాలను విచారించడానికి షా కమీషన్ ఏర్పాటుచేసి ఆ పేరుతొ ఇందిర కుటుంబాన్ని వేధింపులకు గురిచేయడం, వారి వ్యక్తిగతజీవితాలపై బురద చల్లే ప్రయత్నాలు సాగించడం మొదలయిన చర్యలు  ప్రజల్లో తిరిగి ఇందిరా గాంధీ పట్ల సానుభూతి పెరగడానికి దోహదం చేశాయి.  ప్రజలు తమకు  కట్టబెట్టిన అధికారాన్ని వారి బాగోగులకోసం వాడుకోవడానికి బదులు రాజకీయ ప్రతీకారాలకు వినియోగించే విధానం జనాలకు నచ్చలేదు. పైపెచ్చు ఇందిరను అధికారం నుంచి తొలగించడం కోసమే ఆ పార్టీలన్నీ ఏకమయ్యాయి తప్ప వారికి మరో ధ్యాస లేదన్నట్టుగా అంతర్గత కుమ్ములాటలకు జనతా పార్టీని ఒక వేదికగా మార్చారు. ఫలితం అంత మెజారిటీతో ఏర్పడ్డ జనత ప్రభుత్వం పూర్తి అయిదేళ్ళ కాలంకూడా  అధికారంలో కొనసాగలేక కుప్పకూలిపోయింది. ఈ ప్రయోగ వైఫల్యం కాంగ్రెస్ పార్టీకి ఎంతగా కలిసొచ్చిందంటే తదుపరి  జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరస్కరించిన ప్రజలే తిరిగి ఆ పార్టీకి పట్టం కట్టారు. బ్రహ్మ రధం పట్టి అధికార పీఠం ఎక్కించారు.
ఇదంతా ఎందుకు పునశ్చరణ చేసుకోవాల్సివచ్చిందంటే - రాజకీయ పార్టీల విలీనాలు సిద్ధాంత ప్రాతిపదిక  మీద కాకుండా యేవో పైకి కనిపించని ఎజెండా ఆధారంగా జరిగితే వొనగూడే ప్రయోజనాలు కూడా తాత్కాలికమే. ప్రజలకు పనికి వచ్చేలా నాలుగు కాలాలపాటు మనగలగడం కష్టం.  
ప్రస్తుతానికి వస్తే, జనతా పరివార్ అనేది  కూడా తాత్కాలికంగా మీడియాలో వినవస్తున్న కొత్త పార్టీ పేరు. విలీనం కావాలన్న నిర్ణయం అయితే జరిగింది కానీ, కొత్త పార్టీకి ఇంకా పేరు, జెండా, ఎజెండా, గుర్తు ఖరారు కావాల్సివుంది. ఎన్నికల్లో పార్టీ గుర్తు ఏమిటన్నది ఎన్నికల కమీషన్ చేతుల్లో వున్న విషయం. అయినా ములాయం సైకిల్, లాలూ లాంతరు గుర్తుల విషయంలో కొంత చర్చ జరుగుతున్నట్టు వినికిడి. ఉమ్మడి ఎన్నికల గుర్తు కొన్ని చిక్కులను తెచ్చిపెట్టే ప్రమాదం వుంది. ఈ ఆరు ప్రాంతీయ పార్టీలకు వారి వారి రాష్ట్రాల్లో వారి సొంత బలం వున్నట్టుగానే ఆయా పార్టీల ఎన్నికల గుర్తులు కూడా కొంత ప్రాచుర్యం పొందిన మాట కూడా కాదనలేనిది. అంచేత ఉమ్మడి గుర్తు ఎన్నికల ఫలితాలపై కొంత పరోక్ష ప్రభావం చూపే అవకాశం వుంటుంది. అంచేతే కాబోలు, విలీన నిర్ణయం ఆర్భాటంగా  ప్రకటించిన నేతలు విధివిధానాల ఖరారు అంశంపై కాలయాపన చేస్తున్నారు.
ఈ కొత్త ప్రయోగ విజయావకాశాలపై కొన్ని సందేహ మేఘాలు కమ్ముకోవడానికి కూడా ఆధారాలు వున్నాయి. ఒక వేదికపైకి వచ్చి చేతులు అయితే కలిపారు కాని వారి మనసులు కలిసాయి అనడానికి నమ్మకం కుదరడం లేదు. ఎందుకంటె పరస్పరం కత్తులు దూసుకునే విషయంలో ఈ పార్టీల నాయకుల గతం అలాటిది. ఒకరికొకరు చుక్కెదురు. ఒకరి పొడ మరొకరికి గిట్టదు. ఆధిపత్య స్వభావం విషయంలో మాత్రం అందరిదీ ఒకే బాట. తమ మాటే నెగ్గాలనే తత్వం అందరిలో వుంది. ఒక్క నితీష్ కుమార్ ని మినహాయిస్తే అవినీతి విషయంలో మినహాయింపు ఇవ్వగల నాయకులు ఆ పార్టీల్లో  లేరు. గతంలో కాంగ్రెస్ వ్యతిరేకత మాదిరిగా బీజేపీ వ్యతిరేకత ఒక్కటే వారినిప్పుడు విలీనం దిశగా అడుగులు వేయించింది.
ఈ విలీనం అనుకున్న ఫలితాలను ఇవ్వదని ఖరాఖండిగా చెప్పడం కూడా కష్టమే. కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని బీహార్ ఉప ఎన్నికల ఫలితాలు తెలుపుతున్నాయి. బహుశా ఇదే వారిని దగ్గరకు తీసిన అంశం అయివుంటుంది. అంతే కాకుండా ఇలా కుమ్ములాడుకుంటూ రాజకీయ కాలక్షేపం చేస్తూ పొతే చాప కింద నీరులా పాకుతూ వస్తున్న బీజేపీ ప్రభంజనాన్ని అడ్డుకోవడం కష్టం అన్న ఎరుక కూడా.            
ఐకమత్యం మహా బలం కావచ్చు. ఐక్యతారాగం అందుకుంటే ఆశించిన ఫలితాలు అందుకోనూ వచ్చు. అయితే చీలి కలిసే నాయకుల్లో చిత్తశుద్ధి లోపిస్తే మాత్రం భవిష్యత్తులో ఇటువంటి ప్రయోగాల పట్ల ప్రజల్లో  నమ్మకం పూర్తిగా  సడలిపోతుంది. అటువంటి నమ్మకం ఇప్పటికే బీటలు వారి ఉందన్న వాస్తవాన్ని గమనంలో పెట్టుకోవాలి.
అయితే, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ కూడా ఒక  విషయం గుర్తుంచుకోవాలి. ఎన్నికల్లో గొప్ప వాగ్దానాలు ఏమీ చెయ్యకపోయినా ప్రజలు వారిని గద్దె ఎక్కించడానికి కారణం కేవలం ఆ పార్టీ పట్ల, ఆ పార్టీ నాయకత్వం పట్ల  పెంచుకున్న నమ్మకం ఒక్కటే కాదు, అంతకు పూర్వం  కాంగ్రెస్ పాలనపై  వారు పెంచుకున్న వ్యతిరేకత కూడా. ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే ప్రతిపక్షాల ఐక్యత  ఓటమికి తోడవుతుంది అన్న వాస్తవాన్ని మరచిపోకూడదు.
ఏ పాలకపక్షానికయినా అన్వయించే సూక్తి ఇదొక్కటే! (18-04-2015)

రచయిత మొబైల్: 98491 30595, ఈమెయిలు:  bhandarusr@gmail.com

NOTE: Photo Courtesy Image Owner 

17, ఏప్రిల్ 2015, శుక్రవారం

నిష్టూర నిజాలు


"అంటే ఏమిటన్న మాట"
మా ఆవిడ ఇచ్చిన కాఫీ తాగేసి కప్పు టీపాయ్ మీద పెడుతూ అన్నాడు ఏకాంబరం.
 "ఎన్నో విషయాలు తెలుసు అనుకున్నవాళ్ళకు కూడా కొన్ని విషయాలు అర్ధం కావని. ఈ మధ్య అలాటివి రెండు నా దృష్టికి వచ్చాయి" వక్కపొడి నములుతూ సంభాషణ పొడిగించాడు.
నిజానికి ఏకాంబరంతో సంభాషించడం కుదరని పని. మన మాటలు కూడా అతడే మాట్లాడుతూ మాటలు కొనసాగిస్తాడు. ఒకరకంగా  ఏకాంబరంతో వున్న సులువు కూడా అదే. వింటున్నట్టు ఓ చెవి పారేసి మన మానాన మనం రాసుకుంటూ,  చదువుకుంటూ ఎంచక్కా అతడితో ముచ్చట్ల కార్యక్రమం కొనసాగించవచ్చు.


"హైకోర్టు ఆగ్రహం"
మళ్ళీ  ఏకాంబరమే మొదలెట్టాడు.
"ఇదొక అర్ధం కాని మీడియా భాష. కోర్టుకు ఆగ్రహానుగ్రహలతో నిమిత్తం వుండకూడదు. ఏదయినా కేసు విచారించేటప్పుడు ఇటువంటి భావోద్రేకాలకి న్యాయమూర్తులు లోనుకాకూడదు. నిజంగా జడ్జీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో లేదో ఎవ్వరికీ తెలవదు. టీవీ స్క్రోలింగుల్లో మాత్రం ఈ పదం తరచూ దర్శనం ఇస్తుంటుంది. నాకు అర్ధం కాని విషయాల్లో ఇదొకటి" అన్నాడు ఏకాంబరం.
"మరి రెండో సంగతి"
ఎవరూ అడక్కుండానే  ఆయనే అందుకున్నాడు.
"అలసటా, ఆయాసం లేకుండా హాయిగా బంధు మిత్ర సపరివార సమేతంగా తిరుపతి వెంకన్న దర్శనం చేసుకొచ్చిన ప్రముఖులు, మహాద్వారం  దగ్గర్లో మీడియాతో మాట్లాడే మాటలు అస్సలు అర్ధం కావు. 'దేశం సుభిక్షంగా ఉండాలనీ, ప్రజలందరికీ మంచి జరగాలనీ  అ బ్రహ్మాండనాయకుడ్ని  ప్రార్ధించి వచ్చినట్టు ఎలాటి భేషజం లేకుండా బ్రహ్మాండమైన అబద్ధాలు  ఆశువుగా చెప్పేస్తారు.  ఈ మాటలు నమ్మడానికి జనం ఏమైనా చెవిలో పూలు పెట్టుకున్నారా?"


"అల్లాగే ఇంకో అర్ధం కాని  విషయం. అందరు భక్తుల్లాగే వాళ్ళూ తిరుపతి వస్తారు. ఎలాటి లాయలాస లేకుండా దేవుడి దర్శనం తేలిగ్గా చేసుకుంటారు. కావాల్సిన కోరికలు ఎవరూ లేకుండా చూసి కోరుకుంటారు. బయటకు రాగానే మాత్రం  అదేదో 'సబ్బు వాడండి' అని సినిమాతారలు ప్రకటనలకు ఫోజు ఇచ్చినట్టుగా గుడి బయట వాళ్లకు ఈ పబ్లిసిటీ ఇవ్వడం ఎందుకు చెప్పండి. ఏడుకొండలవాడికి వీళ్ళ మెచ్చుకోళ్ళు అవసరమా? టీవీలవాళ్లు  ఈ పద్ధతికి స్వస్తి చెబితే బాగుంటుంది"
"చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుమార్లు సరయిన సమయం చూపించినట్టు  ఏకాంబరం గారు  చెప్పేవి పోచికోలు కబుర్లే  అప్పుడప్పుడూ ఇలాటి మంచి మాటలు కొన్ని చెబుతుంటారు.  అందుకే పొద్దున్నే వచ్చి విసిగించినా, విసుక్కోకుండా కాఫీ ఇచ్చేది" అన్నది మా ఆవిడ ఏకాంబరం వెళ్ళిపోయిన తరువాత తాపీగా. (17-04-2015)

NOTE: Courtesy Image Owners 

15, ఏప్రిల్ 2015, బుధవారం

ఫ్లెక్సీల బెడదకు పరిష్కారం ఒక్కటే!

(Published by 'SURYA' telugu daily in it's edit page on 16-04-2015)

http://www.suryaa.com/pdf/display.asp?edition=0&page=4
పుట్టిన ప్రతిమనిషికీ ఒక పుట్టిన రోజు వుంటుంది. కొందరి పుట్టిన రోజులకు వారి వారి హోదాలనుబట్టి గుర్తింపు లభిస్తుంది.  రాజకీయ రంగంలో ఉన్నవారికీ, ముఖ్యంగా అధికారంలో ఉన్నవారికీ పుట్టిన రోజులు గుర్తుపెట్టుకుని జరిపేవారు అప్పటికప్పుడు పుట్టుకొస్తుంటారు కూడా.  
ఎనభయ్యవ దశకం ప్రధమార్ధంలో టంగుటూరి అంజయ్య ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుమారు పదహారు మాసాలపాటు పనిచేశారు. ఆయన 1929 లో పుట్టారని తెలుసుకానీ, ఏరోజున పుట్టారో అయన పేషీలో ఎవరికీ తెలవదు. ముఖ్యమంత్రి అన్నాక ఇష్టం వున్నా లేకపోయినా  పుట్టిన రోజంటూ జరుపుకోవాలి. అధికారులూ, అనధికారులూ, అభిమానులూ వరుసలు కట్టి వచ్చి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలపడం ముఖ్యమంత్రుల దర్బారుల్లో ఓ  ఆనవాయితీ. దానికి భంగం వాటిల్లరాదని భావించిన ఆయన పేషీలోని ఓ అధికారి,  కృష్ణుడు పుట్టిన జన్మాష్టమి నాడే  అంజయ్య గారు పుట్టారనీ, అదే అయన జన్మదినమనీ నిర్ణయించడం,  తగు విధంగా ఆ ఏడాది కృష్ణ జన్మాష్టమి నాడు ముఖ్యమంత్రిగారికి పుట్టినరోజు  అభినందనలు తెలిపే కార్యక్రమాలు నిర్వహించడం జరిగిపోయాయి. రాజీవ్ గాంధీ పుణ్యమా అని ఆయన్ని అర్ధాంతరంగా పదవినుంచి తొలగించడం వల్ల అంజయ్య గారు  రెండో ఏడాది కూడా వరసగా తన పుట్టిన రోజును ముఖ్యమంత్రి హోదాలో జరుపుకునే అవకాశం లేకుండా పోయింది.  సరే అదొక కధ.
అధికారంలో వున్నవాళ్ళు పుట్టిన రోజులు జరుపుకుంటే ఎవ్వరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆ క్రమంలో అభిమానులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించడం ఒక్కటే ప్రశ్నార్ధకమవుతోంది. హైకోర్టు ధర్మాసనం కూడా ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మీడియా వార్తలు తెలుపుతున్నాయి.
ఏ రాజకీయ పార్టీ నాయకుడి పుట్టిన రోజు అయినా సరే, చనిపోయిన నాయకుల జయంతులు, వర్ధంతులు అయినా సరే,  నగరంలో కూడళ్ళు, వీధులు అన్నీ రంగు రంగుల ప్లాస్టిక్ బ్యానర్లతో, ఫ్లేక్సీలతో, హోర్దింగులతో నిండిపోతాయి. ఏ నాయకుడి గౌరవార్ధం వాటిని కడుతున్నారో ఆ నాయకుడి పట్ల వారికెలాంటి మర్యాదా మన్ననా లేదన్న విషయం ఉరితాళ్ళతో గొంతుకు ఉరి బిగించినట్టు కానవచ్చే రంగురంగుల ప్లాష్టిక్  తోరణాలు చూసిన వారికి  ఇట్టే తెలిసిపోతుంది. వాటిని కట్టేటప్పుడు ప్రదర్శించే ఉత్సాహం తొలగించేటప్పుడు జావకారిపోతుంది. ఇదే హైకోర్టు ఆగ్రహానికి కారణం.
ఈ అంశం హైకోర్టు గడప దాకా రావడానికి ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దోహదపడింది.  2008 లో మురళీ కృష్ణ అనే వ్యక్తి, ప్రకాశం జిల్లాలో ముక్తి నూతల పాడు, గుడిమిల్ల పాడు నడుమ రోడ్డును ఆక్రమిస్తూ ఓ విగ్రహ ప్రతిష్టాపనకు ప్రయత్నం జరుగుతోందని ఓ 'పిల్' దాఖలు చేసారు. గతంలో దాన్ని విచారించిన ధర్మాసనం, పనిలో పనిగా,  పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఫ్లేక్సీలను తొలగించాలని రెండు తెలుగు రాష్ట్రాల అధికారులను  ఆదేశించింది. రెండు ప్రభుత్వాలనుంచి వివరణలు అందుకున్న హైకోర్టు ధర్మాసనం వాటిని పరిశీలించింది.
రాజకీయ నాయకుల జన్మదినోత్సవాల సందర్భంలో ఏర్పాటు చేసే ఫ్లేక్సీలు, కటౌట్ల తొలగింపు కష్ట సాధ్యం అవుతోందన్న తెలంగాణా ప్రభుత్వ వాదనతో ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, న్యాయమూర్తి సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం ఏకీభవించలేదు. బహిరంగ ప్రదేశాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా వెలసిన కటౌట్లు, ఫ్లేక్సీలు, బ్యానర్లు, హోర్దింగులను తొలగించాలని గతంలో తామిచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ ఆదేశాలను అమలు చేయలేకపోతే ఆ విషయం తమకు చెప్పాలని, తామే వాటిని తొలగించి చూపుతామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఫ్లేక్సీలు, కటౌట్లను తొలగిస్తున్నట్టు అధికారులు పైకి చెబుతున్నారు కానీ క్షేత్ర స్థాయిలో తమ అనుభవం భిన్నంగా వుందని వారన్నారు. తమ ఆదేశాల అమలుకు ఏ చర్యలు తీసుకున్నారో తెలపాలని మరోమారు ఆదేశించిన ధర్మాసనం విచారణను ఈ నెల 17  కు వాయిదా వేసింది.  
వాస్తవానికి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే హోర్డింగులు, ఫ్లెక్సీలు మొదలయినవి మునిసిపల్ వ్యవస్థలకు అదనపు ఆదాయ వనరు. అయితే, రాజకీయ నాయకుల పుట్టిన రోజులు పురస్కరించుకుని ఏర్పాటు చేసే బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు వాటికి అదనపు ఖర్చు. వీటివల్ల పైసా ఆదాయం లేకపోగా వాటిని తొలగించడానికి అదనపు శ్రమతో పాటు అదనపు వ్యయం తోడవుతుంది.  ఖర్చంటే ఏదో తంటాలు పడతారు కానీ ఇందులో పైకి చెప్పుకోలేని మరో మతలబు వుంది. అధికారంలో వున్న వ్యక్తుల కటౌట్లు, బ్యానర్లు తొలగించి చెత్తకుప్పల్లో వేయాలంటే  లేని తలనొప్పిని తెచ్చి పెట్టుకోవడమే అవుతుంది. ఇవన్నీ హైకోర్టుకు తెలియనివి కావు. కాకపోతే ఈ విషయంలో ధర్మాసనం ఓ వైఖరి తీసుకుంది. దాన్నే మరోమారు స్పష్టం చేసింది. పైగా, 'మీకు  చేతకాకపోతే చెప్పండి, అదేదో మేము చేసి చూపిస్తాం' అని కూడా అంటోంది. డబ్బూ, సిబ్బందీ వున్న కార్పోరేషన్ వాళ్ళే ఆ పని  చేయలేకపోతే ఆ రెండూ లేకుండా హైకోర్టు వారు  ఎలా చేస్తారని అనుమానం రావచ్చు. అయితే అలా ఖరాఖండిగా  చెప్పడం అంటే తాము ఈ విషయంలో యెంత పట్టుదలగా ఉన్నదీ అధికారులకి అర్ధం అయ్యేలా చెప్పేందుకే ధర్మాసనం ఆ వ్యాఖ్యలు చేసిందని  కొందరు అన్వయం చెబుతున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో నాయకుల పుట్టిన రోజుల సందర్భంలో ఏర్పాటు చేస్తున్న ఇటువంటి కటౌట్లు, బ్యానర్ల వల్ల పర్యావరణ కాలుష్యం సంగతి అటుంచి కొన్ని సందర్భాలలో అవి ప్రమాదహేతువులుగా  తయారవుతున్నాయి. పైపెచ్చు నగర సౌందర్యాన్ని ఓ మేరకు చెడగొడుతున్నాయి. అందుకే ఈ అంశంపై హైకోర్టు గతంలో స్పందించినప్పుడు పౌరులనుంచి సానుకూల ప్రతిస్పందనలు వెలువడ్డాయి.




ఒకటి మాత్రం వాస్తవం. పెట్టిన ఫ్లెక్సీలు తొలగించడం ఒక పరిష్కారం కావచ్చు కానీ అది శాశ్విత పరిష్కారం కాబోదు. నాయకుల దృష్టిలో పడడంకోసం కొందరు చోటా నాయకులు చేసే  ప్రచారంకోసం ఇలా ఒక పద్దతి అంటూ లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేయకుండా చూస్తే కొంత ప్రయోజనం వుంటుంది. ఇటువంటి నిషేధపు ఉత్తర్వులు సరిగా అమలు కావాలంటే నాయకమ్మన్యులు సయితం కాసింత త్యాగనిరతి చూపాలి. ఎటువంటి పరిస్తితుల్లో కూడా తమకు ఇలాటి ఆర్భాటాలు సమ్మతం కావని  స్పష్టం చేయాలి. అప్పుడే ఈ కాలుష్య సంస్కృతికి అడ్డుకట్ట పడుతుంది. ఇది ఎలా సాధ్యమో అర్ధం కావాలంటే గతానికి సంబంధించిన రెండు ఉదంతాలను గుర్తు చేసుకోవాలి.
టీ.ఎన్. శేషన్ గుర్తున్నారా! ఒకప్పుడు భారత ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ గా పనిచేసి అన్ని రాజకీయ పార్టీలకు గుండెల్లో దడ పుట్ట్టించిన అధికారి. ఆయనకు పూర్వం, ఎక్కడ  ఏ ఎన్నికలు జరిగినా వూళ్ళల్లోని గోడలన్నీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ప్రచార నినాదాలతో నిండిపోయేవి. ఈనాడు దేశంలో ఎక్కడన్నా అలాటి గోడ రాతలు కనబడుతున్నాయా? అంటే ఏమిటన్న మాట. చిత్తశుద్ధి ఉండాలే కానీ  సాధించలేనిది ఏమీ వుండదు.
రెండో ఉదాహరణ రాజకీయ పార్టీల కార్యకర్తలకు సంబంధించింది. అంజయ్య గారితో మొదలయింది కాబట్టి ఆయనతోనే ఈ వ్యాసానికి ముగింపు పలకడం  సముచితంగా వుంటుంది.
అంజయ్య గారు ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ హైదరాబాదు వస్తున్నారని తెలిసి కాంగ్రెస్ కార్యకర్తలు బేగంపేట విమానాశ్రయం  నుంచి నగరంలో దారి పొడవునా భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసారు. ఇప్పట్లా వీటిని తయారు చేయడం, వాటిని వీధుల్లో అమర్చడం అంత సులభం అయిన సంగతి కాదు. అయినా వచ్చేది సాక్షాత్తు ప్రధానమంత్రి కొమరుడు కాబట్టి ఎంతో కష్టపడి విమానాశ్రయం నుంచి గాంధీ భవన్ వరకు కాంగ్రెస్ నాయకులు వాటిని ఏర్పాటు చేసారు.   హైదరాబాదులో జరుగుతున్న హడావిడిని అంజయ్య గారి ప్రత్యర్ధులు ఢిల్లీకి మోశారు. అప్పటికే ముఖ్యమంత్రి మార్పు విషయం పరిశీలిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈ కబురు కలిసివచ్చింది. యువకుడయిన రాజీవ్ కు ఇటువంటి హంగులూ, ఆర్భాటాలు అసలు గిట్టవనీ, హోర్దింగులూ, బ్యానర్లూ ఖుద్దున తొలగించాలని ఢిల్లీ నుంచి ఆదేశాలు అందాయి. దాంతో యుద్ధప్రాతిపదిక మీద ఏర్పాటయిన  వాటన్నిటినీ మెరుపు వేగంతో  తొలగించారు. దరిమిలా సంభవించిన రాజకీయ పెనుమార్పుల్లో భాగంగా అంజయ్య గారిని పదవి నుంచి కూడా తొలగించారు.  అదో కధ. నిజానికి ఆ కధే రాష్ట్ర రాజకీయాలను ఓ పెద్ద మలుపు తిప్పింది. తెలుగు దేశం అనే పేరుతొ కొత్త ప్రాంతీయ పార్టీ ఆవిర్భావానికి బీజం వేసింది.    
సరే!  విషయానికి వస్తే, ఇప్పుడు నడుస్తున్న 'ఫ్లెక్సీల కధ'కి సరయిన ముగింపు దొరక్కపోదు. కాకపొతే ఆ  శక్తి  ఒక్క రాజకీయ నాయకుల చేతుల్లోనే వుంది. ఉచితంగా లభిస్తున్న ప్రచారాలను స్వచ్చందంగా ఒదులుకోగల వారి ధీమంతంలో వుంది.  (15-04-2015)

రచయిత మొబైల్: 98491 30595 -  ఈమయిల్: bhandarusr@gmail.com             

12, ఏప్రిల్ 2015, ఆదివారం

స్వయంకృతాపరాధాలు



పురుషులందు పుణ్య పురుషులు వేరయాఅన్నాడు వేమన. అలాగే - విభక్తుల్లో సంబోధనా ప్రథమా విభక్తితరహాయే వేరన్న భావన ఈనాడు సమాజంలో కానవస్తున్నట్లుగా తోస్తోంది. తల్లిని ఒసేఅనడం - తండ్రిని ఒరేఅనడం ఈ మధ్య సినిమాల్లో షరా మామూలుగా మారిపోయి అదే సంస్కృతి క్రమంగా, వడి వడిగా సాధారణ జీవితాల్లోకి జొరబడుతుంది.




వెనుకటి రోజుల్లో పిల్లలు ఒకర్నొకరు సరదాగా గురూ-గురూఅని పిల్చుకుంటూ ఉంటే విని పెద్దలు గుర్రుమనే వారు. మాట తీరుకు ఆ రోజుల్లో అంత ప్రాధాన్యం ఉండేది. ఇళ్ళల్లో మాట్లాడుకునే దానికి - బయట సంభాషించే పద్ధతికి ఎంతో వ్యత్యాసం ఉండేది.ఇంట్లో 'అమ్మా' అని పిలిచినా బయట నలుగురిలో మాత్రం 'అమ్మగారు' అంటూ గౌరవంగా చెప్పుకునే వారు. ఉత్తరాలు రాసేటప్పుడు - 'గంగా భాగీరథీ సమానురాలైన అత్తగారికి' అనో, 'పూజ్యులైన తాతయ్యగారికి' అనో వినమ్రత కనబరిచేవారు. వినయాన్ని సంస్కారంగా, విధేయతని సభ్యతగా పరిగణించేవారు. ఒదిగి ఒదిగి ఉండడాన్ని ఆత్మన్యూనతగా కాకుండా అణుకువగా అనుకునేవారు. సభ్యతా, సంస్కారాలకు  అదే కొలమానంగా భావించేవారు.

ఇక, పత్రికల్లో వాడే భాష, సినిమాల్లో వినిపించే సంభాషణలు, చట్టసభల్లో జరిగే చర్చలు చాలా వరకు పరిధులకు, ప్రమాణాలకు లోబడే ఉండేవి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆకాశవాణి, దూరదర్శన్ ల సంగతి చెప్పనక్కర్లేదు. వాటి కార్యక్రమాలు, వార్తలు గిరి గీసుకుని, మడికట్టుకుని తయారుచేసినట్టుగా ఉండేవని గిట్టనివారు అనుకునేవారు కూడా. నిజాలను నిదానంగా  చెబుతాయన్న నింద తప్ప - సమాజానికి కాలుష్య కారకాలుగా మారాయన్న అపప్రధని అవి ఏనాడు మోయలేదు. 
కానీ, కాలం ఒక్క తీరుగా ఉండదు కదా! జనం అభిరుచులు కూడా కాలాన్ని బట్టి, తరాలను బట్టి మారిపోతుంటాఅయి. కనుకే సంబోధనా ప్రథమా విభక్తి ప్రత్యయాలకు ఈనాడు ఇంతటి ఆదరణ. అందుకే మార్పులోని మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా దాన్ని స్వీకరించడం, అమోదించడం అంతా సజావుగా సాగిపోతున్నది. ఈ మార్పుని మరింత వేగవంతంచేయడంలో ఈనాటి ఎ టూ జెడ్ఛానళ్ళు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి.

తరాలు మారుతున్నప్పుడు - వర్తమాన తరం వెనుకటి తరాన్ని చిన్నబుచ్చడం, హేళన చేయడం తరతరాలుగా వస్తోంది. పెద్దల సుద్దులను చాదస్తంగా కొట్టివేయడం మార్పుకున్న ప్రధమ లక్షణం. ఇలా మారిపోతున్న జనాల్లోనుంచే నాయకులు పుడతారు. మేథావులు పుడతారు. జర్నలిస్టులు పుడతారు. సంపాదకులు పుడతారు. కవులు - రచయితలు పుడతారు. పాఠకులు పుడతారు. శ్రోతలు పుడతారు. వీక్షకులు పుడతారు. వీళ్ళ సభ్యతా సంస్కారాల కొలబద్దలు కూడా మార్పులకి తగ్గట్టుగానే మారిపోతుంటాయి. మార్పుని అంగీకరించని మునుపటి తరం మౌనవీక్షణలో మునిగి సణుగుతుంటే - ఏది ఒప్పో, ఏది తప్పో చెప్పేవాళ్ళు లేక, చెప్పినా ఒప్పుకునే తత్త్వం లేక నవతరం ముందుకు సాగుతోంది. తరాల అంతరాల్లోనుంచి మొలకెత్తిన వైరుధ్యాలు, వైకల్యాల ప్రతిరూపాలే ఈనాడు సమాజంలోని అన్ని వర్గాలను ఆశ్రయించుకుని బహుముఖ రూపాల్లో బయటపడుతున్నాయి. అమ్మను 'ఒసే' అనడం, నాన్నను 'ఒరే' అనడం వంటి కొత్త ధోరణులను ఆవిష్కరిస్తున్నాయి. ముందే చెప్పినట్టు ఇది క్రమంగా సినిమాల నుంచి ఛానళ్ళకు, పత్రికలకు, పుస్తకాలకు, చట్టసభలకు విస్తరించి - సభ్యతా సంస్కారాలకు కొత్త భాష్యం చెబుతున్నాయి. ఈ క్రమంలో నుంచే ఆవిర్భవించిన ప్రజా ప్రతినిధులు, మేధావులు, జర్నలిస్టులు, కవులు, రచయితలు, కళాకారులు - చెప్పే మాటల్లో, ప్రవచించే పలుకుల్లో, రాసే రాతల్లో - సభ్యతా సంస్కారాల ప్రమాణాలే మారిపోతున్నాయి. ఇందుకు సజీవ సాక్ష్యాలు - ఈనాటి సినిమాలే, ఈనాటి ఛానళ్ళే, ఈనాటి పత్రికలే, ఈనాటి  పుస్తకాలే, ఈనాటి చట్ట సభలే!
రోజూ చచ్చేవాళ్ళకు ఏడ్చేవాళ్ళుండరు. రోజులు ఇలాగే గడిస్తే వర్తమాన వైరుధ్యాలకు బాధపడే వాళ్ళు మిగలరు. 
పాలితులను బట్టే పాలకులు- పాఠకులను బట్టే పత్రికలు - ప్రేక్షకులను బట్టే సినిమాలు - వీక్షకులను బట్టే ఛానెళ్ళు.
ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు!

NOTE: COURTESY IMAGE OWNER

11, ఏప్రిల్ 2015, శనివారం

తేడా!



ఏకాంబరం భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు ఇల్లు సర్దుతుంటే భార్య స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఇచ్చిన ప్రోగ్రెస్ కార్డు కనబడింది. అది చూసి ఏకాంబరం మూర్చపోయాడు. కారణం భార్యకు వచ్చిన గొప్ప మార్కులు కాదు. ఆమె గురించి స్కూలు హెడ్ మాస్టర్ రాసిన రెండు వాక్యాలు: "చాలా మంచి అమ్మాయి. మృదుభాషి" 

సంపన్నులు, సబ్సిడీలు

  
(Published in 'SURYA' telugu daily in it's edit page on 12-04-2015, SUNDAY)

ఇప్పుడు దేశంలో ఒక విప్లవాత్మకమైన పరిణామం నిశ్శబ్దంగా చోటుచేసుకుంటోంది.


సంపన్నులు గ్యాస్ సబ్సిడీని  స్వచ్చందంగా ఒదులుకోవాలని ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన పిలుపుకు చక్కటి స్పందన కనబడుతోంది. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థలు ఈ సబ్సిడీని ఒదులుకోవాలంటూ తమ ఉద్యోగులకు విజ్ఞప్తి చేసాయి. ఉదాహరణకు టాటా గ్రూపుకు  దేశవిదేశాల్లో దాదాపు వంద కంపెనీలు వున్నాయి. వీటిల్లో అయిదు లక్షల ఎనభయ్ వేల పైచిలుకు సిబ్బంది పనిచేస్తున్నారు. వారిలో అత్యధిక శాతం మన దేశంలోనే ఉద్యోగాలు చేస్తున్నారు. టాటా గ్రూపులో ఉద్యోగి ఎవరయినా సరే, గ్యాస్ సబ్సిడీని నిక్షేపంగా త్యాగం చేయగల జీత భత్యాలు సంపాదిస్తుంటారనేది నిర్వివాదాంశం. యాజమాన్యం పిలుకు స్పందించి వారిలో అత్యధికులు సబ్సిడీ ఒదులుకుంటే ప్రభుత్వానికి ఒనగూడే ప్రయోజనం కూడా అదే  స్థాయిలో వుంటుంది. ఈ ప్రయోజనాన్ని  త్యాగం చేయాలని కోరుకునే వారి సౌలభ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 'గివ్ ఇట్ అప్' (www.giveitup.in)  అనే పేరుతొ ఒక పోర్టల్ రూపొందించింది. సంపన్నులయినవారు మాత్రమే కాకుండా స్వచ్చందంగా ఈ సబ్సిడీని ఒదులుకోవడానికి ముందుకు వచ్చేవారు కూడా  ఇందులో తమ వివరాలు నమోదు చేసుకుని ఈ  బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోవచ్చు. ఇంతవరకు ఈ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకున్నవారి సంఖ్య మూడు లక్షలు దాటిపోయింది కూడా. ప్తభుత్వరంగ పెట్రోలియం కంపెనీల్లో పనిచేసే అధికారులందరూ సబ్సిడీ  ఒదులుకోవడానికి సంసిద్ధతత తెలిపారు. దేశంలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు వాడుకుంటున్న పదిహేను కోట్ల ముప్పయి లక్షల మంది వినియోగదారుల్లో కనీసం కోటి  మంది అయినా సబ్సిడీ ఒదులుకుంటారని ప్రభుత్వం పూర్తి విశ్వాసంతో వుంది.
ఒక్క టాటా కంపెనీ మాత్రమే కాదు ప్రధానమంత్రి పిలుపుకు  దిగ్గనాధీరులయిన అనేకమంది పారిశ్రామికవేత్తలు స్పందించారు. ఆనంద్ మహీంద్రా, అనిల్ అగర్వాల్, గౌతమ్ అదాని, సజ్జన్ జిందాల్, ఉదయ్  కోటక్ మొదలయిన వారు తమ సిబ్బందికి టాటా  కంపెనీ తరహాలోనే వ్యక్తిగత విజ్ఞప్తులు పంపారు.
ఫలితంగా ఇంతవరకు ఈ ఖాతాలో వందకోట్ల రూపాయల  వరకు ప్రభుత్వం మీద భారం తగ్గిపోయింది.  
సరే! ఇదంతా ఘనంగా చెప్పుకోవాల్సిన ముచ్చటే.
ఇదిలా వుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్యక్షుడు అమిత్ షా సయితం తమ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులకు కూడా ఇదేవిధమైన విజ్ఞప్తి చేశారు. స్పందన ఎలా వుందనే వివరాలు తెలియరాలేదు.
ఈ సందర్భంగా సామాన్యుల్లో కలిగే సందేహం ఒక్కటే. సబ్సిడీ ఒదులుకోమని పిలుపు ఇచ్చింది సాక్షాత్తు ప్రధానమంత్రి. ఏ త్యాగమైనా ఇంటి నుంచి మొదలు కావాలంటారు.
దాన్ని ముందు పార్లమెంటు నుంచి మొదలుపెట్టాలి. పార్లమెంటు సభ్యులకు, మంత్రులకు వచ్చే జీతభత్యాల విషయం రహస్యమేమీ కాదు. 'దేశం మొత్తంలో అత్యంత చౌక ధరలకు అత్యంత నాణ్యమైన ఆహార పదార్ధాలు ఎక్కడ దొరుకుతాయి అంటే పార్లమెంటు క్యాంటీనులో మాత్రమె'   అని జవాబు వచ్చేలా అనేక కధనాలు నెట్లో నిత్యం సంచారం చేస్తున్నాయి. ఆ  క్యాంటీనులో  వాడుతున్న గ్యాస్ సిలిండర్లు సబ్సిడీవే అయినప్పుడు ఇతరులను సబ్సిడీ ఒదులుకోమని చెప్పడం అసంగతం అవుతుంది. ఒకవేళ సబ్సిడీ లేని సిలిండర్లు అయితే ఆవిషయానికి విస్తృత ప్రచారం కల్పించి వుంటే బాగుండేది.
అదీ కాక సబ్సిడీ భారంగా పరిణమిస్తోంది అని ప్రభుత్వం అనుకుంటున్నప్పుడు ఈ రకమైన విజ్ఞప్తులు, పిలుపుల పద్ధతికి స్వస్తి పలకాలి. దేశంలో సంపన్నుల జాబితా ప్రభుత్వం వద్దనే సిద్ధంగా వుంటుంది. 'పలానా తేదీ నుంచి అలాటివారందరికీ సబ్సిడీ ఎత్తి వేస్తున్నాం' అని ఒక ప్రకటన చేస్తే సరిపోయేది. గ్యాస్ సిలిందర్లపై ప్రభుత్వం నుంచి పొందుతున్న సబ్సిడీ మొత్తానికి కనీసం కొన్ని వందల రెట్లు తమ కుక్క పిల్లల ఆలనాపాలనాపై ఖర్చు పెట్టగలిగిన ఖామందుల సంఖ్య మన దేశంలో తక్కువేమీ కాదు. దుష్టాంగాన్ని తొలగించి శిష్టాంగాన్ని కాపాడమన్నట్టుగా అనర్హులయిన వారిని సబ్సిడీ జాబితా నుంచి తొలగించి అవసరమైన పక్షంలో సబ్సిడీ మొత్తాన్ని  మరింత పెంచి అర్హులైన పేదలకు అందిచగలిగితే అది నిజమైన సంక్షేమ ప్రభుత్వం అనిపించుకుంటుంది.     
అభివృద్ధి చెందుతున్న  దేశాల్లో సబ్సిడీలు తప్పనిసరి. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ విధానం అమల్లో వుంది. ఎందుకంటె పెరిగే సంపద సక్రమంగా అన్ని చోట్లా సమానంగా పెరగదు. సంపన్నత పెరిగే కొద్దీ సమాజంలో అసమానతలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తాయి. వృద్ధాప్యం, అనారోగ్యం మొదలయిన అంశాలు వ్యక్తిగత ఆదాయాలపై ప్రభావం చూపుతాయి. అంచేతే సిరి సంపదలు పుష్కలంగా వున్న దేశాల్లో కూడా ఆహార సబ్సిడీలు, ఆరోగ్య సబ్సిడీలు  ఘనంగానే ఉంటున్నాయి. కాకపోతే సబ్సిడీల విషయంలో ఆయా  దేశాల ప్రజలు స్వచ్చందంగా  పాటించే కొన్ని నియమ నిబద్ధతతల కారణంగా అవి దుర్వినియోగం కావడం లేదు. సంపన్నులయినవాళ్ళు సబ్సిడీలకోసం ఆరాటపడని మంచి  సమాజాలను వారు సృష్టించుకున్నారు. మన దేశంలో అలాటి ప్రయత్నం మొదటి నుంచీ  జరగలేదనే చెప్పాలి. సబ్సిడీల భారం అపరిమితంగా పెరిగిపోవడానికి దోహదం చేసిన అనేక కారణాల్లో ఇదొకటి. సబ్సిడీ బియ్యం నుంచి  ఆరోగ్యశ్రీ కార్డు వరకు ఇదే తంతు.
స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ ప్రతిదానికీ ప్రభుత్వం మీద ఆధారపడే మనస్తత్వం పెరిగిపోతూ వచ్చింది. అంతా ఉచితంగా లభించాలనే భావన అందులోనుంచే పుట్టుకు వచ్చింది. అనేకానేక కారణాలతో ప్రభుత్వాలు కూడా ఈ ధోరణి పెరగడానికి తమ వంతు సాయం చేస్తూ వచ్చాయి. ఫలితం కొండలా పెరిగిపోతున్న సబ్సిడీల భారం. జీవితంలో ప్రతిదాన్నీ ఉచితంగానో, లేదా చాలా చౌకగానో పౌరులకు సమకూర్చిపెట్టిన సోవియట్ యూనియన్ లో ఏం జరిగిందో  గుర్తు పెట్టుకోవాలి. ఉత్పత్తి ఖర్చుకు మించి తక్కువ ధరకు సరఫరా చేయడం ఎల్లకాలమూ సాధ్యం కాదన్న సత్యాన్ని సోవియట్  అనుభవం గుర్తు చేస్తోంది.
మరో విచిత్రం అయిన విషయం ఏమిటంటే, ఉత్పత్తి ఖర్చుకంటే అనేక వందల రెట్లు అమ్మకం ధర వుండే వస్తు  సామాగ్రి కొనడానికి పరుగులు తీసే వారే సబ్సిడీ ధరలకు ప్రభుత్వం అన్నీ సరఫరా చేయాలని పట్టుబడుతుంటారు. సబ్సిడీ తగ్గించినప్పుడల్లా గోల  చేస్తుంటారు.
ప్రభుత్వ వ్యవస్థను గాడిన పెట్టడానికి కొన్ని  కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తప్పుకాదు. అయితే అటువంటి నిర్ణయాల అమలు ప్రభుత్వాధినేతల నుంచే మొదలు కావాలి. పొదుపు చేయండని పిలుపు ఇచ్చేవాళ్ళు దాన్ని ఆడంబరంగా చేయకూడదు. సబ్సిడీ ఒదులుకోవాలని  పిలుపు ఇచ్చిన ప్రధాని మోడీ గారింట్లో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వాడడం లేదు అనే విషయం  తెలుసుకోగోరేవారుంటే అలాటి వారిని అనుమానంగా చూడాల్సిన అవసరం లేదు. పైగా అలాటి అనుమానాలను నివృత్తి చేయగలిగితే మరింత బాగుంటుంది.
గతంలో లాల్ బహదూర్ శాస్త్రి  ప్రధాన మంత్రిగా వున్నప్పుడు దేశంలో ఏర్పడ్డ తిండిగింజల కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ ప్రతి సోమవారం ఒక పొద్దు మాత్రమే భోజనం చేయాలని ఇచ్చిన పిలుపుకు అపూర్వ స్పందన లభించింది. ఎందుకంటె ఆయన ఆ నియమాన్ని అయన  బతికున్నంతవరకు పాటించారు. ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి స్వల్పకాలమే మనగలగడం మన  జాతి చేసుకున్న దురదృష్టం.        
అధికారం ప్రదర్శించాల్సిన  తరుణం వచ్చినప్పుడు దృఢచిత్తంతో వ్యవహరించండి. అయితే అధికారం ఉందికదా అని అహంకారం చూపకండి. చేతిలో వున్న అధికారాన్ని సౌమ్యంగా, సాధ్యమైనంత మృదువుగా వాడండి. అదెలా వుండాలంటే,  మనస్సు ఏమాత్రం నొచ్చుకునేలా  వుండకూడదు. పువ్వు నుంచి భ్రమరం తేనె తాగుతున్నంత  సుకుమారంగా  వుండాలి.  
ఏ ప్రభుత్వానికయినా విజ్ఞులు ఇచ్చే సలహా ఇదే !

(రచయితే మొబైల్ నెంబరు : 98491 30595  మెయిల్: bhandarusr@gmail.com)

10, ఏప్రిల్ 2015, శుక్రవారం

కూర్చో! ఇప్పుడే వస్తా....!


తిరుపతయ్య గ్రామ రెవెన్యూ  అధికారి దగ్గరికి వెళ్ళాడు చిన్న పని మీద.
'ఇదిగో ఇప్పుడే వస్తా! ఎమ్మార్వో గారు వెంటనే రమ్మనమని ఫోను. గంటలో తిరిగొస్తా, ఇక్కడే కూర్చో' అంటూ వీఆర్వో  మోటారు సైకిల్ ఎక్కి తుర్రుమన్నాడు.  
వీఆర్వో ఆఘమేఘాల మీద వెళ్లేసరికి ఎమ్మార్వో  అతడికోసమే ఎదురుచూస్తున్నట్టు మొహం పెట్టి, వచ్చావా! మొన్న చెప్పాను చూడు...' అంటూ ఉండగానే ఆయన చేతిలో సెల్లు ఘల్లున మోగింది. కంగారుగా వింటూనే  అంతకంటే కంగారుగా 'ఇదిగో ఇప్పుడే  జేసీ గారు వున్నాఫలాన రమ్మంటున్నారు, మాట్లాడి ఇప్పుడే వస్తా కూచో' అంటూ అంతకంటే  కంగారుగా వెళ్ళిపోయాడు ఎమ్మార్వో జీపెక్కి.  జేసే గారి ఆఫీసుకు చేరి కనుక్కుంటే ఆయన పియ్యే చావు కబురు చల్లగా చెప్పాడు, 'మిమ్మల్ని రమ్మనమని ఫోను చేసారా, అలా రమ్మనమని కలెక్టరు దొరగారి ఫోను. పని చూసుకుని వస్తారు కూర్చోండి అన్నాడు జేసీ గారి పియ్యే తాపీగా.
అక్కడ జేసీ గారికి కలెక్టర్ ఆఫీసులో ఇదే సీను. 'మంత్రి గారు కబురు పెడితే వెళ్ళారు, వస్తారు కూర్చోండి అంటూ క్యాంప్ క్లర్కు మర్యాద.
కలెక్టర్ గారి  కారు మంత్రి గారి బంగ్లాలో ప్రవేశిస్తూ ఉండగానే గేటు దగ్గరే ఎదురొచ్చింది మంత్రి గారి వాహనం. 'ఇదేమిటి  రమ్మనమనిచెప్పి  ఎటూ వెడుతున్నట్టు' అని  అనుకుంటూ ఉండగానే సెల్లు మోగింది. అవతల మంత్రి గారు. 'చూడండి కలెక్టర్ గారు అర్జెంటు పనిమీద రమ్మన్నాను. కానీ ఈలోగా సీఎం గారి నుంచి కబురు వెంటనే రమ్మనమని. వెళ్లి వస్తా  కాసేపు వెయిట్ చేయండి, ఏమనుకోవద్దు'
మంత్రిగారు సీఎమ్ ఇంటికి వెళ్లేసరికి ఆయన ఢిల్లీ ఫోనులో వున్నారు. అది తెమిలేసరికి రాత్రి ఎనిమిదయింది. మంత్రిగారిని చూస్తూనే ఆయన అన్నారు 'అయ్యో ఇంతసేపు వెయిట్ చేస్తున్నారా. ఏదో చిన్న విషయం మాట్లాడదామనుకున్నాను. మళ్ళీ చూద్దాం లెండి' అన్నారు 'మళ్ళీ రండి' అన్న భావం కళ్ళల్లో ప్రదర్శిస్తూ.
అక్కడ వూళ్ళో వీఆర్వో గారింట్లో తిరుపతయ్య, ఎమ్మార్వో ఆఫీసులో వీఆర్వో, జేసీ కార్యాలయంలో ఎమ్మార్వో, కలెక్టర్  క్యాంప్ ఆఫీసులో జేసీ, మంత్రిగారింట్లో కలెక్టర్, ముఖ్యమంత్రి నివాసంలో మంత్రిగారు - అందరూ ఉదయం నుంచి సాయంత్రం దాకా గడ్డాలు, మీసాలు పెంచుకుంటూ ఎదురుచూపులు.


ఏదో బట్టల సబ్బు ప్రకటనలో మాదిరిగా ఇది 'ఆఖరిసారి' కాదు, మళ్ళీ మళ్ళీ జరిగే తంతే!

NOTE: Courtesy Image Owner