9, డిసెంబర్ 2014, మంగళవారం

"అర్ధం చేసుకోండి - అర్ధాలు వెతక్కండి"


పెద్ద సినిమాలు తీసే వారికీ ప్రయాసే, కొండొకచో చూసేవారికీ ప్రయాసే.
చిన్న సినిమాలు తీయడానికి కష్టమూ ఎక్కువే ప్రతిఫలమూ తక్కువే.
ఇక మరీ చిన్న సినిమాలు, సంక్షిప్త చిత్రాలు, షార్ట్ ఫిలిమ్స్ పేరు ఏదయినా, వాటిని  తీసే వారికి పేరొస్తుందేమో కాని  కాసులు కురవడం అపనమ్మకమే. కాకపొతే సినిమా తీయాలన్న అభిలాషా, చేతులు కాలే నిడివీ తక్కువ కావచ్చు, యూ ట్యూబ్ వంటి మాధ్యమాలు అందుబాటులోకి రావడం వల్ల కావచ్చు చిన్నా పెద్దా సినిమాలు తీయలేనివాళ్ళు ఈ వైపు మళ్ళుల్లుతున్నారు. చూసే అవకాశం రావాలే కాని, వీటిల్లో మంచి కధలు, ఎంచక్కని  కధనాలు, తీస్తున్న విధానాలు వీటన్నిటితో పాటు మరో ప్లస్ పాయింటు ఏమిటంటే  టైం వృధాకాకుండా చూసేయొచ్చు. అలాటి అవకాశం మొన్న సాయంత్రం నాకు లభించింది.



ఆ చిట్టి పొట్టి చిత్రం పేరు 'అద్వైత'. పేరు చూసి ఇదేదో వేదాంతం బాపతు అని పొరబడే అవకాశం వుంది కాని చూసిన తరువాత, చూసిన అందరి అభిప్రాయమూ అద్వైతమే. అంటే అంతా 'బాగుంది' అన్నవాళ్ళే కాని  వేరే మాట వినబడలేదు.
'అద్వైత' తీసిన వాళ్ళు సినిమా రంగానికి కొత్తేమో కాని ఆ మాధ్యమానికి కొత్తకాదని నాకూ అనిపించింది. నిజానికి సినిమాలు చూడడం నాకూ కొత్తే! ఎప్పుడో కాని చూడని అలవాటు ఎన్నాళ్ళుగానో వుంది.
రేడియోలో పనిచేసేవారికి చెప్పే మొదటి పాఠం - "Brevity is the soul of expression". అంటే 'సంక్షిప్తత భావ వ్యక్తీకరణకు దగ్గరి మార్గం' అని అర్ధం చెప్పుకోవచ్చు. ఇది లఘు చిత్రాలకు కూడా వర్తించే సూత్రం.
ఇరవై ఇరవై రెండు నిమిషాలలోనే టైటిల్స్ తో సహా శుభం కార్డులాంటి 'అర్ధం చేసుకోండి - అర్ధాలు వెతక్కండి' అనే సున్నిత అభ్యర్ధనతో మొత్తం చిత్రం ముగుస్తుంది. నటీనటులు ఇద్దరే. మూడో మనిషి మాటవరసకు అన్నట్టు కనిపించి మాయమైపోతాడు. చిత్రం యావత్తు ఆ ఇద్దరి మధ్య సంభాషణలతో నడుస్తుంది. అంటే కత్తిమీద సామే. విసుగనిపించకుండా కధనం సాగాలి.  అన్నింటికంటే చమక్కుమనిపించే ముగింపు మరీ ముఖ్యం. ఓ హెన్రీ కధల్లో మాదిరి. ఫోటోగ్రఫీ నైపుణ్యం, శబ్దగ్రహణం, క్లోజప్పుల్లో హావభావాలు అన్నీ కలిస్తేనే చూడవచ్చిన వారు మెచ్చుకోలు మాటలు చెబుతారు. అదృష్టవశాత్తు 'అద్వైత' లఘు చిత్రానికి ఇవన్నీ సమపాళ్ళలో కుదిరాయి.


అందుకే నాటి ప్రదర్శనకు ప్రేక్షకులుగా వచ్చిన ప్రసిద్ధ దర్శకుడు శేఖర్ కమ్ముల, ప్రసిద్ధ నటి జయసుధ, మధుర శ్రీధర్, రచయిత సిరా శ్రీ, నటుడు అడవి శేషు  (ఎవరి పేరన్నా మరచిపోతే క్షమించాలి, అసలే ఈ రంగం నాకు కొత్త)  అందరిదీ ఒకే మాట. 'మంచి ప్రయత్నం'  అద్వైత హీరో హీరోయిన్లు చైతన్య, లాస్య - కొత్తగా దర్శక పాత్రలో ప్రవేశించిన సీనియర్ జర్నలిస్ట్ ప్రేమకు అవి చక్కని కాంప్లిమెంట్లు. పడిన శ్రమకు  ఎంచక్కని ఫలితం కూడా.
చివరకు చెప్పేదేమిటంటే అసలు విషయం అంతా ఆ 'చమక్కు' లోనే వుంది. విషయమే కాదు, మహిళల కోణంలో నుంచి ఆలోచించి రాసి తీసిన 'ఇతివృత్తం' కూడా.
చూడాలని  అనుకున్నవారికి దారి చూపే లింకు :
ADVAITHA link.

తోక టపా: అసలు మరో చమక్కు ఏమిటంటే ఈ లఘు చిత్రం దర్శకురాలు ఎవ్వరో కాదు, మా మేనకోడలు విజయలక్ష్మి, బంధు మితృడు జ్వాలా నరసింహారావు పెద్దమ్మాయి ప్రేమ మాలిని దటీజ్ బుంటీ. ఇంకో చమక్కు ఏమిటంటే ప్రసాద్ లాబ్స్ లో ఆరోజు అద్వైత చిత్రం చూసేవరకు మాకెవ్వరికీ 'ప్రేమ' ఈ చిత్రం తీస్తున్నట్టు తెలవదు. అదో చిత్రం!

8, డిసెంబర్ 2014, సోమవారం

వొరిగిన కర్ణాటక సంగీత శిఖరం నేదునూరి


(PUBLISHED BY 'ANDHRA JYOTHI' DAILY IN ITS EDIT PAGE ON 09-12-2014, TUESDAY)
1968  జనవరి నెల.  నలభై ఆరేళ్ళ నాటి మాట.  హైదరాబాదు రవీంద్ర భారతిలో ప్రభుత్వ సంగీత కళాశాల ఆధ్వర్యంలో త్యాగరాజ సంగీత ఉత్సవాలు జరుగుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వేదికమీద  నలభయ్ ఏళ్ళ వయసున్న విద్వాంసులు ఒకరు త్యాగరాజ విరచిత 'మోక్షము కలదా!' అనే కీర్తనను సారమతి రాగంలో పాడడం ప్రారంభించారు. ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు శ్రీ  ఎం చంద్రశేఖరన్ , మృదంగ విద్వాంసులు శ్రీ దండమూడి రామ్మోహనరావులు సహకరిస్తుండగా,  శ్రీ నేదునూరి కృష్ణమూర్తి అనే ఆ విద్వాంసుడు ఆలపించిన ఆ కీర్తనతో కిక్కిరిసిన సభామందిరం యావత్తు అదోరకమైన  తన్మయస్తితిలో  తేలిపోయింది.  త్యాగరాజస్వామి  వారు ఎంతటి  ఆర్తితో ఆ కీర్తన రాసారో అదే ఆర్తి,  కృష్ణమూరిగారి స్వరంలో తొణికిసలాడింది. అద్భుతమైన ఆలాపన, స్వరకల్పన సంగీత ప్రియులను సమ్మోహితులను చేసాయి. సుమారు నలభయ్  అయిదు నిమిషాలపాటు రవీంద్ర భారతి ఆడిటోరియం,  నేదునూరివారి సంగీత లహరిలో మునకలు వేసింది. వయోలిన్ తో ఆయనకు సహకరించిన చంద్రశేఖరన్   తమిళుడు. అయినా నేదునూరివారి సంగీతామృతం సేవించిన పరవశత్వం ఆయనలో గోచరించింది. ఆ మాధుర్యపు మత్తులోనుంచి బయటపడి, ఆడిటోరియం బయటకు వచ్చిన తరువాత చంద్రశేఖరన్  తమిళంలో వెలిబుచ్చిన అభిప్రాయాన్ని దండమూడివారు తెలుగులో చెప్పారు. 'నా జీవితం ధన్యమయింది. ఇంత  గొప్ప సంగీతాన్ని పక్కనే  కూర్చుని వినే భాగ్యం కలిగింది. నేదునూరివంటి సంగీతకళానిధి జీవించిన కాలంలో సమకాలీనులుగా  మనగలిగిన అదృష్టం నన్ను వరించింది. ఈ భాగ్యానికి నన్ను నేనే అభినందించుకుంటున్నాను'
ఆయన నోటి నుంచి సంగీత కళానిధి అనే పదం రావడం యాదృచ్చికమైనా,  తరువాతి రోజుల్లో అది నిజమై కూర్చుంది. సంగీతంలో విశిష్ట సేవ చేసేవారికి చెన్నై  సంగీత అకాడమీ ఏటా ఇచ్చే పురస్కారం సంగీతకళానిధి. ప్రతి సంగీత  విద్వాంసుడు దాన్ని 'పద్మ' పురస్కారం కన్నా మిన్నగా  భావిస్తారు. అలాటి సంగీత పురస్కారం నేదునూరివారిని వరించింది. తమిళ సంగీత విద్వాంసులు సయితం నేదునూరివారికి  ఈ పురస్కారం లభించడంపట్ల హర్షామోదాలు వ్యక్తం చేసారు. మరో విశేషం ఏమిటంటే 1991 లో సంగీత కళానిధి పురస్కారం ప్రకటన వెలువడినప్పుడు ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చెన్నారెడ్డి. ఆయనకు ఆ రోజుల్లో పీ.ఆర్.ఓ గా   వున్న వనం జ్వాల నరసింహారావు ద్వారా విషయం తెలుసుకుని చెన్నారెడ్డి గారు   చక్కని అభినందన సందేశం పంపారు. ఆ పురస్కారం అందుకున్న తరువాత ప్రసంగించాల్సివచ్చినప్పుడు నేదునూరివారికి ఒక చిన్న ఇబ్బంది ఎదురయింది. స్టేజీ మీద ఆంగ్లంలో ప్రసంగించగల ప్రావీణ్యం ఆయనకు లేదు. ఇంగ్లీష్ ప్రసంగాన్ని అండవిల్లి మాస్టారు తయారుచేసి ఇచ్చారు.  చెన్నై మ్యూజిక్  అకాడమీలో అనేకమంది సంగీత ఘనాపాటీల సమక్షంలో నేదునూరివారికి సంగీత కళానిధి పురస్కారం జరిగింది. ఆ అకాడమీలో కృష్ణమూర్తిగారికి ఒక రికార్డు వుంది. ఏటా డిసెంబరు నెలలో జరిగే  సంగీత ఉత్సవాల్లో  1951  నుంచి క్రమం  తప్పకుండా సుమారు అరవై ఏళ్ళపాటు  కచ్చేరీ చేస్తూ వస్తున్న  ఘనత నేదునూరి వారిది. మొదటి వరసలో అప్పటి వరకు కళానిధి  పురస్కారం పొందిన వారు ఆసీనులయివుంటారు. వారి సమక్షంలో,  దేశం నలుమూలలనుంచి వచ్చే వేలాదిమంది సంగీత ప్రియులు వరసగా కొన్ని రోజులపాటు సంగీతాంబుధిలో వోలలడుతారు. నగరంలోని హోటళ్ళన్నీ సంగీత అభిమానులతో నిండిపోతాయి. దీన్ని చెన్నై మ్యూజిక్ సీజను అంటారు.  తమిళనాటకూడా కృష్ణమూర్తిగారికి పెద్ద సంఖ్యలో అభిమానులు వున్నారు.    చెన్నైకి మకాం  మార్చాల్సిందని ఆయనపై చాలా వొత్తిడి వచ్చింది. కానీ ఆయన మాత్రం తాను  సంగీత పాఠాలు నేర్చుకున్న ఉత్తరాంధ్రనే తన శేష జీవితం గడపడానికి ఎంచుకున్నారు. విశాఖ మువ్వలవాని పాలెంలో ఆయన నిర్మించుకున్న గృహం నిజానికి ఒక సంగీత నిలయం. ప్రతి రోజూ పొద్దున్నే నిత్య విద్యార్ధి మాదిరిగా తంబురా పట్టుకుని సంగీత సాధన చేస్తూరావడం ఆయనకే చెల్లింది.



(కీర్తిశేషులు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి) 

ఇటీవలనే   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమాచార సలహాదారు  శ్రీ పరకాల ప్రభాకర్ విశాఖలోని ఆయన ఇంటికివెళ్ళి పరామర్శించి వచ్చారు. హుద్ హుద్ తుపాను సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సకాలంలో తీసుకున్న చర్యలు గురించి  నేదునూరివారు ప్రశంసించినట్టు  వార్తలు వచ్చాయి. నేదునూరి కృష్ణ మూర్తి గారు తన గురువయిన పినాకపాణి మాదిరిగా శత వర్షాలు జీవిస్తారని అనుకున్నారు కానీ అశేష యశస్సును తన వెనుకే  వొదిలి అనారోగ్యంతో  తాను యెంతగానో అభిమానిస్తూ వచ్చిన విశాఖ పట్నంలోనే కన్ను మూశారు. కర్ణాటక సంగీతంలో హిమాలయాల ఎత్తుకు ఎదిగిన ఇద్దరు సంగీత చక్రవర్తులు శ్రీ  మాండలిన్ శ్రీనివాస్, శ్రీ  నేదునూరి కృష్ణ మూర్తిని ఒక్క ఏడాదిలోనే  పోగొట్టుకోవడం కర్ణాటక సంగీత అభిమానులకు తీవ్ర నిరాశను కలిగిస్తోంది.
నేదునూరి వారి శిష్యులకు సయితం కేంద్ర ప్రభుత్వం  ఇచ్చే 'పద్మ' అవార్డులు  లభించాయి కానీ వారి గురువుకు  రాకపోవడం శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం మొదలయిన వారి  అభిమానులందరికీ మనస్తాపం కలిగిస్తున్న విషయం. అయితే ఇంతలోనే  వారిక లేరన్న వార్త.
కర్ణాటక సంగీతంలో గురువుకు సాటిగా పేరు తెచ్చుకుంటున్న మల్లాది సోదరులు జనరంజకమైన  నేదునూరి బాణీని  అజరామరం చేసే దిశగా అడుగులు వేస్తారని ఆశిద్దాం.
చెన్నైలో  ఈ నెల ఇరవైనుంచి సంగీత ఋతువు మొదలవుతుంది. చెన్నై మ్యూజిక్ అకాడమి ఆధ్వర్యంలో,   టీ.టీ.కే. ఆడిటోరియంలో ఎప్పటిమాదిరిగా ఈసారి నేదునూరి వారి కచ్చేరీ  లేకపోవడం ఒక లోటయితే, వచ్చే నెల జనవరి ఇరవై ఆరు భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించబోయే 'పద్మ' పురస్కార గ్రహీతల జాబితాలో నేదునూరి వారి పేరు ఉండకపోతుందా అన్నది ఆయన అభిమానుల ఆశ.
చూడాలి ఏం జరుగుతుందో!

NOTE : Photo Courtesy Image Owner 


        

7, డిసెంబర్ 2014, ఆదివారం

నడిచి వచ్చిన దారి - 1


నాకు తెలిసిన మా వూరు ఒకనాటి పల్లెటూరు. ఈ నాటిది కాదు. ఎదుగూ బొదుగూ లేని పల్లెకు మా వూరు నిలువెత్తు దర్పణం. వాగులు వంకలు దాటుకుంటూ వెళ్ళాలి. పుట్టానన్న మాటే కాని వూళ్ళో వున్నది తక్కువ. చదువులకోసం చిన్నప్పటి నుంచీ మా అక్కా బావల దగ్గరే పెరిగాను. సెలవులు ఇస్తే చాలు ఎగురుకుంటూ వెళ్లి వూళ్ళో వాలిపోయేవాడిని. బెజవాడనుంచి ఉదయం ఓ బస్సు. మళ్ళీ సాయంత్రం ఇంకో నైట్ హాల్ట్ బస్సూ. పెనుగంచి ప్రోలుకు రూపాయికి అర టిక్కెట్టు. అక్కడ మా అన్నపూర్ణక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కయ్య పెట్టిన చిరుతిండ్లు తిని చలో రంగా అంటూ మా వూరుబాట పట్టేవాడిని. యేరు దాటగానే వరుసగా మూడు కాలువలు. మోకాలు లోతు నీళ్ళు. నీటి  పాములు వుంటాయేమో అని భయం. గబగబా కళ్ళు మూసుకుని దాటి కాలువ గట్టెక్కితే పరుగు లాటి నడక. మాయాబజారులో వివాహ భోజనం పాట ఎత్తుకుంటే అలుపు తెలియకుండా వూరు చేరేవాడిని. మధ్యలో ఎదురయిన వాళ్ళు గుర్తు పట్టి చిన్నబ్బాయి గారు అని పలకరిస్తుంటే అదోరకం పులకరింత. మా వూరు మా వాళ్ళు అన్న భావన. 


(మా స్వగ్రామం కంభంపాడులో మా ఇల్లు)
       

ఊళ్ళోకి రాగానే మొదట్లోనే మా ఇల్లు. దొడ్లో చింతచెట్టు. వెనక గుమ్మంలో నిలుచుని మా అమ్మ ఎదురు చూపులు. వసారాలోనే 'సీనాయ్  వచ్చాడు చూడూ' అంటూ మా బామ్మ పలకరింపులు. మట్టికొట్టుకుపోయిన కాళ్ళు కడుక్కుని అమ్మ ఇచ్చిన నీళ్ళు తాగుతుంటే 'అమ్మయ్య వూరికి వచ్చాన'న్న ఆనందం. సొంతూరు అంటే ఎందుకో  అంత మమకారం.   (ఇంకా వుంది)

6, డిసెంబర్ 2014, శనివారం

తెలివిడి


ఏకాంబరం రంపపు మిల్లులో పనిచేస్తుంటే చేయి మిషన్ లో చిక్కుకుంది. ఆపరేషన్ చేసి మోచేతివరకు  తీసేసారు. మేనేజర్ పలకరించడానికి వెళ్ళాడు. 'నువ్వు కొంత అదృష్టవంతుడివి ఏకాంబరం. నీది ఎడమచేతి వాటం కదా! కుడి చేయి మిషన్ లో పడింది.'
ఏకాంబరం పొంగిపోయాడు.
'సరిగ్గా ఆఖరు నిమిషంలో, నేను ఎడమ చేతి వాటం మనిషినని గుర్తుకు వచ్చింది సారూ. వెంటనే తెలివిగా దాన్ని వెనక్కి లాక్కుని కుడి చేయి లోపల పెట్టాను. లేకపోతే నిష్కారణంగా ఇబ్బంది పడేవాడిని'




NOTE: Courtesy Image Owner 

జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతారాగాలు

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY IN ITS EDIT PAGE ON 07-12-2014, SUNDAY)

"మోడీ ప్రాభవం తగ్గుతోందా? ఆయన నేతృత్వంలోని ఎండీయే కూటమికి, 'కాని కాలం' దాపురించిందా? జాతి హఠాత్తుగా ఏదైనా విపత్తును ఎదుర్కోబోతోందా ? దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిందా? త్వరలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయా?"
ఈ ప్రశ్నలకు వేటికీ 'అవును' అనే సమాధానం లేదు. అయినప్పుడు కొత్తగా వినబడుతున్న ప్రతిపక్షాల ఐక్యతారాగాలకు అర్ధం ఏమిటి?    
రాజకీయ శూన్యత వున్నప్పుడు రాజకీయ ప్రత్యామ్నాయాల వికాసానికి అవకాశం వుంటుంది. అది లేనప్పుడు , ఒకప్పటి జనతా పార్టీ కొమ్మలయిన  ఆరు పార్టీలు కలిసి ఏకమై ఒకే పార్టీగా ఏర్పడి సాధించేది ఏమిటి? ఈ కొత్త రాజకీయ కూటమి లేదా కొత్త పేరుతొ ఆవిర్భవించబోయే సరి కొత్త పార్టీ - పాలకపక్షం అయిన బీజేపీకి విసరబోయే సరికొత్త సవాలు ఏమిటి? ప్రస్తుత లోకసభలో ఈ ఆరుపార్టీలకీ వున్న మొత్తం పదిహేనుమంది సభ్యులు ఒక పార్టీగా ఏకమైనా దానివల్ల పాలక పక్షానికి అద్యతన భావిలో ఎదురయ్యే ముప్పు ఏమీ లేనప్పుడు ఈ కొత్త పార్టీ వల్ల   పాలక పక్షం బీజేపీకి  ఎదురయ్యే ముప్పు ఏముంటుంది?   
ఇప్పుడు జాతీయ మీడియాలో విస్తృతంగా చర్చిస్తున్న అంశాలు ఇవే. 

  
దేశ రాజకీయాలను శాసించగల అత్యధిక పార్లమెంట్ స్థానాలు కలిగిన ఉత్తర ప్రదేశ్ లో పాలకపక్షం సమాజ్ వాదీ పార్టీ, జనత దళ్ (యు), రాష్ట్రీయ జనతా దళ్, జనతా దళ్ (యస్), ఇండియన్ నేషనల్ లోక్ దళ్, సమాజ్ వాదీ జనతా పార్టీ - ఈ ఆరూ  పైకి చిన్నా చితకగా కనిపించినా ఒకరకంగా ఇవన్నీ  ఓ మోస్తరు పెద్ద పార్టీలే. కొన్ని రాష్ట్రాల్లో ప్రభావం చూపగల సామర్ధ్యం వున్న పార్టీలే. ఈ పార్టీల అగ్ర నాయకులు మూలాయం సింగ్ యాదవ్,  శరద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ, దుష్యంత్  చౌతాలా  ఇటీవల ఢిల్లీలో సమావేశమై తమ పార్టీలనన్నింటినీ ఏకం చేసి ఒకే పార్టీగా ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న మోడీ ప్రాభవానికి అడ్డుకట్ట వేయడం  ఈ కొత్త పార్టీ  ప్రధాన ధ్యేయంగా కనబడుతోంది.  మరో జాతీయ పార్టీ  కాంగ్రెస్ పరిస్తితి అంత ఆశాజనకంగా లేని ప్రస్తుత పరిస్తితుల్లో కొత్త పార్టీ ఆవశ్యకత ఆ కొరతను తీర్చగలుగుతుందని ఆశించడం ఈ పార్టీ ఆలోచన పురుడు పోసుకోవడానికి దోహదపడివుండవచ్చు.  విచిత్రం ఏమిటంటే అలనాడు కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి అన్ని పార్టీలు కలిసి  జనతా పార్టీగా ఏకం కావడంలో కీలక పాత్ర పోషించిన భారతీయ జనతా పార్టీ (అప్పుడు జనసంఘం) ప్రభుత్వాన్నే  ఇరకాటాన పెట్టడానికి  ఇప్పుడీ పార్టీలన్నీ ఏకం కావడం.  ప్రస్తుతం ఈ ఆరు పార్టీల  విలీనం ద్వారా ఏర్పడబోతున్న కొత్త రాజకీయ పార్టీ జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు కారణం కాగలుగుతుందా అనే ప్రశ్నకు 'రాజకీయ శూన్యత' అనే అంశం ఒక్కటే సానుకూల సమాధానం చెప్పడానికి ప్రతికూలంగా ఉంటోంది.
గతంలో ప్రతిపక్షాల ఐక్యతకు సంబంధించి గట్టి అనుభవమే మనకుంది.
స్వాతంత్ర్యానంతర రాజకీయాలో చీకటి అధ్యాయంగా  పేర్కొనే ఎమర్జెన్సీ పరిణామాల అనంతరం ప్రతిపక్షాల నడుమ సయోధ్యకు దండలో దారం మాదిరిగా నాటి నేత లోక్ నాయక్ శ్రీ జయప్రకాశ్ నారాయణ్ ఎంతగానో దోహదపడ్డారు. ఆయన సారధ్యంలో జనతా ప్రయోగం కొంతవరకు అంటే కాంగ్రెస్ పార్టీని గద్దె దింపడం వరకు విజయవంతం అయింది. శ్రీమతి ఇందిరాగాంధీని దెబ్బతీయాలన్న ఉమ్మడి లక్ష్యం నెరవేరిన తరువాత జనతా పార్టీలో ఆంతరంగిక   విభేదాలు పెచ్చరిల్లాయి. కేవలం కక్ష సాధింపు, అధికార వ్యామోహం తప్ప కలగూరగంప వంటి  జనతా ప్రభుత్వానికి వేరే ధ్యాస, లక్ష్యం లేవన్న  అపనింద మోస్తూ  జనతా ప్రయోగం నీళ్ళు కారిపోవడానికి అందులో చేరిన ఆయా  పార్టీల నేతలే కారణం అయ్యారు. ప్రతిపక్షాల ఐక్యత పట్ల ప్రజల్లో ఓ రకమైన ఉదాసీన భావం ప్రబలడానికి కూడా జనతా ప్రయోగ వైఫల్యం దోహదం చేసింది. తరువాతి కాలంలో ప్రతిపక్షాల ఐక్యతారాగం కొత్త పల్లవి అందుకుంది. ఎవరి అస్తిత్వాన్ని వారు కాపాడుకుంటూనే, భావసారూప్యత ప్రాతిపదికగా సంకీర్ణ ప్రభుత్వాల శకం మొదలయింది. ఇందువల్ల ప్రభుత్వాల మనుగడకు  కొంతవరకు వెసులుబాటు లభించింది  కానీ ప్రజలపట్ల బాధ్యతలను నెరవేర్చడంలో వాటికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.     
అందుకే మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత ఆరు పార్టీలు కలవబోతున్నాయి అనే వార్త ఉత్తర భారతంలోని మీడియాలో పెద్ద చర్చనీయాంశం అయింది కాని ప్రజల్లో దానిపట్ల అంత ఆసక్తి కానరావడం లేదు.
కాంగ్రెస్ పార్టీ బలహీన పడడం అన్న ఒక్క కారణంతో,  అందువల్ల ఏర్పడ్డ రాజకీయ శూన్యతను ఆక్రమించుకునే ఉద్దేశ్యంతో ఈ కొత్త పార్టీ ఆలోచన రూపుదిద్దుకున్నదంటే నమ్మడం కష్టం. కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదని ఈ పార్టీలు నమ్ముతుండవచ్చునేమో కాని  దేశ రాజకీయాల తీరుతెన్నులు గమనించేవారు విశ్వసించడం కష్టం. లోక్ సభలో రెండు స్థానాలు కలిగిన బీజేపీ తదనంతర కాలంలో పుంజుకుని కేంద్రంలో అధికారం దక్కించుకున్న విషయాన్ని  మరువకూడదు.    
కొత్త పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్నది ఈనాడు సాగుతున్న చర్చ. భవిష్యత్తులో సంభవించగల రాజకీయ పరిణామాలకు దీన్ని ఒక సంకేతంగా చూడవచ్చు. ప్రస్తుతం ఈ పార్టీల ప్రభావం ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాలకే పరిమితం. అక్కడకూడా వీటి మధ్య ఆధిపత్య పోరు జనాలకు సుపరిచితం. ఈ పార్టీలకు ప్రస్తుత పార్లమెంటులో వున్న బలం కాంగ్రెస్ తో పోలిస్తే తక్కువే. ఇతర రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు, వామపక్షాల తోడ్పాటు లేకుండా జాతీయ స్థాయిలో ఈ కొత్త పార్టీ సాధించేది పూజ్యం. కాంగ్రెస్ ను కలుపుకుని పోవడం ద్వారా ఓ మేరకు ఫలితం ఉండవచ్చు.
మరో ఊహాగానం కూడా షికారు చేస్తోంది. అసలు ఈ కొత్త పార్టీ ఆలోచన కాంగ్రెస్ పుణ్యమే అని ఓ వాదన వినబడుతోంది. అయితే దాన్ని నిర్ధారించే ఆధారాలు ప్రస్తుతం లేవనే చెప్పాలి.
రాజకీయ పార్టీల కలయిక పవిత్రంగా వుండి, పాలూ నీళ్ళలా కలిసిపోవాలి. అతుకులు పెట్టి అతికినప్పుడు  అంత త్వరగానే అతుకు ఊడిపోయే ప్రమాదం పొంచుకునే వుంటుంది. వీటికి అవకాశంవాదం తోడయితే ఇక చెప్పేపనేలేదు. (06-12-2014)

NOTE: Photo Courtesy Image Owner

నడిచి వచ్చిన దారి - భండారు శ్రీనివాసరావు


జడి జడిగా పడుతున్న వాన చినుకుల్ని కారు వైపర్లు తుడుస్తుంటే ఎదట రోడ్డు స్పష్టాస్పష్టంగా కానవచ్చినట్టు గతంలోని చిన్నతనం. గుర్తుకు వస్తున్న చిన్ననాటి జ్ఞాపకాలు.





"......నీవే తల్లివి దండ్రివి
నీవే నా తోడునీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా|......
".......అష్టమి రోహిణి ప్రొద్దున
నష్టమ గర్భమునఁ బుట్టి యా దేవకికిన్
దుష్టునిఁ గంసు వధింపవె
సృష్టి ప్రతిపాలనంబు సేయఁగ కృష్ణా!......."
పల్లె మేలుకుంటున్న వేళ దూరంగా వుండి వుండి గాలిలో  తేలుతూ  వినవచ్చే కృష్ణ శతకంలోని పద్యాలు. అప్పయ్య మాస్టారి నాన్నగారు శివరాజు నాగభూషణ రావు గారు మంచి కృష్ణ భక్తులు. పొద్దున్నే లేచి స్నానాదులు ముగించుకుని సూర్యోదయానికి పూర్వమే సుస్వరంతో ఆ పద్యాలను గొంతెత్తి పాడేవారు.  మా వూరికి అదే  సుప్రభాతం.
పట్నంలో ఉంటూ సెలవులకు వూరికి వచ్చినప్పుడు చేసే ఒకే ఒక్క పని కరువుతీరా నిద్రపోవడం. ఇంటి ముందు ఆరుబయట మంచం వేసుకుని పడుకుంటే ప్రాణం గాలిలో తేలిపోయేది. దుప్పటి ముసుగు కప్పుకుని పడుకుంటే మెళకువ వచ్చినా లేవకుండా మరి కాసేపు పడుకుంటే బాగుంటుందని అనిపించేది. కల్లాపు జల్లడానికి వచ్చిన జీతగాళ్ళకు నా మంచం అడ్డు. 'పోనీలే సీనాయి (అంటే నేను)ని కాసేపు పడుకోనివ్వండి'. ఎక్కడినుంచో మా బామ్మ గొంతు. ఇంట్లో ఆవిడది సుగ్రీవాజ్ఞ. వెంటనే ఇద్దరు జీతగాళ్ళు నేను పడుకున్న నవారు  మంచాన్ని అలాగే పట్టి లేపి పక్కకు పెట్టి తమ పని కానిచ్చుకునేవారు. ఇదంతా ఎంతో సరదాగా వుండేది.
(సారీ! మరికొన్ని ముచ్చట్లు మరో సారి)
NOTE: Courtesy Image Owner       
  


5, డిసెంబర్ 2014, శుక్రవారం

బెడ్రూంకు డ్రాయింగ్ రూమ్ కు తేడా లేకుండా పోతోంది



వెతకబోయిన తీగె కాలికి తగిలిందన్న సామెత జీవితంలో అతి కొద్ది సందర్భాలలో మాత్రమే నిజమవుతుంది. నా విషయంలో మాత్రం ఈ మినహాయింపు వున్న దాఖలా నాకెప్పుడూ కనబడలేదు. అదేమిటో ఇంటి తాళాలు కూడా వెతక్కుండా ఏనాడూ కళ్లబడలేదు. అయితే ఈ వెతుకులాటలో కూడా ఒక ప్రయోజనం లేక పోలేదు. వెతికేవి కనబడవు కానీ, ఎప్పుడో, ఎక్కడో దాచినవి, దాచి మరచిపోయినవి హఠాత్తుగా దర్శనమిస్తుంటాయి. అల్లా దొరికిందే ఇదిగో ఈ ఇంటర్వ్యూ.

డాట్ కామ్ బూమ్ తొలిమొగ్గ వేస్తున్న రోజుల్లోనే ఆహ్లాద  రచయిత శ్రీ  మల్లాది వెంకట కృష్ణమూర్తి సంపాదకత్వంలో ఆరేళ్ళ క్రితం  (19-02-2006) ‘శృంగారం డాట్ కామ్’ (www.srungaram.com) అనే వెబ్ పత్రికలో శ్రీ దోర్బల శర్మ నాతో జరిపిన  ఇంటర్వ్యూ అది. వృత్తి జీవితంలో నేను అనేకమందిని ఇంటర్వ్యూ చేసివుంటాను కాని నన్ను మరో జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేయడం మాత్రం అదే తొలిసారి. బహుశా  ఆఖరుసారి కూడా. అప్పట్లో ఇంట్లో కంప్యూటర్, ఇంటర్నెట్  లేని కారణంగా దాన్ని కళ్ళారా చూసే భాగ్యం కలగలేదు. కాకపొతే ఆ వెబ్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఇంచార్జ్  శ్రీ ఎస్. రామకృష్ణ పోస్ట్ లో ఆ ఇంటర్వ్యూ ప్రతిని పంపారు. ఇన్నేళ్ళ తరువాత దేనికోసమో వెతుకుతుంటే అదిప్పుడు నా కళ్ళబడింది. మానవ సహజమయిన బలహీనతతో దాన్ని యధాతధంగా ఈ బ్లాగులో వుంచుతున్నాను. ఇందులోని మంచిచెడ్డలు చదువరులకే వొదిలేస్తున్నాను. - భండారు శ్రీనివాసరావు
(04-12 - 2014)
ఇంటర్వ్యూ కు ముందు శర్మ గారి  ఉపోద్ఘాతం :
తెలుగు పత్రికారంగంలో దిగ్గజం వంటివారయిన నార్ల వేంకటేశ్వర రావుతో కలసి పనిచేసిన ప్రముఖ పాత్రికేయుల్లో ఒకరు భండారు శ్రీనివాసరావు. ప్రస్తుతం దూరదర్శన్ లో న్యూస్ ఎడిటర్ గా వున్న ఆయన 1945 డిసెంబర్ లో    కృష్ణాజిల్లా కంభంపాడులో జన్మించారు. జగమెరిగిన భండారు పర్వతాలరావు ఆయనకు స్వయానా పెద్దన్నయ్య. జర్నలిస్టుగా మూడున్నర  దశాబ్దాల అనుభవం కలిగిన శ్రీనివాసరావు – రేడియో, దూరదర్శన్ లలో అనేక ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి ఎందరో జాతీయ స్తాయి నాయకులను ఇంటర్వ్యూ చేశారు.
సుదీర్ఘమయిన తన పాత్రికేయ వృత్తిలో మరచిపోలేని అనుభవంగా - మదర్  థెరిస్సాతో  తన ఇంటర్వ్యూను ఆయన పేర్కొంటారు. మదర్  థెరిస్సా హైదరాబాద్ సందర్శించినప్పుడు ఆమెను ఇంటర్వ్యూ చేసే అదృష్టం కలిగిందని, అల్లాగే ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా వుండగా భద్రాచలం అడవుల్లో నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీతో జరిపిన ప్రత్యేక యాత్ర కవరేజీని మరచిపోలేనని ఆయన అంటారు.
ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐ.ఐ.ఎస్.) అధికారి అయిన శ్రీనివాసరావు విద్యాభ్యాసం ఖమ్మం, విజయవాడల్లో జరిగింది.ఖమ్మం ఎస్.ఆర్.అండ్ బీ.జీ.ఎన్.ఆర్. డిగ్రీ కాలేజీలో పీయూసీ చదివారు. బీకాం విజయవాడ ఎస్.ఆర్. ఆర్. కాలేజీలో. ప్రసిద్ధ సినీ దర్శకుడు, జంధ్యాల కాలేజీలో తనకు బెంచ్ మేట్ గా గుర్తుచేసుకున్నారు. 1971  లో విజయవాడ ఆంధ్రజ్యోతిలో సబ్  ఎడిటర్ గా చేరి  1975  దాకా అక్కడే పని చేశారు. అప్పటినుంచి 1987   దాకా హైదరాబాద్ ఆకాశవాణిలో న్యూస్ కరస్పాండెంట్ గా పనిచేశారు. తరువాత నాటి యు.ఎస్.ఎస్.ఆర్. (సోవియట్ రష్యా)కు చెందిన మాస్కో రేడియో తెలుగు విభాగంలో న్యూస్ రీడర్ గా పని చేయడానికి మాస్కో వెళ్లారు.సుమారు అయిదేళ్ళు అక్కడేవున్న ఆయన నాటి సోవియట్ యూనియన్ పతనాన్ని స్వయంగా చూశారు. తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చి ఆకాశవాణిలో చేరి న్యూస్ ఎడిటర్ గా  2004 దాకా కొనసాగారు. దూరదర్శన్ లో న్యూస్ ఎడిటర్ గా విధులు నిర్వహించి 2005 డిసెంబరు 31వ తేదీన పదవీవిరమణ చేసారు. విధి నిర్వహణలో భాగంగా  దేశ విదేశాల్లో అనేక ప్రాంతాలు సందర్శించిన ఆయనకు అన్ని సామాజిక, దేశీయ సమస్యలపై మంచి అవగాహన వుంది. మలేషియా, సింగపూర్, అమెరికా వంటి దేశాలు సందర్శించారు.
పత్రికా రచయితగా భండారు శ్రీనివాసరావు  1974 – 75 మధ్య కాలంలోనే ఆంధ్ర జ్యోతిలో ‘వాక్టూనులు’ పేర నిర్వహించిన శీర్షిక మంచి  పాఠక జనాదరణ పొందింది. ఆకాశవాణిలో ఆయన పదేళ్ళపాటు నడిపిన ‘జీవన స్రవంతి’ కార్యక్రమం విననివాళ్లు వుండరు. ‘ప్రజాతంత్ర’ వారపత్రికలో కిందటేడాది ‘అమెరికా అనుభవాలు-అనుభూతులు’ శీర్షికన ఆయన ఒక సీరియల్ రాశారు. ‘నడచి వచ్చిన దారి’ శీర్షికన ఒక ఆటోబయాగ్రఫీని, ‘మార్పు చూసిన కళ్ళు’ పేరుతొ తాను చూసిన ఆ నాటి సోవియట్ యూనియన్ అనుభవాలను సీరియల్ గా రాయాలన్న తలంపు వున్నట్టు తన మనసులోని మాటను వెల్లడించారు. పెద్దన్నయ్య భండారు పర్వతాలరావే తనకు వృత్తిలో స్పూర్తినిచ్చారని చెప్పే శ్రీనివాసరావు ‘శృంగారం డాట్ కామ్’ కోసం- ‘బెడ్ రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు తేడా లేకుండా పోయిందం’టూ సీనియర్ పాత్రికేయుడు దోర్బల శర్మకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. -  సంపాదకుడు.
హైదరాబాదులోని  ఎర్రమంజిల్ ప్రాంతంలో ప్రధాన రహదారి పక్కనే వున్న క్వార్టర్ అది. ఇంటి ముందు ‘భండారు శ్రీనివాసరావు, దూరదర్శన్’ అనే నేమ్ ప్లేట్  వుంది. ఆ రోజు ఉదయం పదిన్నర గంటలకల్లా ఆ ఇంటికున్న చిన్న గేటు తీసుకుని లోనికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కగానే ఆయనే వచ్చి నన్ను ఆహ్వానించారు. నన్ను నేను పరిచయం చేసుకున్నాక ఇంటర్వ్యూ ప్రారంభించాను. ‘శృంగారం గురించి నేనేం మాట్లాడగలను?’ అని తొలుత సందేహించిన భండారు – ఆ తరువాత నేను అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు లోతయిన విశ్లేషణతో కూడుకుని వున్నాయి. ఈ తరం విధిగా తెలుసుకోవాల్సిన విషయాలను ఆయన వెల్లడించారు.
ప్ర) శృంగారం అనగానే ఎందుకంత వెనుకంజ వేసారు?
జ) నేనే కాదు. సాధారణంగా ఆ మాట వినగానే మనలో చాలామంది వెనుకంజ వేస్తారు. ఎందుకంటె మన మైండ్ సెట్ ఆ విధంగా తయారయింది. చిన్నతనం, యుక్త వయస్సు, వృద్ధాప్యం – ఇలా యే ప్రాయంలోనయినా సరే దాని గురించి స్వేచ్చగా మాట్లాడే తెగువని చాలామంది చూపలేరు. కనుకే వెంటనే మాట్లాడడానికి కాసింత భయమేసింది.
ప్ర) దాన్ని భయమంటారా?
జ) జంకు కావచ్చు. శృంగార విషయాలను స్వేచ్చగా చర్చించుకునే అవకాశం మన సంస్కృతిలో లేకపోవడమే దీనికి కారణం. దాన్ని గోప్యంగా వుంచేలా మనమంతా ‘ట్యూన్’ అయివున్నాం. ఈ నేపధ్యంలో ‘తెర’ తీసేదెవరు? ‘తెర తీయగరాదా’ అనే ధైర్యం కూడా సాంప్రదాయపరులలో చాలామందికి లేదు.
ప్ర) దీన్నిబట్టి సెక్స్ గురించి చాలామందికి తెలియదనుకోవచ్చా?
జ) సెక్స్ గురించి మన సమాజంలో చాలామందికి సంపూర్ణంగా తెలియని మాట నిజమే. దీన్ని ఇలా గోప్యంగా వుంచడం వల్లనే అలా తెలియకుండా పోతుందన్నది ఒక కారణం కావచ్చు. అయితే మన చుట్టూ వున్న చాలామందికి ‘సెన్సెక్స్’ గురించి తెలిసినంతగా ‘సెక్స్’ గురించి తెలియదనవచ్చు. వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో ‘సెన్సెక్స్’ అనే మాటను మనం చాలాసార్లు వింటూ వుంటాం. కానీ ‘సెక్స్’ అన్న మాటను అనడానికీ, వినడానికీ అనేకులు మొహమాట పడతారు.
ప్ర) మనం సెక్స్ ప్రాధాన్యాన్ని తెలుసుకోవడం లేదా?                  
జ) అనే చెప్పాలి. మనిషి జీవితానికి సెక్స్ యెంత అవసరమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక విశ్లేషణ ప్రకారం  మానవుని ఆయుర్దాయం నూరేళ్ళు అనుకుంటే అందులో సగటున ఒక ఇరవై ఏళ్లకు  మించిన కాలమయినా శృంగారానికి కేటాయిస్తున్నట్టు లేదు. ఎవరికయినా యుక్త వయస్సు వచ్చేసరికి పరిస్తితి ఎలా  వుంటుందంటే – ‘అప్పటికి ఒక పదేళ్ళ కిందటి వరకు సెక్స్ గురించి తెలవదు. ఓ పదేళ్ళ  తరువాత  సెక్స్ అవసరం వుండదు.’  దీన్ని బట్టి శృంగారానికి లభిస్తున్న ప్రాధాన్యం అర్ధం అవుతోంది.
ప్ర) మధ్య వయస్కులు శృంగారానికి దూరం అవుతున్నారంటారా?
జ) అలా అని నిర్దిష్టంగా చెప్పలేం. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఈ మధ్య ‘ప్లస్ ఫార్టీ’ శృంగారం అని ఒకటి వచ్చింది. ఇది నలభై  నుంచి  యాభై ఏళ్ళ వయస్సులోని వారికి వర్తిస్తుంది. ఈ రకమయిన శృంగార పోకడ భార్యాభర్తల మధ్య వున్నప్పుడు ఓకే. కానీ ఇది అలా కాకుండా వివాహేతర సంబంధాలకు దారి తీస్తున్నట్టు వింటున్నాం. ఒక పెళ్ళయిన వ్యక్తి, చివరికి పిల్లాపాపలున్న స్త్రీలు సైతం సమాజం లోని నియమాలను తోసిరాజంటూ ఇలాటి శృంగార సంబంధాలకు సిద్ధపడుతున్నట్టు వినవస్తోంది. శృంగారం లోని ఆనందాలను అనుభవించడానికి అదొక మంచి అవకాశంగా వారు భావిస్తున్నట్టున్నారు.
ప్ర) ఇలా వివాహేతర సంబంధాలను పెట్టుకోవడం ఎంతవరకు మంచిది? 
జ) మంచీ చెడు నిర్ణయం అన్నది ఎవరికి వారు చేసుకోవాల్సిందే. ఒకరికి మంచి మరొకరికి చెడు  కావచ్చు. ఆయా వ్యక్తుల విచక్షణ, పరిస్తితులకు దీన్ని వొదిలేయాల్సిందే. మంచి చెడుల విచక్షణలో ఆయా వ్యక్తుల అభిరుచులు, కాలమాన స్తితిగతులు ఇవన్నీ పరిగణనలోకి వస్తాయి. ఉదాహరణకు ఒకప్పుడు నాగయ్య నటించిన సినిమాలే మంచివి, నిన్నటి నాగేశ్వరరావు సినిమాలు చెడ్డవి అనలేం. యే కాలానికి తగ్గట్టు ఆ రకమయిన పద్ధతులు, నియమాలు వుండడం సహజం. కాకపొతే అన్నింటికీ విలువలు ముఖ్యం అని మరచిపోకూడదు.  విలువలకు అతీతంగా, వాటికి భంగం కలగకుండా చూసుకోవడం  ప్రధానం.
ప్ర) పై పరిస్తితిని విలువలు దిగజారడంగా భావించవచ్చా?
జ) అలా జనరలైజ్ చేయడానికి లేదు. అప్పట్లో విలువలతో కూడిన సంపాదనలు వుండేవి. ఇప్పుడు ప్రతిదానికి డబ్బు సంపాదనే ప్రధానమయినది. విలువలు లేని సంపాదనలు ఎక్కువయ్యాయి. ఇలాటి చోట సెక్స్ లోను విలువలు వుంటాయని అనుకోలేం.
ప్ర) సెక్స్ పట్ల నేటి యువత స్పందన యెలా వుంటోంది?
జ) ఇప్పుడు ఓ మోటార్ బైకు పై ఓ అమ్మాయి, ఓ అబ్బాయి చాలా తేలిగ్గా తిరిగేస్తున్నారు. వారిలో అపోజిట్ సెక్స్ పట్ల, స్పర్స పట్ల ఒక సున్నితత్వం లేకుండా పోయింది. అప్పట్లో అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు తాకడానికే జంకేవారు. శారీరకంగా స్పర్శిస్తే ఒక గగుర్పాటు కలిగేది. కానీ ఇప్పటివారిలో ఈ స్పందన కానరావడం లేదు.  చాలా ఈజీగా ఒకరికొకరు షేక్ హాండ్లు ఇచ్చుకోవడం, ఇద్దరు మగవాళ్ళ మధ్య ఒక అమ్మాయి స్వేచ్చగా తిరగడం జరుగుతోంది. పాతకాలంతో పోల్చుకుని దీన్ని తప్పుపట్టడం కూడా సరికాదు.
ప్ర) అసలు నేటి యువత ప్రధాన లక్ష్యం ఏమిటి? 
జ) వారి ప్రధాన లక్ష్యం డబ్బు. దాన్ని యెలా సంపాదించాలి? ఇంతే. వారి ప్రాధాన్యాలు ఇప్పుడు కెరీర్, సంపాదన. ఇవే. వీటి గొడవలో పడి అసలు సెక్స్ కు ఇవ్వాల్సిన గౌరవం, స్తానం ఇవ్వడం లేదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి తేలిగ్గా ప్రేమించుకోవడం, కలసి తిరగడం, పెళ్ళయితే సరి. లేకపోతే అంతకంటే తేలిగ్గా మరచిపోవడం. ఇదంతా చాలా సులభంగా చేసేస్తున్నారు. ఒకరికోసం ఒకరు తపించడాలు, మనసులు బరువెక్కడాలు వంటి సన్నివేశాలు లేనేలేవు. ఒక్క మాటలో చెప్పాలంటే నేటి యువతరానిది టేకిట్ ఈజీ పాలసీ. ప్రతి దాన్నీ తేలిగ్గానే తీసుకుంటారు, ఒక్క సంపాదన విషయాన్ని మినహాయిస్తే. కుదిరితే ఓ కప్పు కాఫీ అనేవారే ఎక్కువవుతున్నారు.
ప్ర) పెళ్లి కాకుండా భార్యాభర్తల్లా వుండడం ఎంతవరకు సబబు?  
జ) ‘పెళ్లి’ అనేది ఇద్దరు స్త్రీ పురుషులు కలసి వుండడానికి చేసుకునే ఒప్పందం అనుకున్నప్పుడు సమాజం పెట్టిన వివాహం అనే కట్టుబాటు కొందరికి నచ్చకపోవచ్చు. అలాటివారు పెళ్లి చేసుకోకుండానే భార్యాభర్తల్లా కలసి వుంటారు. అందులో తప్పు పట్టడానికి ఏమీ వుండదు. కాకపొతే ఆ ‘బంధాన్ని’ (?) నాలుగు కాలాలపాటు నిలబెట్టుకోగలిగితే సంతోషమే. అయితే అదే అనుమానం.
ప్ర) మీరు పెళ్లి ఆర్భాటాలకు వ్యతిరేకం అని విన్నాను. నిజమేనా?
జ) నిజమే! నాకు టీనేజ్ వచ్చేసరికే దాదాపు పదిహేను ఇరవై మంది మేనకోడళ్లను బుట్టల్లో ఎత్తుకెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాను.  నాకు ఏడుగురు అక్కయ్యలు. వాళ్ళలో చాలామంది ఆడపిల్లల పెళ్ళిళ్ళను నేను దగ్గరుండి మరీ చూసాను. నాకు ఇరవై  ఏళ్ళ వయస్సు వచ్చేదాకా అనేక పెళ్ళిళ్ళు చూసి చూసి ఒకరకంగా చికాకు ఏర్పడింది. నా పెళ్లి వరకు వచ్చేసరికి ఆ పెళ్లి తంతు శుద్ద దండగమారి  ఆర్భాటంలా అనిపించింది. అందుకే నేను ఆ రకమయిన అట్టహాసమేదీ జరుపుకోలేదు.
ప్ర) వివాహ వేడుకలోని అనుభూతిని కోల్పోయినట్టు ఫీలవుతున్నారా? 
జ) బాపు తీసిన  ‘పెళ్లి పుస్తకం’ లాటి కళాత్మక సినిమాలు చూస్తున్నప్పుడు ఆ తంతులో ఇంత గొప్ప అనుభూతి వున్నదా అనిపిస్తుంది. నిజమే. ఇప్పుడు అలా అనిపిస్తున్న సంగతి ఒప్పుకుని తీరాల్సిందే. కానీ, నాకు అప్పట్లో పెళ్లి తంతులోని అనవసర ఖర్చులు, ఆర్భాటాలు, గందరగోళాలు  కనిపించినంతగా, శాస్త్రోక్తమయిన ఆ శుభ కార్యంలో వధూవరులకు లభించే అనుభూతి కానరాలేదు. దానిని మిస్ అయ్యానేమోనని ఇప్పుడు అనిపిస్తున్న మాట నిజమే.
ప్ర) పెళ్లి వద్దనుకున్న వాళ్లకు పెళ్ళాం మాత్రం ఎందుకంటారు?
జ) నేను  వద్దనుకున్నది ఆ ఆచారాలు, వ్యవహారాలనే కాని మొత్తంగా పెళ్లాన్నే కాదుగా. అందుకే నేను అప్పట్లో ‘పెళ్లి వద్దు, పెళ్ళాం కావాలి’ అనే నినాదాన్ని కూడా వినిపించాను. అలాగే దీనితో పాటు ‘ఉద్యోగం వద్దు – ఉపాధి కావాలి’ అనీ అన్నాను. ఆ రోజుల్లో  మామీద ఆనాటి సమకాలీన సమాజ స్తితిగతుల ప్రభావం ఎక్కువగా వుండేది. నాలాటి యువతలో ఇలాటి భావాలు రావడానికి కూడా ఆ నాటి వర్తమాన పరిస్థితులు, కాలానుగుణమయిన మార్పులే   అదే కారణం. ఇప్పటివారు కూడా దీనికి మినహాయింపు కాదు. కాలాన్నిబట్టే పోకడలు. అందుకే ఈ నాటి తరం భావజాలాన్ని సమర్ధించడానికి కూడా అప్పట్లో నాలాటి వాళ్లు ప్రదర్శించిన తిరుగుబాటు ధోరణే కారణం కావచ్చు.  నేను లేవనెత్తిన ఈ రెండు నినాదాల్లో ఒకదాన్ని పాటించగలిగాను. రెండో దాని విషయంలో పాక్షిక సర్దుబాటు చేసుకుని జర్నలిజం లోకి దిగాను.
ప్ర) ప్రేమ ప్రణయం – వీటిపట్ల మీ కవితాత్మక భావనలు కొన్ని చెబుతారా?   
జ) వృత్తిరీత్యా జర్నలిస్ట్ నే అయినా నేనూ కొంత ప్రేమ కవిత్వం రాశాను. అంతా వయసు మహిమ. చెబుతాను వినండి.
“రాత్రి ఒక నక్షత్రం రాలి పడింది.
తెల్లారి చూస్తే అది నువ్వే”

“ఊహల్లో నేనూ
వూహించుకుంటూ నువ్వూ
వర్తమానాన్ని నష్ట పోతున్నాం”

వీటికి ఒక అర్ధం అంటూ లేదు. మనసుకు తోచింది ఇలా రాస్తూ పోయాను.
ప్ర) అప్పటికీ ఇప్పటికీ వచ్చిన సాంస్కృతిక మార్పు ఏమిటి? 
జ) ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు బెడ్రూం కు డ్రాయింగ్ రూమ్ కు తేడా లేకుండా పోతోంది. బెడ్ రూమ్ విషయాలన్నీ టీవీ ద్వారా డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చేశాయి. మార్పు సహజమే. ఒప్పుకోవాలి. ఉదాహరణకు ఇప్పుడు జర్నలిష్టులు పది రూపాయలు ఇస్తే కానీ పేరా వార్త రాయడం లేదని వింటున్నాం. ఇలాటి పెడ ధోరణి ఇదివరకూ లేకపోలేదు. అప్పట్లోనే పెగ్గు పడితే కాని వార్త రాయని వాళ్ళను ఎందర్ని చూడలేదు. అప్పుడూ ప్రమాణాలు పడిపోవడం చూసాము. కాకపొతే, ఇప్పుడు ప్రమాణాలే లేవు. ఇది యెంత దూరం పోతుంది  అంటే –  పెండ్యులం  అన్నది వూగి వూగి ఎక్కడో ఒకచోట ఆగుతుంది. అంతదాకా ఎదురుచూడక తప్పదు.”

అంటూ ఆయన తన ఇంటర్వ్యూ ముగించారు. (19-02-2006)
NOTE: Courtesy Image Owner