3, డిసెంబర్ 2014, బుధవారం

మంచి ప్రార్ధన


'దేవుడా! నాకు డబ్బివ్వు. ఎంతంటే, అవసరంలో ఉన్నవారికి సాయపడేటంత.
'దేవుడా! నాకు అధికారం ఇవ్వు. ఎంతంటే, అవసరంలో ఉన్నవారికి ఉపయోగపడేటంత.

'దేవుడా! నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు. వయసు మళ్ళినప్పుడు ఎవరిమీదా ఆధారపడకుండా వుండేటంత' 


(NOTE: COURTESY IMAGE OWNER)
   

వీసా అక్కరలేని గోంగూర



దేశాలు తిరగాలంటే మాటలా. వీసాలు కావాలి, విమానం టికెట్లు కావాలి. కానీ  మా ఆవిడ చేసిన గోంగూర పచ్చడి ప్యాకెట్లు  ఇవేవీ అక్కరలేకుండానే దేశదేశాలు తిరుగుతున్నాయి. అమెరికాలో వున్న మా పిల్లలకి మూన్నెళ్ళకోమారు తాను  స్వయంగా చేసిన పచ్చళ్ళూ కారాలు పంపడం మా ఆవిడకో అలవాటు. మొన్న ఇలాగే ఓ కొరియర్లో కొన్ని పచ్చళ్ళ ప్యాకెట్లు పంపింది. అది అమెరికా ఎప్పుడు చేరుతుందో తెలుసుకోవడానికి కొరియర్ కంపెనీ వాడు ఓ ట్రాకింగ్ నెంబరు ఇచ్చాడు. దాన్నిబట్టి చూస్తే  మా గోంగూర ప్యాకెట్టు రెండు రోజులు కూడా తిరగకుండానే  మూడు దేశాలు చుట్టి తన ప్రయాణాన్ని కొనసాగిస్తోందని తెలిసింది. హైదరాబాదు నుంచి మొదలయిన దాని ప్రయాణం బెంగళూరు, ముంబై మీదుగా దుబాయి చేరి, అటునుంచి తుపాను దిశ మార్చుకున్నట్టు ఏకంగా ఇటలీ లోని సొమ్మా లాంబార్డో విమానాశ్రయం చేరుకుందని ఆఖరు వార్తలు తెలుపుతున్నాయి. అమెరికాలోని సియాటిల్ చేరేలోగా ఇంకా ఎన్ని ఖండాలు చుట్టబెడుతుందో వేచి చూడాలి.  

   

తోట్లవల్లూరు కబుర్లు

మూడేళ్ళ నాటి ఓ ముచ్చట (2011) 
అనుక్షణం వార్తలమధ్య గడిపే జర్నలిష్టులను ప్రతిరోజూ  పత్రికల్లో వచ్చే వార్తలు అంతగా ఆకట్టుకోవు. కానీ, (2011)నవంబర్ ఇరవై ఐదో తేదీన ఈనాడు లో పడ్డ  వార్తను చూసిలోగడ ఆలిండియా రేడియో, దూర దర్శన్ లలో  న్యూస్ డైరెక్టర్ గా పనిచేసిన ఆర్.వీ.వీ. కృష్ణారావు కాసేపు చకితులయ్యారు. దానికో కారణం వుంది. అది తెలుసుకోవాలంటే అంతకు ముందు శనివారం నాడు హైదరాబాదులో  జరిగిన ఒక పెళ్లి. అది చెప్పుకునే ముందు ఈనాడులో పడ్డ వార్త సారాంశం తెలుసుకుందాం.

తోట్లవల్లూరును మరచిపోలేను.


(ప్రెసిడెంట్ ఒబామాతో డాక్టర్ నోరి)


(తోట్లవల్లూరు, న్యూస్ టుడే-  కేన్సర్ చికిత్సలో ప్రపంచ ప్రఖ్యాత  కీర్తి గడించిన  డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గురువారం కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో పర్యటించి తన చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తాను చిన్నప్పుడు నివసించిన ఇంటిని సాంబశివరావు కొనుగోలు చేసి కొత్తగా  నిర్మించుకున్న ఇంటికి వెళ్లి అంతా  కలయతిరిగిచూసారు. ఇక్కడో బావి వుండాలే!అని ఆ ఇంట్లోవారిని వాకబు చేశారు.   పమిడిముక్కల మండలం ఘంటాడలో తాను జన్మించినా, కుటుంబ సభ్యులతో చిన్నతనంలో  గడిపిన తోట్లవల్లూరును జీవితంలో మరచిపోలేనని చెప్పారు. తనకు నామకరణం చేసిన కలగా పూర్ణచంద్ర శాస్త్రి ఇంటివద్ద కొద్దిసేపు గడిపి వేణుగోపాలస్వామి ఆలయంలో  అర్చకులు ప్రసాదంగా ఇచ్చిన చిట్టి గారెలు తిని దాదాపు యాభై అరవై  ఏళ్ళ నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.)

ఈ వార్త కళ్లబడగానే  కృష్ణారావు గారికి నెప్పల్లి  ప్రసాద్ గారి అబ్బాయి పెళ్ళిలో జరిగిన సంఘటన సినిమా రీలులా కళ్ళముందు కదలాడింది.
ప్రసాద్ గారు అమెరికాలో పేరుమోసిన చార్టర్డ్ అక్కౌంటెంట్. వారి ఆహ్వానం మేరకు కృష్ణారావు గారు ఆ పెళ్ళికి వెళ్లారు. అక్కడ ఆయనకు  వూహించని అతిధి తారసపడ్డారు. ఆయనే నోరి దత్తాత్రేయుడు గారు. ఆయన హస్తవాసికి తిరుగులేదు. క్షణం తీరికలేని వైద్యులు. కేన్సర్ రక్కసి పీచమడిచే పనిలో పడి దేశదేశాలు తిరుగుతుంటారు. ఇటీవల సోనియా గాంధీ గారికి వైద్యం చేసిన డాక్టర్ల  బృందానికి ఆయనే నేతృత్వం వహించారని పత్రికల్లో  వచ్చింది.  దత్తాత్రేయుడి గారికి  నెప్పల్లి ప్రసాద్ గారు  అత్యంత ఆత్మీయులు. అందుకే వారి కుమారుడి వివాహానికి అమెరికానుంచి రెక్కలు కట్టుకుని ఇండియాకు  వచ్చారు. వారిని పెళ్ళిలో చూడగానే కృష్ణారావు గారికి చిన్నప్పటి తోట్లవల్లూరు సంగతులు మదిలో మెదిలాయి. దత్తాత్రేయుడు గారి కుటుంబం, కృష్ణారావు గారి కుటుంబం యాభయ్ , అరవై ఏళ్ళనాడు ఆ వూళ్ళో ఒకే ఇంట్లో నివాసం వుండేవి. చిరకాలం నాటి  బాల్య మిత్రుడు అన్నేళ్ల తరువాత   తారసపడగానే కృష్ణారావు గారు ఆయనతో మాటలు కలిపారు. మాటల మధ్యలో తోట్లవల్లూరు సంగతి ఎత్తారు. పెళ్ళిలో నలుగురి మధ్యవున్న కారణంగానో యేమో ఆయన  నుంచి వెంటనే  స్పందన కాన రాలేదు. అయినా కృష్ణారావు గారు నిరుత్సాహ పడలేదు. పెళ్ళయిన తరువాతో అంతకు  ముందో కానీ, భోజనాల సమయంలో మరోసారి దత్తాత్రేయుడు  గారితో ముచ్చటించే వీలు చిక్కించుకున్నారు. చిన్నప్పటి సంగతులు కొన్ని  గుర్తు చేశారు. ఈ సారి ఆయన గుర్తుపట్టినట్టే అనిపించింది.
ఎన్నో ఏళ్ళయింది తోట్లవల్లూరు వెళ్లి. మేము అమ్మేసిన ఇల్లెలా వుంది? వూరెలా వుంది ?” అని అడిగారు.
వీలయితే ఈసారి కలసివెడదాంఅని కూడా అన్నారు.  
కోట పోయింది. చదువుకున్న స్కూలు అలాగే వుంది. మనం ఆడుకున్న గుడీ అలానే వుంది. పక్కన కృష్ణానది అందరి  జ్ఞాపకాలను వొడిలో దాచుకుని అలాగే పారుతోంది.బదులు చెప్పారు.
అంతటితో ఆగలేదు. చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలు, మసలిన మనుషులు అన్నింటినీ  గుర్తుచేశారు.
వేణుగోపాలస్వామి ఆలయం, గుళ్ళో ప్రసాదంగా పెట్టే చిట్టిగారెలు, కట్టు పొంగలి రుచి, వాళ్లు వున్న ఇల్లు, ఇంటి ముందు గిలక బావి, దొడ్లో బాదం చెట్టుఇలా ఒకటేమిటి గుర్తుకొచ్చినవన్నీ పూసగుచ్చినట్టు చెప్పేశారు కృష్ణారావు గారు.
విందు పూర్తయింది. పెళ్లయిపోయింది. ఇంటికి తిరిగివచ్చిన తరువాత కూడా కృష్ణారావు గారికి తోట్లవల్లూరు గురించిన తలపులు వొదలలేదు. అది ఆయన సొంత వూరు  కాకపోయినా, దత్తాత్రేయుడు గారి మాదిరిగానే కృష్ణారావు గారికి కూడా ఆ వూరితో మరచిపోలేని అనుబంధాలు, జ్ఞాపకాలు అనేకం వున్నాయి.
కృష్ణారావు గారి నాన్న గారు రాయసం గంగన్న పంతులు గారు. దేవాదాయ శాఖలో ఉద్యోగి. చిన్న చిన్న దేవాలయాలను పర్యవేక్షించే అధికారి. బదిలీ మీద కుటుంబాన్ని వెంట తీసుకుని తోట్లవల్లూరు వెళ్లారు.
ఆ వూళ్ళో నోరి సత్యనారాయణ గారింట్లో ఓ వాటా అద్దెకు తీసుకున్నారు.
సత్యనారాయణ గారికి   నలుగురు కుమారులు. పెద్దబ్బాయి  నోరి రాధాకృష్ణ మూర్తి గారు. ఐ.పి.ఎస్. అధికారి. పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ గానో ఆ పై పదవిలోనో రిటైర్ అయ్యారు. పోలీసు ఉద్యోగంలో చేరక మునుపు ఆయన బందరు కాలేజీలో లెక్చరరుగా పనిచేసేవారు.
రెండో కుమారుడు ఎన్.మధురబాబు గారు. స్టేట్ బ్యాంక్ లో జనరల్ మేనేజర్ చేశారు. ఇందిరాగాంధీ హయాంలో ప్రవేశపెట్టిన గ్రామీణ బ్యాంకుల  వ్యవస్థలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొల్పిన మొట్టమొదటి గ్రామీణ  బ్యాంక్  నాగార్జున గ్రామీణ బ్యాంక్ కు మొదటి  చైర్మన్ గా పనిచేసి సమర్ధుడయిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. జ్యోతిష శాస్త్రంలో కూడా దిట్ట, మూడో కుమారుడు రామతీర్ధ కాగా కనిష్ట  కుమారుడు నోరి దత్తాత్రేయుడు గారు. చిన్నప్పుడు దత్తు అని పిలిచేవాళ్ళు.
కొత్త వూరిలో కృష్ణారావుగారికి కొత్త స్నేహితులు లభించారు. ఆటపాటలతో కాలక్షేపం చేసేవారు. అమ్మా నాన్నా ఏదయినా పనిమీద బెజవాడ  వెళ్ళాల్సి వస్తే ఆ నాలుగు రోజులు తన భోజనం పడకా కూడా నోరి  వారింట్లోనేఅని కృష్ణారావు గారు నాతో  ఈ విషయాలు చెబుతూ గుర్తు చేసుకున్నారు.   
వారి తండ్రిగారి అకాల మరణం తరువాత నోరి వారి మకాం బందరుకు మారిపోయింది.
కృష్ణారావు గారు మాత్రం తండ్రిగారి  ఉద్యోగరీత్యా  తోట్లవల్లూరులోనే మరికొంత కాలం గడిపారు.
ఆ నాటి రోజులు గురించీ, అప్పటి వాతావరణం గురించీ ఆయన మాటల్లోనే.              
నదికి ఆనుకునే కాలవ. బెజవాడ నుంచి లాంచీలు తిరుగుతుండేవి. శివ కామేశ్వరి, శివ పార్వతి, గంగ వాటి పేర్లు.         
నోరి వారి కుటుంబం యావత్తూ కుసుమ హరనాధ బాబా భక్తులు.  ఇంట్లో  రోజూ భజనలు. పూజలు. తండ్రి చనిపోయిన తరువాత వారి కుటుంబం బందరు వెళ్ళగానే ఆ వాటాలోకి అప్పయ్య శాస్త్రి గారు అద్దెకు దిగారు.
తోట్లవల్లూరులో వాళ్లు వున్న ఇల్లు బాగా పెద్దదేమీ కాదు. ఉత్తర ముఖంగావున్న ఆ ఇంటి ముందు గిలక బావి. దొడ్లో బాదం చెట్టు. కుడి పక్క  తాడికొండ వారి నివాసం. ఆ ఇంట్లోనే రామమందిరం. దాపునే తోట్లవల్లూరు కరణం గారయిన అడిదం వారి ఇల్లు. మరోపక్క గోవిందరాజుల వాళ్లు వుండేవాళ్ళు. పోతే,  శివలెంక వీరేశ లింగం గారి  ఇల్లు కూడా పక్కనే. వీరేశ లింగం గారు పేరు మోసిన  పెద్ద జ్యోతిష్కులు. సినీ నటుడు   ముదిగొండ లింగమూర్తి గారి  వియ్యంకులు. మద్రాసునుంచి భానుమతి వంటి ప్రముఖ సినీ  కళాకారులు కూడా ఆయనను కలవడానికి తోట్లవల్లూరు వచ్చేవాళ్ళు. వీరేశలింగం గారి  అబ్బాయి ఎస్.వి.ఎం. శాస్త్రి గారు  దక్షిణ  మధ్య రైల్వేలో ఉన్నతాధికారిగా పనిచేశారు. తోట్లవల్లూరులోని శివాలయానికి శివలెంక వారు అనువంశిక ధర్మ కర్తలు.
వూళ్ళో వున్న పెద్దగుడి వేణుగోపాలస్వామిది. ఆ గుడికి తగ్గట్టు  పెద్ద గాలి గోపురం. దాని మీద పావురాళ్ళు. వాటి రక్తం పూస్తే పక్షవాతం వంటి రోగాలు నయమవుతాయని చెప్పుకునే వాళ్లు. అది బొమ్మదేవరపల్లి  జమీందారులు కట్టించిన గుడి కావడం వల్ల వైభోగానికి  తక్కువలేదు. పూజలు, పునస్కారాలు, ప్రసాదాల వితరణ ఘనంగానే  జరిగేవి. తిరునక్షత్రం నాడు పులిహోర చేసేవాళ్ళు. పర్లాంగు దూరంలో  కృష్ణానది. ధనుర్మాసంలో ఆలయ అర్చకులు ఆ బావినుంచి మంగళ వాయిద్యాలతో తీర్ధపు బిందెలు తెచ్చేవాళ్లు. మా  పిల్లల  ఆటలన్నీ గుళ్ళో పొగడ చెట్టు కిందనే.
మా వీధి లోనే పోస్టాఫీసు. అన్నంభొట్లవాళ్లు టపా పని చూసేవారు. ఉయ్యూరు నుంచి ప్రతిరోజూ ఒక భారీ మనిషి  (పోస్టల్ రన్నర్) తపాలా సంచీ మోసుకుంటూ అయిదుమైళ్లు గబగబా నడుచుకుంటూ  తోట్లవల్లూరు వస్తుండేవాడు. పెద్ద పెద్ద అంగలు వేస్తూ, చేతిలో వున్న పొడుగుపాటి బల్లేన్ని నేల మీద పోటు  పొడుచుకుంటూ  అతగాడు నడిచివస్తుంటే ఆ బల్లెం పైన కట్టిన మువ్వలు అదోరకం శబ్దం  చేస్తుండేవి.
తోట్లవల్లూరు  జమీందారులు బొమ్మదేవర వంశీకులు వేణుగోపాలస్వామి దేవాలయానికి అనువంశిక ధర్మకర్తలే కాదుదానికి కర్తా కర్మా క్రియా అన్నీ వాళ్ళే.  జమీందార్ల దగ్గర ఏనుగుల్ని సంరక్షించే నాగయ్య అనే వ్యక్తి తరువాతి రోజుల్లో ఈ గుడి వ్యవహారాలూ కనిపెట్టి  చూసేవాడు. కృష్ణారావు గారి తండ్రి రాయసం గంగన్న పంతులు గారు ప్రభుత్వం తరపున అంటే దేవాదాయ శాఖ తరపున ఆలయం బాధ్యతలు  చూస్తుండే వారు. అప్పట్లో ఆయన నెల  జీతం  అరవై రూపాయలు. కరవుభత్యం కింద  ఇరవై రూపాయలు. పైన మరో అర్ధ రూపాయి. ఆ వూరి మొత్తంలో  నెలసరి అంత జీతం వచ్చేవాడు మరొకడు లేకపోవడం వల్ల అది చిన్న జీతంగా ఆయన ఎప్పుడూ భావించలేదు. కాకపొతే అంత జీతం అన్నది ఆయనకు వూళ్ళో ఒక ప్రత్యేకతను, అయాచిత  గౌరవాన్ని కట్టబెట్టింది. 
ఆ రోజుల్లో బెజవాడ నుంచి  తోట్లవల్లూరుకు  ప్రైవేటు సర్వీసులవాళ్లు బస్సులు నడిపేవాళ్ళు. ఒకటి  రామాంజనేయ మోటార్ సర్వీస్, రెండోది గోపాలకృష్ణా ట్రాన్స్ పోర్ట్. బస్సులమీద ఆ  పేర్లు రాసివుండేవి. గోపాలకృష్ణా ట్రాన్స్ పోర్ట్  అని రాసి  పక్కనే ఇన్ లిక్విడేషన్ అని కూడా వుండేది. దాని అర్ధం ఇప్పటికీ తెలియదు. వీటిల్లో   రామాంజనేయా సర్వీసు బస్సు ఖచ్చితంగా  టైం ప్రకారం నడిచేది. ఒక బస్సు డ్రైవర్  పేరు సుబ్రహ్మణ్యం అని గుర్తు.
వెనుక బెజవాడ నుంచి  రావాలంటే చుట్టూ తిరిగి  రావాల్సివచ్చేది. ఇప్పుడు కృష్ణానది కరకట్ట మీదుగా హంసలదీవి దాకా రోడ్డు వేసారు. దాంతో  రాకపోకలు సులువయ్యాయి.
తోట్లవల్లూరులో  వున్న హైస్కూలే చుట్టుపక్కల వూళ్ళకు దిక్కు. వల్లూరిపాలెం నుంచి ఆడపిల్లలు  నడుచుకుంటూ స్కూలుకు వచ్చేవాళ్ళు. పక్కనున్న భద్రిరాజుపాలెం నుంచి కూడా చదువుకోవడానికి పిల్లలు  తోట్లవల్లూరు  రావడం గుర్తు.
వూళ్ళో గుర్రబ్బళ్లు  కూడా వుండేవి. ఒకరోజు బండి చక్రం కింద ఓ కుక్క పిల్ల నలిగి చనిపోవడం చూసిన పిల్లలకు ఆ రోజు అన్నం తినబుద్దికాలేదు.
తోట్లవల్లూరు గురించిన  పాత సంగతులు  కృష్ణారావు గారికి  ఇంకా అనేకం గుర్తున్నాయని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకనిపించింది.
పెళ్ళిలో కలసి కాకతాళీయంగా  ఆయన    చెప్పిన నాలుగు ముచ్చట్లు నోరి దత్తాత్రేయుడి గారి తోట్లవల్లూరు పర్యటనకు ప్రేరణకావడం  నా ఈ రచనకు ప్రేరణగా మారింది. (28-11-2011) 
NOTE: Courtesy Image Owner   

    


2, డిసెంబర్ 2014, మంగళవారం

ఆరు మాసాలు - అరవై వివాదాలు

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY IN IT'S EDIT PAGE ON 04-12-2014, THURSDAY)

'ఎంతో చేద్దామనుకున్నాను. కొంతే  చేయగలిగాను. ఏదయినా మంచి పని చేయాలని అనుకున్నప్పుడు ఇన్నిన్ని అవాంతరాలు, అడ్డంకులు ఉంటాయని అప్పుడు వూహించలేకపోయాను'
పదవి దిగిపోయేముందు  ప్రతి రాజకీయ నాయకుడూ చెప్పే మాట ఇది.
'ఈసారి మరో అవకాశం ఇచ్చి చూడండి. ఏం చేద్దామని అనుకున్నానో, ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను'
ఆ ప్రతి రాజకీయ నాయకుడు  మళ్ళీ మళ్ళీ చెప్పే మాటలు కూడా ఇవే.  
కొత్త రాష్ట్రం ఏర్పడీ, కొత్త ప్రభుత్వం ఏర్పాటయి అక్షరాలా ఆరు మాసాలు. మరో కొత్త రాష్ట్రంలో మరో కొత్త ప్రభుత్వం ఏర్పడి మరో వారంలో ఆరు నెలలు పూర్తవుతాయి. తప్పదనుకున్నా, తప్పే అయినా తప్పనిసరిగా పోల్చి చూసుకోవాల్సిన పరిస్తితి ఈ రెండు తెలుగు రాష్ట్రాలదీ. బహుశా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏర్పడిన కొత్త రాష్ట్రాలలో వేటిల్లో కూడా ఈ ఆంద్ర,  తెలంగాణాల్లో వున్న విచిత్ర, వింత  పరిస్తితి వుందనుకోలేము.
కోరి కోరి, పోరి పోరి కోరిన రాష్ట్రం తెచ్చుకుని ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన టీ ఆర్ ఎస్ పార్టీకి విభజన తలనొప్పులు తప్పలేదు.
అవిభాజ్య ఆంద్ర ప్రదేశ్ గా వున్నప్పుడు, 'కలసివుంటే పండగ, వేరు కుంపటి దండగ' అంటూ పల్లవులు పాడి, చివరకు గత్యంతరం లేని స్తితిలో విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి, విభజనానంతర అవశేష ఆంద్ర ప్రదేశ్ లో అధికార పగ్గాలు దక్కించుకున్న తెలుగు దేశం పార్టీకి అవే తలనొప్పులు. వచ్చిపడ్డవి కొన్నయితే, కొని తెచ్చుకున్నవి మరి కొన్ని. ఈ నొప్పులు వారివరకు పరిమితమయితే కధ వేరుగా వుండేది. అవి ప్రజల వరకు బదిలీ అవుతుండడమే ఇందులోని విషాదం.
కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు కొత్త ఇబ్బందులు సహజం. అవి ఎలా ఉంటాయో, వాటి పర్యవసానాలు ఎలా వుండబోతాయో అన్నది అందరికీ ముందే తెలుసు. అయినా అందరి సమ్మతితోనే రాష్ట్ర విభజన జరిగి పోయింది. విభజన నిర్ణయం జరిగీ జరగగానే, ఉమ్మడి రాష్ట్రంలో అటు లోక సభకు ఎన్నికలు జరిగాయి. మరో విడ్డూరం ఏమిటంటే, రాష్ట్ర విభజన జరగక ముందే రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికల తంతు ముగించారు. ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడిన తరువాతనే, జూన్ రెండో తేదీన రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తిచేశారు. ఎన్నికయిన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఓ వారం రోజుల తేడాతో కొలువు తీరాయి. ఇక అప్పుడు మొదలయింది అసలు కధ. 
    
మొదటి అధ్యాయం చంద్రబాబు నాయుడు సర్కారు ఎక్కుబెట్టిన  పీపీయే అస్త్రంతో  శ్రీకారం చుట్టుకుంది. అది పెరిగి పెరిగి  రగిలి రగిలి మంటలుగా మారుతూ ఉన్నప్పుడే, తెలంగాణా సర్కారు తన అంబుల పొదిలోని ఫీజు రీ ఇంబర్స్ మెంటు అంశాన్ని తీసి అంకుశంలా ప్రయోగించింది. దానితో, పిల్లల చదువులతో పాటు  కాలేజీ యాజమాన్యాలు కూడా గందరగోళంలో పడ్డాయి. స్థానికత వివాదం సుడులు రేపుతుండగానే మరో పక్క  కరెంటు సెగ రాజుకుంది. అటూ ఇటూ అందరూ కలిసి  దాన్ని మరింత ఎగదోశారు. రెండు పార్టీల నడుమ సహజంగా వున్న వైరుధ్యాలు ఆధ్యం పోశాయి. ఇరువైపులా మాటల తూటాలు పేలాయి. అనేక సందర్భాలలో అవి సభ్యతాసంస్కారాలకు కొంత  దూరం జరిగాయి. వీటికి తోడు శ్రీశైలం జలవివాదం కమ్ముకుంది. వీధి కొళాయిల దగ్గర తగాదాలను మరిపించింది. చివరికి సేద్యపు నీటి  ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలను మోహరించాలని డిమాండ్ చేసేవరకు కధ ముదిరింది. కాదేదీ వివాదానికి అతీతం అన్నట్టుగా, వాహనాల రిజిస్ట్రేషన్, ఇంటర్ బోర్డు, ఉమ్మడి పరీక్షలు  ఇలా ఏది తీసుకున్నా ప్రతి చిన్న అంశం రెండు రాష్ట్రాల నడుమ పెద్ద వివాదాలకు కారణమవుతోంది.  ఇక ఉన్నతాధికారుల విభజన పూర్తిగా తేలకుండానే  మిగిలిపోయింది. తమ నిష్క్రియాయపరత్వానికి ఓ సాకుగా ఈ అంశం ఉభయ ప్రభుత్వాలకు ఉపయోగపడుతోంది. అది వేరే విషయం.
ఒక్క ముక్కలో చెప్పాలంటే,     
గత ఆరుమాసాలుగా ఈ రెండు నవజాత రాష్ట్రాలలోని  రెండు ప్రభుత్వాల నడుమ సయోధ్య అన్నది కలికానికి  కూడా కనబడకుండా పోయింది. ఇద్దరు  ముఖ్యమంత్రుల నడుమ మాటా  మంతీ లేదు. కలుసుకున్న సందర్భాలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. దానికి కూడా గవర్నర్ స్వయంగా పూనుకోవాల్సివచ్చింది.
ఇదీ, ఈ ఆరు నెలలుగా అవిశ్రాంతంగా సాగిపోతున్న కధ.
'ఆరు నెలలు.
'అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయా! ఇంకెంత? మరో నాలుగున్నర ఏళ్ళు. ఎంతలో గడిచిపోతాయి'
కాచుకు కూర్చున్న ప్రతిపక్షాల ఆశ.
'ఆరునెలలు.
'ఆరునెలలు చాలా స్వల్ప కాలం. ఎంతో చేయాలని సంకల్పించుకున్నప్పుడు ఇది మరీ తక్కువ సమయం. అయినా ఇంకా నాలుగున్నర సంవత్సరాలు అలాగే మిగిలున్నాయి. మిగులు తరుగులన్నీ పూర్తిచేసుకోవడానికి అది చాలు'
అధికార పక్షం ఆకాంక్ష.
అటయినా, ఇటయినా ఇదే ఆట. ఆడేవారు వేరు కాని పాత్రల స్వభావం ఒకటే.
ఇక ఇంతేనా అంటే ఇంతే అని చెబితే అది 'అర్ధ సత్య' అవుతుంది.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటు చంద్రశేఖర రావు, అటు చంద్ర బాబు నాయుడు ఇరువురికీ తమ తమ రాష్ట్రాల గురించి ఎన్నో  కలలు వున్నాయి. వాటిని సాకారం చేసుకోవడంకోసం ఎన్నో పధకాలు తయారు చేస్తున్నారు. ఒకరు బంగారు తెలంగాణా సాధన అంటుంటే, మరొకరు స్వర్ణాంధ్ర సాధన అంటున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తమ స్వప్నాలు యెంత సుందరంగా వున్నాయో ప్రజలకు విడమరచి చెబుతున్నారు. వాటిని నిజం చేయడం ఎలాగో తమకు తెలుసని అంటున్నారు కానీ ఎలా అన్నది చెప్పడం లేదు. వారి ప్రత్యర్ధులు సయితం వొప్పుకునే మంచి గుణం వారికి వున్న సమర్ధత. ఆ సమర్ధత పట్ల వారి వారి రాష్ట్రాల్లో అధిక సంఖ్యాకులకు వున్న అపార  నమ్మకం. ఇదే ప్రస్తుతానికి వారికి శ్రీరామ రక్ష.
ఏ రాజకీయ నాయకుడికీ ఇంతవరకూ లభించని అపూర్వ అవకాశం వీరిద్దరికీ లభించింది. ఒకరికి కొత్త రాష్ట్రాన్ని నిర్మించే అవకాశం. మరొకరికి కొంగొత్త రాజధాని నగరాన్ని నిర్మించే  అవకాశం.
ఇద్దరూ ఈ విషయంలో ఎవరికీ తీసిపోకూడదనే పావులు కదుపుతున్నారు. ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నారు. తమ కృషి పట్ల, తమ సామర్ధ్యం పట్ల ప్రజల్లో  విశ్వాసం పాదుకొలిపే ప్రయత్నం చేస్తున్నారు.   
ఎంతటి నమ్మకమైనా కాలం కలిసి రాకుంటే సడలిపోతుంది.  ఎంతటి కవచమైనా పరిస్తితులను బట్టి శిధిలమవుతుంది.
ప్రజల్లో నమ్మకం కలిగించేవాడు నాయకుడవుతాడు. ఆ నమ్మకాన్ని పది కాలాలపాటు నిలబెట్టుకోగలిగినవాడు ప్రజా నాయకుడు అవుతాడు.  
లేకుంటే, గతంలో ఓ వెలుగు వెలిగి మలిగిపోయిన అనేకానేక మంది రాజకీయుల్లో ఒకడిగా మిగిలిపోతాడు.
ఇది చరిత్ర చెప్పే సత్యం.         

(02-12-2014)

దీపం లేదు కదా!


ఏకాంబరం రాత్రి వేళ వీధి దీపం కింద వెతుకులాడుతుంటే దోవనపోయేవాడు ఆగి చూసి అడిగాడు 'ఏం వెతుకుతున్నావని'
'ఇంట్లో ఉంగరం పడిపోయింది'
'అలా అయితే ఇక్కడ ఎందుకు దేవులాడుతున్నావు?'
'ఎందుకేమిటి నీ మొహం! ఇంట్లో దీపం లేదు కదా!'

ఏకాంబరం విసుక్కున్నాడు.  

NOTE: Courtesy Image Owner

1, డిసెంబర్ 2014, సోమవారం

దిగ్భ్రాంతి అంటే !


ఏకాంబరం ఓ ఆదివారం వుదయం కారులో జోరుగా హుషారుగా షికారుకు వెడుతున్నాడు. అడవి బాటలో ఒంటరి ఆడపిల్ల - అదీ వయసులో వున్నదీ, అందంగా వున్నదీ తారస పడింది. అడిగి మరీ కారెక్కింది. ఆ అమ్మాయితో ముచ్చట్లు చెబ్తూ, ఆ మాటల కిక్కు ఎక్కేలోగా వూహించనిది జరిగిపోయింది. మాట్లాడుతూ  మాట్లాడుతూనే ఆ అమ్మడు నోట మాట లేకుండా స్పృహ తప్పి పడిపోయింది. ఏదేదో వూహించుకుంటూ వూహాలోకాల్లో వున్న ఏకాంబరం  ఆ పిల్ల పరిస్తితి చూసి దిమ్మ తిరిగి దిగ్భ్రాంతికి గురయ్యాడు.
కాసేపట్లో తేరుకుని దగ్గర్లో వున్న ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు.
డాక్టర్ పరీక్ష చేసి అభినందనలు తెలిపాడు. ‘తండ్రి కాబోతున్నాడన్న కబురు’ చెవిలో వేశాడు.
ఏకాంబరం కాదన్నాడు. డాక్టర్ ఏదో చెప్పబోయేలోగా ఆ అమ్మడు కల్పించుకుని అతడే  పుట్టబోయే తన బిడ్డకు కాబోయే కన్నతండ్రని ఖరాఖండిగా చెప్పింది. ఏకాంబరం మరోసారి దిగ్భ్రాంతికి గురయ్యాడు.
దాన్నుంచి మళ్ళీ తేరుకుని ధైర్యం కూడదీసుకుని ఆ అమ్మాయి అబద్ధం చెబుతోందని వాదించాడు. తాను చెప్పింది నిజం అని నిరూపించుకోవడానికి ఎలాటి పరీక్షకయినా సిద్ధం అన్నాడు.
డాక్టర్ డి.ఎన్.యే. పరీక్ష చేశాడు. టెస్ట్ రిజల్ట్ వచ్చింది. ఆ ఫలితం ఏకాంబరాన్ని కొంత వూరట పరిచింది. ఆ పిల్ల చెప్పింది నిజం కాదని తేలిపోయింది. కాని అందులో వివరాలు అతగాడికి  మరింత దిగ్భ్రాంతి కలిగించాయి. ఆ అమ్మాయి గర్భవతి కావడానికి ఏకాంబరం కారణం కాదని మాత్రం  తేలింది కానీ, ఏకాంబరానికి ఆ అమ్మాయినే కాదు యే అమ్మాయినీ గర్భవతిని చేయగల సామర్ధ్యం పుట్టుకతోనే లేదన్న కఠిన వాస్తవం  ఆ టెస్టుల్లో బయట పడింది.
ఆ దిగ్భ్రాంతి నుంచి కూడా తేరుకుని  ఏకాంబరం ఇంటి దారి పట్టాడు. హఠాత్తుగా అతడికి తన కన్న పిల్లలు గుర్తుకు వచ్చారు.
అంతే!
దిగ్భ్రాంతికి పరాకాష్ట అంటే ఏమిటో  ఏకాంబరం అనుభవంలోకి వచ్చింది.


(నెట్లో చక్కర్లు కొడుతున్న ఇంగ్లీష్ జోకుకు స్వేచ్చానువాదం)

NOTE: Courtesy Image Owner         

30, నవంబర్ 2014, ఆదివారం

మనశ్శాంతికి మంచి మార్గం


బుద్ధుడు అంతేవాసులతో కలసి అడవి మార్గాన వెడుతున్నాడు.
దోవలో ఆగి ఒక శిష్యుడిని పిలిచి ‘దాహంగా వుంది మంచి నీళ్ళు పట్టుకురమ్మ’ని కోరాడు.
అతడు చుట్టుపక్కల పరికిచి చూస్తే దగ్గరలో ఓ వాగు కనిపించింది. ఆకుల దొన్నెలో నీళ్ళు పట్టుకురాబోయేలోగా ఒక  ఎడ్లబండి అటుగా వచ్చింది. ఎడ్లు వాగుదాటే క్రమంలో  అందులోని  నీళ్లన్నీ మురికి మురికిగా మారాయి.  ఆ నీటిని తీసుకువెళ్లడం ఆ శిష్యుడికి మనస్కరించలేదు.
తిరిగి బుద్ధుడి దగ్గరికి వెళ్ళి వున్న విషయం మనవి చేసుకున్నాడు. ‘స్వామీ! వాగులో నీరు మురికి మురికిగా వుంది’
బుద్ధుడు తలపంకించి వూరుకున్నాడు.      

అప్పటికి అక్కడే విశ్రాంతికోసం  విడిది చేసిన బుద్ధుడు కొంతసేపు గడిచిన తరువాత అదే శిష్యుడిని పిలిచి మంచి నీరు పట్టుకు రావాల్సిందని మళ్ళీ కోరాడు.
శిష్యుడు మళ్ళీ వాగువద్దకు వెళ్లాడు.
అప్పటికీ వాగులో నీళ్ళు  తేరుకోలేదు.  బురద బురదగానే వున్నాయి.
శిష్యుడు తిరిగి వచ్చి అదే విషయం బుద్ధుడితో చెప్పాడు. బుద్ధుడు ఏమీ మాట్లాడలేదు.
మరి కొద్ది సేపటిలోనే ఆ శిష్యుడికి మళ్ళీ పిలుపు. నీళ్ళు తెమ్మని గురువుగారి అర్ధింపు.
ఈసారి వెళ్లేసరికి వాగులో నీరు తేరుకుని వున్నాయి. నిర్మలంగా వున్న నీటిని ఆకు దొన్నెలో తెచ్చి గురువు గారికి అందించాడు.
బుద్ధుడు ఆ నీటిని సేవించి శిష్యుడితో ఇలా అన్నాడు.
‘దీన్నిబట్టి నీకేం అర్ధం అయింది. ముందు వెళ్ళినప్పుడు వాగులో నీళ్ళు మురికిగా వున్నాయి.
‘కొంత వ్యవధానం తరువాత అవే తేరుకున్నాయి. అవి అలా తేరుకోవడానికి మనం చేసినదేమీ లేదు. కొంత వ్యవధి ఇచ్చాం అంతే.
 ‘మన మనసు కూడా ఆ వాగులో నీటి మాదిరే.
‘అది కలత చెందినప్పుడు దాన్ని దాని మానాన వొదిలిపెట్టాలి. కాసేపటి తరువాత అదే కుదుట పడుతుంది.
‘ఈ మర్మం తెలుసుకోగలిగితే మనశ్శాంతి కష్టమేమీ కాదు.
‘మానసిక ప్రశాంతత కోసం వేరే  ప్రయత్నాలేవీ  అవసరం లేదు. నిజానికి ఎలాటి ప్రయత్నమూ లేకుండానే దాన్ని పొందవచ్చు.’