3, జూన్ 2014, మంగళవారం

ఇద్దరు చంద్రులకూ ఒకే చిట్కా - భండారు శ్రీనివాసరావు


ఇటు చంద్రశేఖరరావు గారు అటు చంద్రబాబు నాయుడుగారు - ఇద్దరికీ పనికొచ్చే తాయిలం ఇది.
స్కూళ్ళల్లో చేరే పిల్లల  సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. అధవా చేరినా, చేర్చినా -  చదువుకు మధ్యలోనే గంట  వాయించి స్కూళ్ళు వొదిలి వెళ్ళిపోయే వారి సంఖ్య రోజురోజుకూ  పెరుగుతోంది. దీనికి అనేక కారణాలు. వాటిని అన్వేషిస్తూ ఢిల్లీలో ఒక స్వచ్చంద సంస్థ 'సూదికోసం సోది'  చెప్పించుకుంది. ఆ సోదిలో తేలిందీ తెలియవచ్చిందీ ఏమిటంటే -
"ఢిల్లీలోని మురికివాడల్లో నివసించేవారికి అనేక ఇబ్బందులు. అందులో ఒకటి విద్యుచ్చక్తి లేకపోవడం. వున్నా నామమాత్రంగా -  'గుడ్డికన్ను తెరిచినా ఒకటే మూసినా ఒకటే' అన్న తీరులో వుండడం. ఈ కారణం వల్ల ఆ వాడల్లో వుండే పిల్లలు సరిగా చదువుకోలేకపోతున్నారు. అంతే సరిగా హోం వర్క్ చేసుకోలేకపోతున్నారు. ఫలితంగా బాగా మార్కులు తెచ్చుకోలేకపోతున్నారు. దీనికంటే చదువు మానేయడమే మంచిదనే తీర్మానానికి వస్తున్నారు (ట).
ఈ విషయం అర్ధం చేసుకున్న 'సలాం బాలక్ ట్రస్ట్' అనే ఒక స్వచ్చంద సంస్థ ఒక అడుగు ముందుకేసి  పరిష్కారం దిశగా ఆలోచించింది. మరో సంస్థతో కలిసి సోలార్ పానెల్స్, ఎల్.ఈ.డీ. లైట్లు వున్న స్కూల్ బ్యాగ్ తయారుచేసింది. పగటివేళ పిల్లలు స్కూలుకు వెళ్ళేటప్పుడు ఈ సంచీని వీపుకు తగిలించుకుని వెడతారు. సూర్యరశ్మికి  ఈ సోలార్ బ్యాగ్ చార్జ్ అవుతుంది.  రాత్రివేళ కరెంటు లేకపోయినా కూడా ఈ బ్యాగ్ కు అమర్చిన లైట్ల సాయంతో పిల్లలు చదువుకోవచ్చు.
కాబట్టి మనం అర్ధం చేసుకోవాల్సింది ఏమిటీ అంటే-
ఉపాయం  లేనివాడిని వూరినుంచి తరిమెయ్యమంటారే -  అదిగో ఆ సామెతలో ఎంతో అర్ధం వుందని.

రాలిన సంగీత నక్షత్రం ప్రపంచం సీతారాం


(ఈనాటి - 04-06-2014 - ఆంధ్ర జ్యోతి దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)
సంగీతానికి చావు లేదు. అయితే, అజరామరమైన సంగీతాన్ని జనాలకు వొదిలి సంగీత కారులు మాత్రం  అమరులుగా మిగిలిపోతుంటారు. అలాంటి సంగీత నక్షత్రం ఒకటి అమెరికాలో ని అట్లాంటాలో మొన్న ఆదివారం నాడు రాలిపోయింది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఫ్లూట్ వాయిద్యకారుడు ప్రపంచం సీతారాం ఇక లేడన్నవార్తను  మీడియా కాస్త ఆలశ్యంగా మోసుకొచ్చింది.  అంతటి సంగీతకారుడు పనిచేసిన రెడియోలోనే నేనూ పనిచేశాను అనే ఒకే ఒక్క  కారణం తప్ప ఆయన్ని గురించి రాయగల  ఏ యోగ్యతా నాకులేదని, ఆ ఒక్కటే  ఈ వ్యాసానికి ప్రేరణ అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఆత్మగౌరవం కలిగిన కళాకారులు సర్కారీ నౌఖరీ చేయడంలో ఎదుర్కునే మానసిక సంఘర్షణలు గురించి ప్రస్తావించాలని అనుకోవడం కూడా ఈ రచనకు దోహదం చేసింది.


ప్రపంచం సీతారాం స్వయం ప్రతిభ కలిగిన వ్యక్తి. స్వయం శక్తితో పైకి వచ్చారు. చేతిలో ఇమిడిపోయే వేణువును ఒక పరికరంగా  తీసుకుని జీవితాన్ని తీర్చి దిద్దుకున్నారు. సరయిన వయస్సులో తగిన విద్యార్హతలు సంపాదించుకోలేకపోయినా తదనంతర  కాలంలో పట్టుదలతో శ్రమించి అనేక విశ్వవిద్యాలయాల డిగ్రీలు తన ఖాతాలో వేసుకున్నారు. జీవిక కోసం ఒకప్పుడు ఢిల్లీ లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఫ్లూట్ కచ్చేరీలు చేసేవారు. ఆ పిదప యూనియన్ పబ్లిక్ సర్వీసు కమీషన్ ద్వారా ఎంపికై రేడియోలో ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్ గా చేరి, ఢిల్లీ రేడియో స్టేషన్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు.
ఒకప్పుడు రేడియో అంటే అనేక సంగీత దిగ్గజాల పేర్లు వినిపించేవి.                                    
మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, ఓలేటి వెంకటేశ్వర్లు, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి (గాత్రం),  బాలాంత్రపు రజనీకాంతారావు (వాగ్గేయకారుడు), అన్నవరపు రామస్వామి, మారెళ్ళ కేశవరావు, నేతి శ్రీరామ శర్మ (వయొలిన్) దండమూడి రామ్మోహన రావు, ఎల్లా వెంకటేశ్వరరావు  (మృదంగం) ప్రపంచం సీతారాం,  ఎన్ ఎస్ శ్రీనివాసన్ (వేణువు), మంచాల జగన్నాధరావు( వీణ).   మామూలుగా అయితే ఇవి కొన్ని పేర్లు మాత్రమే. కానీ ఆ పేర్లకువున్న పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇన్నీ కావు. ఒకప్పుడు ఇలాటి మహనీయులు నడయాడిన నట్టిళ్లు ఆకాశవాణి కేంద్రాలు. వారు బయట ప్రదేశాలకు వెళ్ళి సంగీత కచ్చేరీలు ఇచ్చినప్పుడు పలానా వారు, బెజవాడ రేడియో కేంద్రం,  హైదరాబాదు కేంద్రం  నిలయ విద్వాంసులు అని కరపత్రాలు ముద్రిస్తే,  అది వారు పనిచేసే కార్యాలయానికి ఒక అదనపు గుర్తింపు తెచ్చిపెట్టేదిగా భావించేవారు. గతంలో రేడియో కేంద్రాలకు అధిపతులుగా పనిచేసిన అధికారులు కూడా వారికి తగిన గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. చక్కటి సంగీత కళాకారులు తమ వద్ద పనిచేయడం అనేది గొప్ప విషయంగా పరిగణించేవారు. ఆ కారణంగానే పాత కాలంలో సంగీతానికి రేడియో, రేడియోకు సంగీతం పరస్పర సహకారం ఇచ్చుకున్నందువల్లే కచ్చేరీల ద్వారా కొందరికే అందుబాటులో వున్న సంగీతం రేడియో ద్వారా ఎల్లెడలా వున్న జనాలకు చేరువకాగలిగింది.  కానీ కాలం గడుస్తున్న కొద్దీ అన్ని వ్యవస్థల్లో మార్పులు వచ్చినట్టే రేడియోలో కూడా పరిస్థితులు మారుతూవచ్చాయి. తమ సంగీతపాటవాన్ని పదిమందికీ తెలియచేయాలన్న తపనతో ఓ పక్క రేడియోలో పనిచేస్తూనే కొందరు కళాకారులు మరోపక్క తగిన అనుమతులు తీసుకోకుండా బయట సంగీత కచ్చేరీలలో పాల్గొంటూ వుండేవారు. ముందే చెప్పినట్టు వెనుకటి రోజుల్లో ఈ తరహా వ్యవహారాలను అధికారులు ఓ దృష్టితో చూసి, చూసీ చూడనట్టు వొదిలేస్తే తదనంతరం వచ్చిన అధికారుల్లో కొందరు దీన్ని నిబంధనలకు వ్యతిరేకం అన్న కోణంలో చూడసాగారు. అదిగో అక్కడే రేడియో ఆర్టిస్టులకు, అధికారులకు మధ్య సంఘర్షణలకు దారితీసింది. అయితే సహజంగా ఈ విషయంలో అధికారులదే పైచేయి కావడంతో ఆర్టిస్టులు మానసికంగా కుంగిపోయేవారు. రేడియోలో తమది ఉపాధి అనుకున్నారు కాని ఉద్యోగం కాదనుకుని వచ్చి ,  పరిస్తితులతో రాజీపడలేని కొందరు రేడియోనే వొదిలేసారు. అలాటివారిలో మొన్న అట్లాంటాలో కన్నుమూసిన ప్రపంచం సీతారాం ఒకరు. దక్షిణ భారతంలో పేరెన్నికగన్న టీ ఆర్ మహాలింగం శిష్యులు. ప్రపంచం అన్నది సీతారాం ఇంటిపెరుకాదనీ, ఎప్పుడో దశాబ్దాలక్రితం తెలుగులో తీసిన 'ప్రపంచం' అనే చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించిన కారణంగా ఆయనకు ప్రపంచం అన్నది ఇంటి పేరుగా మారిపోయిందని చెబుతారు.   

రేడియోలో చాలాకాలం అదీ బెజవాడ రేడియోలో ఎక్కువకాలం న్యూస్ ఎడిటర్ గా  పనిచేసిన నా సీనియర్ సహచరులు  ఆర్ వీ వీ కృష్ణారావు గారికి , సీతారాం గారి  మరణ వార్త గురించి చెప్పగానే ఆయనతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. నిబంధనల  పేరుతొ నిరంకుశంగా వ్యవహరించే అధికారుల చేతుల్లో కళాకారులు యెలా కుంగిపోతారన్నదానికి ఒక అనుభవాన్ని ఆయన ఉదాహరణగా చెప్పారు.
ఇది జరిగి కూడా పాతిక ముప్పయ్యేళ్ళు అవుతుందేమో.  మంగళగిరి,  నంబూరు నడుమ ఒక జైన దేవాలయం వుంది. ఆ ఆలయం అధికారుల ఆహ్వానం మేరకు ఒకరోజు బెజవాడ రేడియో స్టేషన్ డైరెక్టర్ శ్రీ అయూబీ, కృష్ణారావు గారిని వెంటబెట్టుకుని అక్కడకువెళ్లారు. అదేసమయంలో అక్కడ వారికి ప్రపంచం సీతారాం తన బృందంతో తారస పడ్డారు. అప్పటికే ఆయన రేడియో కళాకారుడే కాకుండా తదనంతరం సంపాదించుకున్న డిగ్రీల సాయంతో రేడియోలో ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్ గా ఎంపికై. ప్రమోషన్ మీద  బెజవాడ రేడియో స్టేషన్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఉద్యోగం ఏదైనప్పటికీ, స్వతహాగా ఆయన సంగీత కారుడు.  కచ్చేరీలు చేయాల్సిందిగా ఆహ్వానాలు అందుతూ వుండేవి. అయితే రేడియో ఉద్యోగులు ఇలా కచ్చేరీలు చేయడం అప్పటి స్టేషన్ డైరెక్టర్ కు సుతరామూ ఇష్టం వుండేదికాదు. పైగా అలాటి వారికి  మెమోలు ఇవ్వడం, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఆయనకు అలవాటు. ఆయన హయాములో రేడియో కళాకారులు బిక్కచచ్చినట్టు వుండేవారు.
జైన దేవాలయంలో పై అధికారి కనబడగానే కచ్చేరీ నిమిత్తం అక్కడికి వచ్చిన ప్రపంచం సీతారాం కూడా కంగారు పడిపోయారు. మరునాడు స్టాఫ్ మీటింగులో కూడా స్టేషన్ డైరెక్టర్ అదే విషయాన్ని ప్రస్తావించి హెచ్చరిక చేయడంతో,  ఆయన కృష్ణారావు గారితో చెప్పుకుని తెగ మధన పడిపోయారు. ఇలాటి అనేకానేక అనుభవాల తరువాత రేడియోలో స్టేషన్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన తరువాత కూడా సీతారాం, తన మనస్సుని సమాధానపరచుకోలేక, తన మనస్సుకు నచ్చని రేడియో ఉద్యోగాన్ని వొదిలి పెట్టి పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో చేరి, అక్కడే విభాగాధిపతిగా పనిచేసి పదవీ విరమణ చేశారు.
ఫ్లూటు వాయిద్యంలో తనకు తానే సాటి అనిపించుకున్న ప్రపంచం సీతారాం గారు ఈ ఏడాది మే నెలలో అమెరికాలోని శాండియాగోలో వుంటున్న తన కుమారుడు ప్రసన్నను చూడడానికి  వెళ్ళి, గత ఆదివారం నాడు ఈ ప్రపంచాన్ని శాశ్వితంగా విడిచివెళ్ళారు.
తన సంగీత జ్ఞానంతో తెలుగు  సంగీత ప్రాభవాన్ని ఏనాడో ఎల్లలు దాటించిన ప్రపంచం సీతారాం, దేశం ఎల్లలు  దాటివెళ్ళి అక్కడెక్కడో పరాయి దేశంలో మరణించడం విధి విచిత్రం. (03-05-2014)



సాకారమైన కల


నేటి సాక్షి దినపత్రిక (03-06-2014) ఎడిట్ పేజీలో ప్రచురితం

    
మన  రాష్ట్రానికి సంబంధించిన  ఒక ప్రధానమైన ఘట్టం చరిత్రలో చోటుచేసుకుంది. చాలా ఏళ్ళుగా నలుగుతూసలుపుతూ వచ్చిన ఒక సమస్యకు'ముగింపుదొరికింది. పడింది 'శుభంకార్డామరో సమస్యకు అంకురార్పణా అన్న చర్చ అనవసరం.  దాన్ని కాలమే తేలుస్తుంది.
ఎందుకంటే 1956 లో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా 'ఆంధ్రప్రదేశ్ఏర్పాటయినప్పుడు ఇలాగే సంతసించినవాళ్ళు వున్నారు. సందేహించినవాళ్లు వున్నారు. ఆనాడు సంశయం వ్యక్తం చేసిన వాళ్ల భయాలే నిజం అయ్యాయని ఈనాడు విభజనను గట్టిగా కోరుతున్నవారు ఎంతో గట్టిగా వాదించిన సందర్భాలు వున్నాయి. అంచేత సందేహిస్తున్నవారి భయాలను తేలిగ్గా కొట్టివేయడం  కూడా తగదు.
ఎవరు అవునన్నా   ఎవరు కాదన్నా ప్రత్యేక తెలంగాణా స్వప్నం సాకారం అయింది.  ఈ సమయంలో గెలుపు వోటముల ప్రసక్తిని పక్కనబెట్టాలి. యుద్ధాల్లో, క్రీడల్లో  మాత్రమే ఈ మాటలు వినబడతాయి. ఇంతకాలం జరిగింది యుద్ధమూ కాదుఆటా కాదు.ఉభయప్రాంతాల జనంలో వున్న ఆకాంక్షకు చక్కని  అభివ్యక్తీకరణ మాత్రమే. కొందరు రాజకీయులు దీనికి అగ్గి రాజేసారు. వారిని గురించి పట్టించుకోవాల్సిన అగత్యం ఎంతమాత్రం లేదు. ఇకనుంచయినా సరేరెండు ప్రాంతాల ప్రజలు  రాజకీయుల చేతుల్లో పావులు కాకుండా తమ  ప్రాంతాల సత్వర  అభివృద్ధిలో  స్వయంగా భాగస్వాములు కావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అన్న నగ్న సత్యాన్ని రాజకీయ నాయకులకు ఎరుకపరచాలి.
నిజమే. సుదీర్ఘ కాలం సాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో హింసాత్మక ఘటనలు తక్కువే కావచ్చు. 1969 నాటితో పోలిస్తే  మొత్తం మీద ఉద్యమం శాంతియుతంగా జరిగిందని దానికి నాయకత్వం వహించిన వాళ్లు చెప్పుకోవచ్చు. కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం తపనపడి , ప్రత్యేక రాష్ట్రం  ఇక తీరని కలేమో అని అపోహపడి, ఆ నిర్వేదంలో  అనేక మంది యువకులు చేసిన  బలిదానాల మాటేమిటి? ప్రాంతీయంగా విడిపోయినా మానసికంగా కలిసివుందామని కోరుకునే వారి నడుమ రాజకీయులు తమ స్వార్ధం కోసం రగిల్చిన  సంఘర్షణల మాటేమిటి? ఆత్మహత్యలు చేసుకున్నపిల్లల  తలిదండ్రుల మానసిక క్లేశాలకు ఖరీదు కట్టే షరాబులు దొరకరు. అంచేత అలాటివారికి  స్వాంతన కలిగించడం తెలంగాణా నాయకుల ప్రధమ కర్తవ్యం.
ప్రజల మనసులకు తగిలిన  గాయాలు నయం కావడానికి కొంత సమయం పడుతుంది. వాటిని తమ మాటలు, చేతలతో మరింత ముదిరేలా చేసి  వ్రణాలుగా తయారు చేయకపోతే  అదే పది వేలు.
రైలు ప్రయాణంలో కలిసిన ప్రయాణీకులే విడిపోయేటప్పుడు ఎంతో బాధ పడతారు. అలాటిది దాదాపు అరవై ఏళ్ళక్రితం కలిసిపోయి, ఇన్నేళ్ళుగా కలిసి మెలిసి వుండి విడిపోయే తరుణంలో బాధపడని వారు వుండరు. విడిపోవడం తప్పనిసరి అయినప్పుడు కలిసివున్నప్పటి రోజుల్లోని అనుబంధాలను గుర్తు చేసుకుని వాటిని పదిలపరచుకోవడం, మరింత పెంచుకోవడం విజ్ఞుల లక్షణం.
మరో వారం తిరగగానే  తెలుగు ప్రజల చరిత్రలో ఇంకో నూతన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. తెలంగాణా పది జిల్లాలు పోను మిగిలిన పదమూడు జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ అనే పాత పేరుతోనే మరో కొత్త రాష్ట్రం రూపుదిద్దుకోబోతోంది.  వేరే వెతుక్కోకుండా తెలంగాణాకు,  వడ్డించిన విస్తరి మాదిరిగా అన్ని హంగులతో కూడిన రాజధానీ నగరం వుంది. అటుపక్క ఆంధ్ర ప్రదేశ్ లో  మాత్రం అన్నీ మొదటి నుంచీ మొదలు పెట్టాలి. బుడి బుడి అడుగులతో నడక ప్రారంభించాలి. అదీ వేగంగా సాగాలి. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల దూరదృష్టి లోపం కారణంగా అభివృద్ధి యావత్తూ హైదరాబాద్, దాని చుట్టుపక్కల మాత్రమే కేంద్రీకృతం అయింది. అంతర్జాతీయ స్థాయి కలిగిన విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, విద్య,  వైద్యాలయాలు అన్నీ కట్టగట్టుకుని ఒక్కచోటునే మఠం వేశాయి. చదువుల కోసం, వైద్యం కోసం, ఉద్యోగాలు, ఉపాధుల కోసం రాష్ట్రం నలుమూలలనుంచి హైదరాబాదు రావడానికి అలవాటు పడిన వారికి ఇప్పుడు కొన్నేళ్ళ పాటు ఇబ్బందే. సీమాంధ్ర ప్రాంతంలో ఈ సౌకర్యాలు ఓ మోస్తరు స్థాయిలోనే అభివృద్ధి చెందాయి. ఆ ప్రాంతంలో కొలువు తీరబోతున్న నూతన  ప్రభుత్వ వ్యవస్థకు ఎదురయ్యే తొలి సవాలు ఇదే.          


అభివృద్ధి  బంతి ఇప్పుడు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు నాయకత్వం వహించే వారి కోర్టులో వుంది. ఒక రాష్ట్రాన్ని నిర్మించుకోవాలి. మరో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి. వున్న వ్యవధానం చాలా తక్కువ. ఐదేండ్ల పుణ్యకాలం ఇట్టే గడిచిపోతుంది. కాబట్టి, లేనిపోని  గిల్లికజ్జాలతో, ఆరోపణలు ప్రత్యారోపణలతో అనుదినం  పొద్దుపుచ్చకుండా, ప్రజలకు  ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకుంటూ, వారి ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటూ,  సత్వర కార్యాచరణకు నడుం కట్టాలి. మాటలు చెప్పి, గీతలు గీసి విభజించడం అంత సులభం కాదు కొత్త రాష్ట్రాలను సుసంపన్నంగా తీర్చిదిద్దడం. పెనుభారంతో కూడిన ఈ బాధ్యతను రెండు ప్రభుత్వాలు అత్యంత శ్రద్ధాసక్తులతో, గరిష్ట నిష్టతో  నిర్వహించ గలిగితేనే రాష్ట్ర విభజన వల్ల సానుకూల ఫలితాలు రెండు ప్రాంతాలకు సిద్ధిస్తాయి. లేకుంటే పాఠ్య పుస్తకాల్లో మ్యాపులుగా మాత్రమే ఈ రెండు రాష్ట్రాలు మిగిలిపోతాయి.(02-06-2014)

1, జూన్ 2014, ఆదివారం

నమ్మలేని నిజం


నిజాలు ఒక్కోసారి నిజమేనని నమ్మలేనంత  విడ్డూరంగా వుంటాయి.
1990
అంటే సుమారు కొంచెం అటూ ఇటుగా పాతికేళ్ళనాటి ముచ్చట.
ఇద్డరు యువతులు ఢిల్లీ వెళ్ళడానికి లక్నోలో రైలెక్కారు. ఆ మరునాడే మల్ళీ అహమ్మదాబాదు వెళ్ళాలి. రైలు కదిలేముందు ఇద్దరు బడా నేతలు  అదే బోగీలోకి ఎక్కారు. వారితో పాటే బిలబిలమంటూ మరో డజను మంది వారి అనుచరులు కూడా  జొరబడ్డారు. ఆ యువతుల్ని సామాన్లమీద కూర్చోమని వాళ్ల బెర్తుల్ని  దర్జాగా ఆక్రమించుకున్నారు. అంతటితో ఆగారా.  పక్కన ఆడవాళ్ళు వున్నారు అనే సోయ  లేకుండా పెద్ద గొంతుకతో అసభ్య పదజాలంతో  సంభాషణ సాగించారు. వారి ధోరణితో ఆ యువతులు బిక్కచచ్చిపోయారు. ఢిల్లీ చేరేంతవరకు ప్రాణాలు అరచేతబెట్టుకుని ప్రయాణం చేశారు.
మరునాడు రాత్రి ఢిల్లీ నుంచి అహమ్మదాబాదు వెళ్లేందుకు రైలెక్కారు. మళ్ళీ 'మరో' ఇద్దరు నేతలు అదే బోగీలో కనబడ్డారు. రాత్రి అనుభవం ఇంకా  మనసులో పచ్చిగా  వుండిపోవడంతో  యువతుల భయం రెట్టింపు అయింది. అయితే చిత్రం. ఆ కొత్త వారిద్దరూ ఆ ఇద్దరు ఆడవాళ్లని చూడగానే జరిగి సర్దుకు కూర్చుని చోటిచ్చారు. అనుచరగణం కూడా లేకపోవడంతో తరువాత  ప్రయాణం సాఫీగా సాగిపోయింది.
మరునాడు ఉదయం రైలుదిగి ఎవరిదోవనవాళ్లు వెళ్ళబోయేముందు ఒక యువతి డైరీ తెరచి పట్టుకుని ' నేనూ  నా స్నేహితురాలు ఇద్దరం రైల్వేలో ప్రొబేషనరీ అధికారులుగా పనిచేస్తున్నాము. నా పేరు లీనా శర్మ.  శిక్షణ కోసం ఈ ప్రయాణం పెట్టుకున్నాము. మీవంటి వారు తోడుగా వుండడం వల్ల  రాత్రి మా ప్రయాణం ఎలాటి ఇబ్బంది లేకుండా సాగిపోయింది. ధన్యవాదాలు' అంటూ వారి పేర్లు అడిగింది.
వారిలో ఒకతను జవాబు చెప్పాడు.
'నా పేరు  శంకర్ సింగ్ వాఘేలా, ఇతడు నా రాజకీయ సహచరుడు నరేంద్ర మోడీ'
 (ఫేస్ బుక్ కోసం తెలుగులో క్లుప్తీకరించిన ఈ కధనం పూర్తి పాఠం ఈరోజు (01-06-2014)- హిందూ దినపత్రిక 'ఓపెన్ పేజ్' లో వుంది. ఆ పత్రికకి కృతజ్ఞతలు. ప్రస్తుతం రైల్వేలో అత్యున్నత పదవిలో వున్న అనే ఆవిడ రాశారు. నరేంద్ర మోడీ మొదటిసారి ముఖ్యమంత్రి కాకపూర్వమే ఆవిడ సొంత రాష్ట్రం అయిన అస్సాం లో ఒక స్థానిక దినపత్రిక ఈ కధనాన్ని లోనే ప్రచురించింది. షరా మామూలుగా ఇది స్వేచ్చానువాదం)

31, మే 2014, శనివారం

"ఒక్క తెలుగు - రెండు రాష్ట్రాలు"


2014 జూన్ 2
తెలుగు  ప్రజల చరిత్ర  ఒక మహత్తరమైన మలుపు తిరుగుతున్న రోజు. ఈ అపూర్వ పరిణామానికి  మనమందరం సాక్షీభూతులం కావడం ఒక అదృష్టం అనే అనుకోవాలి. అయితే ఈ సందర్భంలో గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఒకటుంది. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసివుండాలన్న అనేకుల కల సాకారం కావాలంటే అందుకు  బాగా ఉపయోగపడేది దండలో దారం లాంటి తెలుగు భాష ఒక్కటే.
కొన్నేళ్ళ క్రితం తెలుగు భాష తీరుతెన్నులపై జరిగిన ఒక గోష్టిలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు  ఈ సందర్భంలో స్పురణకు వస్తున్నాయి.
ఒక ప్రాంతం వారి భాషనుయాసను మరో ప్రాంతం వారు అణగదొక్కి తమ ప్రాబల్యాన్ని భాషపై కూడా విస్తరిస్తూ పోయారన్న అబిప్రాయం ఆ గోష్టిలో వ్యక్తమయింది.
బిడ్డ పోయి అమ్మాయికొడుకు పోయి అబ్బాయికక్కయ్య పోయి బాబాయిచిన్నమ్మ పోయి పిన్నమ్మ - ఇలా ఒక ప్రాంతానికి చెందిన పదాలు క్రమక్రమంగా కనుమరుగయి పోతున్నాయని సింగిడి తెలంగాణా రచయితల సంఘం కన్వీనర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారు వెల్లడి చేసిన ఆవేదనతో కొంతవరకు ఏకీభవించక తప్పదు. ప్రాంతీయపరమయిన ఉద్యమం నడుస్తున్న నాటి  నేపధ్యంలో ఇలాటి అభిప్రాయాలు మరింత బలంగా వేళ్ళూనుకోవడం సహజమే. ఇందులో తప్పుపట్టాల్సింది కూడా ఏమీ లేదు. అయితేపరిణామక్రమాన్ని కూడా కొంత పరిశీలించుకోవాల్సిన అవసరం వుంది.
నలభయ్ యాభయ్ ఏళ్ళక్రితం హైదరాబాదులో దుకాణాల పేర్లువీధుల పేర్లు తెలుగులో ఎలా రాసేవారో గుర్తున్న వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఇదేవిధమయిన ఆవేదనకు గురయ్యారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతొ దేశంలో తొట్ట తొలిసారి ఏర్పడ్డ తెలుగు రాష్ట్రంలో తెలుగుకు ఈ దుర్గతి ఏమిటని బాధపడేవారు. సబ్బులుతలనొప్పి గోళీల గురించి సినిమా హాళ్ళలో వేసే ప్రకటనల్లో కూడా తెలుగు పరిస్తితి అదే విధంగా వుండేది. ఎందుకంటె ఆరోజుల్లో ఇలాటి ప్రకటనలన్నీ బొంబాయిలో తయారయ్యేవి. హిందీ లిపిలో తెలుగు రాయించితెలుగు కొద్దిగా తెలిసివాళ్ళచేత చదివించడంవల్ల వచ్చిన అపభ్రంశపు తెలుగునే తెలుగువారిపై రుద్దేవారు. ఈనాడు అరవై ఏళ్ళు దాటిన ప్రతిఒక్కరికీ ఇది అనుభవైకవేద్యమే.

మా కుటుంబంలో మా బావగార్లూవాళ్ళ పెద్దవాళ్ళూ ఉర్దూ మీడియంలో చదువుకున్నవాళ్ళే. గ్రామాల్లో రాతకోతలన్నీ ఆ భాషలోనే జరగడంవల్ల ఉర్దూ మాట్లాడగలిగినవారికి అయాచిత గౌరవం లభించేదని చెప్పుకునేవారు.
ఆ రోజుల్లో ఖమ్మం జిల్లా మొత్తానికి కలిపి ఒకే ఒక్క డిగ్రీ కాలేజి ఖమ్మంలో వుండేది. అక్కడినుంచి హైదరాబాదుకు ఒకే ఒక్క పాసింజర్ బస్సు. దాదాపు పన్నెండు గంటల ప్రయాణం. బెజవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఒకేఒక్క రైలు నైజాం పాసింజర్. కుంటుకుంటూ నడిచే ఆ రైలు బొగ్గుకోసంనీళ్ళ కోసం మధ్య మధ్యలో ఆగుతూపడుతూ లేస్తూ ఎప్పటికో హైదరాబాద్ చేరేది. ప్రయాణ సౌకర్యాలు అంతగా లేని రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాదుకు రాకపోకలు తక్కువ. పైగా భాష తెలియకపోవడం మరో ఇబ్బంది. అయినాపై చదువులకోసం హైదరాబాద్ తప్పనిసరిగా రావాల్సిన పరిస్తితి. మరోవైపురాష్ట్ర రాజధాని కావడం వల్ల ఏదో ఒక పనిపై రాకుండా వుండలేని స్తితి. ఈ క్రమంలో రాకపోకలు పెరిగాయి. ఉద్యోగాలకోసంఉపాధుల కోసం వలసలు పెరిగాయి. వ్యాపార అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే వారి సంఖ్యా పెరిగింది.
ఫలితంగా – గత యాభయ్ ఏళ్లలో పరిస్తితి పూర్తిగా మారిపోయింది. రవాణా సౌకర్యాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. రోజుకొక పాసింజర్ బస్సు స్తానంలో గంటగంటకూ నడిచే ఎక్స్ ప్రెస్ బస్సులు వచ్చాయి. నలుమూలలనుంచి హైదరాబాదుకు రైళ్ల సౌకర్యం ఏర్పడింది. రాష్ట్ర రాజధానికి ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలనుంచి లక్షలాదిమంది జనం హైదరాబాదుకు వచ్చి స్తిరనివాసాలు ఏర్పరచుకోవడం మొదలయింది. ఆ రోజుల్లో ఆయా ప్రాంతాలలో వున్న అక్షరాస్యతను బట్టి చూస్తె బయట నుంచి వచ్చే ఇలాటివారి సంఖ్య గణనీయంగా వుండడం ఆశ్చర్యకరమేమీ కాదు. వలసలు వచ్చిన వాళ్ళు వారితో పాటే తమ సంస్కృతినిఆచారవ్యవహారాలనుభాషలో తమదయిన నుడికారాలను వెంటబెట్టుకు వస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది ఇదే. ఉదరపోషణార్ధం ఇతరదేశాలకు ముఖ్యంగా అమెరికాకు వెళ్ళిన తెలుగువాళ్ళు చేస్తున్నదీ ఇదే. ఇదంతా సహజ సిద్దంగా జరిగేదే కానీ ఒక దాడి ప్రకారంఒక పధకం ప్రకారం జరుగుతోందని అనుకోవడం అంత సబబు కాదు. వ్యాపారవాణిజ్య ప్రయోజనాలకోసం వచ్చేవారు,స్తానికులకు చేసే అన్యాయాలతో ముడిపెట్టిఈ అంశాన్ని చూడడం కూడా సరికాదనిపిస్తుంది. పట్టణీకరణ (అర్బనైజేషన్) వల్ల వచ్చిపడే అనర్థాలలో ఇదొకటి కాబట్టి సర్దుకుపోవాలని చెప్పడం కాదు కానీఈవిధమయిన పరిణామాలు అనివార్యం అన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో వారి వారి భాషలుయాసలు పదిలంగా వుండడాన్నిబట్టి చూస్తెవలసలు ఎక్కువగా వుండే పట్టణ ప్రాంతాలలోనే ఈరకమయిన మార్పులు చోటు చేసుకుంటున్నాయని కూడా అనుకోవాలి.
భాష పట్ల మమకారం లేని వాడు వుండడు. అది కన్న తల్లితో సమానం. పరాయి భాషల వాళ్ళు మన భాషలో తడి పొడిగా యేవో రెండుముక్కలు మాట్లాడితే మురిసి ముక్కచెక్కలయ్యేది అందుకే.
మాండలికాలు ఎన్ని వున్నా తల్లి వేరు ఒక్కటే. భాషకు యాస ప్రాణం. పలికే తీరులోనే వుంటుంది మాధుర్యమంతా. చిన్నప్పుడు స్కూల్లో రసూల్ సారు ఉర్దూలో అనర్ఘలంగా మాట్లాడేవారు. ఆయన మాట్లాడే దానిలో మాకు ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదు. కానీ ఇంకా ఇంకా వినాలనిపించేది. అదీ భాషలోని సౌందర్యం.
మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అనేక తెలుగు మాండలికాలు వున్నాయి. ఒక్కొక్కదానిదీ ఒక్కొక్క తరహా. దేనికదే గొప్ప. కొన్ని పదాలు అర్ధం కాకపోయినా చెవికి ఇంపుగా వుంటాయి. ప్రతి భాషలో వుండే ఈ యాసలు ఒకదానికొకటి పోటీ కాదు. ఒకదానికొకటి ప్రత్యామ్నాయమూ కాదు. కాకపొతే భాషను సుసంపన్నం చేయడంలో వీటి పాత్ర అమోఘం.
భాషాభిమానులందరు బాధ పడాల్సిన అంశాలు మరికొన్ని కూడా వున్నాయి. నాన్నను ఒరే’ అనడం – అమ్మను ఒసే’ అనడం వంటి వికృత ప్రయోగాలు తెలుగునాటముఖ్యంగా తెలుగు సినిమాలలో నానాటికీ ముదిరిపోతున్నాయి. తెలుగు భాషకుసంస్కృతికి చీడపురుగుల్లా మారుతున్న ఈ ధోరణులకు సయితం అడ్డుకట్ట వేయాల్సిన అవసరం వుంది.
ఎన్ని కొమ్మలు వేసినా తల్లి వేరు ఒక్కటే. కలివిడిగా తల్లిని ప్రేమించడానికి ఏమయినా ఇబ్బందులు వుంటే విడివిడిగా అమ్మను  ఆరాధించడమే బిడ్డలు చేయాల్సిన పని.
'ఒక భాష - రెండు రాష్ట్రాలు' అనే నూతన శకం ఆవిష్కృతమవుతున్న శుభ సందర్భంలో - రెండు రాష్ట్రాలలో 'తెలుగు భాష' మరింత పరిపుష్టం కావాలని, ఆ భాషే రెండు ప్రాంతాల ప్రజల్ని కలిపినిలబెట్టే  మహత్తర శక్తి కావాలని మనసారా కోరుకుందాం. (28-05-2014)


సిగరెట్లు మానడం యెలా?


సిగరెట్లు మానడం యెలా?
ఇదేమన్నా బ్రహ్మ విద్యా! నేను చాలాసార్లు మానేశానుఅనే జోకులు వింటూనే వుంటాము.


చాలా సంవత్సరాల క్రితం అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మ్యాగజైన్ సంపాదక బాధ్యతలు నిర్వహించిన కీర్తిశేషులు శ్రీ పీవీ రావు నాచేత ఈ అంశంపై ఒక వ్యాసం రాయించి పత్రికలో అచ్చు వేయించి ఓ నూటపదహార్లు అనుకుంటాను తాంబూలం కూడా ఇచ్చారు. ఏదయితేనేం అప్పుడా డబ్బులు ఓ వారం పదిరోజులు సిగరెట్ల ఖర్చుకు పనికొచ్చాయి.
నాకు సిగరెట్ అలవాటు యెలా అలవడిందో గుర్తు లేదు. మా మామగారి ముందు  ఆధిపత్యం ప్రదర్శించడానికి నేను సిగరెట్లు మొదలు పెట్టానని మా ఆవిడ అంటుంది. కానీ సిగరెట్ తాగే మా స్నేహితులు చెప్పే మాట వేరే. శ్రీనివాసరావు సిగరెట్లు తాగడు, తగలేస్తాడుఅన్నది వాళ్ల థియరీ, ‘హార్లిక్స్ తాగడు తింటాడుఅనే వాణిజ్య ప్రకటన టైపులో.
సిగరెట్లు అలవాటు కావడానికి నేను చెప్పుకునే కారణం వేరే వుంది. ఇండియాలో వున్నప్పుడు కొని తాగే అలవాటు అలవడని నేను మాస్కో వెళ్ళేక డబ్బులు తగలేసి మరీ సిగరెట్లు తగలేయడం మొదలు పెట్టాను. దానికి కారణాలు రెండు. ఒకటి మన దగ్గర అతి ఖరీదైన సిగరెట్లు కూడా మాస్కోలో అతి తక్కువ ధరకు దొరకడం. భాష ఎంతమాత్రం  తెలియని  ఆడామగా రష్యన్   సహోద్యోగులతో కాసేపు మాటామంతీలేని కాలక్షేపం చేయడానికి  ఈ సిగరెట్లు చక్కగా  అక్కరకు రావడం. దానాదీనా నా కొనుగోళ్ళు   సిగరెట్ ప్యాకెట్ల నుంచి  ఏకంగా  కార్టన్ల స్థాయికి పెరిగాయి. 2004 లో అమెరికా వెళ్ళినప్పుడు  ఒక పెద్ద సూటుకేసు నిండా మా ఆవిడ వూరగాయ పచ్చళ్ళ ప్యాకెట్లతో, మరో పెద్ద సూటుకేసు నిండా సిగరెట్ల ప్యాకెట్లతో దిగబడ్డ మమ్మల్ని చూసి అమెరికా కష్టమ్స్ వాళ్లు నోళ్ళు వెళ్ళబెట్టారు. నా మీద కార్టూన్లు వేసే స్థాయికి నేను జీవితంలో ఎదిగివుంటే అంజయ్య గారి వేలుకు హెలికాఫ్టర్ బొమ్మ ముడివేసినట్టు నా బొమ్మకు చేతిలో సిగరెట్ తగిలించేవాళ్లేమో!
'మరి ఇప్పుడేవిటి ఇలా అయిపోయారు?  ఏవి తండ్రీ నాడు విరిసిన  రింగు రింగుల  పొగల మేఘాలుఅని మా స్నేహితులు భారంగా నిట్టూర్పులు విడుస్తుంటారు. నా ఈ దుస్తితికి కారకులు ఎవరయ్యా అంటే నిమ్స్ డైరెక్టర్ గా పనిచేసిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు. దీనికి ముందు ఓ పిట్ట కధ చెప్పాలి. దూరదర్శన్ విలేకరిగా పనిచేస్తున్న రోజుల్లో  ఓ రోజు తెల్లగా తెలవారక మునుపే, కప్పు కాఫీ కూడా పొట్టలో పడకుండానే జూబిలీ హిల్స్ లోని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కెమెరామన్ తో సహా  చేరుకున్నాను. మిగిలిన జాతీయ ఛానళ్ళ బృందాలు కూడా బిలబిల మంటూ అక్కడికే చేరాయి. మామూలుగా అయితే అక్కడ విలేకరులకు రాజభోగాలు. కానీ ఆ రోజు విలేకరులది పిలవని పేరంటం. బీజేపీతో టీడీపీ కి ఎన్నికల పొత్తు విషయం గురించి తేల్చడానికి  ఆ రెండు పార్టీల నాయకుల నడుమ లోపల ఎడతెగని చర్చలు సాగుతున్నాయి. బయట ఫుట్ పాత్ మీద నిలబడి కొందరం,  కూలబడి కొందరం పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటున్నాం. ముందు జాగ్రత్త చర్యగా వెంట తెచ్చుకున్న సిగరెట్లను ఒకదాని వెంట మరోటి తగలేస్తూ, తెచ్చుకోని వాళ్లకు ఉదారంగా పంచిపెడుతూ నా మానాన నేను కాలక్షేపం చేస్తుండగా సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. కడుపులో ఎలుకలు. మరో పక్క సిగరెట్ల పొగతో కళ్ళు మంటలు. నిలబడి సిగరెట్ తాగుతూ వున్నవాడ్ని వున్నట్టుండి  స్లో మోషన్ లో కిందకు వొరిగి పోతూ వుండడం వరకే గుర్తు. కట్ చేస్తే నిమ్స్ ఆసుపత్రిలోని  ప్రత్యేక గదిలో డాక్టర్ల పర్యవేక్షణలో. ఆందోళనగా నా వైపే చూస్తున్న నా భార్య. ఆమెతో పాటు నా ఇద్దరు పిల్లలు. ముఖ్యమంత్రి గారా మజాకా. జరిగిన విషయం  విలేకరుల ద్వారా తెలుసుకుని హుటాహుటిన అంబులెన్స్ తెప్పించి నన్ను నిమ్స్ లో అడ్మిట్ చేయించారట. అందుకే కాకర్ల వారు కూడా వచ్చి చూసారు. కళ్ళు తిరగడానికి, వొళ్ళు తూలడానికీ నా సిగరెట్లే కారణం అని ఆయన తన అనుభవంతో ఇట్టే కనుక్కున్నారు. ఆ విషయం మా ఆవిడతో చెప్పి నెమ్మదిగా ఈ అలవాటు మానిపించమని అన్నారు. కళ్ళు తెరిచి  ఇదంతా చూస్తూ, చెవులు వొగ్గి ఇదంతా వింటున్న నేను ముందుకు వొంగి  నేను సిగరెట్లు మానేశాను డాక్టర్ గారుఅనేశాను. ఆయన నెత్తి మీది వెంట్రుకలు పట్టి చూపిస్తూ ఇలాటి వాళ్ళను నేను ఇంతమందిని చూసానుఅంటూ,  'అదంత తేలిక కాద'ని ఆయనే చెబుతూ నేను తాగే బ్రాండ్ సిగరెట్ ప్యాకెట్ ఒకటి అప్పటికప్పుడే తెప్పించి మా ఆవిడ చేతిలో పెట్టి, 'రాత్రి అందరూ  నిద్ర పోయిన తరువాత నీ మెదడు కొరుక్కు తింటాడు, ఎందుకయినా మంచి ఇది దగ్గర వుంచుకోమ్మాఅని వెళ్ళిపోయారు.
అంతే! ఎంతయినా పట్టుదల కల మనిషిని కదా! ఇంటికి వెళ్ళినప్పటినుంచి ఆ ప్యాకెట్టూ ముట్టుకోలేదు. అప్పటినుంచి సిగరెట్టూ అంటించలేదు.
మరో వింత ఏమిటంటే, ఆనాటి నుంచి  తాగాలని కూడా అనిపించలేదు.
(ఈరోజు ధూమపాన నిరోధక దినోత్సవం - Anti tobacco day - అంటున్నారు)

24, మే 2014, శనివారం

వాగ్దానభంగం


వాగ్దానాన్ని మించిన దానం లేదంటారు రాజకీయనాయకులు.
వాగ్దానాలు చేస్తూ పోవాలి కాని వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే రాజకీయాల్లో పుట్టగతులుండవని వారిలో కొందరి నిశ్చితాభిప్రాయం. గత రెండు మూడు రోజులుగా ఏ ఛానల్ పెట్టినా, లేదా ఏ ఛానల్లో చర్చకు వెళ్ళినా ఇదే చర్చ.



వాగ్దానాలు  చేయడం అన్నది రామాయణ కాలం నుంచీ వుంది. దశరధ మహారాజు తన భార్య కైకేయికి, వరసకు మూడో భార్య అయినా మాటవరసకు కూడా మూడు వరాలు ఇవ్వకుండా కేవలం రెండే రెండు వరాలు ఇచ్చాడు. మాట ఇచ్చి తప్పడం ఇక్ష్వాకుల వంశంలో లేదంటారు కాని  ఇచ్చి మరచిపోవడం వుందన్న విషయానికి తార్కాణం  కైక మళ్ళీ గుర్తు చేసేదాకా ఆయనకు ఇచ్చిన మాట  గుర్తుకు రాకపోవడమే.  అంటే ఏమిటన్న మాట. ఎన్ని మాటలన్నా ఇవ్వవచ్చు. మాటలు పుచ్చుకున్నవాళ్ళు వాటిని గుర్తు పెట్టుకుని గుర్తు చేసేదాకా ఇచ్చిన వాళ్లకు ఆ మాటలు నిలబెట్టుకోవడంపై ఎలాటి పూచీ లేదని రామాయణమే చెబుతోంది. ఇలా ఏదో సరదాకు రాస్తే కోడి గుడ్డు మీద ఈకలు పీకకండి సుమా!  నవ్వు వచ్చిందనిపిస్తే  నా మొహాన ఒకటి గిరవాటు వెయ్యండి. కోపం వస్తే మొహం అటు తిప్పుకోండి. స్వస్తి.

NOTE: Courtesy image owner