నేటి సాక్షి దినపత్రిక (03-06-2014) ఎడిట్ పేజీలో ప్రచురితం
మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన
ఘట్టం చరిత్రలో చోటుచేసుకుంది. చాలా ఏళ్ళుగా నలుగుతూ, సలుపుతూ వచ్చిన ఒక
సమస్యకు'ముగింపు' దొరికింది. పడింది 'శుభం' కార్డా, మరో సమస్యకు అంకురార్పణా అన్న చర్చ అనవసరం. దాన్ని కాలమే
తేలుస్తుంది.
ఎందుకంటే 1956 లో మొట్టమొదటి భాషా
ప్రయుక్త రాష్ట్రంగా 'ఆంధ్రప్రదేశ్' ఏర్పాటయినప్పుడు ఇలాగే సంతసించినవాళ్ళు వున్నారు. సందేహించినవాళ్లు
వున్నారు. ఆనాడు సంశయం వ్యక్తం చేసిన వాళ్ల భయాలే నిజం అయ్యాయని ఈనాడు విభజనను
గట్టిగా కోరుతున్నవారు ఎంతో గట్టిగా వాదించిన సందర్భాలు వున్నాయి. అంచేత
సందేహిస్తున్నవారి భయాలను తేలిగ్గా కొట్టివేయడం కూడా తగదు.
ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ప్రత్యేక
తెలంగాణా స్వప్నం సాకారం అయింది. ఈ సమయంలో గెలుపు వోటముల ప్రసక్తిని పక్కనబెట్టాలి. యుద్ధాల్లో, క్రీడల్లో మాత్రమే ఈ మాటలు వినబడతాయి. ఇంతకాలం జరిగింది యుద్ధమూ కాదు, ఆటా కాదు.ఉభయప్రాంతాల
జనంలో వున్న ఆకాంక్షకు చక్కని అభివ్యక్తీకరణ మాత్రమే. కొందరు రాజకీయులు
దీనికి అగ్గి రాజేసారు. వారిని గురించి పట్టించుకోవాల్సిన అగత్యం ఎంతమాత్రం లేదు.
ఇకనుంచయినా సరే, రెండు ప్రాంతాల ప్రజలు రాజకీయుల చేతుల్లో పావులు కాకుండా తమ
ప్రాంతాల సత్వర అభివృద్ధిలో స్వయంగా భాగస్వాములు కావాలి.
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అన్న నగ్న సత్యాన్ని రాజకీయ నాయకులకు
ఎరుకపరచాలి.
నిజమే. సుదీర్ఘ కాలం సాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో
హింసాత్మక ఘటనలు తక్కువే కావచ్చు. 1969 నాటితో పోలిస్తే
మొత్తం మీద ఉద్యమం శాంతియుతంగా జరిగిందని దానికి నాయకత్వం వహించిన వాళ్లు
చెప్పుకోవచ్చు. కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం తపనపడి , ప్రత్యేక రాష్ట్రం
ఇక తీరని కలేమో అని అపోహపడి, ఆ నిర్వేదంలో
అనేక మంది యువకులు చేసిన బలిదానాల మాటేమిటి? ప్రాంతీయంగా విడిపోయినా మానసికంగా కలిసివుందామని కోరుకునే వారి నడుమ
రాజకీయులు తమ స్వార్ధం కోసం రగిల్చిన సంఘర్షణల మాటేమిటి? ఆత్మహత్యలు చేసుకున్నపిల్లల తలిదండ్రుల మానసిక క్లేశాలకు ఖరీదు కట్టే
షరాబులు దొరకరు. అంచేత అలాటివారికి స్వాంతన కలిగించడం తెలంగాణా నాయకుల ప్రధమ
కర్తవ్యం.
ప్రజల మనసులకు తగిలిన గాయాలు నయం కావడానికి
కొంత సమయం పడుతుంది. వాటిని తమ మాటలు, చేతలతో మరింత ముదిరేలా
చేసి వ్రణాలుగా తయారు చేయకపోతే అదే పది వేలు.
రైలు ప్రయాణంలో కలిసిన ప్రయాణీకులే విడిపోయేటప్పుడు
ఎంతో బాధ పడతారు. అలాటిది దాదాపు అరవై ఏళ్ళక్రితం కలిసిపోయి, ఇన్నేళ్ళుగా కలిసి మెలిసి వుండి విడిపోయే తరుణంలో బాధపడని వారు వుండరు.
విడిపోవడం తప్పనిసరి అయినప్పుడు కలిసివున్నప్పటి రోజుల్లోని అనుబంధాలను గుర్తు
చేసుకుని వాటిని పదిలపరచుకోవడం, మరింత పెంచుకోవడం
విజ్ఞుల లక్షణం.
మరో వారం తిరగగానే తెలుగు ప్రజల చరిత్రలో ఇంకో
నూతన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. తెలంగాణా పది జిల్లాలు పోను మిగిలిన పదమూడు
జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ అనే పాత పేరుతోనే మరో కొత్త రాష్ట్రం రూపుదిద్దుకోబోతోంది.
వేరే వెతుక్కోకుండా తెలంగాణాకు, వడ్డించిన విస్తరి
మాదిరిగా అన్ని హంగులతో కూడిన రాజధానీ నగరం వుంది. అటుపక్క ఆంధ్ర ప్రదేశ్ లో
మాత్రం అన్నీ మొదటి నుంచీ మొదలు పెట్టాలి. బుడి బుడి అడుగులతో నడక
ప్రారంభించాలి. అదీ వేగంగా సాగాలి. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల దూరదృష్టి లోపం
కారణంగా అభివృద్ధి యావత్తూ హైదరాబాద్, దాని చుట్టుపక్కల
మాత్రమే కేంద్రీకృతం అయింది. అంతర్జాతీయ స్థాయి కలిగిన విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, విద్య, వైద్యాలయాలు అన్నీ కట్టగట్టుకుని ఒక్కచోటునే మఠం వేశాయి. చదువుల కోసం,
వైద్యం కోసం, ఉద్యోగాలు, ఉపాధుల కోసం రాష్ట్రం నలుమూలలనుంచి హైదరాబాదు రావడానికి అలవాటు పడిన
వారికి ఇప్పుడు కొన్నేళ్ళ పాటు ఇబ్బందే. సీమాంధ్ర ప్రాంతంలో ఈ సౌకర్యాలు ఓ మోస్తరు
స్థాయిలోనే అభివృద్ధి చెందాయి. ఆ ప్రాంతంలో కొలువు తీరబోతున్న నూతన ప్రభుత్వ
వ్యవస్థకు ఎదురయ్యే తొలి సవాలు ఇదే.
అభివృద్ధి బంతి ఇప్పుడు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు నాయకత్వం వహించే
వారి కోర్టులో వుంది. ఒక రాష్ట్రాన్ని నిర్మించుకోవాలి. మరో రాష్ట్రాన్ని
పునర్నిర్మించుకోవాలి. వున్న వ్యవధానం చాలా తక్కువ. ఐదేండ్ల పుణ్యకాలం ఇట్టే
గడిచిపోతుంది. కాబట్టి, లేనిపోని
గిల్లికజ్జాలతో, ఆరోపణలు ప్రత్యారోపణలతో
అనుదినం పొద్దుపుచ్చకుండా, ప్రజలకు ఇచ్చిన మాటల్ని
నిలబెట్టుకుంటూ, వారి ఆశలకు ఆకాంక్షలకు
అనుగుణంగా నడుచుకుంటూ, సత్వర కార్యాచరణకు
నడుం కట్టాలి. మాటలు చెప్పి, గీతలు గీసి విభజించడం
అంత సులభం కాదు కొత్త రాష్ట్రాలను సుసంపన్నంగా తీర్చిదిద్దడం. పెనుభారంతో కూడిన ఈ
బాధ్యతను రెండు ప్రభుత్వాలు అత్యంత శ్రద్ధాసక్తులతో, గరిష్ట నిష్టతో
నిర్వహించ గలిగితేనే రాష్ట్ర విభజన వల్ల సానుకూల ఫలితాలు రెండు ప్రాంతాలకు
సిద్ధిస్తాయి. లేకుంటే పాఠ్య పుస్తకాల్లో మ్యాపులుగా మాత్రమే ఈ రెండు రాష్ట్రాలు
మిగిలిపోతాయి.(02-06-2014)
