2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

అర్ధం కాని విషయం


అర్ధం కాని విషయం

అజ్ఞాని : మాకు తెలియని ఎన్నెన్నో ఊసులు చెబుతున్నారు. చాలా సంతోషం. వింటున్నకొద్దీ వినాలని వుంది గురూ గారూ.
విజ్ఞాని: విషయాలేవీ తెలియవంటున్నావు. కొంపతీసి వైయస్సార్ మాట విని ఆ రెండు పేపర్లు చదవడంలేదా! అందుకే కాబోలు ఇలా అజ్ఞానిగా వుండిపోయావు.
అ: ఇంతకీ జగన్ మోహన్ రెడ్డి చరిత్ర ముగిసిపోయిందంటారు.
వి: అవును శిష్యా. అతగాడికి భవిష్యత్తే కాదు వర్తమానం కూడా లేనట్లే.
అ: ఏం జరగబోతోందని మీ అంచనా?
వి: ఏముంది? అతడి చుట్టూ ఉచ్చు బలంగా బిగుసుకుంటోంది. ఇవ్వాళో రేపో అరెస్ట్ చేస్తారు. బ్యాంకు అక్కౌంట్స్ సీజ్ చేస్తారు. పొట్లంలో బెల్లం లేదని తెలిసాక చుట్టూ చేరిన చీమలన్నీ తప్పుకుంటాయి. హీనపక్షం పదేళ్లన్నా జైల్లో వుండక తప్పదు. ఇక అలాటి వాడిని నమ్ముకుని ఎవరు వెనకాల వేళ్ళాడుతారు చెప్పు.
అ: ఇవన్నీ ఆ రెండు పేపర్లూ చాన్నాళ్ళ నుంచి రాస్తూనే వున్నాయి. ఇందులో కొత్తేమీ లేదు గురూ గారూ. ఏదయినా సరి కొత్త సంగతి చెప్పండి.
వి: ప్రతి రోజూ కొత్త విషయం ఎక్కడనుంచి వస్తుంది. పాత విషయాన్నే మార్చి మార్చి రాస్తుండాలి. చెబుతుండాలి. అయినా అడిగావు కాబట్టి చెబుతున్నా. జగన్ పోట్లాటెట్టుకుంది ఎవర్తో. సాక్షాత్తు కాంగ్రెస్ అధిష్టాన దేవతతో. ఢిల్లీ లో, గల్లీలో అధికారం చేతిలోవున్న కాంగ్రెస్ పార్టీ తో. ఎదురు తిరక్కుండా, నీ బాన్చెను అంటూ మోచేతినీళ్ళు తాగే ఎంతమందినయినా, వాళ్లు ఎంత లంచగొండులయినా సరే అధిష్టానం చూసీ చూడనట్టు వొదిలేస్తుంది కానీ ఎదురుతిరిగిన వాళ్ళను మాత్రం వూరికే వొదిలిపెట్టదు. పార్టీలో కింద నుంచి పైదాకా ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, పిల్లోడు పార్టీకి కొత్తకదా. వాళ్ల నాయనలాగే ఉడుకు రక్తం. అందుకే అలా ఆవేశపడిపోయి ఢిల్లీ పెద్దలతో గిల్లికజ్జా పెట్టుకున్నాడు. గిల్లి వూరుకున్నా అదో సంగతి. ఏకంగా అధినేత్రి పైనే నోరు చేసుకున్నాడు. కాంగ్రెస్ వాళ్లు వాళ్ల పెళ్ళాలనన్నా ఎవరన్నా ఏమన్నా అంటే వూరుకుంటారేమోకానీ, సోనియాపై పల్లెత్తు మాట తూలినా చాలు వొంటి కాలు మీద లేస్తారు. తమ ఇంట్లో వోట్లు కూడా నమ్మకంగా తమకు వేయించుకోలేని కొందరు నాయకులు కేవలం ఈ ఒక్క లక్షణం కారణంగానే ఢిల్లీలో ఇన్నేళ్ళుగా నెగ్గుకువస్తున్నారు.
అ: కొత్త విషయం అంటూ మళ్ళీ ఆ పేపరోళ్లలాగానే పాతపాటే పాడుతున్నారు. మీరంటే ఆ రెండు పేపర్లు తెగ చదివేసి ఇలా విషయాలన్నీ ఇడమరచి చెబుతున్నారు. ఇన్ని ఇన్నాక కూడా ఓ సంగతి మాబోటోళ్లకు అర్ధం కావడం లేదు. మొన్న రేత్రి మా పక్కింటికి పోలీసోడు వచ్చి ఏవో రాసుకుపోయాడు. అంతే. ఉప్పుకీ, పప్పుకీ
పక్కింటి తలుపు తట్టే మా ఇంటిది కూడా మర్నాడు ఆ యింటి మొహం చూస్తే వొట్టు. పోలీసు బయం అంటే అల్లాగుంటది. అలాటిది జగన్ బాబు మీద అదేదో సెంటర్ పోలీసోళ్లు దిగిపోయారు. మీరన్నట్టు, ఆ రెండు పేపరోళ్ళు రాస్తున్నట్టు ఈ పొద్దో, రేపటిసందో ఆ బాబుని పట్టుకెళ్ళి చర్లపల్లి జెయిల్లో వేస్తారు. అల్లాగే,  బ్యాంకుల్లో ఆయన డబ్బు చెలామణీ కాకుండా చూస్తారు. మరి, ఆయనదగ్గర మరేటి వుంటాదని పాతికమందో, ముప్పయిమందో ఎమ్మెల్యేలు ఆయన వెంట వెడుతున్నట్టు. సీటు పోయిందని టీవీల్లో రాతలు వచ్చీ రాకముందే మన వెనకున్నోళ్లు అయిపు ఆజా లేకుండా పోయే రోజులివి. పోనీ, సొమ్ములకు కక్కుర్తి  పడ్డారనుకుంటే ఇవతల ఇంకా రెండేళ్ళ అధికారం వుందాయె. పదవిలో వుంటే పది పనులు చేసుకుని పది కాలాల పాటు కాలు మీద కాలు వేసుకుని దర్జాగా బతకొచ్చు. అంకెల మీద రోజులు వెళ్ళదీసే సర్కారు తన అవసరానికి అందించే తాయిలాలకు ఆశ పడే వాళ్ళుంటారు కానీ, జగన్ ఎప్పుడో సీ ఏం అవుతాడని, అప్పుడు ఆదుకుంటాడని, వున్నదాన్ని వూడగొట్టుకునే వాళ్ళుంటారా ఎక్కడయినా. పదవిని వొదులుకుని, సర్కారు చేసే సాయాలు వొదులుకుని ఏం బావుకుందామని జగనెంట ఇంతమంది వెడుతున్నట్టు? మాకర్ధం కాని ఈ ఒక్క విషయం అర్ధం అయ్యేలా చెప్పండి గురువు గారూ. (02-09-2011)

29, ఆగస్టు 2011, సోమవారం

భారతంలో అవినీతి మూలాలు – భండారు శ్రీనివాసరావు

భారతంలో అవినీతి మూలాలు – భండారు శ్రీనివాసరావు


మహా భారత యుద్ధ పరిసమాప్తి కాలంలో అశ్వద్ధామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రం - అభిమన్యుడి అర్ధాంగి ఉత్తర గర్భంలో పెరుగుతున్న పాండవ వంశాంకురాన్ని తుదముట్టించబోయేటప్పుడు కృష్ణుడు సుదర్శన చక్రం అడ్డువేసి తల్లీకొడుకులను కాపాడతాడు. ఉజ్వల తేజస్సుతో జన్మించిన ఆ శిశువుకు విష్ణురాతుడు అని నామకరణం చేస్తారు. 


తల్లి కడుపులో వున్నప్పుడే తనకు రక్షకుడుగా వున్న ఆ దైవం (కృష్ణ భగవానుడు) సర్వవ్యాపకుడా అన్న సందేహం అతడికి చిన్ననాటినుంచే కలుగుతుంది. ఆ విషయాన్ని నిర్ధారించుకోవడానికి పరీక్షగా పరికించి చూసే విష్ణురాతుడికి పరీక్షిత్తు అనే పేరు స్తిరపడుతుంది. యుక్తవయస్సు రాగానే అతడికి ఐరావతి అనే కన్యను ఇచ్చి వివాహం జరిపిస్తారు. ఒకసారి అరణ్యానికి వేటకు వెళ్లి ఒక క్రూర మృగాన్ని వెంటాడుతూ శమీక మహర్షి ఆశ్రమం చేరుకుంటాడు. ఆ వేళలో తపస్సమాధిలో వున్న శమీకముని, రాజు రాకను గమనించడు. డస్సిపోయిన స్తితిలోవున్న చక్రవర్తి ,క్షణికావేశంలో, చచ్చిపడి వున్న ఒక పాముని ముని మెడలో వేసి, కసి తీర్చుకుని తనదారిన వెడతాడు. కాసేపటికి ఆశ్రమానికి తిరిగివచ్చిన శమీక మహర్షి కుమారుడు తండ్రి మెడలో వేలాడుతున్న మృత సర్పాన్ని గమనించి కుపితుడయి- ‘ఈ దుష్కార్యానికి వొడిగట్టినవాడు ఏడు రోజుల్లో పాము కాటు చేతనే మరణిస్తాడ’ని శపిస్తాడు. ఆ శాపం గురించి తెలుసుకున్న పరీక్షిత్తు పశ్చాత్తాపపడతాడు. మృత్యువు సమీపంలో వున్నందున వున్న కొద్దికాలాన్ని జ్ఞానబోధకుల సత్సాంగత్యంలో గడపాలని నిర్ణయించుకుంటాడు. వ్యాసుడి కుమారుడయిన శుకమహర్షి భాగవత సప్తాహ బాధ్యతను స్వీకరిస్తాడు. పవిత్ర గంగా తీరంలో పరమాత్మ లీలలను తెలుసుకుంటూ మోక్షమార్గ అన్వేషణలోవున్న పరీక్షిత్తు ప్రాణాలు హరించడానికి నాగుల రాజయిన తక్షకుడు బయలుదేరుతాడు. మార్గమధ్యంలో అతడికి ఒక పండితుడు పరిచయమవుతాడు. మాటల మధ్యలో, అతడో మంత్రశాస్త్రవేత్త అనీ, ఎటువంటి కాలకూట విషానికయినా విరుగుడు ప్రసాదించగల మహిమాన్వితుడనీ తక్షకుడు తెలుసుకుంటాడు. కానీ, నిజానికి అతడికా శక్తియుక్తులున్నాయో లేదో, వుంటే అవి ఏపాటివో తెలుసుకోవాలని అనుకుంటాడు. దారిపక్కన పచ్చటి కొమ్మలు ఆకులతో అలరారుతున్న ఓ వృక్షాన్ని కాటు వేస్తాడు. తక్షక విషాగ్నికి ఆ పచ్చటి వృక్షం కాస్తా క్షణకాలంలో మాడి మసి అవుతుంది. పండితుడు చిరునవ్వుతో ఆ దృశ్యాన్ని పరికించి తన దగ్గరవున్న మంత్రజలాన్ని ఆ బూడిద కుప్పపై చల్లుతాడు. కనురెప్పపాటులో అ ఆ చెట్టు పచ్చటి కొమ్మరెమ్మలతో యధారూపును సంతరించుకుంటుంది. ఈ అద్భుతాన్ని గమనించిన తక్షకుడికి మతిపోతుంది. ఈ పండితుడు తనవెంట రాజువద్దకు వస్తే తను తలపెట్టిన లక్ష్యం నెరవేరదు. తన విషంతో పరీక్షిత్తు ప్రాణం తీయడం అనేది తనకు తృణప్రాయం. కానీ ఏం లాభం? మరణించిన మహారాజును బతికించడం అన్నది ఈ పండితుడుకి చిటికె లోని పని. అందుకే ఆలోచించి ఆ మంత్రగాడిని వెనుకకు మళ్లించే ఆలోచన చేస్తాడు. పునర్జీవితం ప్రసాదించినందుకు మహారాజు నుంచి అందబోయే ధనధాన్యకనకవస్తువాహనాలకు రెట్టింపు ఇస్తానని ప్రలోభపెడతాడు. వచ్చిన పని మార్గమధ్యంలోనే అయిపోతున్నందున ఆ పండితుడు కూడా ఎంతమాత్రం సందేహించకుండా తక్షకుడు ఇవ్వదలచిన బహుమానాలను స్వీకరించి తిరుగు ముఖం పడతాడు. చేయి తడపడం ద్వారా పనులు చేయించుకునే ఒక దుష్ట సంప్రదాయానికి తక్షకుడు ఆ విధంగా తొలి బీజం వేశాడు.


భారత కాలంలో బహుమానం పేరుతొ తొలిసారి రూపుదిద్దుకున్న ఈ ‘ఇచ్చిపుచ్చుకునే’ వ్యవహారానికి కాలక్రమంలో అవినీతి, లంచగొండితనం అనే వ్యవహార నామాలు స్తిరపడ్డాయి.

చిలుకూర్ బాలాజీ


(చిలుకూరులో వెలసిన ‘వీసా బాలాజీ’ అనే వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వంశ పారంపర్య ధర్మకర్తగా వుంటూ ఆలయ పరిరక్షణ ఉద్యమాన్ని వొంటి తాటిపై సాగిస్తున్న ‘వన్ మ్యాన్ ఆర్మీ’ , పట్టువొదలని అపర విక్రమార్కుడు సౌందర్ రాజన్ కుమారుడు రంగరాజన్ భక్తులకు అందిస్తున్న అనుగ్రహభాషణం ఆధారంగా – రచయిత - 29-08-2011)





28, ఆగస్టు 2011, ఆదివారం

ఆంధ్రజ్యోతి వాక్టూన్లు - 9 - భండారు శ్రీనివాసరావు

ఆంధ్రజ్యోతి వాక్టూన్లు - 9 - భండారు శ్రీనివాసరావు

ఎవ్వరికీ పట్టకపోతే ....


రెన్నెళ్ల నాటి కార్యక్రమం బాగుందంటూ 
రాసినవారికి హార్దిక అభినందనలంటూ 
శ్రోతల ఉత్తరాల ప్రోగ్రాం లో వినిపించిందంటే 
ఖచ్చితంగా అది ఆ రచయిత వొండిన వొంటే 

(జూన్, 29, 1975 - ఆంధ్రజ్యోతి దినపత్రిక) 


ఎప్పుడూ ఇంతే !



పొద్దున్నే లేవడమా! లేదెన్నడు అలవాటు 
ఆలశ్యం అవడంతో అన్నిట్లో తడబాటు 
ఫ్రెంచ్ బాతుతో పాటు అసలుడకని సాపాటు
హడావిడిగ పరిగెత్తి  ఆఫీసుకు లేటు 

(జూన్,2, 1975  -ఆంధ్రజ్యోతి దినపత్రిక)



కార్టూనిష్టులకు/ఇమేజ్ సొంతదారులకు ధన్యవాదాలు - రచయిత  


  



27, ఆగస్టు 2011, శనివారం

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 8 - భండారు శ్రీనివాసరావు

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 8 - భండారు శ్రీనివాసరావు

స్కోరెంత?


ఇవ్వాళా రేపూ హలో అనడం కన్న
క్రికెట్ సంగతి తెలిసినా తెలియకున్న
వికెట్ల గురించి అజ్ఞానం ఎంత వున్న
'స్కోరెంత?' అంటూ పలకరించడమే మిన్న

 (జూన్, 13, 1975 ఆంధ్ర జ్యోతి దినపత్రిక)

చెవిలో జోరీగ


రోడ్డుపక్క హోటల్లో వలె భీకరధ్వని
చేసే పక్కింటి రేడియో గోల వినివిని
చక్కావెళ్లి మానేసి చేస్తున్న పని 
'ప్లేటిడ్లీ' తెమ్మంటే యెలా వుంటుందా అని 

(జులై, 1, 1975 ఆంధ్ర జ్యోతి దినపత్రిక) 

కార్టూనిస్టులకు/ఇమేజ్ సొంతదారులకు ధన్యవాదాలు- రచయిత  

25, ఆగస్టు 2011, గురువారం

“జయ”హో! – భండారు శ్రీనివాసరావు

“జయ”హో! – భండారు శ్రీనివాసరావు


(పూర్తిగా వ్యక్తిగతం – నాకోసం, నావారికోసం రాసుకున్న మనోగతం)




కీర్తిశేషురాలు కొలిపాక జయ  

‘విరిగి పెరిగితి, పెరిగి విరిగితి - కష్టసుఖముల సారమెరిగితి’ అన్న కవి వాక్కు కొందరి విషయంలో అక్షర సత్యం.

కొందరు సుఖపడడానికి పుడతారు. ఇంకొందరు తాము సుఖపడుతూ ఇతరులను కష్టపెడతారు. మరికొందరు కష్టపడడానికి పుడతారు. వారిలో కొందరు కష్టపడుతూ తోటివారిని సుఖపెడతారు. పైన చెప్పిన కవి వాక్కు ఇలాటివారిని గురించే.

మా మేనకోడలు జయ ఈ చివరి కోవ లోనిదే. దానివన్నీ సినిమా కష్టాలే. చిన్న తోటికోడలు వొంటికి నిప్పంటుకుని వొంటింట్లోనే తనువు చాలించింది. అత్తామామలు ఆ తరువాత కొద్దికాలానికే కన్నుమూశారు. కట్టుకున్నవాడు కేన్సర్ బారిన పడి అకాల మృత్యువు పాలయ్యాడు. వున్న ఒక్క కొడుకు డాక్టర్ చదువు పూర్తిచేసి వంశాన్ని ఉద్ధరిస్తాడనుకున్న సమయంలో, చిన్న వయస్సులోనే డాక్టర్లు ఎవ్వరూ కనుక్కోలేని రోగంతో తెలియని లోకాలకు తరలిపోయాడు. తరుముకు వచ్చినట్టు ఒకదానివెంట మరొకటి. రోజులు బాగా గడుస్తున్న రోజుల్లో అవసరాలకు అందరినీ ఆదుకునే ఆమె మనస్తత్వం ఆ తరువాత రోజుల్లో ఆమెకు అక్కరకు వచ్చింది. చిన్నకుటుంబం చింతలు లేని కుటుంబం విధి చూసిన చిన్నచూపుకు చిన్నబోయిన స్తితిలో తోడబుట్టిన అక్కచెల్లెళ్ళు, అన్నాతమ్ముళ్ళు ఆదరించి చేరదీశారు. ఆత్మీయుల మంచితనం, చనిపోయిన భర్త పుణ్యమా అని వచ్చిన గ్యాస్ ఏజెన్సీ – ఆ చిరు జీవితానికి ఆలంబనగా మారాయి. సొంత కుటుంబంలో ఒక్కొరొక్కరుగా రాలిపోతున్నా గుండె చెడకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకే వేసింది.

జీవితంలో వొడిదుడుకులు, ఆటుపోట్లు అన్నీ వుంటాయి. అన్నింటినీ తట్టుకుని నిలబడి జీవించడంలోనే మనిషి జీవితానికి సార్ధకత. కష్టనష్టాలకు అదరక బెదరక గుండె నిబ్బరంతో ఎదుర్కొని నిలవాలి. నిలిచి పోరాడాలి. పోరాడి గెలవాలి. తాను అబలని కాదు సబలనే అని నిరూపించుకుంటూ అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలవాలి. ఇదే జయను ముందుకు నడిపించింది. తనవద్ద పనిచేసేవారినే సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ కాలం వెళ్ళదీసింది. కాలుడికి కావలసింది కూడా ఆ మంచితనమే కాబోలు. అందుకే తనవద్దకు చేర్చుకునే క్రమంలో స్వల్ప అనారోగ్యం బారిన పడేశాడు. స్వల్పం అనుకున్నది అనల్పంగా మారింది. అపోలో ఆసుపత్రిలో చేర్పించి నిండా రెండు రోజులు కూడా గడవలేదు. ఈ రోజున జయ ఇక లేదన్న కబురు. నిజంగా ఇది నిజమేనా అన్న సందేహాల నడుమ ఆత్మీయులందరూ కట్టగట్టుకుని ఆసుపత్రికి వెళ్లారు. నిద్రిస్తున్న దేవతలా ధవళ వస్త్రంలో చుట్టిన ఆమె భౌతికదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు.

ప్రతి పుట్టుకా మరణంతో అంతమయ్యేదే. జాతస్య మరణం ధృవం. అన్నీ తెలిసిన విషయాలే. కానీ కొన్ని మరణాలు బాధిస్తాయి. అది మరణించినవారి గొప్పదనం. జయ మరణం అలాటిదే. చప్పున మరచిపోవడం అంత తేలిక కాదు.

‘పెద్దవారిని అమితంగా బాధ పెట్టే విషయమేమిట’ని యక్షుడు ధర్మరాజుని అడిగాడో లేదో తెలియదు. అడిగివుంటే మాత్రం ‘తమ కంటే చిన్న వాళ్లు తమ కంటిముందే రాలిపోవడం’ అని జవాబు చెప్పి వుండేవాడని నేననుకుంటు న్నాను. (25-08-2011)

24, ఆగస్టు 2011, బుధవారం

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 7 -భండారు శ్రీనివాసరావు

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 7 - భండారు శ్రీనివాసరావు

శీర్షికాసనం


రేపు రాయాల్సిన వాక్టూన్ కోసం 
ఆలోచిస్తూ డాబాపై  పచార్లు దోసం 
ఎదురింటి పిల్లకు ఫోజు కోసం 
అనుకుంటే శ్రీమతి అసలుకే మోసం 

(జూన్, 21, 1975  ఆంధ్ర జ్యోతి దినపత్రిక )


క్షుర 'ఖర్మ'






మెడ ముప్పయి డిగ్రీల్లో వంచి 
చెవిదగ్గర కత్తెర టకటక లాడించి 
క్షణాల్లో క్షవరం అయిందనిపించి 
పంపేస్తే ఏం చెప్పాలా క్రాపు గురించి 

(జూన్, 15,1975  ఆంధ్ర జ్యోతి దినపత్రిక )


కార్టూనిష్టులకు/ ఇమేజ్ సొంతదారులకు ధన్యవాదాలు - రచయిత   

23, ఆగస్టు 2011, మంగళవారం

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 6 - భండారు శ్రీనివాసరావు

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు  -  6 - భండారు శ్రీనివాసరావు


షరా 'మామూలు'


పండుగ మామూలేమో మనదగ్గర వసూలుచేసి
మనకొచ్చే ఉత్తరాలేమో ఎదురింట్లో ఇచ్చేసి
చక్కాపోయే పోస్ట్ మాన్ని చూసి
పుట్టుకురాదా వొళ్ళంతా కసి

(జూన్, 14, 1975, ఆంధ్ర జ్యోతి దినపత్రిక)


పరీక్షిత్తులు


అర్ధరాత్రి దాకా నిద్దుర కాచి కాచి
చదివిన ఫలితం కోసం వేచి వేచి
పండయితే ఆనందం విరగపూచి
కాయయితే తలిదండ్రితో తప్పదు పేచి 

 (జూన్, 18, 1975,  ఆంధ్ర జ్యోతి దినపత్రిక) 

కార్టూనిస్టులకు/ఇమేజ్ సొంతదారులకు ధన్యవాదాలు - రచయిత