29, డిసెంబర్ 2009, మంగళవారం

కన్నుపొయ్యే కాటుకెందుకు? - భండారు శ్రీనివాసరావు

వార్త - వ్యాఖ్య

కన్నుపొయ్యే కాటుకెందుకు? - భండారు శ్రీనివాసరావు

ఆరోజు మంత్రి వర్గం సమావేశమౌతోంది. మధ్యాహ్నం పన్నెండు తర్వాత ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడతారని కబురొచ్చింది. అందరం బిలబిలమంటూ సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌కు చేరుకున్నాం. విలేకరులు, అధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు ఆ ఛాంబర్‌ ప్రక్కనే ఒక చిన్న హాలు ఉండేది.


 ఓ అరగంట తర్వాత అప్పటి ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య ఆ హాల్లోకి వచ్చారు. విలేకరులందరినీ పేరుపేరునా పలకరిస్తూ మామూలు కబుర్లలో పడిపోయారు. మధ్యమధ్యలో ఏం మొయిన్‌ ! (మొయినుద్దీన్‌ - ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి) అందరికీ అన్నీ (కాఫీ టిఫిన్లు) అందాయా? అని వాకబు చేస్తున్నారు. అప్పటికి దాదాపు ఒంటిగంట కావస్తుండడంతో చివర్లోకూర్చున్న నాలో అసహనం పెరిగిపోతోంది. మరో పదిమిషాల్లో మధ్యాహ్నం ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ఈ బులెటిన్‌ తప్పిపోతే మళ్లీ సాయంత్రందాకా దిక్కులేదు. కానీ అంజయ్యగారి కబుర్లు ఒక పట్టాన తేలేలా కనిపించడంలేదు. చివరికి ఏదయితే అదే అయిందని లేచి ఆయన దగ్గరకు వెళ్లాను. వార్తల టైమ్‌ అవుతోందని చెప్పేసి- ఏం చెప్పదల్చుకున్నారో ఒక్క ముక్కలో చెప్పండని కోరాను. దానికాయన పెద్దగా నవ్వేస్తూ `చెప్పడానికేముంది - మంత్రులందరూ (రాజీనామాలు) ఇచ్చేశారు' అని సైగలతో చెప్పేశారు. నేను రయ్‌ మంటూ బయటకు పరుగెత్తి - ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రేడియోకి ఫోన్‌ చేసి మంత్రుల రాజీనామా వార్తని అందించాను.

ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే - విలేకరులు వార్తలను అందించే తొందర్లో ఎలా తప్పుల్ని తొక్కుతారో అన్నది తెలియ చెప్పడానికే.



అంజయ్యగారి మంత్రి వర్గాన్ని `జంబోక్యాబినెట్‌' అని ఎద్దేవా చేసేవారు. అరవైమంది మంత్రులేమిటి - విడ్డూరం కాకపోతే అనేవారు. కార్టూన్ల సంగతి సరేసరి. అయినా, ప్రతిదీ తేలిగ్గా తీసుకునే తత్వం ఆయనది. యాదగిరి (హెలికాప్టర్‌)తో తనను ముడిపెట్టి ఒక దినపత్రికలో ప్రచురించే వ్యంగ్య చిత్రాలను కూడా నవు్వతూ ఆస్వాదించే మనస్తత్వం ఆయనది.



`వెనకటి రోజుల్లో జిల్లాకు ఒకే ఒక్క అయ్యేఎస్‌ ఆఫీసర్‌ (జిల్లాకలెక్టర్‌) ఉండేవాడు. ఇప్పుడో - ఇద్దరు ముగ్గురు అలాంటి అధికార్లు జిల్లాల్లో పనిచేస్తున్నారు. అలాంటప్పుడు జిల్లాకు ఇద్దరు మంత్రులు వుంటే తప్పేంటి `శ్రీనివాసూ' అనేవారు ఆంతరంగిక సంభాషణల్లో.



ఇక వార్తల్ని అందించడంలో తొందరపాటు విషయానికి వస్తే ఆ రోజు నేను హడావిడిలో అరవైమంది మంత్రులు రాజీనామా చేశారని చెప్పాను. రేడియోలో కూడా అలాగే ప్రసారమైంది. నిజానికి ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గంలో సభ్యులసంఖ్య అరవై. 59 మంది మంత్రులే ఆరోజు రాజీనామా చేశారు. సాయంత్రం వార్తల్లో ఈ తప్పు సవరించుకున్నామనుకోండి. ఇలాంటి పొరపాట్లే మరికొన్ని తరహా వార్తల విషయంలో జరిగితేనే వస్తుంది చిక్కంతా.




శ్రీమతి ఇందిరాగాంధీని హత్యచేసినప్పుడు చాల సేపటివరకూ రేడియో ఆ వార్తని వెల్లడించలేదు. ఆవిడ మరణవార్తని జాతికి తెలియచెయ్యడంలో తాత్సారం జరిగిందని దరిమిలా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధానిపై కాల్పులు జరిగాయన్న వార్త బయటకు పొక్కింది కానీ అసలేం జరిగిందన్న దానిపై అందరికీ తీరని సందేహాలే. చివరికి రాజీవ్‌ గాంధీ కూడా శ్రీమతి ఇందిరా గాంధీ మరణం గురించి బీ బీ సీ వార్తలు విని ధృవపరుచుకున్నారు. ఆమెపై కాల్పులు జరిపిన అంగరక్షకుల్లో ఒక సిక్కు మతస్తుడు ఉన్నాడన్న సంగతిని రేడియో వార్తల్లో ముందు వెల్లడించలేదు. అందువల్ల - అప్పటివరకూ అందరి మనసుల్లో ఆందోళన - అలజడి తప్పిస్తే అంతా ప్రశాంతమే. కానీ కాల్పులు జరిపిన అంగరక్షకుల్లో ఒకడిపేరు `బియాంత్‌ సింగ్‌' అన్న విషయం వెల్లడి కాగానే ఒక్కసారిగా అంతా తారుమారయింది. పరిస్థితులు వర్ణించలేనంత భీభత్సంగా పరిణమించాయి. ఎక్కడో ఢిల్లీలో జరిగిన ఘాతుకానికి దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో ప్రయాణించే సిక్కు ట్రక్కు డ్రైవర్లు ఊచకోతకు గురయ్యారు. అవేశకావేశాల ముందు వివేకం, విచక్షణ తలవంచాయి.

ఎవరో చెప్పినట్టు ట్యూబునుంచి పేస్టు బయటకు తీయగలమే కానీ మళ్లీ అందులో పెట్టలేం. అలాగే పేల్చిన తూటా కూడా.



నిజమే. వార్తను వెనువెంటనే అందించాలన్న కర్తవ్యదీక్షని మెచ్చుకుని తీరాల్సిందే. కానీ సామాజిక బాధ్యత సంగతేమిటి? పగలసెగలు రగిలించి, వ్యధలు మిగిలించి, విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్న సమాచారాన్ని తొక్కి పెడితే వచ్చే నష్టం ఏమిటి?





భయంకరమైన పోటీ వాతావరణంలో పయనిస్తున్న ఈనాటి మీడియా మనుగడకు ఎంతో కొంత మేరకు సంచలనాత్మక కథనాలు అవసరమే. కాకపోతే టీ ఆర్‌ పీ రేటింగ్‌లతో పాటు విశాల జనహితాన్ని పట్టించుకోవడం కూడా ఆవశ్యకమే! కాదంటారా!



భండారు శ్రీనివాసరావు



302, మధుబన్‌



ఎల్లారెడ్డి గూడా



హైదరాబాద్‌ - 500073



సెల్‌ 98491 30595



మెయిల్‌ bhandarusr@yahoo.co.in



29 - 09 -08































--------------------------------------------------------------------------------

ఎటు పోయాయ్‌ ఆ రోజులు ? --భండారు శ్రీనివాసరావు

ఎటు పోయాయ్‌ ఆ రోజులు ?

మా తాత గారి కాలం నాటికి మా వూళ్లో కరెంటు లేదు. ఆముదపు దీపాలు మినహా - కరెంట్‌  బల్బ్ ని కూడా చూడకుండానే ఆయన కాలం చేశారు.
మా నాన్న గారి కాలం వచ్చేసరికి కరెంట్‌ రాలేదు కానీ - రేడియోలు, గ్రామఫోన్లూ ఉండేవి. కాకపోతే ఆ రేడియోలు - మోటారుకార్లలో వాడే పెద్దసైజు బ్యాటరీల సాయంతో పనిచేసేవి.
మా వూరి మొత్తం జనాభాలో- ఆరోజుల్లో - యాభయి మైళ్ల దూరంలో వున్న బెజవాడకి వెళ్లి, సినిమా చూసొచ్చిన పెద్దమనిషి ఆయన ఒక్కరే. ఆ మాటకి వస్తే ఆయన తప్ప- రైలుని చూసిన  వాళ్ళు  కానీ, బస్సు ఎక్కిన వాళ్ళు కానీ, మా వూళ్లో ఎవరూ లేరని కూడా చెప్పుకునే వారు.
ఇక మా అమ్మ-
కట్టెల పొయ్యి ముందు కూర్చుని - పొగచూరిన వంటింట్లో పదిమందికి వండి వార్చేది. ఆమె సామ్రాజ్యంలో రకరకాల పొయ్యిలు ఉండేవి. పాలు కాగబెట్టడానికి దాలిగుంట - కాఫీ కాచుకోవడానికి బొగ్గులకుంపటి, వంట చేయడానికి మూడు రాళ్ల పొయ్యి, ఇలా దేనికి దానికి విడివిడిగా ఉండేవి. ఇక పెరట్లో బావి ప్రక్కన స్నానాలకోసం కాగులో నీళ్ళు  మరగపెట్టడానికి మరో పెద్ద పొయ్యి సరేసరి. దాలిగుంట విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వంటింటి వసారాలోనే ఓ మూలగా ఉండేది. నిప్పంటించిన పిడకలను ఆ దాలిగుంటలో దొంతరగావేసి పాలకుండని వాటిపై ఉంచి - పైన ఒక రాతిపలకని కప్పేవారు. సన్నటి సెగపై ఆ పాలు తీరిగ్గా కాగేవి. ఎరగ్రా కాగిన ఆ పాలపై - అరచేతి మందాన మీగడ కట్టేది. మర్నాడు - ఆ కుండలోని పెరుగుని నిలబడి వయ్యారంగా కవ్వంతో చిలికేవారు. మజ్జిగ నీటిపై తెట్టెలా కట్టిన తెల్లటి వెన్నని చేతుల్లోకి తీసుకుని, అరచేతిలో ఎగురవేస్తూ ముద్దగా చేసేవారు. పక్కన నిలబడి ఆశగా చూసే చిన్న పిల్లలకి చిన్న చిన్న వెన్న ముద్దలు పెట్టే వాళ్ళు . ఆహా ఏమి రుచి! అని లొట్టలు వేస్తూ తినేసి- ఆటల్లోకి జారుకునే వారు.  మగవాళ్ల సంగతేమో కానీ, ఆడవాళ్లకి ఆ రోజుల్లో చేతినిండా పనే. భోజనాలు కాగానే - అంట్లగిన్నెలు సర్దేసి - వంటిల్లు ఆవు పేడతో అలికేవారు. బాదం ఆకులతో విస్తళ్ళు కుట్టే వారు.  రోకళ్లతో వడ్లు దంచేవారు. ఇంటికి దక్షిణాన ఉన్న రోటిపై కూర్చుని పప్పు రుబ్బేవారు. ఈపనులు చేయడానికి విడిగా పనిమనుషులు ఉన్నా వారితో కలిసి ఈ పనులన్నీ చేసేవారు. వాటితో పాటు శ్రమతెలియకుండా పాటలు పాడుకుండేవారు. విలువ కట్టని వారి శ్రమా, విలువ కోరని వారి నిబద్ధతా చిన్న నాటి జ్ఞాపకాల దొంతర్లలో పదిలంగా ఉండిపోయాయి.
ఇక మారోజులు వచ్చే సరికి - రోజులు పూర్తిగా మారిపోయాయి. కట్టెల పొయ్యిలు పోయి - గ్యాస్‌ స్టవ్‌లు వచ్చాయి. నీళ్ల కాగుల్ని బాయిలర్లు భర్తీ చేశాయి. కరెంట్‌ దీపాలు వచ్చి లాంతర్లని వెనక్కి నెట్టేశాయి. కరక్కాయ సిరాలు- పుల్ల కలాలు తరువాతి రోజుల్లో రూపాలు మార్చుకుని ఫౌంటెన్‌ పెన్నులుగా, బాల్‌పాయింట్‌ పెన్నులుగా అవతరించాయి. రూపాయికి పదహారణాలు అనే లెక్కకాస్తా మా చిన్నతనంలోనే నూరు నయాపైసలుగా మారిపోయింది. బేడలూ, అర్ధణాలూ, కాసులూ, చిల్లికాసులూ జేబుల్లోంచి జారిపోయి నిగనిగలాడే రాగి నయా పైసలు, నికెల్‌ నాణేలు చెలామణిలోకి వచ్చాయి. రామాయణ కాలంనుంచీ ఎరిగిన ఆమడలు, కోసులు, మైళ్ళు  కాలగర్భంలో కలిసిపోయి, కిలోమీటర్‌  రాళ్ళు  రోడ్లపై  వెలిసాయి.  ఏడాదికోమారు జరిగే తిరుణాళ్లు  నిత్యకృత్యంగా మారి - అశ్లీల నృత్యాల వేదికలుగా మారిపోతున్నాయి. కోలాటాలు, పందిరి నాటకాలు, హరికథలు, బురక్రథలు, పిట్టలదొర కథలు చరిత్రపుటల్లో చేరి కనుమరుగవుతున్నాయి.
ఆరోజుల్లో సెలవులు ఇస్తే చాలు - పిల్లలంతా పల్లెటూళ్లకి పరిగెత్తే వాళ్ళు.  ఇన్ని రకాల ఆటలుంటాయా అనేట్టు అనేక రకాల ఆటలతో, పాటలతో కాలం గిర్రున తిరిగిపోయేది. అష్టాచెమ్మాలు, తొక్కుడు బిళ్లలు, వామన గుంటలు, వెన్నెలముద్దలు, వైకుంఠపాళీలు, పచ్చీసాటలు, చింతపిక్కలు, బావుల్లో ఈతలు, వాగు ఒడ్డున కబడ్డీ పోటీలు- ఒకటేమిటి - ఒక జీవితానికి సరిపడా ఆనందాన్ని గుండెల్లో నింపేసుకుని- ఇంకా ఇంకా ఇలాగే రోజుల్ని సరదాగా గడపాలన్న కోరికని మనసులోనే చంపేసుకుని - పాడు సెలవులు అప్పుడే అయిపోయాయా అని నిట్టూరుస్తూ బడిబాట పట్టేవాళ్ళు.
ఇక మా పిల్లల కాలం వచ్చేసరికి - మాయాబజారు సినిమాలో మాదిరిగా - కళ్లముందు ప్రపంచం ఒక్క మారుగా మారిపోయింది. గతం తలచుకోవడానికే మిగిలింది. చిన్నతనంలో చూసినవేవీ - ఈనాడు కలికానికి కూడా కానరావడం లేదు. జీవితం, ఇంత చిన్నదా అనిపించేలా, విన్న పదాలు, చూసిన దృశ్యాలు - ఆడిన ఆటలు, పాడిన పాటలు - కనురెప్పలకిందే కరిగి పోతున్నాయి. జ్ఞాపకాల పొరల్లోకి జారిపోతున్నాయి.
ఆ గురుతుల దారుల్లో వెనక్కి వెడుతుంటే - జొన్న చేల నడుమ కాలిబాటలో పరుచుకున్న దోసతీగెలూ-
లేత జొన్న కంకుల్ని వొడుపుగా కొట్టి తీసి వేయించిన ఊచ బియ్యం-
రోజూ తినే వరి అన్నానికి - ఎప్పుడో ఒకప్పుడు సెలవిచ్చేసి - పని వాళ్ళు  వండిన జొన్నన్నంతో కూడిన మృష్టాన్న భోజనం-
కళ్లాల„సమయంలో - కొత్త వడ్లు కొలిచి - కొనుక్కుతినే కట్టె మిఠాయి-
సాయంత్రం చీకటి పడేవేళకు - మైకులో ఊరంతా వినవచ్చే పంచాయితీ రేడియోలో సినిమా పాటలు-
వెన్నెల్లో ఆరుబయట నులకమంచాలపై పడుకుని ఊ కొడుతూ వినే అమ్మమ్మ కథలూ-
ఏవీ ! అవేవీ! ఎక్కడా కనబడవేం! ఇవన్నీ ఒక నాడు వున్నాయని అన్నా - కంప్యూటర్లతో ఒంటరిగా ఆడుకునే ఈనాటి పిల్లలు  నమ్ముతారా?? కళ్లతో చూసిందే  నమ్ముతాం  అని వాళ్లంటే మీరేం చేస్తారు?



16 -7-2008







..........................................

అభివృద్ధి - ఆరోపణలు - భండారు శ్రీనివాసరావు

అభివృద్ధి - ఆరోపణలు - భండారు శ్రీనివాసరావు

` ఖమ్మం జిల్లాలోని ప్రాజెక్టుల్లో ఏ రాయినడిగినా, రప్పనడిగినా నా పేరే చెబుతుంది ' అనేవారు కీర్తి శేషులు, మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు.

జలగం
 తన జిల్లాకు తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పేటప్పుడు ఆయన మాటల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. ` జిల్లాలో జనం తినే ప్రతి బియ్యపు గింజ మీదా నా పేరే రాసుంటుంది' అని కూడా అంటుండే వారు - సాగర్‌ ఎడమ కాలువని ఖమ్మం జిల్లా మీదుగా మళ్ళించిన ఘనత తనదేనని చెప్పే సందర్భాల్లో.

ప్రాజెక్టులను, పథకాలను మంజూరు చేసే అధికారం కలిగిన వాళ్ళు - తమ తమ ప్రాంతాలకు పెద్దపీట వెయ్యడం అన్నది విడ్డూరమేమీ కాదు. కేంద్రప్రభుత్వంలో ` అధికార చక్రం తిప్పే తమిళనాడు అధికారులూ ' మంత్రులూ, తమ రాష్ట్రానికి మేలు చేసే విషయంలో కులమతాలు, పార్టీ విభేదాలనూ పక్కన పెడతారనే సంగతి అందరికీ తెలిసిందే.రాష్ట్రానికి ముఖ్యమంత్రో, దేశానికి ప్రధానమంత్రో అయినంత మాత్రాన, సొంతూరు గురించి, సొంతమనుషుల గురించీ పట్టించుకోకూడదనడం ఏం ధర్మం?

చంద్రబాబు
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన నియోజకవర్గం కుప్పం అభివృద్ధి విషయంలో ప్రత్యే శ్రద్ధ కనబరిచి ఎంతో కృషి చేశారు. చిత్తూరు జిల్లాలో వెనకబడ్డ ప్రాంతం అయిన కుప్పంలో ఇజ్రాయెల్‌ తరహా ప్రాజెక్టుని అమలు చేసి, అక్కడి రైతాంగాన్ని అభివృద్ధిపధంలో నడిపించారు. అలాగే, రాష్ట్రానికి ముఖ్యమంత్రులయిన వారందరూ తాము అధికారంలో ఉన్నప్పుడు తమ తమ ప్రాంతాలకు తగిన రీతిలో అభివృద్ధి ఫలాలను అందించే విషయంలో ఇతోధికంగా శ్రమించినవారే.

వైఎస్ఆర్
ఇప్పుడు కడప జిల్లాలో, పులివెందుల ప్రాంతానికీ రాజశేఖరరెడ్డి చేస్తున్నదదే!
దేశానికి రాజయినా, తల్లికి కొడుకే అన్నట్టు - ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంతి అయినా తాము ముందు జవాబుదారీగా ఉండాల్సింది తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గ ప్రజలకే! అందుకోసమే రాజు తలచుకుంటే రోడ్లకు కొదవా అనే రీతిలో పులివెందులలో నాలుగులేన్ల రహదారి నిర్మాణానికి అధికారులు ఆఘమేఘాలమీద అనుమతులిచ్చారంటూ చేస్తున్న విమర్శలు అర్ధరహితం అని చెప్పాల్సివస్తోంది. అయితే రాష్ర్టంలో ఉప ఎన్నికలు రగిలిస్తున్న వేడిలో అగ్నికి మరింత ఆజ్యం పోయడానికి ఇలాంటి విమర్శలు వెలువడడం కూడా సహజమే. వేసవి సెగలతో రాష్ట్రం నిప్పులకొలిమిలా మారుతున్న సమయంలో వచ్చిపడ్డ ఈ ఎన్నికలు అన్ని పార్టీలకీ అగ్ని పరీక్షగా తయారయ్యాయి. భగభగమండే ఎండల్లో ఎన్నికల ప్రచారం తలకు మించిన భారం అయినా నాయకులకూ, వారి అనుచరగణానికీ తిప్పలు తప్పడం లేదు.
పెళ్ళానికి జీతం, నడిచేవాడికి దూరం చెప్పకూడదన్న పద్ధతిలో వాతావరణ శాఖ వారు కూడా ఏ రోజుకారోజు అ వేసవి తాపం మరో రెండు రోజులే అని నెట్టుకొస్తున్నారు. నిండు వేసవిని పండు వెన్నెలగా భావిస్తూ సాగిస్తున్న ఈ ఎన్నికల ప్రచారాల తీరు తెన్నులు గమనిస్తుంటే నా చిన్ననాటి స్నేహితుడు జ్ఞాపకం వస్తున్నాడు. అతడు ఏడాది పొడుగునా, సినిమాలు, షికార్లంటూ జల్సాగా తిరిగేవాడు. పరీక్షలు దగ్గరపడే సరికల్లా పుస్తకాలు ముందేసుకుని టీలు తాగి - నైటౌట్లు చేసి ప్రశ్నలూ, జవాబులు భట్టీయం వేసి ఫస్టుమార్కులతో పాసయ్యేవాడు. అక్కడ్నించి షరా మామూలే! పరీక్షలు వచ్చేవరకూ మళ్ళీ పుస్తకాల మొఖం చూసేవాడు కాదు.

note : all images in this blog are copy righted to respective owners

27, డిసెంబర్ 2009, ఆదివారం

చిక్కు సమస్యలు - చిరు పరిష్కారాలు

వార్త - వ్యాఖ్య


చిక్కు సమస్యలు - చిరు పరిష్కారాలు

- భండారు శ్రీనివాసరావు

యాభయ్ ఏళ్ళక్రితానికి - ఇప్పటికీ కొట్టొచ్చినట్టు కనబడే మార్పు ఏమిటి? అని అడిగితే - ఆ రోజుల్లో సినిమా హాళ్ళలో చుట్ట - బీడీ సిగరెట్లు తాగేవారు - ఇప్పుడది లేదని - ఆరు పదులు వయసు దాటిన వారెవరైనా జవాబు చెబుతారు.


అప్పటికీ - ఇప్పటికీ పొగత్రాగేవారి సంఖ్య తగ్గిందా అంటే అదీ లేదు. సినిమా హాల్లో సిగరెట్ తాగితే జరిమానా వేస్తామని బెదిరించారా అంటే అదీ లేదు. అన్ని సినిమా హాళ్ళ వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించి కట్టుదిట్టం చేశారా అని ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తుంది. పొగరాయుళ్ళను పట్టుకుని కౌన్సిలింగ్లూ గట్రా నిర్వహించారా అంటే అదీ లేదు. ప్రేక్షకులతో సమావేశాలు ఏర్పాటు చేసి పొగత్రాగవద్దని క్లాసులు తీసుకున్నారా అంటే ఆ దాఖలాలూ లేవు. మరి పొగత్రాగందే పట్టుమని పది నిమిషాలు ఓపలేని ధూమపాన ప్రియులు సిగరెట్ల జోలికి పోకుండా సినిమాలు ఎలా చూస్తున్నారు?

ఈ ప్రశ్నకి సమాధానం ఒక్కటే. ప్రజల్లో ఓ సుగుణం ఉంది. అది చూసి నేర్చుకోవడం. డేరా టూరింగ్ టాకీసులూ,రేకుల సినిమా హాళ్ళ కాలం ముగిసి ఎయిర్ కండిషన్ థియేటర్ల కాలం మొదలు కాగానే సినిమా హాళ్ళలో పొగత్రాగడం మంచిది కాదని పక్క వాళ్ళని గమనిస్తూ ఎవరికి వారే తెలుసుకున్నారు. ఈ సూత్రాన్నే ట్రాఫిక్ అధికారులు గమనించి అమలు చేస్తే సమస్యలకు సగం పరిష్కారం లభిస్తుంది. లేని పక్షంలో - ఒక దినపత్రిక పేర్కొన్నట్టు -" సమస్యమీదే - పరిష్కారం మీదే మేం నిమిత్త మాత్రులం - ఇదీ ట్రాఫిక్ పోలీసుల వరుస" అనే విమర్శల తాకిడిని తట్టుకోక తప్పదు.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ని చక్కదిద్దడం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు. కాకపోతే , అందుకోసం తీసుకుంటున్న చర్యలేమిటన్నదే జవాబు లేని-  రాని ప్రశ్న.  

 ట్రాఫిక్ అంశాలపై ఏర్పాటు చేసిన సదస్సులు - సమావేశాల్లో పౌరులు ఏదయినా చెప్పబోతే `సమస్యలు చెప్పమంటే, సలహాలు చెబుతున్నారని' కొందరు అధికారులు విరుచుకు పడిన తీరు గమనిస్తే వారి అసహన వైఖరి తేటతెల్లమవుతుంది. అవగాహన కల్పించే తీరు సరిగా లేదేమో అనిపిస్తుంది. కొన్ని కొన్ని చిన్న చిన్న చర్యలతో సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో ప్రయత్నించి చూడడంలో తప్పేమీ లేదని వారు గ్రహించాలి. అన్నింటికంటే ముందు చేయాల్సింది - ట్రాఫిక్ అధికారులు తమ ప్రాధాన్యతలను నిర్ధారించుకోవడం. హెల్మెట్లు, సీటు బెల్టులవంటి నిబంధనల అమలుకు తీసుకుంటున్న శ్రద్ధని - కొంతకాలం పాటయినా - ట్రాఫిక్ని చక్కదిద్దడానికి మరల్చాలి. ఎక్కడ - ఏ సమయంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందో అధ్యయనం చేసి అందుకు తగ్గట్టుగా అదనపు సిబ్బందిని - ఆయా కూడళ్ళలో - అవుట్ సోర్సింగ్ పద్ధతిపై నియమించాలి. ఈ సిబ్బంది కయ్యే ఖర్చుని ఆయా కూడళ్ళ చుట్టు పక్కల ఉండే దుకాణాలు, నివాస సముదాయాలనుంచి పారదర్శక పద్ధతిలో వసూలు చేయాలి.



రోడ్లు దాటడానికి రాజధాని నగరంలో అనేక చోట్ల ఫుట్ వోవర్ బ్రిడ్జీలు నిర్మించారు. ప్రకటనలకు మినహా - వాటిని జనం ఉపయోగిస్తున్న దాఖలాలు లేవు. స్త్రీ, బాల, వృద్ధులు ఆ వంతెనలు ఎక్కలేరు. ఎక్కగలిగిన వారు, ఎక్కనే ఎక్కరు. అందువల్ల వాటిని మరింత ఉపయోగంలోకి తీసుకురావడానికి వాటికి లిఫ్టులు అమర్చాలి. అందుకయ్యే వ్యయాన్ని కొద్ది కొద్దిగా వినియోగదారుల నుంచి రుసుము రూపంలో రాబట్టుకోవాలి. ఇలాటి  ఏర్పాట్లకి వీలులేనిచోట్ల ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి. అనేక  రద్దీ కూడళ్ల వద్ద రోడ్డుదాటలేక అవస్తలు పడేవారు అనేకమంది కనిపిస్తుంటారు. భవసాగరం కంటే రోడ్డు దాటడమే కష్టంగా భావిస్తుంటారు.ఇలాటి సంగతి పట్టించుకునే నాధుడు కనబడడు.  బాగా అభివృద్ధిచెందిన ప్రపంచ నగరాలలో అయితే, రోడ్డుదాటడానికి  పుష్ బటన్ వ్యవస్తలు వుంటాయి. రోడ్డుపక్కన వున్న పుష్ బటన్ నొక్కగానే రోడ్డు క్రాస్ చేయడానికి వీలుగా దీపం వెలుగుతుంది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతాయి.

 లేదా విద్యుత్ తో కూడా పని లేకుండా - జండాలను ఉపయోగించే ఒక విధానం అమల్లోవుంది. అదేమిటంటే- రోడ్డుకు ఇరువైపులా బాస్కేట్లలో కొన్ని జండాలను ఉంచుతారు. రోడ్డుదాటాలనుకునేవారు ఆ జండాను తీసుకుని ఊపుకుంటూ వెళ్లిపోవచ్చు. రోడ్డుదాటిన తరవాత అవతలవైపు వున్న బాస్కేట్లో వుంచి తమదారిన వెళ్లిపోవచ్చు.
అలాగే,       
ప్రైవేటు విద్యా సంస్థల వద్ద నిర్మించిన వంతెనల పూర్తి వ్యయాన్ని ఆ సంస్థల నుంచే వసూలు చేయాలి. విద్యార్ధుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు పిండుతున్న ఆ సంస్ధలకి ఇదేమంత పెద్దభారం కాబోదు.

థియేటర్లు, పాఠశాలలు, ఆఫీసుల వేళల్లో తగుమార్పులు చేయడం ద్వారా, ఒకే సమయంలో, ప్రజలు, వాహనాలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు రాకుండా నియంత్రించడం వీలుపడుతుంది.

కనిపించిన చోటల్లా `నోపార్కింగ్' బోర్డులు పెట్టకుండా   పార్కింగ్ కి  అనువయిన స్ధలాలని ముందుగా గుర్తించాలి. పోలీసు వాహనాలు `నోపార్కింగ్' ప్రదేశాల్లో నిలపకుండా చూడాలి.
ప్రయివేటు బస్సులని ఎలాగూ  అదుపు చేయలేరు కనుక - రాత్రి సమయాలల్లో కొన్ని కొన్ని విద్యాసంస్తలకున్న ఖాళీ జాగాలలో ప్రయాణీకులను  ఎక్కించుకునేందుకు అనుమతి ఇవ్వాలి. ఇందుకోసం వసూలు చేసే రుసుముని ఆయా విద్యా సంస్తలకే ఇవ్వాలి. ఇలాచేయడంవల్ల అనేక ప్రాంతాలలో రాత్రివేళల్లో ట్రాఫిక్ జామ్స్ తగ్గిపోతాయి.      

స్కూళ్ళకీ, ఆఫీసులకీ వెళ్ళే బిజీ సమయాల్లో చెకింగ్లు జరిపే పద్ధతికి స్వస్తి చెప్పాలి. సిగ్నల్ జంపింగ్ చేసే వాహనదారులను పట్టుకుని భారీ జరిమానాలు విధించాలి. రద్దీ సమయాలని దృష్టిలో పెట్టుకుని ` వీ ఐ పీ ' ల పర్యటనల వేళల్లో మార్పు చేయాలి.

ఇవన్నీ చేసినా, సమస్య నూటికి నూరుపాళ్లు  పరిష్కారం కాకపోవచ్చు. కానీ పరిస్థితి కొంతలో కొంత మెరుగు పడడానికీ , పోలీసుల పట్ల ప్రజలకున్న అవగాహన, అభిప్రాయాల్లో సానుకూల మార్పు రావడానికే ఈ చర్యలు ఖచ్చితంగా దోహదం చేస్తాయి.


భండారు శ్రీనివాసరావు

302, మధుబన్

ఎల్లారెడ్డి గూడా

హైదరాబాద్ - 500073

సెల్ 98491 30595

మెయిల్ bhandarusr@yahoo.co.in

26, డిసెంబర్ 2009, శనివారం

గుబులు పుట్టిస్తున్న ఉప ఎన్నికలు - భండారు శ్రీనివాసరావు

ఏమి సేతురా లింగా !

ముని  మంత్రంబు నొసంగ నేల? 
నొసగె బో -
మున్ముందు మార్తాండు రమ్మని నేకోరగానేల?
కోరితిని బో -
అతండు రానేల?
వచ్చెను బో -
కన్నియనంచు నెంచక నను చేపట్టగా నేల?
పట్టెను బో -
పట్టి నొసంగ నేల?
అడుగంటెన్‌ కదా! కుంతి సౌభాగ్యముల్‌!


                                           
కరుణశ్రీ పద్య రూపంలో పలికించిన ` కుంతీ విలాపం' మాదిరిగా ఉంది నేడు రాష్ట్రంలో ఉప ఎన్నికల నేపధ్యంలో వివిధ పార్టీల పరిస్థితి.
గెలిచి తీరతాం! అన్న ధీమా కాస్తా
గెలవకపోతామా! అన్న ఆశగా మారి
గెలుస్తామా! అన్న సంశయ రూపం ధరిస్తే -
మిగిలేది కుంతీ విలాపమే!

కోరిన వరాలిచ్చు కొండంత దేవుళ్ళలాంటి వాళ్ళు  కాదు ఓటర్లు.  వాళ్ళ నాడి కనిపెట్టడం రాజకీయ పార్టీలను పుట్టించిన బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. వాళ్ళ మూడ్‌ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అలాగని గాలి వాటం కాదు. సమయం వచ్చినప్పుడు కీలెరిగి వాత పెట్టడంలో వారికి వారే సాటి. ఈ పాటి వాస్తవం ఎరగబట్టే పార్టీ నేతల్లో ఇంత గుబులు.

ఆవిరయ్యే హామీలు 

రాష్ట్రం అగ్ని గుండంగా మారి, వేసవితాపం, భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరిగిపోతున్న సమయంలో ఉప ఎన్నికల వేడితోడయి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రధాన పార్టీలు ఎడాపెడా కురిపిస్తున్న హామీల వర్షాలు కూడా వారితాపాన్ని తీర్చలేకపోతున్నాయి. ఉపశమనాన్ని కలిగించలేకపోతున్నాయి.

ఇక పార్టీలు, పార్టీల నేతలు, ఉపనేతలు, కార్యకర్తల పరిస్థితి మరీ ఘోరం. మండు వేసవిలో వచ్చిపడ్డ ఈ ఉప ఎన్నికలు నిజంగా వారి పాలిట అగ్ని పరీక్షగా తయారయ్యాయి. కరెంటు కోతలు, ఉక్కపోతల నడుమ పరీక్షలు రాసే విద్యార్ధుల మాదిరిగా ఉంది వారి పరిస్థితి.
పైకి ఎంత ధీమాగా ఉన్నా -  బింకంగా కనబడ్డా -
` ఎందుకొచ్చిన ఎన్నికలు రా' అన్న బాధ వారి మనసులను ఏదో మూల తొలుస్తూనే వుండాలి!
ఇది ఇలా ఎందుకు జరిగింది? అన్న ప్రశ్న  ఎంత స్వాభావికమైనదో -
అలా జరిగి వుంటే - ఇలా జరిగేది కాదేమో అన్న భావన కూడా అంత స్వాభావికమైనదే?
`` ఆ నాడు సర్కారు ఎక్‌‌సప్రెస్‌ లేటుగా వచ్చి - మీరు పెళ్ళి చూపులకు ఆలస్యంగా వచ్చివుంటే - మా నాన్న ఎంచక్కా నాకు ఆ భీమవరం సంబంధమే ఖాయం చేసివుండేవాడు' అన్నదట ఓ ఇల్లాలు శోభనం రోజున కట్టుకున్న మొగుడితో.
అలాగే - భవనం వెంట్రామ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు, తన స్నేహితుడు ఎన్‌. టీ. రామారావుని రాజభవన్‌కు ఆహ్వానించకపోయి ఉంటే - వెంట్రామ్‌ సలహా మేరకు రామారావుకు కాంగ్రెస్‌ అధిష్టానం రాజ్యసభ సభ్యత్వం ఇచ్చివుంటే - అసలు తెలుగుదేశం పార్టీ పుట్టేదే కాదన్నాడొక రాజకీయ విశ్లేషకుడు.
మరో విశ్లేషకుడు మరో అడుగుముందుకువేసి - డిప్యూటీ స్పీకర్‌కు బదులుగా - చంద్రశేఖరరావుకు చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే తెలంగాణా రాష్ట్ర సమితి ఉండేదే కాదు. ఈ ఉప ఎన్నికలు వచ్చేవే కావు పొమ్మన్నాడు.
అందుకే మన జనం వేదాంతాన్ని నమ్ముకున్నది
కానున్నది కాకమానదు. కానిది కానే కాదు.


భండారు శ్రీనివాసరావు
జయీ భవ! దిగ్విజయీభవ

గత మూడు దశాబ్దాల కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల చరిత్రను వై ఎస్సా ర్‌ తిరగరాస్తున్నారు. నాలుగేళ్ళ పదవీకాలాన్ని విజయవంతంగా ఈ నెలలో పూర్తి చేసుకుని అయిదో ఏట అడుగుపెడుతున్నారు. ఏ విధంగా చూసినా - రాజశేఖరరెడ్డిది ఒక రికార్డే. 48 నెలల్లో ఎన్ని పథకాలు? ఎన్ని ప్రణాళికలు? ఎన్ని ప్రాజెక్టులు?
అధికార యంత్రాంగాన్ని ఊపిరి సలపనివ్వకుండా అమలు చేస్తున్న పథకాల తీరుతెన్నులు గమనించిన వారికి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల్లో రాజశేఖరరెడ్డి విశిష్టత బోధపడుతుంది. ఎన్నికల హామీలను అమలు పరచడమే కాకుండా - ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను గమనిస్తూ - కొత్త ఆలోచనలకు రూపం కల్పిస్తూ ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్న తీరు హర్షనీయం! అభినందనీయం!
అందుకే అంటున్నారు జనం
రాజశేఖరా ! నీపై మోజుతీరలేదురా !!

( జూన్ - 2008 )

జనహితమే సర్వజన సమ్మతం - భండారు శ్రీనివాసరావు

జనహితమే సర్వజన సమ్మతం  - భండారు  శ్రీనివాసరావు

ఎక్కడి వీవిస్ లక్ష్మణ్! ఎక్కడి గిల్‌క్రిస్ట్! ఎక్కడి సెహ్వాగ్! ఎక్కడి జయసూర్య! ఎక్కడి హర్భజన్! ఎక్కడి హేడెన్! హద్దుల్ని కాదనుకుని - సరిహద్దుల్ని దాటుకుని క్రీడా స్పూర్తితో క్రికెట్ చరిత్రని తిరగరాస్తున్న ఐ పీ ఎల్ పోటిల్లో పాల్గొంటున్న దిగ్గజాలని చూస్తుంటే ఏమనిపిస్తుంది? విశ్వమంతా ఒకటై - ఒకే వేదికగా మారుతున్న తరుణంలో 'మన రాజకీయం ' ఏ దిశగా సాగుతోంది? ఏ దరి చేరబోతుంది?

రాష్ట్ర విభజనని ప్రజలు మనస్పూర్తిగా కోరుకుంటే ఏ రాజకీయ శక్తీ దాన్ని ఆడ్డుకోలేదు. ఈ ఆకాంక్ష జనానిదయితే మన్నించాల్సిందే. రాజకీయమైనదయితే ఆలోచించాల్సిందే'. ఇటీవలికాలంలో - దాదాపు అన్ని పార్టీలు - ఏదో ఒక రూపంలో - ఏదో ఒక స్థాయిలో తెలంగాణా సెంటిమేంట్‌ని కొద్దో గొప్పో పులుముకోవాలిని ప్రయత్నిస్తూ ఉన్నాయి.

ఈ పార్టీల్లోని కొందరు పెద్దలకి ఇది తక్షణ రాజకీయ అవసరంగా మారింది. అదే ఇందులోని విషాదం. అయితే, సమైక్యవాదం నుంచి అంగుళమైనా ఎడం జరగని ఎడమ పార్టిల్లో సీపియంని ప్రధమంగా చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కూడా ఈ కోవలోకే వస్తారు. అభివృద్ధి నినాదం ప్రాతిపదికపైనే ఉప ఎన్నికల సమరాంగణంలోకి అడుగు పెట్టాలన్నది ఆయన అభిమతం. సమైక్య రాష్ట్ర సిద్ధాంతాన్ని బలపరిచే పార్టీల్లో పెద్ద పీట వేయాల్సిన మరో పార్టి టీడీపి.

ప్రత్యేక రాష్ట్రమే పరమావధిగా పుట్టుకోచ్చిన తెలంగాణా రాస్ట్ర సమితి నాయకుడు చంద్రశేఖరావు - వ్యూహాత్మకంగానో లేదా గత్యంతరం లేకనో తెచ్చిపెట్టిన ఉప ఎన్నికల ఉసురు అన్ని పార్టిలనూ చుట్టుముడుతోంది. తెలంగాణా పట్ల అనేక రాజకీయ పక్షాల్లో నెలకొని ఉన్న అసందిగ్ధ పరిస్థితికి - ఈ ఉప ఎన్నికల ఫలితాలే స్వస్తి వాచకం పలకగలవన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.

దేశం స్వాతంత్ర్యం పొందిన దరిమిలా - అనేక కొత్త రాష్ట్రాలు పురుడు పోసుకున్నాయి. పొరుగున ఉన్న అనాటి మద్రాసు(తమిళనాడు) రాష్ట్రం నుంచి విడిపోయి ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం - తరువాత కొద్ది కాలానికే - భాషా ప్రయుక్త రాష్ట్రాల సిద్దాంత ప్రాతిపదిక పై - తెలంగాణా ప్రాంతాన్ని కలుపుకుని - ఆంధ్ర ప్రదేశ్ గా ఆవిర్భవించింది. ఒకే భాష మాట్లాడే వారికి కూడా, విడివిడిగా రాస్ట్రాలు వున్నప్పుడు - ఆంధ్ర ప్రదేశ్ ని కూడా ప్రజాభిష్టం మేరకు విభజించడంలో తప్పేమి లేదు. అయితే తప్పల్లా - ప్రజల ఆకాంక్షని అంచనా వేయడంలో చేస్తున్న తప్పులే. రాష్ట్ర విభజన అన్నది ఎవరో కొందరి రాజకీయావసరాల కోసం కాకుండా మెజారిటీ ప్రజల అబీష్టం మేరకు జరగాలి. జరగనున్న ఉప ఎన్నికల ఫలితాలు ఈ దిశగా కొంతమేరకు ఉపకరించే అవకాశం ఉంది.

ఏ వేర్పాటు ఉద్యమానికయినా, వెనుకబడినతనమే ప్రాతిపదిక. దీని ఆధారంగా పెచ్చరిల్లే భావోద్వేగాలే విభజన ఉద్యమాలకు ఊపిరిపోస్తాయి. ఈ విధంగా ప్రజ్వరిల్లే శక్తిని అడ్డుకోవడం అతికష్టం అని గతంలో తెలంగాణా ప్రజా సమితి నిరూపించింది కూడా. అయితే, అప్పటికి అంటే 1969 నాటికి ఇప్పటికీ పరిస్థితుల్లో ఇసుమంత కూడా మార్పు రాలేదంటే నమ్మడం కష్టం. తెలంగాణాలో ఇంకా కొన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదంటే నమ్మచ్చుకాని తెలంగాణాలో అసలు అభివృద్ధి జరగలేదని వాదించడం కేవలం రాజకీయమే అవుతుంది. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. 1969 నాటికి వూహకు సయితం అందని ఉదార ఆర్ధిక విధానాలు ఈనాడు శరవేగంగా అమలవుతున్నాయి. ప్రపంచీకరణ సిద్దాంతం నేల నాలుగు చెరగులా బలంగా వేళ్ళూనుకుంటున్న నేపధ్యంలో - అసలు దేశాలు మధ్యనే హద్దులు చెరిగిపోతున్నాయి.

పొట్ట గడవక కొందరూ - డాలర్లు వేటలో మరికొందరూ - ఉపాథి కోసం ఇంకొందరూ ఉన్నవూరు వదిలిపెట్టి వెళ్ళడం అన్నది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కావడంలేదు. అవకాశాలు వెతుక్కుంటూ అన్ని ప్రాంతాలవారు అన్ని చోట్లకీ వలస వెడుతున్నారు.
ఏదో ఒకనాడు - తెలుగువాడే అమెరికాకి అధ్యక్షుడు కాగలడని ఆ దేశంలో ఉంటున్న తెలుగువారే భరోసాగా చెబుతున్నారంటే ఇక భౌగోళిక రేఖలకి, దేశాల సరిహద్దులకీ - అర్థమేముంటుంది? పోతే - ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని - భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు ఏపాటి మిగులుతాయో అర్ధం చేసుకోలేని విషయమేమి కాదు.
ఆ మాటకి వస్తే - దేశాలయినా, రాష్ట్రాలైనా, ప్రజలైనా విడిపోవడం - కలిసిపోవడం పెద్ద విషయమేమి కాదు. విభజన కుడ్యాన్ని కూలగొట్టుకుని - రెండు జర్మనీలు కలిసిపోయాయి. అమెరికాని సయితం శాసించగలిగిన స్థాయికి ఎదిగిన సోవియెట్ యూనియన్ - అంగ, వంగ, కళింగ దేశాల మాదిరిగా విచ్చిన్నమయింది.

కాబట్టి - చరిత్ర నుంచి నేర్చుకున్నవారు - చరిత్ర హీనులు కాలేరు. మనసులూ - మనుషులూ కలుషితం కావడం ఏ సమాజానికి క్షేమకరం కాదు. విడీపోయినా చేతులు కలిసే వుండాలి. మనసులు మసి బారకుండా ఉండాలి .
సర్వేజనాః సుఖినోభవంతు!
(మే - 2008 )

తెలంగాణా గురి మళ్ళీ తప్పుతోందా ? - భండారు శ్రీనివాసరావు

తెలంగాణా గురి మళ్ళీ తప్పుతోందా ? 

ద్రోణాచార్యుడు కురు, పాండు కుమారులకు విలు విద్య పోటీ పెట్టాడు. చెట్టుపై పిట్టబొమ్మను పెట్టి పిట్ట కంటిని గురిపెట్టి కొట్టమన్నాడు. ముందుగా ధుర్యోధనాదులను పిలిచి బాణం ఎక్కుపెట్టి ఏం కనపడుతున్నదో చెప్పమన్నాడు.`చెట్టు చెట్టు కొమ్మలు కొమ్మలనడుమ పిట్టబొమ్మ కనపడుతున్నాయని' వారు సమాధానం చెప్పారు.

ద్రోణుడు అర్జునుని పిలిచి అదే ప్రశ్న అడిగాడు. `పిట్ట కన్ను మాత్రమే కనపడుతోందని' కిరీటి జవాబిచ్చాడు. లక్ష్యం పట్ల గురి ఎలా ఉండాలో తెలియ చెప్పడానికి ఈ కథ చెప్పేవాళ్ళు. అంటే లక్ష్య సాధనకు ఏకాగ్రత కావాలి. సాధించాల్సింది తప్ప మరో దానిపై మనసు మరల్చరాదు, అన్నది ఈ కథలోని నీతి. కానీ `తెలంగాణా రాష్ట్ర సాధన అనే ఉద్యమం ఏ మలుపు తిరుగుతోంది? `తెలంగాణా నా ప్రాణం తెలంగాణా రాష్ట్ర సాధనే నా ధ్యేయం' అనే నినాదంతో ఆవిర్భవించిన తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడైన చంద్రశేఖరరావు నోట `మహా కూటమితో కాంగ్రెస్‌ ఓటమి' అనే మాట ఎలా వచ్చింది? అంటే తెలంగాణా సాధన అన్న ప్రధాన లక్ష్యాన్ని కాంగ్రెస్‌ ఓటమి అనే ఉమ్మడి ధ్యేయం వెనక్కు నెట్టి వేసిందని అనుకోవాలా? కూటమిలోని మిగిలిన పార్టీలకు కాంగ్రెస్‌ ఓటమి ప్రధాన ధ్యేయం కావడానికి తప్పుపట్టాల్సింది ఏమీలేదు. కానీ తెలంగాణా అన్న ఏకైక లక్ష్యంతో ఏర్పాటైన తెలంగాణా రాష్ట్ర సమితి చేస్తున్నదేమిటి.

మహా కూటమిలోని మిగిలిన పార్టీల విషయం వేరు తెరాస పరిస్థితి వేరు. మహాకూటమో, మెగా కూటమో ఏదో ఒక కూటమి అవసరం వారి వారి రాజకీయ అవసరాల కోణం నుంచి చూస్తే ఒక తక్షణావసరం కావచ్చు కానీ, తెరాస దాని తీరు మార్చుకోకపోయినా, ప్రాధాన్యతల క్రమం మార్చుకోవడాన్ని తెలంగాణా అభిమానులు ఎలా జీర్ణించుకుంటారో అన్నది భవిష్యత్‌ తేలుస్తుంది.

సామ , దాన, భేద, దండోపాయాలతోనైనా సరే కార్యాన్ని సాధించాలనే సూత్రం తెలంగాణా సాధన లక్ష్యసాధనకు అన్వయింపచేయాలని చూడడం తగని పని. తెలంగాణా ప్రాంతంలోని అధిక సంఖ్యాకులకు ప్రత్యేకరాష్ట్రం పట్ల మక్కువ లేదన్న సంకేతాలను పంపే ప్రమాదం ఈ కూటములవల్ల కలిగే అవకాశం ఉంది. బహుశా, తెరాస నేతకు కూడా ఈ అంశం బోధపడే, `మహా కూటమితో కాంగ్రెస్‌ ఓటమి' అనేనినాదంతో అంతరంగాన్ని అవిష్కరించి ఉంటారు.

ఈ రోజున నిజానికి తెలంగాణా ఊసెత్తని పార్టీ అంటూ రాష్ట్రంలో కలికానికి కూడా కానరాదు. కానీ నాలుక తెలంగాణా అంటున్నా మనసులో మర్మం మరోటి ఉందన్న అనుమానం అందరికీ ఉంది. వేరే ఉద్దేశ్యాలను మనసులో ఉంచుకుని తెలంగాణా నామజపం చేసేవాళ్ల వల్లే తెలంగాణాకు ఎక్కువ ముప్పు పొంచి ఉంది. తెలంగాణా మేధావులు కూడా ఈ విషయంలో పెదవి విప్పకపోవడం విషాదకరం.

తెలంగాణా వాదులకూ, తెలంగాణా పేరుతో పబ్బం గడుపుకోవాలని చూసే తెలంగాణా రాజకీయ వాదులకూ నడుమ ఎంతో అంతరం ఉంది. 1969 నుంచి జరుగుతున్నది ఇదే. మహా కూటమి ఏర్పాటుతో ఇది పునరావృతం అయ్యే అవకాశాలు పెరిగాయి. అన్ని జండాలు కలుపుకుని రాజశేఖరరెడ్డిని గద్దె దింపాలన్న ఒకే ఒక ఎజెండాతో ముందుకు సాగే ఈ కూటమి కలలు ఫలించి కాంగ్రెస్‌ ఓటమి పాలయినా తెలంగాణా వస్తుందన్న గ్యారంటీ లేదు. కాంగ్రెస్‌ పరాజయం వల్ల మహా కూటమిలోని ఇతర పార్టీలకు లబ్ది చేకూరవచ్చునేమో కానీ, తెలంగాణా రాష్ర్ట సమితికి అదనంగా ఒకటో అరో సీట్లు పెరగడం మినహా ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ లక్ష్య దిశగా వొరిగేదేమీ ఉండదు. కాంగ్రెస్‌ ప్రజా వ్యతిరేక పాలనపై మడమ తిప్పని పోరాటం చేయాలని తామంతా కలసి ప్రతిజ్ఞ చేశామని చంద్రశేఖర రావు చెప్పడాన్ని బట్టి చూస్తే ప్రత్యేక రాష్ట్ర లక్ష్యానికి ఎడం జరుగుతున్నట్లు ఎవరికైనా అనిపిస్తే అందుకు ఆయన అభ్యంతరం పెట్టకూడదు. మరోసారి మోసపోవడమే తెలంగాణాను నిజంగా కోరుకునే వారికి మిగిలిందా అని అనిపిస్తే కూడా తప్పు పట్టాల్సిన పనిలేదు. ఎవరు శ్రేయోభిలాషులు అన్నది తెలంగాణా వారే అర్ధంచేసుకుని ఆదరించాల్సి ఉంది. మరోసారి తప్పటడుగు పడితే కాలు కూడదీసుకోవడానికి కూడా వీలుండదు. ( ఫిబ్రవరి - 2009 )