మళ్ళీ మళ్ళీ రాని రోజు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మళ్ళీ మళ్ళీ రాని రోజు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, జూన్ 2026, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో: (330) - భండారు శ్రీనివాసరావు


మళ్ళీ మళ్ళీ రాని రోజు అనుకునే ఆ రోజు నిస్సారమైన జీవితాల్లో కూడా ఏదో ఒక రోజు వస్తుంది. భగవంతుడు మామూలు మనిషికి ముందే అమర్చిపెట్టిన కుషన్ ఇది. కోరకుండానే ఇచ్చిన వరం కూడా.
‘ఎండనబడి వచ్చావు, అలా కూర్చో నాయనా!’ అంటూ చల్లని నీళ్ళు ఇచ్చింది, ఆ ఇల్లాలు.
విదేశాల్లో ఉంటున్న సుందరానికి ఆ పల్లె వాతావరణం చీదరగానే వుంది. పూర్వీకుల ఆస్తికి బేరం తగిలింది. దాన్ని ఏదో విధంగా ఏదో ఒక రేటుకు తెగనమ్మి వెళ్ళిపోవాలని సొంతూరు వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత కానీ రిజిస్ట్రేషన్ వ్యవహారాలు అంత సాఫీగా జరగవన్న సంగతి అర్ధం అయింది. మొత్తం మీద కొంత మొత్తం ముట్టచెప్పిన పిమ్మట ఆ పని ముగిసింది. ఇక బయలుదేరి వెళ్ళే ముందు ఎప్పుడో అమ్మేసిన, తాను పుట్టి పెరిగిన ఇంటిని చూద్దామని అనిపించి వచ్చాడు. అది ఇప్పటికే పది చేతులు మారింది. తనను ఆప్యాయంగా పలకరించిన ముసలమ్మే ఇప్పుడు ఆ ఇంట్లో ఒంటరిగా వుంటోంది. ఆమె కొడుకులు తన లాగే ఎక్కడో విదేశాల్లో వుంటున్నారు.
‘ఒక్క పది నిమిషాలు అలా కూర్చో నాయనా! ఏదో చేతనమయిన వంట చేసి పెడతాను’ అంటోంది ఆవిడ.
‘అన్నంతిని వెళ్ళమని అన్నప్పుడు కాదు కూడదు అని వెళ్ళకూడదు, మొండిగా వెడితే ఆ పూటకు అన్నం పుట్టదు’ అని చిన్నప్పుడు బామ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.
వంటింట్లో పీట, విస్తరి వేసి వడ్డించింది.
ఇబ్బందిగా కూర్చుని తినడం మొదలు పెట్టాడు.
‘కళ్ళకు మసకలు, డాక్టరు చూపించుకోవడానికి కుదరడం లేదు, పచ్చట్లో ఉప్పు సరిపడా వేశానో లేదో ముద్ద కలుపుని చెప్పు నాయనా’ అంటోంది ఆ ఇల్లాలు ప్రేమగా.
సుందరం ఆ ఆప్యాయతకు చలించిపోయాడు. గత కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి ప్రేమానురాగాలకు దూరంగా ఉంటున్న సుందరం కళ్ళు చమర్చాయి. కంటి నీరు ఉబికి వచ్చింది. ఆ వెచ్చటి, ఉప్పటి కన్నీరు తింటున్న అన్నంలో కలిసింది.
‘ఉప్పు సరిపాళ్ళుగానే వేశారు బామ్మగారూ’ అన్నాడు సుందరం ఆమె చూడకుండా కళ్ళు తుడుచుకుంటూ.
ఇదో కధ అనుకుని అలా ఉంచుదాం.
పొతే,
ఈ ఫేస్ బుక్ లో మెరికలు లాంటి ఇద్దరు అక్కచెల్లెళ్ళు వున్నారు. Komaragiri Phanikumari ఫణి కుమారి, Manikumari Govindarajula మణి కుమారి. వీళ్లిద్దరూ నా మేనకోడళ్ళు. పిల్లలు పెళ్ళిళ్ళు అన్నీ బాధ్యతలు పూర్తి చేసుకుని హైదరాబాదులో సెటిల్ అయ్యారు.
మణి కధలు రాస్తుంది. ఫణి పేరుకు తగ్గటుగా పనిమంతురాలు. కొత్తగా వచ్చిన ఏ ఐ ని ఆపోసన పట్టింది. ఆ నైపుణ్యంతో తన మొబైల్ తో ఏవో జిమ్మిక్కులు చేస్తుంది. ఇక వంటలు, పిండి వంటలు సరే చెప్పక్కర లేదు. వంట వేరు వడ్డన వేరు. వంట రుచి వడ్డన టెక్నిక్ తెలిస్తే రెట్టింపు అవుతుంది అంటారు. అది వీళ్ళిద్దరి విషయంలో నూటికి నూరు పాళ్ళు కరక్ట్.
వీళ్ళ అన్నయ్య , నా మేనల్లుడు శ్రవణ్ కూడా అక్కడే ఆ ప్రాంతంలోనే ఉంటాడు. చిన్నప్పటి నుంచి శ్రవణ్ కు హీరో కృష్ణ, అంటే అభిమానం. ఎంత అభిమానం అంటే తన పిల్లలకు విమల్ కృష్ణ, రమ్య కృష్ణ అని పేర్లు పెట్టుకున్నాడు. నాలుగేళ్ల క్రితం, 2022లో విడుదల అయిన బ్లాక్ బస్టర్ చిత్రం డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణే నా మేనల్లుడి కుమారుడు.
“డీ.జే. టిల్లు! ఇదేం పేరురా! ఆడవాళ్ళకి నచ్చుతుందా అసలు” అన్నాను నేరుగా ఈ సినిమా డైరెక్టర్ తోనే.
విమల్ కృష్ణ బీ. టెక్. చదివాడు. అమెరికా ఛాన్స్ కూడా వదులుకుని సినిమాల మీద మోజుతో అలాగే ఆ ప్రపంచంలోనే వుండి పోయాడు. అలా కొన్నేళ్ళు. చివరికి ఆ తపస్సు ఫలించింది. పట్టుదల ఫలితం ఇచ్చింది. విమల్ డైరెక్ట్ చేసిన చిత్రం డీ.జే. టిల్లు కనక వర్షం కురిపిస్తోందని ఆ రోజుల్లో అమెరికా నుంచి మా పిల్లలు ఫోన్ చేసి చెప్పారు.
నాది పాత తరం కదా! సర్దుకోవడం కొంచెం ఇబ్బంది. ఇదేం పేరు, ఇదేం కధ అనే భావనే. కానీ నవ తరానికి అపరిమితంగా నచ్చినట్టు వుంది.
అప్పటికి జెన్ జడ్ (Gen Z అంటే 1997 - 2012 మధ్య జన్మించిన వాళ్ళు) అనే పదం కూడా ప్రాచుర్యంలో లేదు. నేటి కుర్రకారుకు ముందు చూపులేదు అని పాత తరం అనుకునే మాటలోనే ఏమాత్రం ముందు చూపులేదు అని ఎప్పటికప్పుడు రుజువవుతూనే వుంది. అయినా పాత తరం పద్దతి మార్చుకోవడం లేదు. నేనూ మినహాయింపు కాదు.
“జనం కోరేది మనం శాయడమా! మనం చేసేది జనం చూడడమా!” అనే అలనాటి పాతాళభైరవి పింగళి మార్కు మాంత్రికుడి డైలాగ్ నేటికీ వర్తించేలా సినిమా తీసిన డీ జే టిల్లు కుర్ర బృందానికి అభినందనలు. ఇప్పుడు అనుమాన పక్షి అనే మరో సినిమా తీశాడు. విడుదలకు సిద్ధంగా వుంది.
'ఘన విజయం సినిమా తీసిన ఒక డైరెక్టర్ కు మరో సినిమా తీయడానికి నాలుగేళ్ల కాలం ఎందుకు పట్టింది? డీజే టిల్లు సీక్వెల్ కు దర్శకత్వం చేసే అవకాశం ఎందుకు అంది పుచ్చుకోలేదు' అనే సందేహాలకు విమల్ కృష్ణ తనదైన రీతిలో చాలా హుందాగా జవాబు చెప్పాడు.
'డీజే టిల్లులో హీరో పాత్ర ఒక ఐకానిక్ కేరక్టర్. మళ్ళీ అలాంటి కేరక్టర్ కోసమే ఇంత విరామం. సీక్వెల్ కంటే మరో ఐకానిక్ పాత్ర రూపొందించడానికే నేను ఇష్టపడ్డాను, వేరే కారణాలు ఏవీ లేవు' అన్నది విమల్ కృష్ణ వివరణ.
జెన్ జడ్ అంటేనే సొంత, నిర్ధిష్ట అభిప్రాయాలతో ముందుకు సాగే తరం. మా తరం మాట్లాడేది ఏముంటుంది? ఆ తరాన్ని సమర్థించక పోయినా, వారిని నిరుత్సాహ పరచకపోవడమే మా తరం చేయాల్సిన పని.
All the best my dear Vimal Krishna!
నిన్న విమల్ కృష్ణ తండ్రి శ్రవణ్ ఇంట్లో అందరం కలిశాము. ఫణి భర్త Rampa Ks రాంపా చిత్రకారుడు, రచయిత. ఫేస్ బుక్ లో మితృలు చాలామందికి తెలిసిన వాడే. మణి భర్త నరసింహారావుకు ఎడమ కాలు చాలా గట్టిది. చేసిన ప్రతి ఉద్యోగాన్ని ఎడాపెడా ఎడమ కాలితో తన్నుకుంటూ, తారాజువ్వలా తన వృత్తిలో దూసుకుపోయాడు.
ఇక మరో వ్యక్తి Paramesh CK పరమేష్. బెజవాడలో నా కళ్ళముందే పుట్టి పెరిగాడు. దుబాయ్ లో ఇరవై ఆరేళ్లు ఉద్యోగం చేసి హైదరాబాదులో ఇటీవలే సెటిల్ అయ్యాడు. వీళ్ళందరూ వయసులో నాకంటే చిన్నవాళ్లు అయినా నాకు మంచి మితృలు. అంచేత ఆదివారం సాయంత్రం హాయిగా, మళ్ళీ మళ్ళీ తిరిగిరాని రోజు అన్నట్టుగా గడిచిపోయింది.
మేనకోడళ్ళు, మేనల్లుడు భార్య లక్ష్మి, భోజనాల బల్ల దగ్గర కనుక్కుని, కనుక్కుని మరీ వడ్డన చేశారు. అన్ని రకాలు చేయడానికి వాళ్ళు ఎంత కష్ట పడ్డారో నాకు తెలియదు కానీ, అన్ని రుచికరమైన పదార్ధాలను వదిలి వేయకుండా తినడానికి నేనైతే చాలా కష్టపడ్డాను.
షరా మామూలుగా తోక టపా!
ముందు చెప్పిన కధలో సుందరాన్ని నేనే!
కృతజ్ఞతలు బాహాటంగా వ్యక్తం చేయడం నిజానికి చాలా కష్టమైన పని. అందుకు నేను ఎంచుకున్న పద్దతి ఇది.



(ఇంకా వుంది)