నోట్ల రద్దు అంశం కేవలం మోడీకి,
ఆయన
ప్రత్యర్ధులకు సంబంధించింది కాదు. యావత్ ప్రజానీకాన్ని ప్రభావితం చేస్తున్న సమస్య.
ఇబ్బందులకు, కష్టాలకు తేడా వుంది. మనం ఇబ్బంది
అనుకున్నది వేరొకరికి కష్టంగా వుంటుంది. మన జీవన సరళిని బట్టి ఈ భావన మారుతూ వుంటుంది. తినడానికి
రొట్టె లేదని ఒక పేద పిల్ల ఆకలితో
ఏడుస్తుంటే ఓ రాజకుమారి, 'రొట్టె దొరక్కపోతే కేకు తినొచ్చుకదా నా
లాగా' అందట.
మీడియా పనికట్టుకుని మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోందని అంటున్నారు. మీడియా
వ్యతిరేకం అయినంత మాత్రాన పిడుగులు పడవు. ట్రంప్ కు మీడియా పూర్తిగా వ్యతిరేకం.
అయినా అక్కడ ఏం జరిగింది? మీడియాని పక్కన పెట్టండి.
దేశంలో సామాన్యుడికి ఊరట కలిగించేవి చిన్న చిన్న కార్టూన్లు,
జోకులు.
సీరియస్ వాతావరణం నుంచి ఎంతోకొంత ఉపశమనం
కలిగిస్తాయి. రాజకీయ నాయకుల్లో సెన్స్ ఆఫ్
హ్యూమర్ రోజురోజుకీ తగ్గిపోతోంది. ప్రజాస్వామ్య ప్రియులకు ఆందోళన
కలిగిస్తున్నఅంశాల్లో ఇదొకటి. ఒక పాత
సంగతి ముచ్చటించుకుందాం. 1962 లో చైనాతో జరిగిన యుద్ధంలో భారతదేశానికి
ఘోర పరాభవం ఎదురయినప్పుడు, ప్రముఖ కార్టూనిష్టు ఆర్. కే. లక్ష్మణ్, నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పై ఒక కొంటె
కార్టూన్ వేసారు. నెహ్రూను చిన్నబుచ్చుతూ వేసిన ఆ కార్టూన్ కారణంగా ఆయన అభిమానులనుంచి దాడి తప్పదు అని అనుకుంటుంటే, లక్ష్మణ్ గారికి నెహ్రూ నుంచి ఉత్తరం వచ్చింది.
‘పొద్దున్నే పత్రికలో మీ కార్టూన్ చూసి నాకెంతో సంతోషమయింది. అది చూడగానే
నా మనసుకు ప్రశాంతత చిక్కింది. దాన్ని
కొంత పెద్దదిగా గీసి పంపిస్తే ఫ్రేం కట్టించి దాచుకుంటాను.” అని రాశారు నెహ్రూ.
ఈ రోజుల్లో, కార్టూన్లు, జోకులు కొండొకచో కొంచెం శృతి మించుతున్న మాటా నిజమే.
కానీ అవి చదవగానే రాసిన వారెవరో ఎందుకోసం రాసారో సులభంగా తెలిసిపోతూనే వుంటుంది.
ఎందుకంటే దేశం ఇప్పుడు రాజకీయ పార్టీల వారీగా, నాయకుల వారీగా విడిపోయి వుంది. ఈ
విభజన వల్ల లాభపడేది పార్టీలే, దేశం కాదు.
బాపూ సినిమాలో రావు గోపాల రావు అన్నట్టు మడిసన్నాక కూసింత కలాపోసన వుండాలి.
అది కూడా రాజహంస మాదిరిగా పాలను
నీళ్ళను వేరు చేసి చూడగలిగే విధంగా వుండాలి.