వీధుల్లో రతనాలు
రాశులుగా పోసి విక్రయించిన గుప్తుల స్వర్ణ యుగం గురించి పుస్తకాల్లో
చదువుకున్నాము. నిజంగా అలాంటి యుగం ఒకటి ఉందా, వుండడం సాధ్యమేనా అని ఇప్పుడు అనిపిస్తుంటుంది. నా
మాస్కో జీవితం అలాంటిదే. ఈ జన్మలో మరోసారి చూడలేనిది, కేవలం చెప్పుకోవడానికి
మాత్రమే పనికి వచ్చేది. ఎందుకంటే ఇప్పటి మాస్కో అప్పటి మాస్కో కాదు, జీవన శైలిలో, జీవనభారంలో
పాశ్చాత్య దేశాలను మించి పోయింది.
ఇండియాకు వచ్చి ముప్పయి మూడేళ్లు
దాటిపోతున్నా, ఇప్పటికీ
వారానికో, నెలకో
ఒకసారి మాస్కో వెళ్లి అక్కడ నేను నడయాడిన వీధులను చుట్టబెట్టి వస్తుంటా. ఇదో సరదా
నాకు. ఇదెలాగా అంటారా!
ఏదో సినిమాలో ఒక చెంబు
లాంటిది ఒకడు సముద్రంలోకి బలంగా గిరవాటు
వేస్తాడు. అది సముద్ర జలాల అలలతో ప్రయాణించి మరో దేశం చేరుతుంది. అలాగే ఈ సోషల్
మీడియా పోస్టులు. నా మాస్కో రాతలు ప్రస్తుతం మాస్కోలో ఉద్యోగం చేసుకుంటున్న ఎన్.కె.హెచ్.
ప్రసాద్ గారనే తెలుగువాడి కంటపడ్డాయి.
ఆయన పేరు నందగిరి
ప్రసాద్. నిజానికి వీరితో నాకు పూర్వ పరిచయం లేదు. ఎప్పుడో నా
బ్లాగులో, నా ఒకప్పటి
మాస్కో జీవితం గురించి చదివి, గట్టి పట్టుదలతో
ప్రయత్నించి, నా ఫోన్ నెంబరు పట్టుకుని ఓ రోజు వీడియో కాల్ చేసారు.
ప్రసాద్ గారు నాకు
పరిచయం లేని మనిషి అయినా కూడా, వీడియోల్లో చూస్తూ
వచ్చాను కనుక ముఖ పరిచయం లేని మనిషి అని చెప్పలేను.
నిరుడు జులై లో ఒక రోజు ఉదయం ఫోన్ చేసి, ‘హైదరాబాద్ వచ్చాను, సాయంత్రం నాలుగు గంటలకు మీ ఇంటికి వస్తున్నాను, లోకేషన్
షేర్ చేయమ’ని చెప్పి, అన్నట్టే వచ్చేసారు. గత కొన్ని నెలలుగా ఫోన్లో
మాట్లాడుతూ వున్నా, మేమిద్దరం ఒకరినొకరం
కలుసుకోవడం ఇదే మొదటిసారి. రెండు గంటలు కూర్చుని మళ్ళీ ఆరు గంటలకు బయలు దేరి
వెళ్ళిపోయారు. తాను మరో మూడు నాలుగేళ్లు మాస్కోలో వుంటానని, తాను కూడా (పెళ్లి కాలేదు కనుక) ఒంటరిగానే ఉంటున్నానని, తప్పకుండా వచ్చి తనతో వుండమని మరీ మరీ చెప్పారు. మేము
మాస్కోలో వున్నప్పుడు తాను బెజవాడలో స్కూల్లో చదువుతున్నానని, తనకు ఇప్పటి మాస్కో తెలుసుకానీ, నలభయ్ ఏళ్ల క్రితం ఎలా వుండేది అన్నది నా రచనల ద్వారా
తెలుసుకున్నానని చెబుతూ, ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా కలవాలని అనుకున్నానని, అంచేత హైదరాబాద్ రాగానే మొదటి ఫోన్ మీకే చేసాను అని
అన్నారు.
వెళ్ళే ముందు ఆయన్ని ఓ
కోరిక కోరాను. ‘వారానికో, పది రోజులకో, నెలకో మీ ఇష్టం, మీరు మాస్కోలో మేము తిరిగిన ప్రదేశాలకు వెళ్లి అక్కడ
నుంచి వాటిని చూపుతూ నాకు వీడియో కాల్ చేయండి’ అని. నాకంటే చిన్నవాడు, నా కంటే మంచివాడు అయిన ప్రసాద్ గారు నా మాట మన్నించి అడపా
తడపా నాకు మాస్కోని లైవ్ లో చూపిస్తూనే వున్నారు. ఒకప్పుడు నేను అక్కడ వున్న
అయిదేళ్ల కాలంలో చూసిన మాస్కోకు ఇప్పటి మాస్కోకు స్థూలంగా పెద్ద మార్పులు
లేకపోయినా, ప్రజల జీవన శైలి, వస్త్ర ధారణల్లో వచ్చిన
మార్పులు స్పుటంగా కనిపించాయి. మళ్ళీ ఒకసారి మాస్కో వెళ్ళాలనే నా తీరని కోరికను
ఆయన ఈ విధంగా తీరుస్తూ వస్తున్నారు.
ఎవరైనా ఫోన్ చేస్తే
మాటలు రికార్డు చేయడం, వీడియో
రికార్డు చేయడం నైతికంగా తప్పు అనేది నా సిద్ధాంతం. అదీ కాక, అంత సాంకేతిక ప్రావీణ్యం నాకు లేదు. బహుశా ఈ
కారణం చేతనే దానికి ఒక సిద్ధాంతం రూపం ఇచ్చానేమో తెలియదు.
ఇత్యాది కారణాలతో ఆ
వీడియోలు నా దగ్గర లేవు. కానీ కొన్ని ఫోటోలు పంపుతామని అన్నారు. చూడాలి.
మాస్కో ఇండియన్ ఎంబసీలో పనిచేసేవారికి,
ఆ రోజుల్లో రకరకాల రాయితీలతో అనేక రకాల
వస్తువులు చౌకలో లభించేవి. రష్యన్ రూబుళ్ళతో జీతాలు తీసుకునే మా వంటి వారికి అవి
లభ్యం కావు. ఉదాహరణకు వి ఐ పి సూటు కేసులు మూడు పెద్దవీ, చిన్నవీ ఒకదానిలో ఒకటి అమిరేవి వున్న సెట్టు ఒక్కొకటి మూడువేల
రూపాయలకు దొరికేది. ఇది కాక ఒక బ్రీఫ్ కేసు, లేడీస్ మేక్
అప్ బాక్సు కూడా వస్తాయి. దాంతో ఎంబసీ మితృలు దాసరి గారి సహకారంతో మేము రెండు
సెట్లు తీసుకున్నాము.
స్టెయిన్ లెస్ స్టీల్ తో
తయారుచేసిన బాయిలర్ సైజు సమావర్లు వంటి రకరకాల
సామాగ్రి కొనుగోలు చేయడానికి, కొంచెం ఖరీదుకే అనుకోండి, అయినా మన దగ్గర కంటే చౌకే, అప్పటికే మొదలైన
గోర్భచేవ్ సంస్కరణలు కొంత సాయపడ్డాయి.
అప్పటివరకు సోవియట్ పౌరులు ఏదైనా రిపబ్లిక్ నుంచి మాస్కో రావాలి అంటే కొన్ని
ఆంక్షలు ఉండేవి. మంచు కురిసే ప్రాంతం కాబట్టి, సరైన వసతి లేకుండా వస్తే, మన దగ్గర
మాదిరిగా బస్ స్టేషన్లలో, రైల్వే ప్లాటు ఫారాలమీద రోజులు గడిపే వీలు వుండదని
ఏవేవో కారణాలు చెప్పేవారు. మేము తిరిగి వచ్చే ఘడియ దగ్గర పడేసరికి వివిధ
రిపబ్లిక్కుల నుంచి జనాల రాకపోకలు బాగా
పెరిగాయి. వాళ్ళు వస్తూ పోతూ, తమ వెంట తెచ్చిన తమ రిపబ్లిక్కులలో తయారైన సరుకులను మాస్కో తీసుకువచ్చి అమ్మడం మొదలైంది. ఆ విధంగా జార్జియా నుంచి
కాబోలు మన దగ్గర స్టార్ హోటళ్ళలో కానవచ్చే పాతిక , ముప్పయి బల్బులు కలిగిన షాండిలియర్ లు తెచ్చి అమ్ముతుంటే, ఒకటి కొని ఇంట్లో పెట్టాము. తీరా తీసుకు వెళ్లి
చిక్కడపల్లి ఇంట్లో తగిలించి (వెళ్ళేటప్పుడు అక్కడినుంచే వెళ్ళాము కనుక మరో
ప్రాంతం గురించిన ఆలోచనే మాకు రాలేదు) స్విచ్చి వేస్తే, వీధిలో ఎలెక్ట్రిక్ పోల్
మీద ఫ్యూజు ఎగిరిపోతుందని మా ఆవిడ భయపెట్టింది. నిజమే మేము వెళ్ళే నాటికి
హైదరాబాదులో విద్యుత్ సరఫరా పరిస్థితి అలాగే వుండేది. ఆ భయంతో డబ్బులు (పెద్ద ధర
కాదనుకోండి) పోసి కొన్న ఆ షాండిలియర్ ను అక్కడే వదిలేసాం. అదొక్కటే కాదు, అలాంటివి చాలా వరకు లగేజ్ సమస్య కారణంగా వదిలిపెట్టి
వచ్చేసాం. అయినా మేము మా వెంట బెట్టుకుని వచ్చిన పెద్దపెద్ద కార్టన్లతో బొంబాయి
(ఇప్పుడు ముంబై) లోని మా రెండో అన్నయ్య
రామచంద్ర రావు గారి స్టేట్ బ్యాంక్ అపార్ట్ మెంటు సగం నిండి పోయింది. మధ్యలో ఈ
బొంబాయి ఏమిటంటారా?
మామూలుగా రేడియో మాస్కో
వాళ్ళు, మాస్కో నుంచి ఢిల్లీకి ఎయిర్ టిక్కెట్లు ఏర్పాటు చేస్తారు, ఢిల్లీ
రేడియో అధికారులతో మాట్లాడితే, మీ ఉద్యోగం హైదరాబాదులో కదా, అక్కడకు వెళ్లి రిపోర్ట్ చేయండి అన్నారు. దాంతో, ఢిల్లీ కాకుండా
బొంబాయి మీదుగా హైదరాబాదుకు టిక్కెట్లు కావాలని అడిగాను, బొంబాయిలో అప్పుడు
పనిచేస్తున్న మా రెండో అన్నయ్యవాళ్ళను దారిలో చూసిపోవచ్చని. ఎలాగూ
మూసేసే దుకాణం అనుకున్నారో ఏమిటో, రేడియో మాస్కో వాళ్ళు కూడా నా గొంతెమ్మ కోర్కెలను ఒప్పుకున్నారు.
ఆ విధంగా మాస్కో- బొంబాయి- హైదరాబాదు విమాన ప్రయాణం టిక్కెట్లు నా చేతిలో పెట్టారు. మా అన్నయ్య అప్పుడు, ఇక నుంచి
ముంబై అంటాను, అక్కడ స్టేట్ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఎండీ ఆఫీసులో
పనిచేస్తున్నారు. బ్యాంకు దగ్గరలోనే అన్ని సదుపాయాలతో కూడిన ఉన్నతాధికారుల నివాస సముదాయం
వుండేది. మాస్కో నుంచి ఏరోఫ్లోట్ విమానంలో దిగాము. అక్కడ వారం పది రోజులకు పైగానే
ఉన్నాము. అంతవరకూ నేను ముంబై చూడలేదు. అంతా తిరిగి, అన్నీ చూసి మళ్ళీ ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాదు,
బేగంపేట విమానాశ్రయంలో దిగాము. మా కుటుంబం యావత్తూ మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి
ఎయిర్ పోర్టుకి వచ్చారు. లగేజీతో సహా
వెళ్లి పంజాగుట్ట ఆఫీసర్స్ క్వార్టర్స్ లో
వుంటున్న మా పెద్దన్నయ్య ఇంటికి చేరాము.
మొత్తం మీద అయిదేళ్ళ
ప్రవాసజీవితం ముగిసింది.
కానీ చిత్రంగా మరో కధ
మొదలయింది.
ఈ లోగా ఏం జరిగిందో
ఏమిటో, మా ఢిల్లీ ఆఫీసు వాళ్ళు హైదరాబాదు రేడియోలో నా స్థానంలో కొత్తగా రిక్రూట్
అయిన పవని విజయలక్ష్మి అనే అమ్మాయికి పోస్టింగు ఇవ్వడం, ఆమె జాయిన్ కావడం జరిగిపోయాయి. నన్ను కడప ఫీల్డ్ పబ్లిసిటీ
అధికారిగా బదిలీ చేశారు.
ఇప్పుడు మాస్కో నుంచి వెంట
తెచ్చిన బండెడు సామాగ్రి, ఓడలో వస్తున్న సామాను సంగతి ఏమిటి?
కింది ఫోటో :
ప్రస్తుతం మాస్కోలో
వుంటున్న ప్రసాద్ గారితో హైదరాబాదులో వుంటున్ననేను.
(ఇంకా వుంది)
1 కామెంట్:
భలే ట్విస్టు పెట్టి టపాలో, ఇంకావుంది అనటం మీకే చెల్లు :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి