మంచు కాలం
మాస్కోలో మేము అడుగుపెట్టింది ఎముకలు కొరికే
చలి కాలంలో.
ఇండియా నుంచి
ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వెళ్ళిన మాకు ఆ వాతావరణం ఓ పట్టాన కొరుకుడు పడలేదు.
కొన్నాళ్ళు వానలు, కొన్నాళ్ళు
చలి గాలులు, మరికొన్నాళ్ళు
మండే ఎండలు, ఇలాంటి వాతావరణం తెలుసు. కానీ
మాస్కోలో పూర్తిగా వేరు. అక్కడి వాతావరణం
గురించిన ఒక జోక్ ఇలా ప్రచారంలో వుంది. 'మాస్కోలో మొదటి నాలుగు నెలలు చలికాలం,
తరువాత మరో నాలుగు నెలలు చలికాలం. పోతే, మిగిలిన నాలుగు నెలలు చలికాలమే'
ఏప్రిల్, మే నెలల నడుమ ఓ పదిహేను, యిరవయి రోజులు వేసవి కాలం
పలకరిస్తుంది. అప్పుడు కూడా డిల్లీలో చలికాలం మాదిరిగా ఎండ కాస్తుంది. దానికే
మాస్కో వాసులు తెగ సంబరపడిపోతారు. ఆ సంబరంలో వాళ్లకు వొంటిమీద బట్టనిలవదు.
ఏటిపొడుగునా ధరించే ఎలుగుబంటి దుస్తుల్ని వొదిలిపెట్టి, ఆడవాళ్ళు స్కర్టుల్లోకి, మగవాళ్ళు నిక్కరు, టీ షర్టుల్లోకి మారిపోతారు. నిజానికి, రష్యన్ల మేని ఛాయ తెల్లని తెలుపు.
కానీ ఉన్ని దుస్తుల్లో వారి అందం కాస్తా మరుగున పడిపోతుంది. ఫర్ కోట్లు, ఫర్ టోపీలు ధరించిన తరవాత ఎవరు ఆడో ఎవరు మగో గుర్తు పట్టడం కష్టం మరి.
హిమనగరం
ఇక మాస్కో
గురించి చెప్పుకోవాలంటే అక్కడ కురిసే మంచు గురించి ముందు ముచ్చటించుకోవాలి.
తెల్లటి మంచు పూలరేకుల మాదిరిగా నిరంతరం నింగినుంచి 'దేవతలు పుష్పవృష్టి' కురిపిస్తున్నట్టు జాలువారుతూనే
వుంటుంది. ఆ మంచు వర్షంలో దుస్తులన్నీ 'మంచుకొట్టుకు పోతాయి' కానీ ‘తడిసి ముద్దయి' పోవు. ఎందుకంటే అక్కడి 'మైనస్' టెంపరేచర్లలో మంచు కరిగి నీరుగా మారే
అవకాశమే లేదు. తెల్లవార్లూ ఎడతరిపి లేకుండా కురిసే మంచులో ఇళ్ళ ముందు పార్కు చేసిన
కార్లు నిలువెత్తు మంచులో కూరుకుపోతాయి. ఆ మంచుని తొలగించి కార్లను మళ్ళీ రోడ్డు
ఎక్కించడం వాటి యజమానులకు రోజూ ఒక సమస్యే. అందుకే చాలామంది కార్లను 'మంచు సమాధుల'లోనే వుంచేసి, మెట్రో రైళ్ళ పైనే రాకపోకలు
సాగిస్తుంటారు.
కన్నుకొట్టని
కరెంటు దీపాలు
ఒక నగరం నగరాన్ని ఆ మాటకు వస్తే, ఒక
దేశం దేశాన్నీ అందులోనూ నీళ్ళు గడ్డకట్టే వాతావరణం కలిగిన దేశాన్ని పొత్తిళ్ళలో
పాపాయి మాదిరిగా వెచ్చగా వుంచడం అక్కడే చూసాను. ఏడాదిలో దాదాపు పదినెలలు మంచు
దుప్పటి కప్పుకుండే మాస్కోలో, దుప్పటి
అవసరం లేకుండా నిద్ర పోవడం అక్కడే సాధ్యం. అదీ పైసా (కోపెక్) ఖర్చు లేకుండా.
ఇళ్లూ వాకిళ్ళూ , ఆఫీసులు, బస్సులు, ట్రాములు, మెట్రో రైళ్ళు, సినిమా హాళ్ళు, హోటళ్లు, స్కూళ్ళు, కాలేజీలు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రష్యన్
సర్కస్ డేరాలు, చివరాఖరుకు స్విమ్మింగ్
పూల్స్ అన్నీ ఎయిర్ కండిషన్ అంటే నమ్మశక్యమా చెప్పండి. ఇంటి బయట ఎముకలు కొరికే చలి
పులి పంజా విసురుతున్నా, ఇంట్లో మాత్రం లుంగీ పైజమాలతో మసలగలిగేంత వెచ్చగా
వుండేది. ఆ వెచ్చదనం కూడా ఏటిపోడుగునా ఏమాత్రం హెచ్చుతగ్గులు లేకుండా ఒకేమాదిరిగా
వుండడం వల్ల ఆ అయిదేళ్ళలో ఒకసారి కూడా తుమ్మాల్సిన అగత్యం రాలేదు.
ఎయిర్
కండిషన్ వ్యవస్తకు మరమ్మతులు
చేయడానికి మాత్రం వేసవిలో ఓ పదిహేను రోజులు ఈ సదుపాయాన్ని నిలుపు చేస్తారు. అసలు ఈ
వ్యవస్థ పనిచేసే విధానమే మాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇళ్లు ఆఫీసులు
అన్నిటిలో వేడినీరు ప్రవహించే ఇనుప గొట్టాలు వుంటాయి. ఆ గొట్టాలనుంచి సదా వెలువడే
వేడినీటితో ఇల్లంతా వెచ్చగా వుంటుంది. బయట ఉష్ణోగ్రతల్లో ఏర్పడే హెచ్చుతగ్గులకు
అనుగుణంగా ఈ గొట్టాలలో ప్రవహించే నీటి వేడిని పెంచడమో తగ్గించడమో చేస్తుంటారు.
అలాగే, రాత్రల్లా కురిసిన మంచుతో
కప్పుకుపోయిన రహదారులను తెల్లవారేసరికల్లా వాహనాల రాకపోకలకు అనుగుణంగా ఒక దారికి
తీసుకురావడం , అందుకు
పడుతున్న శ్రమా, పెడుతున్న
ఖర్చూ చూసేవాళ్ళకు కళ్ళు తిరగక మానవు. ప్రతిరోజూ అర్ధరాత్రి దాటిన తరవాత అంటే సుమారు రెండుగంటలనుంచి ఓ
రెండు మూడు గంటలపాటు రహదారులపై బస్సులు, ట్రాములు మొదలయిన వాహనాలతో పాటు
మెట్రో రైళ్ళ రాకపోకలను కూడా నిలిపివేస్తారు. అక్కడినుంచి మొదలవుతుంది యుద్ధ ప్రాతిపదికన రోడ్లపై మంచు
తొలగించే కార్యక్రమం. వార్ ఫుటింగ్ అన్న పదానికి సరయిన అర్ధం తెలుసుకోవాలంటే
దీన్ని ఒకసారి
పరిశీలించాలి. మొత్తం మూడు రకాల వాహనాలను ఇందులో వాడతారు. ముందు ఒక వాహనం ఉప్పు
కలిపిన ఇసుకను రోడ్లపై చల్లుకుంటూ వెడుతుంది. దానితో గట్టిగా పేరుకుపోయిన మంచు
నీళ్లగా కరుగుతుంది. రెండో వాహనం కింద అమర్చిన చీపురు యంత్రాలు ఆ ఇసకను, నీటిని చిమ్మివేస్తాయి. మూడో వాహనం
నీటితో రోడ్లను శుభ్రంగా అద్దంలా కడిగేస్తుంది. ఇది ఏదో బాగా వర్షం పడినప్పుడు
హడావిడి చేసి చేతులు దులుపుకోవడం లాంటిది కాదు. ఇది ఏటి పొడుగునా జరిగే
కార్యక్రమం. పైగా నిత్య కృత్యం.
పోతే,
మాస్కో విషయాలు
ముచ్చటించుకునేటప్పుడు మరచిపోకుండా చెప్పుకోవాల్సింది అక్కడి కరెంటు గురించి. మేము
అక్కడ వున్న అయిదేళ్ళూ కరెంటు దీపాలు కన్ను కొట్టిన పాపాన పోలేదు. వోల్టేజి సమస్య
అంటే అక్కడివారికి తెలియదు. స్టార్ హోటల్స్ వుండే పాతిక ముప్పయి బల్బులు కలిగిన
పెద్ద పెద్ద షాండిలియర్లు వుండేవి.
ఎప్పుడు బల్బులు మార్చాల్సిన అవసరం రాలేదు.
వంటింట్లో
వాడే గ్యాస్ కూడా పైపుల్లో సరఫరా అయ్యేది. సిలిండర్ అయిపోతే ఎట్లారా అన్న బెంగ
లేదు. పైగా కరెంటు, నీళ్ళు,
గ్యాస్,
ఫోన్ అన్నీ
ఉచితం. ఇంటి సంగతి సరేసరి. అంత పెద్ద అపార్ట్ మెంటుకు చెల్లించాల్సిన నెల కిరాయి పది రూబుళ్ళు దాటదు. జీతం మాత్రం అటూ ఇటూగా వెయ్యి
రూబుళ్ళు.
తోకటపా:
ఒకసారి
మా మేనల్లుడితో ఫోన్ లో మాట్లాడుతుంటే అడిగాడు, మంచుదేశం అంటున్నావు కదా! ఆ
చల్లదనానికి మనుషులు తెల్లబడతారు అంటారు. వెళ్లి రెండేళ్లు అయింది, ఏమన్నా రంగు చేసావా అని. (నా ఒంటి
ఛాయ గురించి వేసిన జోకన్నమాట. ఎందుకంటే మా ఇంట్లో అందరిలో చామనఛాయ మనిషిని నేనే!)
దానికి
నా జవాబు:
“
మాస్కో వచ్చినప్పటి నుంచి మా ఇంటి దగ్గర చెట్టుపై ఒక కాకిని చూస్తున్నాను. ఇంత
కాలం అయినా అది రంగు మారినట్టు నాకు కనబడలేదు”
కింది
ఫోటోలు:
ఓ
వేసవి సాయంత్రం మాస్కో లోని ఆర్బాత్ వీధిలో షికారు చేస్తూ మా కుటుంబం
బయట గడ్డగట్టే
మైనస్ పాతిక డిగ్రీల టెంపరేచర్ వున్నా కూడా, ఇంట్లో హాయిగా తెలుగువార పత్రిక
తిరగేస్తూ మా ఆవిడ నిర్మల
(ఇంకా
వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి